ట్రంప్‌, జేడీ వాన్స్‌ ప్రమాణం.. ప్రత్యేక ఆకర్షణగా ఉషా చిలుకూరి | Usha Vance Monotone magic wins Inauguration Day fashion | Sakshi
Sakshi News home page

ట్రంప్‌, జేడీ వాన్స్‌ ప్రమాణం.. ప్రత్యేక ఆకర్షణగా ఉషా చిలుకూరి

Published Tue, Jan 21 2025 9:33 AM | Last Updated on Tue, Jan 21 2025 11:34 AM

Usha Vance Monotone magic wins Inauguration Day fashion

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ ప్రమాణ స్వీకారం వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పలు దేశాధినేతలు, ప్రముఖులు పాల్గొన్నారు. ఇక, జేడీ వాన్స్‌ ప్రమాణం సందర్భంగా ఆయన పక్కనే తన భార్య ఉషా వాన్స్‌(Usha Vance) ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

అమెరికా ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో ఉషా చిలుకూరి ఆనందంతో ఉప్పొంగిపోయారు. సాధారణంగా అధ్యక్షుడి కంటే ముందు ఉపాధ్యక్షుడు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ క్రమంలోనే తొలుత అమెరికా నూతన ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ చేత సుప్రీంకోర్టు న్యాయమూర్తి బ్రెట్ కవనాగ్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా భార్య ఉషా చిలుకూరి, పిల్లలు ఆయన పక్కనే నిల్చుని ఉన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం జేడీ వాన్స్‌.. తన సతీమణి ఉషా చిలుకూరి ప్రేమగా ముద్దిచ్చారు.

ఇక, ప్రమాణం సందర్బంగా జేడీ వాన్స్‌..‘విదేశీ, దేశీయ శత్రువులందరికీ వ్యతిరేకంగా.. నేను యునైటెడ్ స్టేట్స్ రాజ్యాంగానికి మద్దతు ఇస్తానని, దానిని రక్షించుకుంటానని నేను గంభీరంగా ప్రమాణం చేస్తున్నాను. నేను అమెరికా రాజ్యాంగానికి నిజమైన విశ్వాసం, విధేయతను కలిగి ఉంటాను. ఎటువంటి మెంటల్ రిజర్వేషన్ లేదా ఎగవేత ఉద్దేశ్యం లేకుండా.. నేను ఈ బాధ్యతను స్వేచ్ఛగా తీసుకుంటాను. నేను ప్రవేశించబోయే పదవి విధులను నేను చక్కగా, నమ్మకంగా నిర్వర్తిస్తాను అని అన్నారు.

ఇదిలా ఉండగా.. జేడీ వాన్స్ భార్య ఉషా చిలుకూరి వాన్స్ భారత సంతతికి చెందినవారు. ఆమెకు తెలుగు మూలాలు కూడా ఉన్నాయి. ఆమె తల్లిదండ్రుల స్వస్థలం ఆంధ్రప్రదేశ్. వారు సుదీర్ఘ కాలం కిందటే ఆంధ్రప్రదేశ్ నుంచి వలస వెళ్లి అమెరికాలో స్థిరపడ్డారు. దీంతో ఉషా చిలుకూరి అక్కడే జన్మించారు. 1986లో కాలిఫోర్నియాలో జన్మించిన ఉషా చిలుకూరి.. శాన్ డియాగో శివారులో పెరిగారు. ఆమె రాంచో పెనాస్క్విటోస్‌లోని మౌంట్ కార్మెల్ హైస్కూల్‌లో విద్యను అభ్యసించారు. న్యూయార్క్ టైమ్స్ ప్రకారం.. ఆమె యేల్ విశ్వవిద్యాలయం నుంచి హిస్టరీలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ డిగ్రీని పొందారు.

జేడీ వాన్స్‌తో పరిచయం..
2013లో జేడీ వాన్స్‌ను ఉషా చిలుకూరి కలిశారు. వారు కలిసి సోషల్ డిక్లైన్ ఇన్ వైట్ అమెరికాపై చర్చా సమూహాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత వారిద్దరి మధ్య ప్రేమ బంధం ఏర్పడింది. ఆ తర్వాత వారు 2014లో వివాహం చేసుకున్నారు. ఒక హిందూ పూజారి సమక్షంలో నిర్వహించిన వేడుకలో ఇద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. జేమ్స్ డేవిడ్ వాన్స్-ఉషా చిలుకూరి వాన్స్ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారి పేర్లు ఇవాన్, వివేక్, మిరాబెల్.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement