అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్‌ | Kamala Harris files nomination for US presidential elections 2024 | Sakshi
Sakshi News home page

అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్‌

Published Sat, Jul 27 2024 7:59 AM | Last Updated on Sat, Jul 27 2024 10:19 AM

Kamala Harris files nomination for US presidential elections 2024

వాష్టింగన్‌: అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌(59) అమెరికా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిగా ఖరారు అయ్యారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తెలియజేశారు. ఇందుకు సంబంధించిన పత్రాలపై సంతకం చేసినట్లు తెలిపారామె. అన్ని ఓట్లూ పొందేందుకు కృషి చేస్తానని, నవంబర్‌లో ప్రజాబలంతో నడుస్తున్న ప్రచారమే గెలుస్తుందని ఎక్స్‌ ఖాతాలో ఆమె పేర్కొన్నారు. అయితే ఆమె తమ అభ్యర్థి అని డెమోక్రటిక్‌ పార్టీ ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. 

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఇటీవల అధ్యక్ష రేసు నుంచి వైదొలుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ వెంటనే ఆయన ఉపాధ్యక్షురాలైన కమలా హారిస్‌ పేరును డెమోక్రటిక్‌ అభ్యర్థిగా ప్రతిపాదించారు. దీంతో డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థిగా ఆమె మద్దతు కూడగట్టుకుంటున్నారు.

నేపథ్యం.. 
కమలా హారిస్‌ పూర్తి పేరు.. కమలాదేవి హారిస్‌. ఆమె భారతీయ మూలాలున్న వ్యక్తి.  తల్లి శ్యామలా గోపాలన్ చెన్నైవాసి. పైచదువుల కోసం అమెరికా వెళ్లి.. అక్కడే శాస్త్రవేత్తగా స్థిరపడ్డారు. కమల తండ్రి డొనాల్డ్ హ్యారిస్‌. జమైకాకు చెందిన ఆయన అర్థశాస్త్ర ప్రొఫెసర్. అమెరికాలో జన్మించిన కమల.. తల్లి భారతీయురాలు కాబట్టి భారతీయ అమెరికన్, తండ్రి ఆఫ్రికన్ కాబట్టి ఆఫ్రికన్ అమెరికన్ అయ్యారు. హోవార్డ్ విశ్వవిద్యాలయం నుంచి అర్థశాస్త్రంలో డిగ్రీ చేశారు కమల. క్యాలిఫోర్నియా యూనివర్సిటీ పరిధిలోని హేస్టింగ్స్ కాలేజ్ ఆఫ్ లా నుంచి జ్యూరిస్ డాక్టరేట్ అందుకొన్నారు. 

అటార్నీ జనరల్‌గా..
హోవార్డ్‌లో చదువుతున్నప్పుడే విద్యార్థి నాయకురాలిగా పోటీ చేశారామె. చదువు పూర్తి చేసిన తర్వాత క్యాలిఫోర్నియాలోని అలమెడా కౌంటీకి డిప్యూటీ డిస్ట్రిక్ట్ అటార్నీగా పని చేశారు. శాన్‌ఫ్రాన్సిస్కో డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయంలో కెరీర్ క్రిమినల్ యూనిట్‌లో మేనేజింగ్ అటార్నీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆపై శాన్‌ఫ్రాన్సిస్కో సిటీ అటార్నీ జనరల్‌గా రెండు పర్యాయాలు ఎన్నికై సమర్థంగా తన బాధ్యతలు నిర్వహించారు కమల. 2003లో ఆ పదవి చేపట్టిన కమల 2011 వరకు అందులోనే కొనసాగారు. ఆపై కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా ఎన్నికయ్యారు. 

సెనేటర్‌ నుంచి తక్కువ టైంలో.. 
2017లో క్యాలిఫోర్నియా సెనేటర్‌గా కీలక బాధ్యతలు చేపట్టారు. తద్వారా కరోల్ మోస్లే తర్వాత ‘అమెరికన్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్’లో అడుగుపెట్టిన తొలి నల్ల జాతీయురాలిగా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. 2020లో అమెరికా ఉపాధ్యక్ష పదవి చేపట్టారు. కమలా హారిస్‌ అమెరికా తొలి మహిళా ఉపాధ్యక్షురాలు. మొదటి నల్లజాతి, దక్షిణాసియా సంతతికి చెందిన తొలి వైస్ ప్రెసిడెంట్‌ కూడా ఆమే. ఇప్పుడు ఏకంగా అధ్యక్ష పదవికే గురిపెట్టారు. డెమోక్రటిక్‌ పార్టీ ఆ​మె అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటిస్తే.. రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌(78)తో ఆమె పోటీ పడనున్నారు. ఈ ఎన్నికల్లో డెమోక్రటిక్‌ అభ్యర్థిగా గెలిస్తే.. అగ్ర రాజ్యానికి తొలి మహిళా అధ్యక్షురాలిగా చరిత్ర సృష్టించినట్లే అవుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement