బెంగళూరు, సాక్షి: కర్ణాటక రోడ్డు గంటల వ్యవధిలో మరోసారి నెత్తురోడింది. ఉత్తర కన్నడ(Uttara Kannada) జిల్లాలో ఈ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కూరగాయలు, పండ్ల లోడుతో వెళ్తున్న ట్రక్కు బోల్తాపడిన ఘటనలో 10 మంది మృతి చెందారు. మరో 15 మందికి గాయాలయ్యాయి.
మరణించిన వారంతా కూరగాయల వ్యాపారులుగా తెలుస్తోంది. బుధవారం తెల్లవారుజామున ట్రక్కులో కూరగాయల లోడుతో వ్యాపారులు సావనూర్ నుంచి కుంత మార్కెట్‌కు వెళ్తున్నారు. గులాపురా గ్రామ సమీపంలోని యాలాపురా హైవే వద్దకు చేరుకోగానే డ్రైవర్ ఓ వాహనానికి దారి ఇచ్చే క్రమంలో అదుపు తప్పడంతో మరో ట్రక్కును ఢీకొట్టింది. దీంతో దాదాపు 50 మీటర్ల లోతైన లోయలో పడిపోయింది.
#WATCH | #Karnataka: 10 died and 15 injured after a truck carrying them met with an accident early morning today. All of them were travelling to Kumta market from Savanur to sell vegetables: SP Narayana M, Karwar, Uttara Kannada
(Visuals from the spot)
ANI pic.twitter.com/9vgO1nOKOu— OTV (@otvnews) January 22, 2025
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెల్లవారుజామున 4:00 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 10మంది మృతి చెందగా.. మరో 20 మంది తీవ్ర గాయాలపాలైనట్లు పోలీసులు పేర్కొన్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అధికారులు చెబుతున్నారు.
ప్రమాదంపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య(Siddaramaiah) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాయచూరు, సింధనూరులో జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో మొత్తం 14 మంది మృతి చెందారనే వార్త బాధాకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారికి ప్రభుత్వం తగిన పరిహారం అందిస్తుందని హామీ ఇచ్చారు.
అంతకు ముందు.. మంగళవారం అర్ధరాత్రి.. కర్ణాటకలోని హంపి(Hampi) క్షేత్రంలో జరిగే నరహరి తీర్ధుల ఆరాధనకు 14 మంది వేద పాఠశాల విద్యార్ధులతో వెళుతున్న వాహనం సింధనూరు సమీపంలో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ శివ, ముగ్గురు విద్యార్ధులు అభిలాష, హైవదన, సుజేంద్ర అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరు విద్యార్ధులు గాయపడగా, వారిని సింథనూరు ఆసుపత్రికి తరలించారు. కారు టైర్ ఊడిపడడంతో.. వాహనం బోల్తా ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.
Comments
Please login to add a commentAdd a comment