విజయవాడ, సాక్షి: సీనియర్ ఐపీఎస్ అధికారి, గత సీఐడీ చీఫ్ ఎన్.సంజయ్‌పై చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపులకు దిగింది. ఇప్పటికే ఆయనపై సస్పెన్షన్ వేటు వేసిన సర్కార్.. ఇప్పుడు అధికార దుర్వినియోగం, అవినీతి ఆరోపణల విచారణ పేరిట ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నాల్లో ఉంది. ఒకవైపు ఆయన న్యాయపోరాటం చేస్తున్నవేళ.. మరోవైపు విచారణకు రావాలంటూ ప్రభుత్వం నోటీసులు జారీ చేయడం గమనార్హం.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో సీఐడీ ఛీఫ్‌గా సంజయ్(Sanjay) వ్యవహరించిన సంగతి తెలిసిందే. చంద్రబాబు నాయుడి స్కిల్ స్కాం కేసు దర్యాప్తు ఈయన పర్యవేక్షణలోనే జరిగింది. ఈ నేపథ్యంలోనే రాజకీయ, వ్యక్తిగత ప్రతీకారంలో భాగంగానే కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందన్న ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి.
తాజాగా.. 30 రోజుల్లో స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది ప్రభుత్వం. వ్యక్తిగత విచారణకు హాజరుకావాలని.. స్పందించకపోతే చర్యలు తీసుకుంటామంటూ నోటీసులో హెచ్చరికలు జారీ చేసింది.
ముందస్తు బెయిల్‌పై తీర్పు రిజర్వ్
సాక్షి, అమరావతి: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) నమోదు చేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఏపీ హైకోర్టును కోరుతూ సీనియర్ ఐపీఎస్ అధికారి, గత సీఐడీ చీఫ్ ఎన్.సంజయ్ దాఖలు చేసిన పిటిషన్‌లో వాదనలు ముగిశాయి. వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి తీర్పును రిజర్వ్ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది సుబ్రహ్మణ్య శ్రీరామ్(Subramanyam Sriram)వాదనలు వినిపిస్తూ.. సీనియర్ ఐపీఎస్ అధికారి సంజయ్‌పై ఏసీబీ చేసిన ఆరోపణల్లో ఎంతమాత్రం వాస్తవం లేదని వివరించారు. ప్రభుత్వం మారిన వెంటనే తనను దురుద్దేశపూర్వకంగా ఈ తప్పుడు కేసులో ఇరికించారని తెలిపారు. అగ్ని యాప్ తయారీలో అక్రమాలు జరిగాయని ఏసీబీ చెబుతోందని, వాస్తవానికి ఆ యాప్ పనితీరుకు టెక్నాలజీ సభ అవార్డు సైతం ప్రదానం చేసిందన్నారు. యాప్ తయారీకి నిబంధనల ప్రకారం టెండర్లు పిలిచామని, అందులో లోయస్ట్ బిడ్డర్ అయిన సౌత్రికా టెక్నాలజీస్ అండ్ ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్‌కు అగ్నిమాపక శాఖ పనులు అప్పగించిందన్నారు. ఆ వెంటనే పనులు ప్రారంభించిన సౌత్రికా, యాప్ తయారీని సకాలంలో పూర్తి చేసిందని తెలిపారు. అగ్ని యాప్ తయారీ పూర్తయి, దాని పనితీరు సంతృప్తికరంగా ఉన్న తరువాతే నగదు విడుదల చేశారని పేర్కొన్నారు. పైగా.. మార్కెట్ ధరకంటే 5 శాతం తక్కువకే ల్యాప్‌టాప్‌లు కొనుగోలు చేశారన్నారు.
వాస్తవాలు ఇలా ఉంటే, ఏసీబీ మాత్రం హడావుడిగా డబ్బు చెల్లించామంటూ నిరాధార ఆరోపణలు చేస్తోందన్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని, ఏ షరతులు విధించినా కట్టుబడి ఉంటామన్నారు. సీఐడీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఈ మొత్తం వ్యవహారంలో సంజయ్ లబ్ధి పొందారని, ఇందుకు ప్రాథమిక ఆధారాలు కూడా ఉన్నాయన్నారు. అంతిమ లబ్ధిదారులు ఎవరో తేల్చాల్సి ఉందని, అందువల్ల సంజయ్‌ని కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆయన ముందస్తు బెయిల్(Anticipatory Bail)ను కొట్టేయాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డి తీర్పును రిజర్వ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment