
ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్ తన ఇంట్లోనే దాడికి గురై వార్తల్లోకి ఎక్కిన సంగతి తెలిసిందే. ఆరు రోజుల చికిత్స తర్వాత కోలుకుని ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. అయితే తాజాగా ఆయన కుటుంబానికి మరో షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. ఆయన కుటుంబానికి చెందిన రూ.15,000 కోట్ల ఆస్తులను మధ్యప్రదేశ్ ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రయత్నాల్లో ఉంది.
2011లో సైఫ్ అలీఖాన్(Saif Ali khan) తండ్రి మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ మృతి చెందారు. ఆ తర్వాత సైఫ్‌కు భోపాల్ నవాబ్‌గా బిరుదు లభించింది. ప్రస్తుతం పటౌడీ కుటుంబానికి సైఫ్ అలీ ఖాన్ వారసుడు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో పటౌడీ కుటుంబానికి చెందిన ఆస్తులు ఉన్నాయి. అదే సమయంలో అక్కడి ఆస్తుల గురించి ఎప్పటి నుంచో వివాదాలు కోర్టులో నడుస్తూనే ఉన్నాయి.
సైఫ్ అలీ ఖాన్, షర్మిలా ఠాగూర్‌తోపాటు ఇతర కుటుంబ సభ్యులకు చెందిన ఆస్తులు అక్కడ ఉన్నాయి. కోహెఫిజా నుండి చిక్లోడ్ వరకు విస్తరించి ఉన్నాయి. ఆ కుటుంబానికి చెందిన సుమారు 100 ఎకరాల భూమిలో దాదాపు లక్షన్నర మంది నివసిస్తున్నారు. అయితే.. ఆ చారిత్రక భూమిపై ఎనిమీ ప్రాపర్టీ కేసులో గత 10 ఏళ్లుగా కొనసాగుతున్న స్టే ఇప్పుడు ముగిసింది. ఆస్తిపై దావా వేయడానికి మధ్యప్రదేశ్ హైకోర్టు సైఫ్ కుటుంబానికి 30 రోజుల సమయం ఇచ్చింది. అయినా సైఫ్ అలీ ఖాన్ కుటుంబం ఎటువంటి దావా వేయలేదు. కానీ ఇప్పుడు ఆ గడువు ముగిసిపోవడంతో.. తర్వాత ఏం జరగనుందా? అనే ఉత్కంఠ మొదలైంది.

ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్(Enemy Property Act) 1968 ప్రకారం విభజన తర్వాత పాకిస్థాన్‌కు వెళ్లిన వ్యక్తులు భారత్‌లో వదిలిపెట్టిన ఆస్తులపై కేంద్ర ప్రభుత్వానికి హక్కు ఉంటుంది.ఈ చట్టం ప్రకారం భోపాల్ చివరి నవాబు ఆస్తులను ప్రభుత్వం నియత్రించాలని ప్రయత్నించింది. అయితే.. సైఫ్ కుటుంబం ఈ నిర్ణయాన్ని 2015లో సవాల్ చేశారు. దీంతో.. కోర్టు స్టే విధించింది. అయితే తాజాగా ఆ స్టేను కోర్టు ఎత్తేసింది. దీంతో ప్రభుత్వం ఆ ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది.
పటౌడీ చివరి నవాబు పెద్ద కుమార్తె యువరాణి అబిదా సుల్తాన్ ఎప్పుడో పాకిస్థాన్ వెళ్లారు. అందువల్ల నవాబు ఆస్తిని శత్రువు ఆస్తిగా(ఎనిమీ ప్రాపర్టీ) ప్రకటించారు. అయితే.. నవాబ్ మరణం తరువాత అతని రెండో కుమార్తె మెహర్ తాజ్ సాజిదా సుల్తాన్ బేగం భోపాల్ వారసత్వ చట్టం 1947 ప్రకారం ఎస్టేట్‌కు వారసురాలుగా ప్రకటించారు. ఇప్పుడు పిటిషన్ వేసిన పటౌడీ కుటుంబంలోని సైఫ్ అలీ ఖాన్, షర్మిలా ఠాకూర్‌వంటివారు సాజిదా(Sajida) వారసులు. ఈ నేపథ్యలో ఆస్తిపై తమకూ హక్కు ఉందని సైఫ్ ఫ్యామిలీ కోర్టులో దావా వేసింది. వారసత్వ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోకుండా డివిజెన్ బెంచ్‌లో ఉత్తర్వులను పటౌడీ కుటుంబం సవాలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment