సాక్షి, తాడేపల్లి: ఏపీలో విద్య పేరుతో జరిగే దోపిడీని వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు వైఎస్సార్‌సీపీ విద్యార్ధి విభాగం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర. మంత్రి నారా లోకేష్ ఏం చేస్తున్నారు?.. రెడ్ బుక్ రాజ్యాంగం విద్యార్థుల మీద కూడా చూపిస్తారా? అని ప్రశ్నించారు. అలాగే, చంద్రబాబు హయాంలో మళ్ళీ అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నారని చెప్పారు.
వైఎస్సార్‌సీపీ విద్యార్ధి విభాగం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘ఏపీలో మళ్లీ ప్రైవేటు కాలేజీల వేధింపులు పెరిగాయి. శ్రీ చైతన్య, నారాయణ సంస్థలు ఫీజుల పేరుతో దోపిడీ చేస్తున్నాయి. ఫీజులు చెల్లించకపోతే బయటకు నెట్టేస్తున్నాయి. శ్రీ చైతన్య సంస్థ నిన్న ఒక విద్యార్థిని బయటకు నెట్టింది. తండ్రితో కలిసి ఆ విద్యార్థి కాలేజీ ఎదుట ధర్నా చేశాడు. విద్య పేరుతో జరిగే ఈ దోపిడీని వ్యతిరేకిస్తున్నాం. మంత్రి లోకేష్ ఏం చేస్తున్నారు?. రెడ్‌బుక్ రాజ్యాంగం విద్యార్థుల మీద కూడా చూపిస్తారా?.
ఫీజుల మానిటరింగ్ కమిటీ ఏం చేస్తుందో అర్థం కావటం లేదు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఫీజుల పేరుతో వేధింపులనేవే జరగలేదు. చంద్రబాబు హయాంలో మళ్లీ అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇంటర్మీడియట్ బోర్డులో నారాయణ సంస్థ సిబ్బందిని నియమించటం సిగ్గుచేటు. ఫీజుల గురించి వేధిస్తే వైఎస్సార్‌సీపీ హయాంలో బ్లాక్ లిస్టులో పెట్టారు. ఇప్పుడు ఆ పని ఎందుకు చేయటం లేదు?. విద్యార్థులను మానసిక ఆందోళనకు గురి చేస్తున్న సంస్థలపై చర్యలు తీసుకోవాలి.
కార్పొరేట్ విద్యాసంస్థల్లో పిల్లలు పిట్టల్లాగా రాలిపోతున్నారు. నారాయణ, శ్రీ చైతన్య సంస్థలపై విచారణ జరపాలి. ఆ సంస్థలు పుస్తకాల ఫీజే రూ.18వేలు చొప్పున వసూలు చేస్తున్నారు. రూ.50ల ఐడీ కార్డుకు రూ.400 వసూలు చేస్తున్నారు. ఇలాంటి చర్యలను వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం సీరియస్‌గా తీసుకుంటుంది. ఈ ప్రభుత్వ చర్యలపై ఉద్యమిస్తాం. నారాయణ, శ్రీ చైతన్య సంస్థల్లోని సిబ్బందికి సరైన జీతాలు ఇవ్వటం లేదు. పని భారంతో వేధింపులకు గురి చేస్తున్నారు. విద్యార్థుల నుండి ముక్కు పిండి ఫీజులు వసూలు చేస్తూ సిబ్బందికి కూడా జీతాలు ఇవ్వటం లేదు’ అని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment