ఇక స్వర్ణయుగం.. అన్నింటా ‘అమెరికాయే ఫస్ట్‌’: ట్రంప్‌ | Donald Trump has been sworn in as the 47th US president | Sakshi
Sakshi News home page

ఇక స్వర్ణయుగం.. అన్నింటా ‘అమెరికాయే ఫస్ట్‌’: ట్రంప్‌

Published Tue, Jan 21 2025 5:07 AM | Last Updated on Tue, Jan 21 2025 5:35 AM

Donald Trump has been sworn in as the 47th US president

47వ అధ్యక్షునిగా ప్రమాణస్వీకారం 

హాజరైన దేశాధినేతలు, సీఈఓలు 

తొలి ప్రసంగంలోనే సంచలన ప్రకటనలు 

వాషింగ్టన్‌: అమెరికాకు తిరిగి స్వర్ణయుగాన్ని తీసుకొస్తానని నూతన అధ్యక్షుడు డొనాల్డ్‌ జె.ట్రంప్‌ ప్రకటించారు. దేశ 47వ అధ్యక్షునిగా సోమవారం ఆయన ప్రమాణస్వీకారం చేశారు. ఆ వెంటనే జాతినుద్దేశించి ఉద్వేగపూరితంగా ప్రసంగించారు. నాలుగేళ్ల డెమొక్రాట్ల పాలనలో అమెరికాకు అన్ని రంగాల్లోనూ తీరని ద్రోహం జరిగిందని ఆక్షేపించారు. దాన్ని సమూలంగా సరిదిద్దేలా ప్రజలు ఎన్నికల్లో తనకు అనుకూలంగా తీర్పు ఇచ్చారన్నారు. 

‘‘అమెరికా పతనానికి ఈ క్షణమే అడ్డుకట్ట పడింది. స్వర్ణయుగం మొదలైంది. ఈ జనవరి 20 అమెరికా పాలిట విముక్తి దినం. భవిష్యత్తంతా ఇక మనదే. మన దేశం నేటినుంచి అన్నిరంగాల్లోనూ అద్భుతంగా రాణిస్తుంది. భూమిపైనే అత్యంత శక్తిమంతమైన, గౌరవప్రదమైన దేశంగా ప్రపంచమంతటా మన్ననలు పొందుతుంది. ప్రతి దేశమూ అబ్బురపడేలా, అసూయ చెందేలా, అభినందించేలా అభివృద్ధి చెందుతుంది. అన్ని విషయాల్లోనూ ‘అమెరికా ఫస్ట్‌’ అన్నదే మన నినాదం. అదే మన మూలమంత్రం’’ అని 78 ఏళ్ల ట్రంప్‌ ప్రకటించారు.

 ‘‘మీ నమ్మకాన్ని మీ సంపదను, ప్రజాస్వామ్యాన్ని, స్వేచ్ఛను మీకు తిరిగిస్తా’’ అని అమెరికా ప్రజలకు వాగ్దానం చేశారు. అరగంట పాటు సాగిన తొలి ప్రసంగంలో ట్రంప్‌ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంటలు రేపే నిర్ణయాలు ప్రకటించారు. మెక్సికో సరిహద్దుల్లో తక్షణమే జాతీయ ఎమర్జెన్సీ విధిస్తున్నట్టు ప్రకటించారు. ‘‘అమెరికాలోకి వలసలపై ఉక్కుపాదం మోపుతాం. గల్ఫ్‌ ఆఫ్‌ మెక్సికో పేరును గల్ఫ్‌ ఆఫ్‌ అమెరికాగా పేరు మారుస్తున్నాం. పనామా కాల్వను అమెరికా స్వా«దీనం చేసుకుంటుంది’’ అని ప్రకటించారు. 

పనామా కాల్వపై చైనా పెత్తనం సాగుతోందని, వద్ద అమెరికా నౌకలపై భారీగా సుంకాలు విధిస్తున్నారని ఆక్షేపించారు. ‘‘వరక్త వ్యవస్థను సమూలంగా మారుస్తాం. అమెరికన్లను సంపన్నులుగా మార్చడమే లక్ష్యంగా పలు దేశాలపై సుంకాలు, ఇతర టారిఫ్‌లను పెంచుతాం. వాటి వసూలుకు ప్రత్యేక ప్రభుత్వ విభాగాన్ని ఏర్పాటు చేస్తాం. డ్రగ్‌ కార్టల్స్‌ను అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలుగా ప్రకటిస్తాం. 1978 నాటి విదేశీ శత్రువుల చట్టాన్ని తిరిగి తెచ్చి వాటిని అంతం చేస్తాం. పారిస్‌ పర్యావరణ ఒప్పందం నుంచి అమెరికా వైదొలుగుతోంది’’ అని ప్రకటించారు. 

లూథర్‌కింగ్‌ కలలను నిజం చేస్తా 
ట్రంప్‌ తన ప్రసంగంలో బైడెన్‌ పాలనపై నిప్పులు చిమ్మారు. ‘‘ఆర్థిక, విద్య, ఆరోగ్య వ్యవస్థలన్నింటినీ బైడెన్‌ యంత్రాంగం కుప్పకూల్చింది. లాస్‌ ఏంజెలెస్‌ మంటల వంటి మామూలు సమస్యలను కూడా పరిష్కరించలేకపోయింది. భయంకరమైన నేరగాళ్లకు, డ్రగ్స్‌ బానిసలకు దేశాన్ని స్వర్గధామంగా మార్చింది. న్యాయవ్యవస్థను విషపూరితంగా, హింసాత్మకంగా మార్చి ఆయుధంలా వాడుకుంది’’ అని ఆరోపించారు. ‘‘న్యాయవ్యవస్థకు సంకెళ్ల నుంచి విముక్తి కల్పిస్తా. అడ్డూ అదుపూ లేకుండా పెరుగుతున్న ధరలకు, ద్రవ్యోల్బణానికి కళ్లెం వేస్తా. దేశీయ చమురు ఉత్పత్తిని భారీగా పెంచుతా. 

ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రోత్సహించే కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నాం’’ అని ప్రకటించారు. ‘‘250 ఏళ్ల అమెరికా చరిత్రలో ఏ అధ్యక్షుడూ ఎదుర్కోనన్ని పరీక్షలను ఎనిమిదేళ్లుగా ఎదుర్కొంటూ వచ్చా. బహుశా అమెరికాను తిరిగి గొప్పగా తీర్చిదిద్దేందుకే దేవుడు నన్ను హత్యాయత్నం నుంచి కాపాడాడేమో’’ అన్నారు. దాంతో రిపబ్లికన్‌ నేతలంతా పెద్దపెట్టున హర్షధ్వానాలు చేశారు. బైడెన్, హారిస్‌ మౌనంగా వీక్షించారు. ‘‘ఈ రోజు హక్కుల ఉద్యమకారుడు మార్టీన్‌ లూథర్‌కింగ్‌ జూనియర్‌ డే. అమెరికా కోసం ఆయన కన్న కలలను సాకారం చేసి చూపిస్తా. మార్టీన్‌ లూథర్‌ లక్ష్యాల సాధనకు మనమంతా సమైక్యంగా కృషి చేద్దాం’’ అని ప్రజలకు ట్రంప్‌ పిలుపునిచ్చారు. 

వైట్‌హౌస్‌కు స్వాగతం: బైడెన్‌ 
అంతకుముందు సోమవారం ఉదయం బైడెన్‌ తన వారసుడు ట్రంప్‌ను అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లోకి ఆత్మియంగా ఆహ్వానించారు. ట్రంప్‌ దంపతులు వాహనం దిగగానే ప్రధాన ద్వారం వద్ద భార్య జిల్‌తో కలిసి స్వాగతించారు. ‘వైట్‌హౌస్‌కు మరోసారి స్వాగతం’ అంటూ అభినందనలు తెలిపారు. అధ్యక్ష సంప్రదాయం ప్రకారం ట్రంప్‌ కోసం ఓవల్‌ కార్యాలయంలో లేఖ రాసిపెట్టారా అని మీడియా ప్రశ్నించగా, ‘అది మా ఇద్దరి మధ్య వ్యవహారం’ అంటూ చమత్కరించారు. అనంతరం ట్రంప్‌ దంపతులను లోనికి తీసుకెళ్లారు. 

సంప్రదాయం ప్రకారం వారికి తేనీటి విందు ఇచ్చారు. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ దంపతులు కూడా కాబోయే ఉపాధ్యక్షుడు వాన్స్, ఉష దంపతులకు స్వాగతం పలికారు. వాన్స్‌కు హారిస్‌ అభినందనలు తెలిపారు. ఫొటోలకు పోజులిచ్చాక వాన్స్‌ దంపతులను హారిస్‌ దంపతులు వైట్‌హౌస్‌ లోనికి తోడ్కొని వెళ్లారు. అంతకుముందు ట్రంప్‌ తన కుటుంబీకులతో కలిసి వైట్‌హౌస్‌ సమీపంలోని చారిత్రక సెయింట్‌ జాన్‌ ఎపిస్కోపల్‌ చర్చి వద్ద సంప్రదాయ ప్రార్థనలు జరిపారు. అర్జెంటీనా ప్రెసిడెంట్‌ మెయిలీతో పాటు కూడా పారిశ్రామిక దిగ్గజాలంతా వాటిలో పాల్గొనడం విశేషం.

ప్రమాణస్వీకారం ఇలా..
ట్రంప్‌ నాలుగేళ్ల విరామం అనంతరం వైట్‌హౌస్‌లో తిరిగి అడుగుపెట్టారు. సోమవారం మధ్యాహ్నం క్యాపిటల్‌ హిల్‌ భవనంలోని రొటుండా హాల్లో డెమొక్రాట్‌ నేత 82 ఏళ్ల జో బైడెన్‌ నుంచి లాంఛనంగా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. విపరీతమైన చలి నేపథ్యంలో ఇండోర్‌లో జరిగిన కార్యక్రమంలో అమెరికా మాజీ అధ్యక్షులు జార్జి డబ్లు్య.బుష్, బిల్‌ క్లింటన్‌ దంపతులు, బరాక్‌ ఒబామా, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్‌ మెయిలీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ పాల్గొన్నారు. 

అమెరికా అధ్యక్షుని ప్రమాణస్వీకారానికి దేశాధినేతలు రావడం ఇదే తొలిసారి. దిగ్గజ టెక్‌ కంపెనీల సారథులు, పారిశ్రామికవేత్తలు ఎలాన్‌ మస్క్, సుందర్‌ పిచాయ్, మార్క్‌ జుకర్‌బర్గ్, జెఫ్‌ బెజోస్, టిమ్‌ కుక్, ముకేశ్‌ అంబానీ దంపతులు, రూపర్డ్‌ మర్డోక్‌ షౌ చూ తదితరులు కూడా హాజరయ్యారు. అంతకుముందు ట్రంప్‌ దంపతులు వైట్‌హౌస్‌లో అధ్యక్షుడు జో బైడెన్‌ దంపతుల నుంచి సంప్రదాయ తేనీటి విందు స్వీకరించారు. తర్వాత బైడెన్‌తో కలిసి ట్రంప్‌ ఒకే కారులో క్యాపిటల్‌ హిల్‌కు చేరుకున్నారు. 

ఇద్దరూ కలిసే రొటుండా హాల్లో అడుగుపెట్టారు. వెంటనే హాలంతా చప్పట్లతో దద్దరిల్లిపోయింది. ఆహూతులంతా ట్రంప్‌కు, ఆయన రన్నింగ్‌మేట్‌ జె.డి.వాన్స్, ఉష దంపతులకు ఘనస్వాగతం పలికారు. తొలుత వాన్స్‌తో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బ్రెట్‌ కవనా ఉపాధ్యక్షునిగా ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం మరో న్యాయమూర్తి జస్టిస్‌ జాన్‌ రాబర్ట్స్‌ ట్రంప్‌తో ప్రమాణస్వీకారం చేయించారు.

 ‘‘అమెరికా అధ్యక్షునిగా నా బాధ్యతలను విశ్వాసపాత్రునిగా నెరవేరుస్తా. అమెరికాను, దేశ రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు శాయశక్తులా కృషి చేస్తా’’ అంటూ తన తల్లి ఇచి్చన వ్యక్తిగత బైబిల్‌తో పాటు లింకన్‌ బైబిల్‌పై ప్రమాణం చేశారు. అనంతరం భార్య మెలానియా చెంపపై ముద్దాడారు. ఆమె హ్యాట్‌ అడ్డురావడంతో చిరునవ్వులు చిందించారు. ట్రంప్‌కు ప్రపంచం నలుమూలల నుంచీ అభినందనల సందేశాలు వెల్లువెత్తాయి. ‘నా ప్రియమిత్రుడు ట్రంప్‌కు హృదయపూర్వక అభినందనలు’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.  

ఉత్తర్వులే ఉత్తర్వులు! 
బాధ్యతలు చేపట్టిన తొలి రోజే ట్రంప్‌ భారీగా అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. వలసలపై ఉక్కుపాదం, మెక్సికో సరిహద్దుల్లో మరిన్ని సైనిక దళాల మోహరింపు, జన్మతః పౌరసత్వ విధానం రద్దు, చైనా, కెనడాలపై టారిఫ్‌ల పెంపు, గల్ఫ్‌ ఆఫ్‌ మెక్సికో పేరును గల్ఫ్‌ ఆఫ్‌ అమెరికాగా మార్చడం వంటివి వీటిలో ఉన్నట్టు వైట్‌హౌస్‌ వర్గాలు చెప్పాయి. వివరాలు వెల్లడించేందుకు నిరాకరించాయి. అయితే చాలా ఉత్తర్వుల అమలుపై న్యాయపరమైన సవాలు ఎదురవడం ఖాయమంటున్నారు. 

ట్రంప్‌ రాకతో వైట్‌హౌస్‌ వెబ్‌సైట్‌ కూడా కొత్త రూపు సంతరించుకుంది. ‘అమెరికా ఈజ్‌ బ్యాక్‌’ అనే హెడ్డింగ్‌తో ‘నా ప్రతి శ్వాసతోనూ అమెరికన్ల కోసమే పోరాడతా’ అంటూ ట్రంప్‌ సందేశాన్ని హోం పేజీలో హైలైట్‌ చేసింది. ట్రంప్‌ తాజా నిర్ణయాలను పోస్ట్‌ చేసింది. ‘‘పన్నులు, చమురు ధరలు, విద్యుత్‌ చార్జీలు తగ్గుతాయి. సైన్యాన్ని ఆధునికీకరిస్తారు. విఫల విధానాలు రద్దవుతాయి. పలు దేశాల్లో జరుగుతున్న యుద్ధాలకు తెర దించేందుకు ట్రంప్‌ ప్రాధాన్యమిస్తారు’’ అని పేర్కొంది. ఎక్స్, ఫేస్‌బుక్, ఇన్‌స్టా వంటి వైట్‌హౌస్‌ సోషల్‌ మీడియా ఖాతాలకు కూడా కొత్త రూపు వచ్చింది.

విక్టరీ ర్యాలీలో ట్రంప్‌ డ్యాన్స్‌ 
ఆశ్చర్యపరిచిన విలేజ్‌ పీపుల్‌ ప్రదర్శన 
వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ‘మేక్‌ అమెరికా గ్రేట్‌ ఎగైన్‌’విక్టరీ ర్యాలీని తన ఐకానిక్‌ డ్యాన్స్‌ మూవ్స్‌తో ముగించారు. 1978 నుంచి హిట్‌ అయిన ‘విలేజ్‌ పీపుల్‌’ట్రాక్‌ మరోసారి మార్మోగింది. ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఈ విలేజ్‌ పీపుల్‌ బ్యాండ్‌ ఈ పాటను ప్రదర్శించగా వారి వెనుక నిలబడిన ట్రంప్‌ అప్పుడప్పుడు పాడారు. స్టేజ్‌ మీద విలేజ్‌ పీపుల్‌ ఏడో సభ్యుడిగా చేరి ట్రంప్‌ డ్యాన్స్‌ చేశారు.  

మార్పుకోసం ఎదురుచూస్తున్నా 
వాషింగ్టన్‌: ట్రంప్‌ సారథ్యంలో అమెరికాలో చాలా మార్పులు చేయడానికి తాను ఎదురు చూస్తున్నానని టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడిగా ప్ర మాణ స్వీకారానికి ముందు వాషింగ్టన్‌లోని క్యాపిటల్‌ వన్‌ ఏరీనాలో ఆదివారం రాత్రి జరిగిన మేక్‌ అమెరికా గ్రేట్‌ ఎగైన్‌ విజయోత్సవ ర్యాలీలో మస్క్‌ పాల్గొని ప్రసంగించారు. ‘‘మేం చాలా మార్పులు చేయాలని చూస్తున్నాం. శతాబ్దాలపాటు అమెరికా బలీయశక్తి గా కొనసాగేందుకు వీలుగా మార్పులు చేయ డం ముఖ్యం. అమెరికాను మళ్లీ గొప్పగా మా ర్చుదాం’’అని మస్క్‌ అన్నారు. మస్క్... లిటి ల్‌ ఎక్స్‌ అని పిలుచుకునే తన కుమారుడు ఎ క్స్‌ ఎ–12 ను కూడా వేదికపైకి తీసుకొచ్చారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement