సోమవారం బాధ్యతల స్వీకరణ
వేడుకల్లో అధ్యక్షుడు బైడెన్, హారిస్
ముగ్గురు మాజీ అధ్యక్షులు కూడా
పలువురు దేశాధినేతలు, వీవీఐపీలు
భారత్ తరఫున పాల్గొననున్న జైశంకర్
నేటినుంచి 4 రోజుల పాటు కార్యక్రమాలు
వాషింగ్టన్: అగ్రరాజ్యాధినేతగా డొనాల్డ్ ట్రంప్ (78) రెండోసారి శ్వేతసౌధంలో అడుగుపెట్టేందుకు సర్వం సిద్ధమైంది. అమెరికా 47వ అధ్యక్షునిగా సోమవారం ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా శనివారం నుంచి నాలుగు రోజుల పాటు అట్టహాసంగా పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు ప్రమాణస్వీకార కమిటీ ప్రకటించింది. ‘‘శనివారం బాణసంచా నడుమ కార్యక్రమాలు లాంఛనంగా మొదలవుతాయి.
అనంతరం ఫ్లోరిడాలోని ట్రంప్ గోల్ఫ్ కోర్స్ బయట, వాషింగ్టన్ డీసీలోనూ పలు వీఐపీ ఈవెంట్లు జరుగుతాయి. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ (ఎంఏజీఏ) పేరిట విజయోత్సవ ర్యాలీలుంటాయి. సోమ వారం ట్రంప్ ముందుగా సెయింట్ జాన్స్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. అనంతరం వైట్‌హౌస్‌లో తేనీటి విందు జరుగుతుంది. ఆ తర్వాత కాపిటల్ భవనంలోని వెస్ట్ లాన్‌లో (స్థానిక కాలమానం ప్రకారం) ఉదయం 9.30 నుంచి ప్రధాన కార్యక్రమం ఉంటుంది.
సంగీత కార్యక్రమాల అనంతరం ట్రంప్ లాంఛనంగా పదవీ ప్రమాణం చేసి అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తారు. తర్వాత జె.డి.వాన్స్ ఉపాధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరిస్తారు. అనంతరం తన లక్ష్యాలు తదితరాలను వెల్లడిస్తూ అధ్యక్ష హోదాలో ట్రంప్ తొలి ప్రసంగం చేస్తారు. తర్వాత సెనేట్ చాంబర్లోని ప్రెసిడెంట్ రూమ్‌లో కీలక పత్రాలపై సంతకం చేయడంతో ప్రమాణ కార్యక్రమం ముగుస్తుంది.
మధ్యాహ్నం తొలి అధికారిక విందు అనంతరం క్యాపిటల్ హిల్ భవనం నుంచి పెన్సిల్వేనియా అవెన్యూ మీదుగా వైట్‌హౌస్ దాకా ట్రంప్ పరేడ్‌గా వెళ్తారు’’ అని వెల్లడించింది. కార్యక్రమంలో పాల్గొనేందుకు దేశ నలుమూలల నుంచీ ఏకంగా 2 లక్షల మంది సోమవారానికల్లా వాషింగ్టన్ చేరుకుంటారని కమిటీ తెలిపింది. నవంబర్ 6న జరిగిన ఎన్నికల్లో డెమొక్రాట్ల అభ్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌పై ట్రంప్ ఘనవిజయం సాధించి రెండోసారి అధ్యక్షుడు కానున్నారు. 2017–2021 మధ్య తొలిసారి అధ్యక్షునిగా పని చేయడం తెలిసిందే.
మాజీ అధ్యక్షులంతా హాజరు
సోమవారం ప్రమాణస్వీకార కార్యక్రమంలో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, కమలతో పాటు మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్, జార్జి డబ్లు్య.బుష్, బరాక్ ఒబామా కూడా పాల్గొంటారు. వీరిలో ఒబామా మినహా మిగతా వారంతా సతీసమేతంగా వస్తున్నారు. పలువురు దేశాధినేతలు, వీవీఐపీలు, ప్రముఖులు కూడా పాల్గొననున్నారు. భారత్ తరఫున విదేశాంగ మంత్రి జైశంకర్, చైనా తరఫున ఉపాధ్యక్షుడు హాన్ జెంగ్ ప్రమాణ స్వీకారానికి హాజరవుతున్నారు.
అల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్‌తో పాటు ఐటీ, ఇతర దిగ్గజ సంస్థల అధినేతలు కూడా హాజరవుతున్నారు. ఎలాన్ మస్క్, మార్క్ జుకర్‌బర్గ్ (ఫేస్‌బుక్), జెఫ్ బెజోస్ (అమెజాన్) రూపంలో ప్రపంచ కుబేరుల్లో ముగ్గురు వేదికపై కనిపించనుండటం విశేషం. ట్రంప్ హయాంలో అమెరికా టెక్ బిలియనీర్ల అడ్డగా మారనుందని బైడెన్ తాజాగా తన వీడ్కోలు సందేశంలో హెచ్చరించడం తెలిసిందే.
అధికారిక ఫొటోల విడుదల
ప్రమాణస్వీకార సంబంధిత కార్యక్రమాల్లో ఉపయోగించేందుకు ట్రంప్, వాన్స్ అధికారిక చిత్రాలను తాజాగా విడుదల చేశారు. వాన్స్ చేతులు కట్టుకుని సరదాగా చిరునవ్వులు చిందిస్తుండగా ట్రంప్ ఫొటో అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. పెదాలు బిగించి, నుదురు చిట్లించి కెమెరావైపు తీక్షణంగా చూస్తూ కనిపిస్తున్నారు. ఇది అచ్చం కాపిటల్ హిల్ దాడి కేసులో 2023లో ట్రంప్ న్యాయ విచారణకు హాజరైన సందర్భంగా పోలీసు అధికారులు తీసుకున్న ఆయన మగ్ షాట్‌ను పోలి ఉండటం విశేషం. రెండో టర్ములో సంప్రదాయ పోకడలను మరింతగా ధిక్కరించి తీరతానని ప్రతీకాత్మకంగా చెప్పేందుకు ట్రంప్ కావాలనే ఇలాంటి ఫొటోను ఎంచుకున్నారని భావిస్తున్నారు.
హాలీవుడ్ ప్రత్యేక రాయబారులుగా గిబ్సన్ తదితరులు
నటులు జాన్ వొయిట్, మెల్ గిబ్సన్, సిల్విస్టర్ స్టాలోన్‌లను హాలీవుడ్ ప్రత్యేక రాయబారులుగా నియమిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు. నాలుగేళ్లుగా నేలచూపులు చూస్తున్న హాలీవుడ్‌ను బలోపేతం చేసి పూర్వవైభవం తీసుకొచ్చే ప్రయత్నాల్లో వారు తనకు సహాయ సహకారాలు అందిస్తారని వెల్లడించారు. వీరిలో వొయిట్ చిరకాలంగా ట్రంప్‌కు మద్దతుదారు కాగా గిబ్సన్, స్టాలోన్ కూడా తాజా ఎన్నికల్లో ట్రంప్‌ను బలపరిచారు.
Comments
Please login to add a commentAdd a comment