![SBI Har Ghar Lakhpati Scheme Eligibility Features And Interest Rates Details](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/01/7/sbi-new-scheme.jpg.webp?itok=sU2ASYXB)
భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టలేని వారు లేదా చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారి కోసం 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' (SBI) హర్ ఘర్ లఖ్‌పతి రికరింగ్ డిపాజిట్ పేరుతో ఓ సరికొత్త స్కీమ్ తీసుకువచ్చింది. ఇందులో ప్రతి ఒక్కరూ సులభమైన పద్ధతిలో పొదుపు చేసుకోవచ్చు. ఆకర్షణీయమైన వడ్డీని పొందవచ్చు.
హర్ ఘర్ లఖ్‌పతి పథకం (Har Ghar Lakhpati Scheme)
హర్ ఘర్ లఖ్‌పతి పథకం అనేది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రారంభించిన ఓ సరికొత్త పొదుపు స్కీమ్. దీని ద్వారా ఒక వ్యక్తి లేదా కుటుంబం ఆర్థికంగా కొంత వృద్ధి చెందవచ్చు. అంతే కాకుండా క్రమశిక్షణతో కూడిన ఆర్థిక అలవాట్లను పెంపొందించుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇది పెద్దవారికి మాత్రమే కాకుండా.. మైనర్లకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది.
హర్ ఘర్ లఖ్‌పతి పథకం కింద ప్రజలు 12 నెలల నుంచి 120 నెలల (1 ఏడాది నుంచి 10 సంవత్సరాలు) వరకు పొదుపు చేసుకోవచ్చు. వివాహాలకు లేదా ఇంటి కొనుగోళ్లు వంటి వాటికి ప్లాన్ చేసుకునేవారికి ఇది కొంత ప్రయోజనకారిగా ఉంటుంది. 10 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న వారి దగ్గర నుంచి పెద్దవారి వరకు ఎవరైనా ఇందులో పొదుపు చేసుకోవచ్చు. అయితే 10 ఏళ్లకంటే తక్కువ వయసున్న పిల్లలు మాత్రం తల్లిదండ్రులు లేదా సంరక్షకులతో అకౌంట్ ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది.
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/sbi_0.jpg)
వడ్డీ రేటు
●సాధారణ ప్రజలకు 6.75 శాతం
●సీనియర్ సిటిజన్లకు 7.25 శాతం
●స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగులకు 8 శాతం
●ఆదాయ పన్నుశాఖ నిబంధనల ప్రకారం.. పన్ను మినహాయింపు వర్తిస్తుంది
నెలవారీ పెట్టుబడులు
హర్ ఘర్ లఖ్‌పతి రికరింగ్ డిపాజిట్ పథకం కింద.. నెలవారీ పెట్టుబడులు చేయడం ద్వారా లక్ష రూపాయలు పొందవచ్చు. సాధారణ పౌరులకు, 6.75 శాతం వడ్డీతో మూడు సంవత్సరాలకు నెలకు రూ. 2,500 లేదా 6.50 శాతం చొప్పున ఐదు సంవత్సరాలకు నెలకు రూ. 1,407 పెట్టుబడి పెట్టడం లక్ష్యాన్ని చేరుకోవడానికి సహాయపడుతుంది. సీనియర్ సిటిజన్లు 7.25 శాతం చొప్పున మూడేళ్లపాటు నెలవారీ రూ. 2,480 లేదా 7 శాతం చొప్పున ఐదు సంవత్సరాలకు నెలకు రూ. 1,389 పెట్టుబడి పెట్టడం ద్వారా దీనిని పొందవచ్చు.
ఇదీ చదవండి: ఈ టిప్స్ పాటిస్తే.. EMI ఆలస్యమైనా పర్లేదు!
జరిమానాలు
వాయిదా ప్రకారం తప్పకుండా డిపాజిట్ చేయాలి. అలా చేయని సమయంలో లేదా ఆలస్యమైతే రూ.100కు రూ.1.50 పైసలు నుంచి 2 రూపాయలు జరిమానా పడుతుంది. అంతే కాకుండా ఆరు నెలల పాటు వాయిదాలు చెల్లించకపోతే మీ అకౌంట్ క్లోజ్ అవుతుంది. అప్పటికి మీరు పొదుపు చేసిన మొత్తం సేవింగ్ ఖాతాకు బదిలీ అవుతుంది.
అకౌంట్ ఓపెన్ చేయడం ఎలా?
●హర్ ఘర్ లఖ్‌పతి రికరింగ్ డిపాజిట్ పథకం కోసం అకౌంట్ ఓపెన్ చేసుకోవాలనుకుంటే.. సమీపంలోని SBI బ్రాంచ్ సందర్సించాలి.
●ఈ అకౌంట్ ఓపెన్ చేయడానికి కావలసిన డాక్యుమెంట్స్ సమర్పించాలి.
●ఖాతా ప్రారంభించే సమయంలోనే మెచ్యూరిటీ మొత్తాన్ని, ఈఎంఐ వంటి వాటిని లెక్కించుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment