హెచ్–1బీ వీసాలపై రగడలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వీటికి అనుకూలంగా మాట్లాడడం.. ఆయన మద్దతుదారుల్ని షాక్‌కు గురి చేసింది. అదే సమయంలో.. టెస్లా, ఎక్స్, స్పేస్‌ఎక్స్ సంస్థల అధినేత, ప్రపంచ కుబేరుడు ఇలాన్ మస్క్(Elon Musk) కాస్త మెత్తబడ్డారు. హెచ్–1బీ వీసాల పరిరక్షణ కోసం అవసరమైతే యుద్ధానికైనా సిద్ధమేనని ప్రకటించిన ఆయన.. ఇప్పుడు స్వరం మార్చారు. ఈ పాలసీలో భారీ సంస్కరణలు అవసరం అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.
నిపుణులైన ఉద్యోగులకు అమెరికాలో పనిచేసుకొనేందుకు అవకాశం కల్పించేవే హెచ్–1బీ(H1B) వీసాలు. అయితే.. ఈ వీసా వ్యవస్థ సజావుగా నడవడం లేదని.. దానికి భారీ సంస్కరణలు అవసరమని తాజాగా ఇలాన్ మస్క్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఎక్స్‌లో ఓ వ్యక్తి చేసిన పోస్టుకు ఆయన బదులిచ్చారు.
Easily fixed by raising the minimum salary significantly and adding a yearly cost for maintaining the H1B, making it materially more expensive to hire from overseas than domestically.
I’ve been very clear that the program is broken and needs major reform.— Elon Musk (@elonmusk) December 29, 2024
హెచ్–1బీ వీసా మీద సౌతాఫ్రికా నుంచి అమెరికాకు వచ్చి స్థిరపడ్డారు ఇలాన్ మస్క్. అయితే ప్రభుత్వ పాలనలో సమూల సంస్కరణలే లక్ష్యంగా ట్రంప్ కొత్తగా తెస్తున్న డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డోజ్)కు సంయుక్త సారథులుగా ఇలాన్ మస్క్, వివేక్ రామస్వామి(Vivek Ramaswamy) ని నియమించారు. అయితే.. అమెరికా ఫస్ట్ అమలుకు ట్రంప్ ఏరికోరి నియమించిన ఈ ఇద్దరే బీ1 వీసా విధానానికి మద్దతు ప్రకటించడం.. ట్రంప్ మద్దతుదారులకు ఏమాత్రం సహించడం లేదు. దీనికి తోడు..
👉తాజాగా.. వైట్‌హౌస్ ఏఐ సీనియర్ పాలసీ సలహాదారుడిగా భారత అమెరికన్ వెంచర్‌క్యాలిటలిస్టు శ్రీరామ్ కృష్ణన్‌ను ట్రంప్ ఇటీవల నియమించారు. అయితే నిపుణులైన వలసదార్ల కోసం గ్రీన్‌కార్డులపై పరిమితి తొలగించాలని కృష్ణన్ డిమాండ్ చేస్తున్నారు. దీన్ని రిపబ్లికన్ నేతలు తప్పుపట్టారు. ఈ నేపథ్యంలో హెచ్–1బీ వీసాలపై రగడ మొదలైంది.
👉మరోవైపు నెట్టింట జోరుగా చర్చ నడిచింది. అయితే హెచ్–1బీ వీసాల విషయంలో అభిప్రాయం మార్చుకోవాలని వాటి వ్యతిరేకులకు ఇలాన్ మస్క్ సూచిస్తూ వస్తున్నారు. ‘‘నాతోపాటు ఎంతోమంది అమెరికాకు రావడానికి, స్పేస్‌ఎక్స్, టెస్టా వంటి సంస్థలు స్థాపించడానికి కారణం హెచ్–1బీ వీసాలే. ఈ వీసాలతోనే మేము ఇక్కడికొచ్చి పనిచేశాం. అవకాశాలు అందుకున్నాం. హెచ్–1బీ వీసాలతోనే అమెరికా బలమైన దేశంగా మారింది. ఇలాంటి వీసాలను వ్యతిరేకించడం మూర్ఖుపు చర్య. దాన్ని నేను ఖండిస్తున్నా.
👉ఈ వీసాలు ఉండాల్సిందే. ఈ విషయంలో అవసరమైతే యుద్ధానికైనా సిద్ధంగా ఉన్నా’’అని మస్క్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో.. కౌంటర్‌గా కొందరు వ్యతిరేక పోస్టులు పెట్టారు. ఒకానొక టైంలో సహనం నటించిన మస్క్.. బూతు పదజాలం ప్రయోగించిన సందేశం ఉంచారు.
👉ఇక.. వచ్చే ఏడాది జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా డొనాల్ట్ ట్రంప్ ప్రమాణం చేయాల్సి ఉంది. అయితే.. విదేశాల నుంచి వలసలు తగ్గిస్తానని.. అమెరికాను మరోమారు గొప్ప దేశంగా తయారు చేస్తానని(Make America Great Again) తన ప్రచారంలో ట్రంప్ ప్రకటించారు. విదేశీయులకు వీసాలు ఇచ్చే విషయంలో కఠినంగా వ్యవహరించబోతున్నట్లు అప్పుడు సంకేతాలిచ్చారు. కానీ, ఇప్పుడు ఆయన తన అభిప్రాయం మార్చుకున్నారు.
‘‘హెచ్–1బీ వీసా ప్రక్రియను నేనెప్పుడూ ఇష్టపడతా. వాటికి మద్దతు పలుకుతా. అందుకే అవిప్పటిదాకా అమెరికా వ్యవస్థలో కొనసాగుతున్నాయి. నా వ్యాపార సంస్థల్లోనూ హెచ్–1బీ వీసాదారులున్నారు. హెచ్–1బీ వ్యవస్థపై నాకు నమ్మకముంది. ఈ విధానాన్ని ఎన్నోసార్లు వినియోగించుకున్నా. ఇది అద్భుతమైన పథకం’’ అని ట్రంప్ వ్యాఖ్యానించడం ఇటు డెమోక్రాట్లలో.. అటు రిపబ్లికన్లలోనూ తీవ్ర చర్చనీయాంశమైంది.
Comments
Please login to add a commentAdd a comment