ఏపీలో బడా నేతల కాలక్షేపం కబుర్లు​! | KSR Comment On Yellow Media on Amit Shah Jagan Houses Enquiry | Sakshi
Sakshi News home page

ఏపీలో బడా నేతల కాలక్షేపం కబుర్లు​!

Published Wed, Jan 22 2025 11:35 AM | Last Updated on Wed, Jan 22 2025 12:01 PM

KSR Comment On Yellow Media on Amit Shah Jagan Houses Enquiry

ఇద్దరు ప్రజా ప్రతినిధులు.. అది కూడా పెద్ద స్థాయి వారు కలిస్తే ఏం మాట్లాడుకోవాలి? ప్రజలకు ఎలాంటి మేలు చేయాలి? ఇచ్చిన వాగ్ధానాల అమలు ఎలా? ఆ క్రమంలో వస్తున్న ఇబ్బందులను అధిగమించడం ఎలా? వంటివని మనం అనుకుంటాం. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం దీనికి భిన్నంగా జరుగుతోంది. ఎన్డీఆర్‌ఎఫ్‌ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇటీవల అమరావతికి వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృష్ణా కరకట్టపై నిర్మించిన అక్రమ భవనంలో భేటీ అయ్యారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌, మంత్రి లోకేష్‌లు కూడా హాజరైన ఈ సమావేశంలో వాళ్లు మాట్లాడుకున్న విషయాలు తెలిస్తే సామాన్యులు విస్తు పోవాల్సిందే. 

తెలుగుదేశం మీడియా చెప్పిన దాని ప్రకారమే.. ఈ సమావేశంలో ప్రధాన చర్చ మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు ఉన్న భవనాలపై సాగింది! అంత పెద్ద నేతలు ఇంత చీప్‌గా టైమ్‌పాస్‌ మాటలు మాట్లాడుకుంటారా? అబద్ధాల ముచ్చట్లు పెట్టుకుంటారా?. జగన్‌ భవనాల గురించి ఇప్పుడు చర్చించుకోవాల్సిన అవసరం ఏమిటన్న అనుమానం మీకూ రావచ్చు. అయితే ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా జగన్‌పై బురద చల్లడమే లక్ష్యంగా పనిచేస్తున్న పచ్చ బ్యాచ్‌కు మాత్రం ఈ సందేహం రాలేదు. అందుకే టీడీపీ జాకీ మీడియా ఆ సొల్లు పురాణాన్ని పతాక శీర్షికలకు ఎక్కించి సంతోషించింది. 

‘‘జగన్ జల్సా భవన్‌లు’’లపై ఆరా తీసిన అమిత్ షా అంటూ ఆనందపడింది. టీడీసీ,జనసేన, బీజేపీల కూటమి అధికారంలోకి వచ్చి ఏడున్నర నెలలు కావస్తున్నా ఈ పచ్చ మూక జగన్‌పై విమర్శలు మినహా సాధించిందేమీ లేదన్న విమర్శలు వస్తున్న నేపథ్యంలో కూటమి పెద్దలు ఇలా డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు. చంద్రబాబు నివాసాన్ని చూస్తూ, ‘‘నది పక్కన మీ ఇల్లు చాలా బాగుంది’’ అని అమిత్ షా మెచ్చుకున్నారట. పనిలో పనిగా జగన్ పాలెస్‌ల గురించి ఆరా తీసినట్లు తెలిసిందని ఈ జాకీ మీడియా రాసింది. అది చూస్తే ఒకటి మాత్రం స్పష్టం అవుతుంది. అమిత్ షా మాజీ ముఖ్యమంత్రి జగన్ ఇంటి గురించి అడిగి ఉండే అవకాశం లేదు. ఎందుకంటే అది అక్కడ టాపిక్ కాదు. కానీ.. 

విజయవాడలో ప్రకృతి వైపరీత్యానికి కారణమైన చంద్రబాబు ఇంటి గురించి హోం మంత్రి అడిగారన్న సమాచారమే బయటకు వెళితే అది తమకు ఇబ్బంది అవుతుంది కనుక టీడీపీ నేతలు పనిగట్టుకుని ఇలా అబద్ధాలు ప్రచారం చేసి ఉండాలి. హైదరాబాద్‌లో జగన్‌కు వంద గదలు ప్యాలెస్‌ ఉందని టీడీపీ నేతలు చెబితే అమిత్‌ షా చెవిలో పువ్వు పెట్టుకుని విన్నారన్నమాట!.  ఈ సోది రాసిన పత్రిక వారికి నిజం తెలియదా? నాలుగు బెడ్ రూమ్‌ల ఇల్లు ఉంటే వంద రూమ్‌లని వీళ్లు రాస్తారా? కడుపునకు అన్నం తినేవారు ఎవరైనా ఇంత చెత్తగా వార్తా కథనాలు ఇచ్చి పాఠకులను మోసం చేస్తారా?. 

