గతవారం బిజినెస్ | Last week Business | Sakshi
Sakshi News home page

గతవారం బిజినెస్

Published Mon, Jun 22 2015 1:50 AM | Last Updated on Sun, Sep 3 2017 4:08 AM

Last week Business

ఉక్కు ఉత్పత్తులపై దిగుమతి సుంకాల పెంపు
 కొన్ని ఉక్కు ఉత్పత్తుల దిగుమతులపై కేంద్రం బేసిక్ కస్టమ్స్ డ్యూటీని (బీసీడీ) 2.5 శాతం మేర పెంచింది. నిర్దిష్ట ఫ్లాట్ స్టీల్ ఉత్పత్తులపై 7.5 శాతం నుంచి 10 శాతానికి, లాంగ్ స్టీల్ ఉత్పత్తులపై 5 శాతం నుంచి 7.5 శాతానికి సుంకాన్ని పెంచినట్లు కేంద్రీయ ఎక్సైజ్, కస్టమ్స్ బోర్డు (సీబీఈసీ) ఒక నోటిఫికేషన్‌లో పేర్కొంది.

 కార్వీపై ఏడాది నిషేధం
 ఐపీవో స్కాంకు సంబంధించి ఏడాది పాటు కొత్తగా ఎటువంటి ఐపీవోలు చేపట్టకుండా కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ (కేఎస్‌బీఎల్)పై మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఆంక్షలు విధించింది. దీని ప్రకారం సోమవారం నుంచి ఏడాది పాటు ఐపీవోలకు సంబంధించిన ప్రత్యక్ష, పరోక్ష కార్యకలాపాల నుంచి కేఎస్‌బీఎల్‌ని నిషేధించింది.

 ఎగుమతులు డీలా..
 మే నెలలో ఎగుమతులు 20 శాతంమేర, దిగుమతులు 17 శాతంమేర క్షీణించాయి. గతేడాది మే నెలలో 27.99 బిలియన్ డాలర్లుగా ఉన్న ఎగుమతులు ఈ ఏడాది అదే నెలలో 22.34 బిలియన్ డాలర్లకు తగ్గాయి. అదే సమయలో దిగుమతులు 39.23 బిలియన్ డాలర్ల నుంచి 32.75 బిలియన్ డాలర్లకు క్షీణించాయి. వాణిజ్యలోటు 10.4 బిలియన్ డాలర్లుగా ఉంది. చమురు దిగుమతులు 8.53 బిలియన్ డాలర్లుగా, చమురేతర దిగుమతులు 24.21 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. బంగారం దిగుమతులు 10.47 శాతం వృద్ధితో  2.19 బిలియన్ డాలర్ల నుంచి 2.42 బిలియన్ డాలర్లకు ఎగశాయి.

 ఎస్‌బీఐ నుంచి ఆన్‌లైన్ ఫారె క్స్ ప్లాట్‌ఫామ్
 ఖాతాదారులు విదేశీ మారక లావాదేవీలను ఆన్‌లైన్ మాధ్యమంలో జరిపేందుకు వీలుగా ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్‌బీఐ తాజాగా ఇం టర్నెట్ ఆధారిత ఈఫారెక్స్ ప్లాట్‌ఫాంను ఆవిష్కరించింది. ప్రత్యేకంగా బ్యాంకు శాఖకు వెళ్లాల్సిన అవసరం లేకుండా కస్టమర్లు దీన్నుంచే ఫారెక్స్ రేట్లను తెలుసుకోవచ్చని ఎస్‌బీఐ తెలిపింది.

 ఈ ఏడాది సిస్కో పెట్టుబడులు 174 కోట్ల డాలర్లు
  అమెరికా టెక్నాలజీ దిగ్గజం సిస్కో ఈ ఏడాది భారత్‌లో 174 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెడుతోంది. ప్రతీ ఏడాది భారత్‌లో పెడుతున్న పెట్టుబడులకు అదనంగా ఈ ఏడాది మరో  6 కోట్ల డాలర్లు (శిక్షణా కేంద్రాల విస్తరణకు 4 కోట్ల డాలర్లు, విద్యార్థుల శిక్షణకు 2 కోట్ల డాలర్లు) ఇన్వెస్ట్ చేయనున్నామని సిస్కో సిస్టమ్స్ చైర్మన్, సీఈఓ జాన్ టి. చాంబర్స్ చెప్పారు.

 హైదరాబాద్‌లో టీసీఎస్ ఆర్ అండ్ డీ కేంద్రం
 టీసీఎస్ హైదరాబాద్‌లో ఆర్ అండ్ డీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ (సీవోఈ) పేరుతో 10,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ ఆర్ అండ్ డీ కేంద్రాన్ని టీసీఎస్ ప్రారంభించింది. భవిష్యత్తులో అందుబాటులోకి వచ్చే కొత్త టెక్నాలజీలు ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ డిఫైన్డ్ నెట్‌వర్క్స్, 5జీ, వైర్‌లెస్ లాన్ వంటి వాటిపై ఈ కేంద్రం ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తుంది.

 బీపీసీఎల్‌లో 3% వాటాల డిజిన్వెస్ట్‌మెంట్
 ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ చమురు దిగ్గజం భారత్ పెట్రోలియం కార్పొరేషన్‌లో (బీపీసీఎల్) 3 శాతం వాటాలను విక్రయించాలని కేంద్రం యోచిస్తోంది. తద్వారా రూ. 1,800 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. పబ్లిక్ ఆఫర్ ద్వారా బీపీసీఎల్‌లో 2.16 కోట్ల షేర్ల విక్రయించడానికి సంబంధించి అంతర్ మంత్రిత్వ శాఖలు చర్చించేందుకు ఆర్థిక శాఖ ఒక నోట్‌ను రూపొందించింది.

 బంగారం బాండ్లు వస్తున్నాయ్
 నాణేలు, కడ్డీలు తదితర రూపాల్లో బంగారానికి డిమాండ్‌ను కట్టడి చేసే దిశగా కేంద్రం తాజాగా సావరీన్ గోల్డ్ బాండ్ల (ఎస్‌బీజీ) జారీ ప్రతిపాదన తెరపైకి తెచ్చింది. కమీషన్ ప్రాతిపదికన పోస్టాఫీసులు, ఇతరత్రా బ్రోకర్ల ద్వారా వీటిని జారీ చేయనుంది. ఏటా దాదాపు 300 టన్నుల మేర కడ్డీల రూపంలో జరుగుతున్న కొనుగోళ్లలో కొంత భాగాన్నైనా డీమ్యాట్ రూపంలోని బాండ్లవైపు మళ్లించాలన్నది దీని వెనుక ఉద్దేశం. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం సుమారు 50 టన్నుల పసిడికి సరిసమానమైన బాండ్ల జారీ ద్వారా రూ. 13,500 కోట్లు సమీకరించవచ్చని ప్రభుత్వం యోచిస్తోంది.

 కాకినాడలో స్టార్టప్ ఇంక్యుబేషన్ సెంటర్
 ఏపీలోని కాకినాడలో స్టార్టప్ ఇంక్యుబేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్ సలహాదారు జె.సత్యనారాయణ చెప్పారు. ఈ ఏడాది చివరకు ఈ స్టార్టప్ టవర్‌ను అందుబాటులోకి తెస్తామని, ఆ తర్వాత అనంతపురం, తిరుపతిల్లోనూ ఒక్కో సెంటర్‌ను నిర్మిస్తామని చెప్పారు. ఈ ఏడాది స్టార్టప్ ఇన్నోవేషన్ నిధుల కింద రూ.100 కోట్లను ఖర్చు చేస్తామని తెలియజేశారు.

 ఫార్మాలో 4,000 కోట్ల ఎఫ్‌డీఐలకు కేంద్రం ఓకే
 ఫార్మా రంగంలో సుమారు రూ. 4,000 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టు బడుల (ఎఫ్‌డీఐ) ప్రతిపాదనల కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టొరెంట్ ఫార్మా రూ. 3,000 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదన, బయోకాన్‌కి చెందిన రీసెర్చ్ సేవల సంస్థ సింజీన్ రూ. 930 కోట్ల ప్రతిపాదనతోపాటు పలు కంపెనీల ప్రతిపాదనలు ఇందులో ఉన్నాయి.  

 నియామకం
 ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫ్యాప్సీ) ప్రెసిడెంట్‌గా వెన్నం అనిల్‌రెడ్డి ఎన్నికయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement