make america great again
-
Trump 2.0: మనపై ప్రభావమెంత?
రెండోసారి అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ సోమవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. శ్వేతసౌధంలోకి ఆయన పునరాగమనం అక్కడి భారతీయులకు పలు అవకాశాలతో పాటు సవాళ్లను కూడా మోసుకొస్తున్నట్టే కనిపిస్తోంది. అమెరికాలో భారత సంతతికి చెందినవారు 45 లక్షలకు పైగా ఉన్నారు. సంఖ్యాపరంగా తక్కువగా అనిపిస్తున్నా కొన్నేళ్లుగా వాళ్లు ప్రబల శక్తిగా ఆవిర్భవించారు. ఐటీ, వైద్యం, విద్య వంటి రంగాల్లో విశేషంగా రాణిస్తున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థకు ప్రధాన చోదక శక్తులుగా మారారంటే అతిశయోక్తి కాదు. ఇటీవల రాజకీయ రంగంలో కూడా సత్తా చాటుతున్నారు. అధ్యక్షునిగా ట్రంప్ తొలి హయాం భారత అమెరికన్లకు కాస్త తీపి, కాస్త చేదుగానే గడిచింది. ప్రధాని నరేంద్ర మోదీతో ట్రంప్ సాన్నిహిత్యం అందరినీ ఆకర్షించింది. ‘హౌడీ మోడీ’ పేరిట 2019లో హూస్టన్‌లో ట్రంప్ అట్టహాసం చేస్తే, అంతకుమించి అన్నట్టుగా మరుసటేడే మోదీ అహ్మదాబాద్‌లో నమస్తే ట్రంప్ పేరుతో భారీ సభ నిర్వహించారు. దానికి తరలివచ్చిన లక్ష పైచిలుకు జన సందోహాన్ని చూసి ఆశ్చర్యానందాల్లో మునిగిపోవడం అధ్యక్షుని వతయింది. ఆసియాలో చైనా ప్రాబల్యానికి చెక్ పెట్టడం వంటి ఉమ్మడి వ్యూహాత్మక లక్ష్యాలు ఇరు దేశాలను మరింత సన్నిహితం చేశాయి. వరక్త వ్యాపారాలూ ఇతోధికంగా పుంజుకున్నాయి. భారత్–అమెరికా సంబంధాలు మొత్తమ్మీద మరింత బలోపేతమే అయ్యాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ 2.0 భారత్‌కు, అమెరికాలోని మనవారికి ఎలా ఉండనుందన్నది ఆసక్తికరంగా మారింది. సామాజిక ఆందోళనలు ట్రంప్ తొలి హయాంలో జాతి విద్వేష, విద్వేష నేర ఘటనలు పెరిగాయి. వాటిలో తరచూ దక్షిణాసియా మూలాలున్న వారినే లక్ష్యంగా చేసుకునే ఆందోళనకర ట్రెండుకు తెర లేచింది. దీని ప్రభావం భారతీయ అమెరికన్లపైనా బాగానే పడింది. దానికి తోడు ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ నినాదానికి ఈసారి మరింత ప్రాధాన్యమిస్తానని ట్రంప్ కుండబద్దలు కొట్టారు. తమపట్ల వివక్షకు తావులేని వాతావరణాన్ని కోరుకుంటున్న భారతీయ అమెరికన్లలో ఈ ప్రకటన మరింత గుబులు రేపుతోంది. ఈ ఆందోళనలను తొలగించేందుకు రిపబ్లికన్ పార్టీలోని భారత మూలాలున్న నేతలు ఏ మేరకు కృషి చేస్తారన్నది కీలకం కానుంది. వర్తకం.. ఆచితూచి ట్రంప్ తొలి హయాంలో వర్తకానికి పెద్దపీటే వేసినా కొన్నిసార్లు వివాదాలూ తప్పలేదు. ఉక్కు, అల్యూమినియం, వ్యవసాయోత్పత్తుల వంటివాటిపై టారిఫ్‌లు గొడవకు దారితీశాయి. రిటైల్ నుంచి టెక్ స్టార్టప్‌ల దాకా రెండు ఆర్థిక వ్యవస్థల్లోనూ కీలకంగా మారిన భారత అమెరికన్ వ్యాపారవేత్తలకు ట్రంప్ తొలి హయాంలో మిశ్రమ ఫలితాలే ఎదురయ్యాయి. పన్ను తగ్గింపులు, నిబంధనల సడలింపు వంటి ట్రంప్ సర్కారు నిర్ణయాలు వ్యాపార విస్తృతికి దోహదపడినా మొత్తమ్మీద టారిఫ్‌ల విషయంలో కొనసాగిన అనిశ్చితి ఎప్పటికప్పుడు వారికి సవాలుగానే నిలుస్తూ వచ్చింది. వాటిపై సంప్రదింపులు కూడా పెద్దగా ఫలితమివ్వలేదు. ఈసారి వాటిని చక్కదిద్దుకోవడానికి ట్రంప్ ప్రాధాన్యమిచ్చే అవకాశముంది. → విధానాలు ఇరు దేశాలకూ లాభసాటిగా ఉండేలా మెరుగు పరిచేందుకు ద్వైపాక్షిక వర్తకంతో ప్రత్యక్ష భాగస్వామ్యమున్న భారతీయ అమెరికన్ వ్యాపార దిగ్గజాలు ప్రయత్నించవచ్చు. → ఫార్మా, జౌళి, టెక్నాలజీ వంటి రంగాల్లో టారిఫ్‌లు తగ్గడమో, లేదంటే సరళంగా మారడమో ఖాయంగా కనిపిస్తోంది. → పన్ను ప్రోత్సాహకాలపై నియంత్రణల ఎత్తివేతతో పాటు చిన్న వ్యాపారాలకు ఇతోధికంగా వృద్ధి అవకాశాల కల్పన దిశగా అడుగులు పడవచ్చు. → ట్రంప్ అత్యంత ప్రాధాన్యమిస్తున్న ‘అమెరికా ఫస్ట్’ విధానం భారతీయ అమెరికన్ వ్యాపారవేత్తలకు సవాలుగా పరిణమించే ఆస్కారమూ లేకపోలేదు.వలసలపై ఉత్కంఠే అమెరికాలో భారతీయుల విజయగాథకు హెచ్–1బీ వీసా విధానమే దశాబ్దాలుగా మూలస్తంభంగా నిలుస్తూ వచ్చింది. ముఖ్యంగా ఐటీ, వైద్య తదితర రంగాల్లో మన నిపుణులు అగ్ర రాజ్యంలో తిరుగులేని రీతిలో జెండా పాతారు. అంత కీలకమైన హెచ్–1బీ వీసా విధానం ట్రంప్ తొలి హయాంలో ఒడిదుడుకులకు లోనైంది. మితిమీరిన వడపోతలు, కఠినమైన అర్హత ప్రమాణాల వంటివి అమెరికా కలలుకనే భారతీయ ఔత్సాహికుల్లో, వారి కుటుంబాల్లో తీవ్ర అనిశి్చతికి దారితీశాయి. → ఈ సవాళ్లు ట్రంప్ 2.0లో మరింత పెరిగే సూచనలే కన్పిస్తుండటం ఆందోళనకరం. → గ్రీన్‌కార్డు కోసం దశాబ్దాలుగా ఎదురుతెన్నుల్లోనే గడుపుతున్న భారత అమెరికన్లు మరిన్ని సమస్యలు ఎదుర్కోక తప్పేలా లేదు. → జీవిత భాగస్వామి ప్రధానంగా హెచ్–4 వర్క్ వీసా పర్మిట్లపై ఆధారపడే కుటుంబాల పరిస్థితి మరింత డోలాయమానంగా తయారైంది. ఆ వీసాలకు వర్క్ పర్మిట్లు రద్దు చేస్తామని ట్రంప్ గతంలో చేసిన ప్రకటన ఇప్పుడు మళ్లీ భయపెడుతోంది. అదే జరిగితే భారత మహిళలకు కోలుకోలేని దెబ్బే అవుతుంది. కుటుంబానికి ఆర్థిక భద్రత, వృత్తిగత ఎదుగుదలకు కీలకమైన అవకాశం వారి చేజారుతుంది. → వీసా పర్మిట్ల గందరగోళంతో నిపుణులైన భారతీయులపై ఎక్కువగా ఆధారపడే అమెరికా వ్యాపార సంస్థలు కూడా బాగా ప్రభావితమవుతాయి. → వర్క్ వీసాలపై పరిమితులు కీలక రంగాల్లో మానవ వనరుల కొరతకు దారితీస్తాయి.రూటు మారిన రాజకీయం భారత అమెరికన్లు మొదటినుంచీ డెమొక్రటిక్ పార్టీ మద్దతుదారులుగా ఉంటూ వచ్చారు. వలసలు, వైవిధ్యం, సామాజిక న్యాయం తదితర విధానాల్లో ఆ పార్టీ ప్రగతిశీల వైఖరే అందుకు ప్రధాన కారణం. కానీ వలస సంస్కరణలపై బైడెన్ సర్కారు నిర్లిప్తత, అంతూపొంతూ లేని గ్రీన్‌కార్డుల వెయిటింగ్ లిస్టు వంటివి ఆ పార్టీపై వారిలో అసంతృప్తికి దారితీశాయి. ఈ నేపథ్యంలో కుటుంబ విలువలు, విద్య తదితరాల్లో అచ్చం తమను పోలి ఉండే రిపబ్లికన్ పార్టీ వైఖరి, దాని సరళీకృత ఆర్థిక విధానాలు సంప్రదాయ భారతీయులను కొంతకాలంగా అమితంగా ఆకర్షిస్తున్నాయి. నిక్కీ హేలీ, వివేక్ రామస్వామి వంటి భారత సంతతికి చెందిన రిపబ్లికన్ నేతలు మరింతగా వారి ఆదరణను చూరగొంటున్నారు. ముఖ్యంగా దూకుడుకు మారుపేరైన ట్రంప్ రిపబ్లికన్ పగ్గాలు చేపట్టిన నాటినుంచీ ఈ వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. భారత అమెరికన్ సమాజం నానాటికీ ఆ పార్టివైపు మొగ్గుతోంది. ట్రంప్ 2.0 విధానాలను బట్టి ఇది మరింత ఊపందుకున్నా ఆశ్చర్యం లేదు. -
ట్రంప్ ప్రమాణానికి... జోరుగా ఏర్పాట్లు
వాషింగ్టన్: అగ్రరాజ్యాధినేతగా డొనాల్డ్ ట్రంప్ (78) రెండోసారి శ్వేతసౌధంలో అడుగుపెట్టేందుకు సర్వం సిద్ధమైంది. అమెరికా 47వ అధ్యక్షునిగా సోమవారం ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా శనివారం నుంచి నాలుగు రోజుల పాటు అట్టహాసంగా పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు ప్రమాణస్వీకార కమిటీ ప్రకటించింది. ‘‘శనివారం బాణసంచా నడుమ కార్యక్రమాలు లాంఛనంగా మొదలవుతాయి. అనంతరం ఫ్లోరిడాలోని ట్రంప్ గోల్ఫ్ కోర్స్ బయట, వాషింగ్టన్ డీసీలోనూ పలు వీఐపీ ఈవెంట్లు జరుగుతాయి. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ (ఎంఏజీఏ) పేరిట విజయోత్సవ ర్యాలీలుంటాయి. సోమ వారం ట్రంప్ ముందుగా సెయింట్ జాన్స్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. అనంతరం వైట్‌హౌస్‌లో తేనీటి విందు జరుగుతుంది. ఆ తర్వాత కాపిటల్ భవనంలోని వెస్ట్ లాన్లో (స్థానిక కాలమానం ప్రకారం) ఉదయం 9.30 నుంచి ప్రధాన కార్యక్రమం ఉంటుంది. సంగీత కార్యక్రమాల అనంతరం ట్రంప్ లాంఛనంగా పదవీ ప్రమాణం చేసి అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తారు. తర్వాత జె.డి.వాన్స్ ఉపాధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరిస్తారు. అనంతరం తన లక్ష్యాలు తదితరాలను వెల్లడిస్తూ అధ్యక్ష హోదాలో ట్రంప్ తొలి ప్రసంగం చేస్తారు. తర్వాత సెనేట్ చాంబర్‌లోని ప్రెసిడెంట్ రూమ్‌లో కీలక పత్రాలపై సంతకం చేయడంతో ప్రమాణ కార్యక్రమం ముగుస్తుంది. మధ్యాహ్నం తొలి అధికారిక విందు అనంతరం క్యాపిటల్ హిల్ భవనం నుంచి పెన్సిల్వేనియా అవెన్యూ మీదుగా వైట్‌హౌస్ దాకా ట్రంప్ పరేడ్‌గా వెళ్తారు’’ అని వెల్లడించింది. కార్యక్రమంలో పాల్గొనేందుకు దేశ నలుమూలల నుంచీ ఏకంగా 2 లక్షల మంది సోమవారానికల్లా వాషింగ్టన్ చేరుకుంటారని కమిటీ తెలిపింది. నవంబర్ 6న జరిగిన ఎన్నికల్లో డెమొక్రాట్ల అభ్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌పై ట్రంప్ ఘనవిజయం సాధించి రెండోసారి అధ్యక్షుడు కానున్నారు. 2017–2021 మధ్య తొలిసారి అధ్యక్షునిగా పని చేయడం తెలిసిందే. మాజీ అధ్యక్షులంతా హాజరు సోమవారం ప్రమాణస్వీకార కార్యక్రమంలో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, కమలతో పాటు మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్, జార్జి డబ్లు్య.బుష్, బరాక్ ఒబామా కూడా పాల్గొంటారు. వీరిలో ఒబామా మినహా మిగతా వారంతా సతీసమేతంగా వస్తున్నారు. పలువురు దేశాధినేతలు, వీవీఐపీలు, ప్రముఖులు కూడా పాల్గొననున్నారు. భారత్ తరఫున విదేశాంగ మంత్రి జైశంకర్, చైనా తరఫున ఉపాధ్యక్షుడు హాన్ జెంగ్ ప్రమాణ స్వీకారానికి హాజరవుతున్నారు. అల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్‌తో పాటు ఐటీ, ఇతర దిగ్గజ సంస్థల అధినేతలు కూడా హాజరవుతున్నారు. ఎలాన్ మస్క్, మార్క్ జుకర్‌బర్గ్ (ఫేస్బుక్), జెఫ్ బెజోస్ (అమెజాన్) రూపంలో ప్రపంచ కుబేరుల్లో ముగ్గురు వేదికపై కనిపించనుండటం విశేషం. ట్రంప్ హయాంలో అమెరికా టెక్ బిలియనీర్ల అడ్డగా మారనుందని బైడెన్ తాజాగా తన వీడ్కోలు సందేశంలో హెచ్చరించడం తెలిసిందే.అధికారిక ఫొటోల విడుదల ప్రమాణస్వీకార సంబంధిత కార్యక్రమాల్లో ఉపయోగించేందుకు ట్రంప్, వాన్స్ అధికారిక చిత్రాలను తాజాగా విడుదల చేశారు. వాన్స్ చేతులు కట్టుకుని సరదాగా చిరునవ్వులు చిందిస్తుండగా ట్రంప్ ఫొటో అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. పెదాలు బిగించి, నుదురు చిట్లించి కెమెరావైపు తీక్షణంగా చూస్తూ కనిపిస్తున్నారు. ఇది అచ్చం కాపిటల్ హిల్ దాడి కేసులో 2023లో ట్రంప్ న్యాయ విచారణకు హాజరైన సందర్భంగా పోలీసు అధికారులు తీసుకున్న ఆయన మగ్ షాట్‌ను పోలి ఉండటం విశేషం. రెండో టర్ములో సంప్రదాయ పోకడలను మరింతగా ధిక్కరించి తీరతానని ప్రతీకాత్మకంగా చెప్పేందుకు ట్రంప్ కావాలనే ఇలాంటి ఫొటోను ఎంచుకున్నారని భావిస్తున్నారు.హాలీవుడ్ ప్రత్యేక రాయబారులుగా గిబ్సన్ తదితరులు నటులు జాన్ వొయిట్, మెల్ గిబ్సన్, సిల్విస్టర్ స్టాలోన్లను హాలీవుడ్ ప్రత్యేక రాయబారులుగా నియమిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు. నాలుగేళ్లుగా నేలచూపులు చూస్తున్న హాలీవుడ్‌ను బలోపేతం చేసి పూర్వవైభవం తీసుకొచ్చే ప్రయత్నాల్లో వారు తనకు సహాయ సహకారాలు అందిస్తారని వెల్లడించారు. వీరిలో వొయిట్ చిరకాలంగా ట్రంప్‌కు మద్దతుదారు కాగా గిబ్సన్, స్టాలోన్ కూడా తాజా ఎన్నికల్లో ట్రంప్‌ను బలపరిచారు. -
హెచ్1బీ వీసా రగడలో అనూహ్య పరిణామాలు!
హెచ్–1బీ వీసాలపై రగడలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వీటికి అనుకూలంగా మాట్లాడడం.. ఆయన మద్దతుదారుల్ని షాక్‌కు గురి చేసింది. అదే సమయంలో.. టెస్లా, ఎక్స్, స్పేస్ఎక్స్ సంస్థల అధినేత, ప్రపంచ కుబేరుడు ఇలాన్ మస్క్(Elon Musk) కాస్త మెత్తబడ్డారు. హెచ్–1బీ వీసాల పరిరక్షణ కోసం అవసరమైతే యుద్ధానికైనా సిద్ధమేనని ప్రకటించిన ఆయన.. ఇప్పుడు స్వరం మార్చారు. ఈ పాలసీలో భారీ సంస్కరణలు అవసరం అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.నిపుణులైన ఉద్యోగులకు అమెరికాలో పనిచేసుకొనేందుకు అవకాశం కల్పించేవే హెచ్–1బీ(H1B) వీసాలు. అయితే.. ఈ వీసా వ్యవస్థ సజావుగా నడవడం లేదని.. దానికి భారీ సంస్కరణలు అవసరమని తాజాగా ఇలాన్ మస్క్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఎక్స్‌లో ఓ వ్యక్తి చేసిన పోస్టుకు ఆయన బదులిచ్చారు.Easily fixed by raising the minimum salary significantly and adding a yearly cost for maintaining the H1B, making it materially more expensive to hire from overseas than domestically. I’ve been very clear that the program is broken and needs major reform.— Elon Musk (@elonmusk) December 29, 2024హెచ్–1బీ వీసా మీద సౌతాఫ్రికా నుంచి అమెరికాకు వచ్చి స్థిరపడ్డారు ఇలాన్ మస్క్. అయితే ప్రభుత్వ పాలనలో సమూల సంస్కరణలే లక్ష్యంగా ట్రంప్ కొత్తగా తెస్తున్న డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డోజ్)కు సంయుక్త సారథులుగా ఇలాన్ మస్క్, వివేక్ రామస్వామి(Vivek Ramaswamy) ని నియమించారు. అయితే.. అమెరికా ఫస్ట్ అమలుకు ట్రంప్ ఏరికోరి నియమించిన ఈ ఇద్దరే బీ1 వీసా విధానానికి మద్దతు ప్రకటించడం.. ట్రంప్ మద్దతుదారులకు ఏమాత్రం సహించడం లేదు. దీనికి తోడు.. 👉తాజాగా.. వైట్‌హౌస్ ఏఐ సీనియర్ పాలసీ సలహాదారుడిగా భారత అమెరికన్ వెంచర్క్యాలిటలిస్టు శ్రీరామ్ కృష్ణన్‌ను ట్రంప్ ఇటీవల నియమించారు. అయితే నిపుణులైన వలసదార్ల కోసం గ్రీన్‌కార్డులపై పరిమితి తొలగించాలని కృష్ణన్ డిమాండ్ చేస్తున్నారు. దీన్ని రిపబ్లికన్ నేతలు తప్పుపట్టారు. ఈ నేపథ్యంలో హెచ్–1బీ వీసాలపై రగడ మొదలైంది.👉మరోవైపు నెట్టింట జోరుగా చర్చ నడిచింది. అయితే హెచ్–1బీ వీసాల విషయంలో అభిప్రాయం మార్చుకోవాలని వాటి వ్యతిరేకులకు ఇలాన్ మస్క్ సూచిస్తూ వస్తున్నారు. ‘‘నాతోపాటు ఎంతోమంది అమెరికాకు రావడానికి, స్పేస్ఎక్స్, టెస్టా వంటి సంస్థలు స్థాపించడానికి కారణం హెచ్–1బీ వీసాలే. ఈ వీసాలతోనే మేము ఇక్కడికొచ్చి పనిచేశాం. అవకాశాలు అందుకున్నాం. హెచ్–1బీ వీసాలతోనే అమెరికా బలమైన దేశంగా మారింది. ఇలాంటి వీసాలను వ్యతిరేకించడం మూర్ఖుపు చర్య. దాన్ని నేను ఖండిస్తున్నా.👉ఈ వీసాలు ఉండాల్సిందే. ఈ విషయంలో అవసరమైతే యుద్ధానికైనా సిద్ధంగా ఉన్నా’’అని మస్క్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో.. కౌంటర్‌గా కొందరు వ్యతిరేక పోస్టులు పెట్టారు. ఒకానొక టైంలో సహనం నటించిన మస్క్.. బూతు పదజాలం ప్రయోగించిన సందేశం ఉంచారు.👉ఇక.. వచ్చే ఏడాది జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా డొనాల్ట్ ట్రంప్ ప్రమాణం చేయాల్సి ఉంది. అయితే.. విదేశాల నుంచి వలసలు తగ్గిస్తానని.. అమెరికాను మరోమారు గొప్ప దేశంగా తయారు చేస్తానని(Make America Great Again) తన ప్రచారంలో ట్రంప్ ప్రకటించారు. విదేశీయులకు వీసాలు ఇచ్చే విషయంలో కఠినంగా వ్యవహరించబోతున్నట్లు అప్పుడు సంకేతాలిచ్చారు. కానీ, ఇప్పుడు ఆయన తన అభిప్రాయం మార్చుకున్నారు. ‘‘హెచ్–1బీ వీసా ప్రక్రియను నేనెప్పుడూ ఇష్టపడతా. వాటికి మద్దతు పలుకుతా. అందుకే అవిప్పటిదాకా అమెరికా వ్యవస్థలో కొనసాగుతున్నాయి. నా వ్యాపార సంస్థల్లోనూ హెచ్–1బీ వీసాదారులున్నారు. హెచ్–1బీ వ్యవస్థపై నాకు నమ్మకముంది. ఈ విధానాన్ని ఎన్నోసార్లు వినియోగించుకున్నా. ఇది అద్భుతమైన పథకం’’ అని ట్రంప్ వ్యాఖ్యానించడం ఇటు డెమోక్రాట్లలో.. అటు రిపబ్లికన్లలోనూ తీవ్ర చర్చనీయాంశమైంది. -
అమెరికా ‘పగ్గాలు’ ఎవరి చేతిలో?
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హోరాహోరీ పోరులో విజయనాదం చేసిన డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ పీఠంపై కూర్చున్నాక ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? పాలన ఎలా ఉంటుంది? అనే ఆసక్తికర అంశాలకంటే మరో అంశం ఇప్పుడు అమెరికాలో హాట్‌టాపిక్‌గా మారింది. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నూతన ప్రభుత్వంలో ఎలాంటి పాత్ర పోషిస్తారనేది ఇప్పుడు అతిపెద్ద చర్చనీయాంశమైంది. కొత్తగా సృష్టించిన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ(డోజ్)కు సహ సారథిగా కొనసాగాల్సిన మస్క్ ఏకంగా అధ్యక్షుడి నిర్ణయాల్లో కలగజేసుకుంటున్నారనేది ప్రధాన ఆరోపణ. ఇందుకు బలం చేకూర్చే ఘటనలు తరచూ జరగడం చూస్తుంటే అధ్యక్ష పీఠంపై పేరుకే ట్రంప్ కూర్చున్నా నిర్ణయాధికారం మస్క్దేనన్న రాజకీయ పండితుల విశ్లేషణలు ఇప్పుడు సగటు అమెరికన్‌ను ఆలోచనల్లో పడేస్తు న్నాయి. మేక్ అమెరికా గ్రేట్ ఎగేన్ నినాదంతో దూసుకొచ్చి పీఠంపై పెత్తనాన్ని ఖరారుచేసుకున్న ట్రంప్‌కు బదులు సొంత వ్యాపార ప్రయోజనాలే పరమావధిగా నడుచుకునే నయా ప్రపంచ కుబేరుడు మస్క్ ఆలోచనలే ప్రభుత్వ నిర్ణయాలుగా అమలుకాబోతున్నాయని డెమొక్రాట్లు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇందులో నిజమెంతో తెలియాలంటే మరో నాలుగు వారాలు ఆగక తప్పదు. డోజ్ మొదలు ద్రవ్య వినిమయ బిల్లు దాకా.. టెస్లా సీఈవోగా, ప్రపంచ కుబేరుడుగా సుపరిచిత మస్క్ అమెరికా రాజకీయాల్లో మొత్తం తలదూర్చేసి ట్రంప్‌ను ఎలాగైనా గెలిపించాలని కంకణం కట్టుకున్నారు. వేల కోట్లరూపాయల సొంత డబ్బును ట్రంప్ ప్రచారం కోసం నీళ్లలా ఖర్చుచేశారు. డోజ్‌కు సారథ్యం వహిస్తూ అమెరికా ప్రభుత్వ అనవసర ఖర్చులకు కత్తెర వేసే పనిని తన భుజాలకెత్తుకున్నారు. అంతటితో ఆగకుండా అమెరికా తాత్కాలిక బడ్జెట్ అయిన ద్రవ్య వినిమయ బిల్లులోనూ వేలు పెట్టారు. అమెరికా తలపై షట్‌డౌన్ కత్తి వేలాడుతున్నా సరే ఈ బిల్లు ఆమోదం పొందకూడదని మస్క్ తెగేసి చెప్పారు. మస్క్ తన అభిప్రాయం చెప్పిన కొద్దిసేపటికే ట్రంప్ సైతం అదే పాటపాడటం గమనార్హం. పార్లమెంట్లో ఆ బిల్లును వ్యతిరేకించాలని సొంత పార్టీ రిపబ్లికన్ నేతలకు ట్రంప్ హెచ్చరికలు జారీచేశారు. ప్రతి అంశంలో కలగజేసుకోవడం చూస్తుంటే మస్క్ అప్రకటిత ప్రధానమంత్రి హోదా వెలగబెట్టడం ఖాయంగా కనిపిస్తోందని డెమొక్రాట్లతోపాటు కొందరు రిపబ్లికన్ పార్లమెంట్ సభ్యులూ ఆరోపిస్తున్నారు. ‘‘‘ఎక్స్’ను మస్క్ కొనుగోలుచేశారుకాబట్టి సరిపోయింది. లేదంటే ద్రవ్య బిల్లులో ఏముందో మాకు కూడా తెలిసేదికాదు. ‘ఎక్స్’పోస్ట్‌ల ద్వారానే బిల్లు వివరాలు తెల్సుకున్నాం’’అని రిపబ్లికన్ సెనేటర్ విలియం ప్రాన్సిస్ హగెర్టీ వ్యాఖ్యానించారు.ఈ ఆరోపణలను ట్రంప్ ఆదివారం కొట్టిపారేశారు. ఆరిజోనా రాష్ట్రంలోని ఫీనిక్స్ సిటీలో ట్రంప్ పాల్గొన్న అమెరికాఫీస్ట్ కార్యక్రమంలో ప్రేక్షకులు ‘అధ్యక్షుడు మస్క్’అంటూ నినాదాలు ఇవ్వడంతో ట్రంప్ స్పందించారు. పీఎం కాకపోతే ఏకంగా ప్రెసిడెంట్ అవుతారని డెమొక్రాట్ల చేసిన వ్యంగ్య వ్యాఖ్యలపై ట్రంప్ మాట్లాడారు. ‘‘మస్క్ ఏనాటికీ అధ్యక్షుడు కాలేడు. నా సీటు భద్రం. ఆయన అమెరికాలో పుట్టలేదుగా. అమెరికా రాజ్యాంగం ప్రకారం అమెరికా గడ్డపై పుట్టిన వ్యక్తికే అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేసే అర్హత ఉంటుంది’’అని ట్రంప్ అన్నారు. మస్క్ దక్షిణాఫ్రికాలో పుట్టారు. సొంత ప్రయోజనాలు చూసుకుంటున్నారా? అమెరికా దేశ ప్రయోజనాలకంటే మస్క్ సొంత వ్యాపారానికే అధిక ప్రాధాన్యతనిస్తున్నారని దిగువసభ సభ్యురాలు డెమొక్రటిక్ నేత రోసా డీలారో ఆరోపించారు. ‘‘చైనాలోని షాంఘైలో టెస్లా కంపె నీ పెట్టుబడులపై అమెరికా పార్లమెంటరీ కమిటీ సమీక్ష జరగాలి. దానిని మస్క్ అడ్డుకుంటున్నారు. దీనిపై మస్క్ సరైన వివరణ ఇవ్వలేదు పైగా ఆమె ను పార్లమెంట్ నుంచి బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ఎవరినీ లెక్కపెట్టని ట్రంప్.. మస్‌్కకు ప్రస్తుతానికి అగ్ర తాంబూలం ఇస్తున్నారు. మరి ఈ సఖ్యత ఎన్నా ళ్లు ఉంటుందో చూడాలి మరి.వినూత్న దారిలో వ్యాపార దార్శనికుడు ఈ–కామర్స్ మొదలు విద్యుత్ వాహనాలు, అంతరిక్ష రంగంలో స్పేస్‌క్రాఫ్ట్ పునరి్వనియోగం దాకా పట్టిందల్లా బంగారంగా మార్చిన మస్‌్కకు అమెరికా వ్యాపారవర్గాల్లో, యువతలో ఎనలేని క్రేజ్ ఉంది. అన్ని ఖండాల్లో వ్యాపారాలు, అంతర్జాతీయంగా వ్యాపారదిగ్గాజాలు, అగ్రనేతలతో సత్సంబంధాలు, అమెరికా ప్రభుత్వం నుంచి బిలియన్ డాలర్ల భారీ కాంట్రాక్టులు, శాటిలైట్ ఇంటర్నెట్ వ్యవస్థ, సొంత ఉపగ్రహాలు, సొంత సోషల్‌మీడియా నెట్‌వర్క్‌లతో విశ్వవ్యాప్తంగా వ్యాపారాన్ని విస్తరించిన మస్‌్క.. అమెరికా పాలననూ శాసిస్తారని ఇప్పటికే పుకార్లు మొదలయ్యాయి. అగ్రరాజ్యానికి అధినేతగా ట్రంప్ కొనసాగినా సెనేట్ సభ్యులైన రిపబ్లికన్ నేతల ఆర్థిక అవసరాలు తీర్చే నిలువెత్తు ఖజానాగా మస్క్ మారారని వార్తలొచ్చాయి. పార్లమెంట్లో రిపబ్లికన్ నేతలు ట్రంప్ కంటే మస్క్ మాటకే ఎక్కువ విలువ ఇచ్చే పరిస్థితులు కనబడుతున్నాయని తెలుస్తోంది. ఇదే జరిగితే త్వరలో కొలువుతీరే కొత్త ప్రభుత్వంలో మస్క్ నిర్ణయాలే ఎక్కువగా అమలుకు నోచుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని విశ్లేషణలు వినవస్తున్నాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీకి సహ సారథిగా ఉంటూ సొంత వ్యాపార ప్రయోజనాలకే మస్క్ పెద్దపీట వేస్తారని డెమొక్రాట్లు ఆరోపిస్తున్నారు. ద్రవ్య వినిమయ బిల్లు తెచ్చిన దిగువసభ స్పీకర్ మైక్ జాన్సన్‌పై మస్క్ బహిరంగంగా విమర్శలు చేయడం చూస్తుంటే ఆయన ఇప్పటికే పరిపాలనలో జోక్యం చేసుకుంటున్నారని స్పష్టంగా తెలుస్తోంది. అధ్యక్షుడిగా గెలిచిన ట్రంప్‌కు ప్రపంచదేశాధినేతలు ఫోన్ చేస్తే పక్కనే ఉన్న మస్క్‌తోనూ ట్రంప్ ఫోన్ మాట్లాడించడం చూస్తుంటే స్వయంగా ట్రంపే ఆయనను చంకన ఎక్కించుకున్నారని అర్ధమవుతోంది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
టారిఫ్ వార్ 2.0!
‘చైనా, బ్రెజిల్, భారత్... అమెరికాపై దిగుమతి సుంకాల మోత మోగిస్తున్నాయి. కొన్ని ఉత్పత్తులపై చైనా కంటే భారీగా భారత్ సుంకాలను విధిస్తోంది. ‘టారిఫ్ కింగ్’గా మారింది. నేను తిరిగి అధికారంలోకి వస్తే టిట్–ఫర్–టాట్ సుంకాలతో బదులు తీర్చుకుంటాం. అమెరికాను మళ్లీ అత్యంత సంపన్న దేశంగా మార్చాలంటే ప్రతీకార టారిఫ్‌లే మందు’. గతేడాది అక్టోబర్‌లో డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలివి. అనుకున్నట్లే బంపర్ విక్టరీతో మళ్లీ అగ్రరాజ్యాధిపతిగా శ్వేత సౌధంలో కొలువుదీరనున్నారు. ట్రంప్ అమెరికా ఫస్ట్ ఎజెండాతో భారత్ సహా చాలా దేశాలకు టారిఫ్ వార్ గుబులు పట్టుకుంది. ప్రచారంలో ట్రంప్ ఊదరగొట్టిన ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్ (మాగా)’ నినాదం గనుక అమల్లోకి వస్తే... ఆటోమొబైల్, టెక్స్టైల్, ఫార్మా వంటి కొన్ని కీలక రంగాల్లో ఎగుమతులపై అధిక కస్టమ్స్ సుంకాలకు దారితీసే అవకాశం ఉందని వాణిజ్య రంగ నిపుణులు చెబుతున్నారు. చైనాతో పాటు భారత్, మరికొన్ని దేశాలపై సుంకాల పెంపు ద్వారా ట్రంప్ 2.0లో మలివిడత టారిఫ్ వార్‌కు ట్రంప్ తెరతీయవచ్చని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్ఐ) ఫౌండర్ అజయ్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. ‘ట్రంప్ రెండో విడత అధికారంలో అమెరికా ఫస్ట్ నినాదానికి అనుగుణంగానే భారత్ ఉత్పత్తులపై రక్షణాత్మక చర్యలు, ప్రతీకార సుంకాలు విధింవచ్చు. ఈ జాబితాలో వాహన రంగం, వైన్స్, టెక్స్టైల్స్, ఫార్మా, స్టీల్ వంటి కీలక రంగాల్లో అడ్డంకులకు ఆస్కారం ఉంది. దీనివల్ల ఆయా పరిశ్రమల ఆదాయాల్లో కోత పడుతుంది’ అని శ్రీవాస్తవ చెప్పారు. అయితే, మనతో పోలిస్తే చైనాపై టారిఫ్ వార్ తీవ్రంగా ఉంటే గనుక, అది భారతీయ ఎగుమతిదారులకు కొత్త అవకాశాలు కలి్పస్తుందన్నారు. అతిపెద్ద వాణిజ్య భాగస్వామి... భారత వస్తు, సేవలకు సంబంధించి అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా నిలుస్తోంది. ద్వైపాక్షిక వాణిజ్యం 2023–24లో 190 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఇక పెట్టుబడుల విషయానికొస్తే, అమెరికా మూడో అతిపెద్ద ఇన్వెస్టర్. 2000 నుంచి 2024 మధ్య 66.7 బిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) భారత్ అందుకుంది! కాగా, ఇంజనీరింగ్ గూడ్స్, స్టీల్ వంటి అత్యధిక ఎగుమతి ఆదాయ రంగాలపై అమెరికా భారీగా టారిఫ్‌లు విధిస్తే, ప్రభావం తీవ్రంగా ఉంటుందని సీఐఐ జాతీయ ఎగ్జిమ్ కమిటీ కో–చైర్మన్ సంజయ్ బుధియా పేర్కొన్నారు. ట్రంప్ గత హయాంలో స్టీల్, అల్యూమినియం ఉత్పత్తులపై 10–25 % అదనపు సుంకాలు విధించడంతో, భారత్ 28 ఉత్పత్తులపై ప్రతీకార టారిఫ్‌లతో బదులిచ్చింది. ఇవే కాకుండా డెయిరీ ఉత్పత్తులు (188%), పండ్లు–కూరగాయలు (132%), నూనె గింజలు, ఫ్యాట్స్, ఆయిల్స్ (164 శాతం), బేవరేజెస్–పొగాకు (150%)పై కూడా అమెరికా అధిక టారిఫ్‌లతో విరుచుకుపడింది.వస్తు ఎగుమతి–దిగుమతులు (బి. డాలర్లలో) వాణిజ్య వివాదాలు పెరగవచ్చు... ట్రంప్ 2.0 హయాంలో వాణిజ్య పరంగా కష్టాలకు ఆస్కారం ఉంది. అధిక టారిఫ్‌ల కారణంగా వాణిజ్య వివాదాలు పెరగవచ్చు. గతంలో మాదిరిగా రక్షణాత్మక విధానం, కఠిన వలస నిబంధనల ట్రెండ్ కొనసాగుతుంది. – అజయ్ సహాయ్, భారత ఎగుమతి సంస్థల సమాఖ్య డైరెక్టర్ జనరల్ టెక్ బంధాన్ని బలోపేతం చేసుకుందాం... ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు శుభాకాంక్షలు. ఇరు దేశాల మధ్య నెలకొన్న అద్భుతమైన టెక్నాలజీ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి కొత్త ప్రభుత్వంతో మరింత సన్నిహితంగా కలిసి పనిచేయడం కోసం ఎదురుచూస్తున్నాం. ద్వైపాక్షిక వాణిజ్యంలో టెక్నాలజీ రంగం ‘వెన్నెముక’గా నిలుస్తోంది. – సింధు, గంగాధరన్, నాస్కామ్ చైర్పర్సన్ఎగుమతులకు కొత్త మార్కెట్లు.... ట్రంప్ 2.0 హయాంలో చైనా, కొన్ని యూరప్ దేశాలపై ట్రంప్ టారిఫ్‌లు, దిగుమతి నియంత్రణలకు ఆస్కారం ఉంది. దీనివల్ల భారతీయ ఎగుమతిదారులకు కొత్త మార్కెట్లకు ద్వారాలు తెరుచుకుంటాయి. ట్రంప్ భారత్‌ను ట్రంప్ మిత్ర దేశంగానే పరిగణిస్తారు. దీనివల్ల యూఎస్ కంపెనీల పెట్టుబడులు పెరుగుతాయి. ట్రంప్ విజయం భారత్‌కు సానుకూలాంశమే. – రాజీవ్ కుమార్, నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ -
ఇదేమీ ‘టోపీ’ వ్యాపారమో!
న్యూయార్క్: రాజకీయమే వ్యాపారమైనప్పుడు వ్యాపారానికి రాజకీయం వాడుకుంటే తప్పేమిటీ? అనుకున్నారేమో! ‘మేక్ అమెరికా గ్రేట్ అగేన్’ అనే నినాదం ముద్రించిన టోపీలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయంటూ ఆన్లైన్ వ్యాపార సంస్థ ‘అమేజాన్’ విక్రయిస్తోంది. ఈ నినాదాన్ని సొమ్ము చేసుకోవడం పట్ల ఎక్కువ మంది నెటిజన్లు మండిపడుతున్నారు. కొంత మందేమో తమదైన శైలిలో వ్యంగోక్తులు విసురుతున్నారు. ‘మేక్ అమెరికా గ్రేట్ అగేన్’ నినాదంతో డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేసిన విషయం తెల్సిందే. అంతేకాకుండా ఆయన అనేక ఎన్నికల ప్రచార సభల్లో ‘మేక్ అమెరికా గ్రేట్ అగేన్’ అనే నినాదం రాసిన ఎర్రటి టోపీలను ధరించి కూడా పాల్గొన్నారు. ‘గ్రేట్ బార్గేన్! మై ట్రీ ఈజ్ నౌ ఆన్ ఫైర్ (గొప్ప బేరం, నా చెట్టు ఇప్పుడు మండుతోంది)’ అంటూ కొందరు విమర్శణాత్మక పేరడి వ్యాఖ్యలు చేస్తుండగా, ‘మేడ్ మై క్రిస్మస్ ట్రీ గ్రేట్ అగేన్ ( నా క్రిస్మస్ చెట్టును మళ్లీ గొప్పది చేయండి)’ అంటూ సానుకూల వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ టోపీలకు ఒక స్టార్ నుంచి ఐదు స్టార్లు రేటింగ్‌లు ఇస్తున్నవారు కూడా ఉన్నారు.