 

జగన్ ఇంటి గురించి  నిజంగానే  సమాచారం కావాలంటే నిమిషాలలో తెప్పించుకునే శక్తి అమిత్ షా కు ఉండదా? బెంగుళూరులో ఇల్లు ఉంది, తాడేపల్లిలో ఇల్లు ఉందని చెప్పారట. ఈ రోజుల్లో కాస్త మధ్యతరగతి, ఉన్నతాదాయ వర్గాలవారు సైతం ఆయా ముఖ్యమైన నగరాలలో రెండు, మూడు ఇళ్లు కలిగి ఉంటున్నారు. అందులోను హైదరాబాద్‌తోపాటు ఏపీలోని సొంత ప్రాంతంలో కూడా ఇళ్లు ఉంటాయి. దానిని భూతద్దంలో చూపి జగన్ పై దుష్ప్రచారం చేయడానికి వీరు చూపిన శ్రద్ద రాష్ట్ర సమస్యలను వివరించడంపై పెట్టి ఉంటే బాగుండేది. పోనీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లకు హైదరాబాద్ లో ఇళ్లు లేవా? ఏపీలోని అమరావతి ప్రాంతంలో ఇళ్లు  లేవా? అవి ఎంత భారీగా ఉన్నాయో తెలియదా? అవి ప్యాలెస్‌లు కాదా? కృష్ణ కరకట్టపై అక్రమంగా నిర్మించిన ఇంటిలో చంద్రబాబు నివాసం ఉండడం లేదా? ఆ ప్యాలెస్‌ ప్రభుత్వానిది అని ఒకసారి, లింగమనేని రమేష్ ది అని మరోసారి మాటలు మార్చలేదా? ఆ ఇల్లు మునిగిపోకుండా చూడడానికి బుడమేరు లాకులను ఎత్తివేసిన ఫలితంగానే విజయవాడ మునిగిందన్న సంగతి నిజం కాదా? 

హోం మంత్రి అమిత్ షా కు పర్యావరణం, ప్రకృతి వైపరీత్యాల నివారణలపై ఏమాత్రం శ్రద్ద ఉన్నా ముందుగా చేయవలసిన  పని ఏమిటి? చంద్రబాబు కృష్ణానది ఒడ్డున కోస్టల్ రెగ్యులేషన్ చట్టాన్ని అతిక్రమించిన కట్టిన ఇంటిలో ఎలా ఉంటున్నావని హోం మంత్రి  ప్రశ్నించాలి కదా? ఆ పని చేయలేదా? చేసినా దాని గురించి ప్రచారం చేయకుండా జగన్ పై కట్టుకధలు వ్యాప్తిలోకి తెచ్చారా? చంద్రబాబుకు జూబ్లిహిల్స్ లో ఉన్నది ఎంత పెద్ద పాలెస్సో ఆ రోడ్డులోకి వెళ్లి చూసిన వారందరికి తెలుస్తుంది. ఆ భవన నిర్మాణానికి ఏ,ఏ దేశాల నుంచి వస్తువులు తెప్పించింది ఆ రోజుల్లో పలు వార్తలు వచ్చాయి కదా? అయినా ఆయన చాలా సింపుల్ గా ఉన్నట్లు అనుకోవాలి. తాజాగా.. 

అమరావతి సుమారు ఐదెకరాల విస్తీర్ణంలో ఇల్లు కట్టుకుంటున్నారని చెబుతున్నారు కదా. ఇది కాకుండా కుప్పంలో కూడా గృహ నిర్మాణం చేస్తున్నారు కదా? వీటి గురించి ఏమి చెబుతారు? ఇక్కడ ఒక సంగతి చెప్పాలి. ఉమ్మడి ఏపీ విభజన తర్వాత  ఆ రాష్ట్ర  రాజధాని అమరావతిలో ఇల్లు కట్టుకున్న ఏకైక నేత వైఎస్ జగన్. అంతేకాదు. సతీసమేతంగా పూర్తిగా  అక్కడే  నివసిస్తున్న నేత కూడా ఆయనే. చంద్రబాబు,పవన్ కళ్యాణ్ లు పూర్తిగా అక్కడే ఉంటున్నారా? చంద్రబాబు కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోనే నివసిస్తుంటారు కదా! ఇది తప్పని చెప్పడం లేదు. కాని ఎదుటి వ్యక్తిమీద మాత్రం బురద వేసి సంతోషపడుతుండడమే దారుణమనిపిస్తుంది. అమిత్ షా కు మరో విషయం గుర్తుకు రాలేదా? ఈ మధ్య కాలంలో ఏడిఆర్ నివేదిక ఒకటి వచ్చింది కదా? అందులో చంద్రబాబు రూ.931 కోట్ల ఆస్తితో  అత్యంత ధనికుడైన సీఎం అని వెల్లడైంది కదా? దానిపై హోం మంత్రి వివరాలు  తెలుసుకునే యత్నం చేయలేదా? ప్రధాని మోదీతో పాటు అమిత్ షా కూడా  2019 ఎన్నికల సమయంలో చంద్రబాబును ఉద్దేశించి అవినీతిపరుడు అని తీవ్ర స్థాయిలో విమర్శించారు కదా! మళ్లీ పొత్తు కుదరగానే నీతిమంతుడు అయిపోయారా? అలాగే చంద్రబాబు కూడా వీరిద్దరిని ఎన్ని మాటలు అన్నారు. జనం ఇవేవి గుర్తుకు తెచ్చుకోరాదన్న ఉద్దేశంతో జగన్ పై డైవర్ట్ చేస్తుంటారు.

అమిత్ షా మరుసటి రోజు ఎన్‌డీఆర్‌ఎఫ్‌  కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఏపీకి మూడు లక్షల కోట్ల రూపాయల మేర కేంద్రం సాయం చేసిందని ప్రకటించారు. అది నిజమా? కాదా? దానిని ఎల్లో మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి కాస్త మార్చి రాశాయి. ఏపీకి మూడులక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని అమిత్ షా అన్నట్లు ఈనాడు మార్చేసింది. హిందూ పత్రికలో మాత్రం మూడు లక్షల కోట్ల ఆర్థిక సాయం చేసినట్లు అమిత్ షా చెప్పారని పేర్కొన్నారు. అమరావతి రాజధాని కోసం రూ.15 వేల కోట్ల గ్రాంట్ ఇచ్చారని చంద్రబాబు తన ప్రసంగంలో చెబితే, అమిత్ షా మాత్రం దానిని రుణంగానే చెప్పారన్న సంగతి తెలుస్తుంది. హడ్కో, వరల్డ్ బ్యాంకు ద్వారా రూ.27 వేల కోట్ల రుణం ఇప్పిస్తున్నట్లు స్పష్టం చేశారు. 

వక్రీకరించి వార్తలు రాసి పాఠకులను టీడీపీ జాకీ మీడియా మోసం చేస్తోందని పదే,పదే రుజువు చేసుకుంటున్నాయి. కేంద్రం నిజంగానే రూ.మూడు లక్షల కోట్లు సాయం చేసి ఉంటే ఆ డబ్బంతా ఏమైపోయిందో అర్థం కాదు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకుండా, పెద్దగా అభివృద్ది పనులు ఏమీ చేపట్టకుండా ఆ నిధులు ఎటు మళ్లిస్తున్నారో ప్రభుత్వం వివరించాలి. ఇవి చాలక ఇప్పటికే రూ.70 వేల కోట్ల అప్పులు తీసుకు వచ్చారు. కరెంటు ఛార్జీల రూపంలో రూ.15 వేల కోట్ల మేర బాదారు. ఈ విషయాల గురించి కానీ విభజన హామీల గురించి ప్రస్తావించకుండా అమిత్ షా భజన చేయడానికే చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు అధిక సమయం కేటాయించినట్లు ఉంది. 

కేంద్రం మద్దతుతో వెంటిలేటర్ నుంచి బయటపడ్డామని, ఇప్పటికీ పేషంటే అని చంద్రబాబు చెబుతున్నారు. యథాప్రకారం రూ.పది లక్షల కోట్ల అప్పు అని అదని, ఇదని గత ప్రభుత్వానికి సంబంధించి అబద్దాలు చెప్పి అమిత్ షాను మోసం చేస్తే ఏమి లాభం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగైతే సూపర్ సిక్స్ హామీలను చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదో తెలపాలి కదా! అమిత్ షా తో తమ సూపర్ సిక్స్, ఎన్నికల ప్రణాళిక హామీల అమలు తీరు గురించి మాత్రం చర్చించలేదు. జగన్ ఇళ్ల గురించి ఇంత కీలక నేతలు  మాట్లాడుకున్నారంటే ప్రజల పట్ల వీరికి ఉన్న చిత్తశుద్ది ఏమిటో తెలియడం లేదా! పోచికోలు కబుర్లు చెప్పుకోవడానికి వీరికి ఇంత ఖాళీ టైమ్ ఉంటుందా!. 

:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement