ఆంధ్రప్రదేశ్‌లో కూటమి రాజకీయం మారుతోందా? టీడీపీ వర్గాల్లో కొందరు మంత్రి లోకేష్ భావి సీఎం అంటుంటే.. డిప్యూటీ సీఎం అని మరికొందరు వ్యాఖ్యలు చేయడం దీనికి కారణంగా కనిపిస్తోంది. ఈ రెండు పదవుల్లో ఏది దక్కినా.. ఇప్పటివరకూ కూటమి భాగస్వామి, జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హోదాకు భంగం కలిగినట్లేనని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. టీడీపీతో కొనసాగితే పవన్ ఎప్పటికీ సీఎం కాలేరన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తమ నేతను అడ్డుకునేందుకే టీడీపీ లోకేష్‌ను తెరపైకి తెచ్చిందన్న ఆలోచన కూడా జనసేనలో ఉన్నట్లు చెబుతున్నారు.
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పదోన్నతిపై దావోస్ పర్యటన సందర్భంగా చర్చ మొదలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి అయితే లోకేష్ ఉప ముఖ్యమంత్రి అయితే చాలని టీడీపీ నేతలు పలువురు బహిరంగంగా కోరుతూంటే.. వీలైనంత తొందరగా సీఎంను చేయాలని చంద్రబాబు నాయుడిపై ఆయన కుటుంబం నుంచే ఒత్తిడి ఉన్నట్లు సమాచారం. దావోస్ పర్యటనలో మంత్రి టీజీ భరత్ చాలా స్పష్టంగా భావి ముఖ్యమంత్రి లోకేష్ అని ప్రకటించగా టీడీపీ నేతలు మాత్రం ఏదైనా ఉంటే కూటమి పక్షాలతో కలిసి మాట్లాడుకుంటామని అంటున్నారు. భరత్ ప్రకటన ఏదో మొక్కుబడి వ్యవహారమని అంటున్నారే కానీ.. లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేసే ప్రతిపాదన ఏదీ లేదని మాత్రం వారు ఖండించకపోవడం గమనార్హం.
కొద్దికాలం క్రితం పవన్ కళ్యాణ్ ఒక సభలో మాట్లాడుతూ మరో పదేళ్లపాటు చంద్రబాబే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నట్లు ప్రకటించారు. లోకేష్‌కు చెక్ పెట్టేందుకు ఆయన ఆ మాట మాట్లాడారా? లేక చంద్రబాబే కుటుంబం నుంచి వస్తున్న ఒత్తిడిని తగ్గించేందుకు పవన్ చేత అలా మాట్లాడించారా? అన్నది చెప్పలేము. ఎందుకంటే.. సీఎం పదవిని ఇప్పుడిప్పుడే వదులుకునే ఆలోచన బాబు చేయరు. లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేస్తే జనసేన నుంచి సమస్యలు రావచ్చునని కూడా బాబుకు తెలుసు. అందుకే ఆయన మధ్యే మార్గంగా ప్రస్తుతానికి లోకేష్‌ను ఉప ముఖ్యమంత్రిని చేయాలన్న ఆలోచనకు వచ్చి ఉండవచ్చు. కాకపోతే ఈ ప్రతిపాదనకు లోకేష్ మద్దతుదారులు, బాబుగారి కుటుంబం నుంచి ఎలాంటి స్పందన వస్తుందన్నది చూడాలి.
నారా లోకేష్‌కు పదోన్నతిపై ప్రచారం మొదలుపెట్టడం ఒక రకంగా రాజకీయ వ్యూహం. ఇతరుల ద్వారా కొన్ని అంశాలను ప్రచారంలో పెట్టడం.. వ్యతిరేకించే వారిని మానసికంగా సిద్ధం చేయడం దీని వెనుక ఉన్న ఉద్దేశం. అంగీకరించేవారు ఉండవచ్చు లేనివారు వారి దోవన వారు వెళ్లవచ్చునని సంకేతం ఇవ్వడం కూడా. ఇలాంటి విషయాలలో చంద్రబాబుది ఘనాపాటే. గతంలో ఎన్టీఆర్‌ను పదవి నుంచి దించేయడానికి ముందు కూడా ఇలాంటి వ్యూహాన్నే ఆయన అమలు చేశారు. ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీ పార్వతిపై దుష్ప్రచారం చేయించడం, ఆమె పెత్తనం పెరిగిపోవడం వల్ల పార్టీకి నష్టమంటూ వంత మీడియా ఈనాడులో కథనాలు రాయించడం చేసేవారు. ఆ టైమ్‌లోనే అప్పటి మంత్రి దాడి వీరభద్రరావు రవీంద్రభారతిలో జరిగిన ఒక కార్యక్రమంలో లక్ష్మీపార్వతిని ఉప ముఖ్యమంత్రిని చేయాలని డిమాండ్ చేశారు.
దీంతో, చంద్రబాబు వర్గం ఈ పాయింట్‌ను అడ్డం పెట్టుకుని కథ నడిపింది. అదే జరిగితే మీ పరిస్థితి ఏమిటన్న ఆందోళనను ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల్లో కల్పించడంతోపాటు వారిని తనవైపు తిప్పుకునేందుకు వరాల జల్లు కురిపించారు. తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు ఉప ముఖ్యమంత్రి పదవి ఆశ చూపారు. పార్టీ అధ్యక్ష పదవిని ఎన్టీఆర్ పెద్దకుమారుడు హరికృష్ణకు ఎరవేశారు. మొత్తమ్మీద ఎన్టీఆర్‌ను పదవి నుంచి దించేశారు. ఆ వెంటనే ఉప ముఖ్యమంత్రి పదవి ఉంటే వర్గపోరు వస్తుందని, కుటుంబ పెత్తనం అంటారని ప్రచారం చేయించారు. దగ్గుబాటికి డిప్యూటీ సీఎం, హరికృష్ణకు పార్టీ అధ్యక్ష పదవి రెండూ దక్కకుండా చూశారు. హరికృష్ణకు మంత్రి పదవి మాత్రమే విదిల్చారు.
అయితే మంత్రి పదవి వచ్చేటప్పటికి హరికృష్ణ ఎమ్మెల్యే కాదు. ఆరునెలల్లోపు ఎన్నికై ఉంటే పదవి దక్కేది కానీ.. కాలేకపోయారు. దీంతో మంత్రి పదవి కూడా పోయింది. తరువాతి కాలంలో జరిగిన ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా ఎన్నికైనా హరికృష్ణకు మంత్రి పదవి ఇవ్వకపోవడం బాబు మార్కు రాజకీయం. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వర్గాన్ని నడిపిన చంద్రబాబు, తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రం వర్గాలను సహించనంటూ హెచ్చరికలు చేస్తుండే వారు. ఇప్పటికీ అదే తరహా రాజకీయం చేస్తున్నారు. నిజంగానే లోకేష్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడానికి సుముఖంగా లేకపోతే, ప్రకటనలు చేస్తున్న టీడీపీ నేతలను వారించే వారు. కానీ, పార్టీ నేత శ్రీనివాసరెడ్డి ఆయన సమక్షంలోనే లోకేష్ పార్టీకి ఎంతో సేవ చేస్తున్నారని, ఎన్నికలలో చాలా కష్టపడ్డారని, అందువల్ల ఆయనను ఉప ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. చంద్రబాబు దీన్ని వారించలేదు.
ఇదే సమయంలో మరికొందరు టీడీపీ నేతలు దాన్ని ఒక డిమాండ్‌గా మార్చారు. సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఒక ట్వీట్ చేస్తూ లోకేష్ అన్ని విధాలుగా అర్హుడని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ నియోజకవర్గమైన పిఠాపురంలో టీడీపీ నేతగా ఉన్న మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా లోకేష్‌ను ఉప ముఖ్యమంత్రిని చేయాలని డిమాండ్ చేయడం కూడా గమనించాలి. పిఠాపురంలో టీడీపీ, జనసేనల మధ్య సంబంధాలు అంత సజావుగా లేవని తేలుతుంది. లోకేష్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తే పవన్ కళ్యాణ్ స్థాయి తగ్గించినట్లవుతుందని తెలిసినా కూడా వీరంతా ఇలా మాట్లాడుతున్నారంటే అందులో మతలబు అర్థమవుతూనే ఉంది.
మరోవైపు లోకేష్ కూడా తన పార్టీ నేతల ప్రకటనలను ఆస్వాదిస్తున్నారు. ప్రస్తుతం ఆయనే ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్నా, పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలో అతిగా వ్యవహరిస్తున్నారన్న భావనతో ఉప ముఖ్యమంత్రి పదవి కోరుకుంటుండవచ్చు. లోకేష్, పవన్ కళ్యాణ్‌ల మధ్య ప్రచ్ఛన్న పోటీకి చాలానే ఉదాహరణలు ఉన్నాయి. ఇటీవల తిరుపతిలో తొక్కిసలాట జరిగిన సందర్భంలోనూ ఇరువురి మధ్య సంబంధాలు గొప్పగా ఏమీ లేవని స్పష్టం చేశాయి. తొక్కిసలాట ఘటనకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఉన్నతాధికారులు ప్రజలకు క్షమాపణ చెప్పాలని పవన్ కళ్యాణ్ చెబితే లోకేష్ అది ఆయన వ్యక్తిగత అభిప్రాయమని తోసిపుచ్చడం.. ఎన్నికలకు ముందు కూడా సీఎం పదవిని జనసేన అధినేతతో పంచుకోవాలన్న డిమాండ్‌ను తోసిపుచ్చడం మచ్చుకు రెండు ఉదాహరణలు.
ఎన్నికల్లో పొత్తు కావాలని టీడీపీ కోరుకుంటూంటే జనసేనకు యాభై సీట్లు ఇవ్వాలని తమకు పాతికి సీట్లు ఇవ్వాలని బీజేపీ ప్రతిపాదించిన విషయాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుందాం. పవన్ కళ్యాణ్ ఈ మాట అనేందుకు కూడా జంకారు. ఇలాంటి షరతులే పెట్టి ఉంటే రాజకీయం ఇంకోలా ఉండేది. పవన్ కళ్యాణ్, బీజేపీలకు కూటమిలో ఎంతో కొంత పట్టు దొరికేది. ఎన్నికలకు ముందు తాను, చంద్రబాబు సమానం అనుకుని పవన్ మాట్లాడేవారు. కొంతకాలం అలాగే నడిచింది. చంద్రబాబు కూడా పవన్‌ను అదే భ్రమలో ఉంచుతూ వచ్చారు. కానీ, కాలం మారుతుంది కదా.. ఇన్నేళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబుతో సమానంగా పవన్ ఎలా ఉంటారన్న ప్రశ్న టీడీపీలో వచ్చింది.
ఇక, సీఎం పదవి లోకేష్‌కు ఇవ్వాలన్న వాదన కూడా వస్తుండడంతో లాభం లేదని ఉప ముఖ్యమంత్రి పదవికి ఆయనను తీసుకురావడానికి వ్యూహరచన మొదలైంది. అందులో భాగంగా ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా చంద్రబాబుకు చెరో వైపు పవన్ కళ్యాణ్, లోకేష్‌ల బొమ్మలు కూడా ప్రభుత్వ ప్రచార ప్రకటనలలో ముద్రించారు. నిబంధనలకు విరుద్ధమైనా లోకేష్ ఫోటో వేయడం చంద్రబాబు మనసులో మాటను చెప్పడమే అవుతుంది. ఆ తర్వాత స్వచ్చ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమ ప్రకటనలో కూడా పవన్, లోకేష్‌ల ఫోటోలు వేశారు. దీని ద్వారా పవన్‌కు స్పష్టమైన సందేశం పంపించారు. తద్వారా చంద్రబాబుతో సమానం అనుకుంటున్న పవన్ స్థాయిని సక్సెస్ ఫుల్‌గా తగ్గించారు. ఇక లోకేష్‌ను డిప్యూటీ సీఎంను చేస్తే, పూర్తి ఆధిపత్యం వచ్చేసినట్లే అవుతుంది. తనకు సీఎం పదవి రాకుండా అడ్డుకుంటున్న పవన్‌కు చెక్ పెట్టినట్లు కూడా ఉంటుంది.
ఈ వ్యవహారంలో బీజేపీ నేరుగా వేలు పెట్టకుండా వేచి చూస్తోంది. తెలుగుదేశంలో మంత్రులుగా పనిచేసిన వారు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు లోకేష్‌ను ఉప ముఖ్యమంత్రి చేయాలన్న డిమాండ్‌ను బహిరంగంగా లేవనెత్తడం గమనార్హం. దానికి వ్యతిరేకంగా జనసేన కార్యకర్తలు, నేతలు పవన్‌ను ముఖ్యమంత్రిని చేసి, లోకేష్‌ను ఉప ముఖ్యమంత్రి చేయాలని ప్రకటనలు చేస్తున్నారు. ఇది ఇక్కడితో ఆగలేదు. సోషల్ మీడియాలో రెండు పార్టీల వారు తీవ్ర వాదోపవాదాలు చేసుకుంటున్నారు. ఎవరి వల్ల ఎవరు పవర్‌లోకి వచ్చారన్నదానిపై చర్చిస్తున్నారు. అది శ్రుతి మించి బూతులు తిట్టుకునే దశకు వెళ్లారు. అయినా పవన్, లోకేష్‌లు నోరు విప్పలేదు. ఇది పవన్, లోకేష్‌ల మధ్య రాజకీయ వార్‌గా మారింది. పవన్ కళ్యాణ్ తన సామాజిక వర్గం కాపులు ఎక్కువ మంది ఉన్నచోట పోటీచేసి గెలిచారని, లోకేష్ మాత్రం ఇటీవలి కాలంలో ఎన్నడూ గెలవని మంగళగిరి నుంచి విజయం సాధించారని, పవన్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడమే ఎక్కువ అని టీడీపీ అభిమాని ఒకరు పోస్టు పెట్టారు. పవన్ లేకపోతే టీడీపీకి అధికారం ఎక్కడ వచ్చేది.. ఇలాగే చేయండి. మళ్లీ జగన్ సీఎం అవుతారు.. అప్పుడు మీ సంగతి చూస్తారు.. అంటూ కొన్ని అభ్యంతర పదాలతో జనసేన కార్యకర్త ఒకరు పోస్టు పెట్టారు.
ఇలా ఇరువైపులా పలువురు విమర్శలు, తిట్ల పురాణం సాగిస్తున్నారు. చంద్రబాబుకు వయసు పెద్దదైందని, అందువల్ల పవన్‌ను సీఎంగా చేసి, లోకేష్‌ను ఉప ముఖ్యమంత్రిని చేయాలని జనసేన వారు కోరుతున్నారు. విశేషం ఏమిటంటే చంద్రబాబుకు వయసు మళ్లిందని జనసేన అంటుంటే, దానిని టీడీపీ వారు కూడా ధృవీకరిస్తున్నట్లుగా మాట్లాడుతూ లోకేష్‌ను సీఎం చేయాలని చెబుతున్నారు. మంత్రి టీజీ భరత్ సీఎం సమక్షంలోనే లోకేష్ ముఖ్యమంత్రి కావాలని అన్నారంటే అర్ధం అదే అన్న భావన కలుగుతుంది. లోకేష్, పవన్‌ల మధ్య సాగుతున్న ఈ గొడవతో చంద్రబాబు నిస్సహాయంగా మిగిలిపోతున్నట్లుగా ఉంది. అటు కొడుకు ఇటు పవన్ కళ్యాణ్ అయిపోయారు మరి. దానికితోడు ఈ మధ్య కాలంలో ఆయన చేసిన వివిధ వ్యాఖ్యలలో అసంబద్ధత ఎక్కువగా ఉంటుండటంతో అంతా వయసును గుర్తు చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ ఒక్కరే ఉప ముఖ్యమంత్రిగా ఉంటారన్నది ఒప్పందం అని, దానిని ఎలా కాదంటారన్నది జనసేన బాధగా ఉంది. కానీ అధికారం రుచి చూసిన పవన్ కళ్యాణ్ అవమానాలనైనా భరిస్తారు కానీ ఇప్పటికైతే టీడీపీ కూటమి ప్రభుత్వంలోనే కొనసాగుతారన్నది ఎక్కువమంది భావన. నిజంగానే లోకేష్ ఈ టర్మ్‌లోనే ముఖ్యమంత్రి అయితే పవన్ తగ్గి ఉంటారా? లేక ఎదిరిస్తారా? అన్నది అప్పుడే చెప్పలేం. ఏది ఏమైనా లోకేష్ ఉప ముఖ్యమంత్రి అవడానికి రంగం సిద్ధం అవుతున్నట్లే కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ ఆత్మగౌరవం వంటి డైలాగుల జోలికి వెళ్లకుండా సర్దుకుపోక తప్పదేమో!.
-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
Comments
Please login to add a commentAdd a comment