ట్రంప్‌ ఇచ్చిన బాధ్యతల నుంచి వైదొలగిన వివేక్‌ రామస్వామి.. కారణం? | Vivek Ramaswamy Quit DOGE After Donald Trump Took Charge | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ ఇచ్చిన బాధ్యతల నుంచి వైదొలగిన వివేక్‌ రామస్వామి.. కారణం?

Published Tue, Jan 21 2025 8:04 AM | Last Updated on Tue, Jan 21 2025 9:39 AM

Vivek Ramaswamy Quit DOGE After Donald Trump Took Charge

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) ప్రమాణం వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ట్రంప్‌ కార్యవర్గంలో కీలకమైన డోజ్‌ (డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫిషియెన్సీ) బాధ్యతల నుంచి భారత అమెరికన్‌ వ్యాపారవేత్త వివేక్‌ రామస్వామి (Vivek Ramaswamy) తప్పుకున్నారు. ఈ మేరకు ట్విట్టర్‌ వేదికగా విషయాన్ని వెల్లడించారు. ఇందుకు కారణం మాత్రం వెల్లడించలేదు.

భారత సంతతి వివేక్‌ రామస్వామి కీలక ప్రకటన చేశారు. ట్రంప్‌ కార్యవర్గంలో కీలకమైన డోజ్‌ బాధ్యతల నుంచి తాను తప్పుకుంటున్నట్టు తెలిపారు. అయితే, ట్రంప్‌ తన ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా ఎలాన్‌ మస్క్‌తోపాటు వివేక్‌ రామస్వామిని  ఈ బాధ్యతల్లో నియమించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఒహైయో గవర్నర్‌గా పోటీ చేసేందుకు మొగ్గు చూపుతున్న నేపథ్యంలో వివేక్‌ తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ సందర్బంగా వివేక్‌ రామస్వామి.. డోజ్‌ ఏర్పాటుకు మద్దతు ఇవ్వడం నాకు గౌరవంగా భావిస్తున్నాను. ప్రభుత్వాన్ని క్రమబద్ధీకరించడంలో ఎలాన్‌ మస్క్‌ బృందం విజయం సాధిస్తుందని నేను విశ్వసిస్తున్నాను. ఒహియోలో నా భవిష్యత్ ప్రణాళికల గురించి త్వరలో నేను మరిన్ని చెప్పాలి. ముఖ్యంగా, అధ్యక్షుడు ట్రంప్ అమెరికాను మళ్లీ గొప్పగా మార్చడానికి మేము సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాము అంటూ చెప్పుకొచ్చారు. దీంతో, ఆయన నిర్ణయం ఆసక్తికరంగా మారింది.

ఇదిలా ఉండగా.. అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్బంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తొలిరోజే దాదాపు 100కుపైగా కార్యనిర్వాహక ఆదేశాల (ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్ల)పై సంతకాలు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో అధ్యక్షుడి చేతిలో అత్యంత శక్తిమంతమైన సాధనంగా పేర్కొనే ఈ ఆదేశాల ప్రాధాన్యం, వాటి అమలు గురించిన అంశాలను పరిశీలిస్తే.. అమెరికా చట్టసభ ఆమోదం లేకుండా సమాఖ్య ప్రభుత్వానికి అధ్యక్షుడు జారీ చేసే లిఖితపూర్వక ఆదేశాలనే ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ అంటారు. ప్రభుత్వ విధానాలకు సంబంధించి అధ్యక్షుడు తీసుకునే కీలక నిర్ణయాలు ఇందులో ఉంటాయి.

కేంద్ర సంస్థలకు ఆదేశాలు ఇవ్వడం లేదా నివేదికలను కోరడం వంటివి ఉండవచ్చు. అమెరికా రాజ్యాంగం ప్రకారం ఈ ఆదేశాలు జారీచేసే అధికారం అధ్యక్షుడికి ఉంటుంది. ఆ దేశాలకు చట్టబద్ధత ఉంటుంది. ఎగ్జిక్యూటివ్‌ ఆదేశాలను తిరస్కరించేందుకు చట్టాన్ని తీసుకొచ్చే అవకాశం కాంగ్రెస్‌కు ఉన్నప్పటికీ.. దానిపై వీటో అధికారం మాత్రం అధ్యక్షుడిదే. అందుకే కాంగ్రెస్‌ ఆమోదించలేని అంశాలను తమ అజెండాలో అధ్యక్షుడు పెట్టుకుంటారు. చట్టసభ ఆమోదం లేకుండా జారీచేసే అధికారం అధ్యక్షుడికి ఉన్నా.. వీటికి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఆదేశాలను వ్యతిరేకించ లేనప్పటికీ.. ఆ నిర్ణయాలకు అవసరమైన నిధులు ఇవ్వకుండా అడ్డుకోవడం లేదా ఇతర అడ్డంకులు సృష్టించడం ద్వారా వీటి అమలుకు ‘కాంగ్రెస్‌’ ఆటంకం కలిగించే వీలుంది. మునుపటి అధ్యక్షులు ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయడానికి ఈ ఎగ్జిక్యూటివ్‌ను కొత్త అధ్యక్షుడు ఉపయోగించే అవకాశం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement