ఇదేమీ ‘టోపీ’ వ్యాపారమో!
న్యూయార్క్: రాజకీయమే వ్యాపారమైనప్పుడు వ్యాపారానికి రాజకీయం వాడుకుంటే తప్పేమిటీ? అనుకున్నారేమో! ‘మేక్ అమెరికా గ్రేట్ అగేన్’ అనే నినాదం ముద్రించిన టోపీలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయంటూ ఆన్‌లైన్ వ్యాపార సంస్థ ‘అమేజాన్’ విక్రయిస్తోంది. ఈ నినాదాన్ని సొమ్ము చేసుకోవడం పట్ల ఎక్కువ మంది నెటిజన్లు మండిపడుతున్నారు. కొంత మందేమో తమదైన శైలిలో వ్యంగోక్తులు విసురుతున్నారు.
‘మేక్ అమెరికా గ్రేట్ అగేన్’ నినాదంతో డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేసిన విషయం తెల్సిందే. అంతేకాకుండా ఆయన అనేక ఎన్నికల ప్రచార సభల్లో ‘మేక్ అమెరికా గ్రేట్ అగేన్’ అనే నినాదం రాసిన ఎర్రటి టోపీలను ధరించి కూడా పాల్గొన్నారు. ‘గ్రేట్ బార్గేన్! మై ట్రీ ఈజ్ నౌ ఆన్ ఫైర్ (గొప్ప బేరం, నా చెట్టు ఇప్పుడు మండుతోంది)’ అంటూ కొందరు విమర్శణాత్మక పేరడి వ్యాఖ్యలు చేస్తుండగా, ‘మేడ్ మై క్రిస్మస్ ట్రీ గ్రేట్ అగేన్ ( నా క్రిస్మస్ చెట్టును మళ్లీ గొప్పది చేయండి)’ అంటూ సానుకూల వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ టోపీలకు ఒక స్టార్ నుంచి ఐదు స్టార్లు రేటింగ్‌లు ఇస్తున్నవారు కూడా ఉన్నారు.