mexico border
-
ఇక స్వర్ణయుగం.. అన్నింటా ‘అమెరికాయే ఫస్ట్’: ట్రంప్
వాషింగ్టన్: అమెరికాకు తిరిగి స్వర్ణయుగాన్ని తీసుకొస్తానని నూతన అధ్యక్షుడు డొనాల్డ్ జె.ట్రంప్ ప్రకటించారు. దేశ 47వ అధ్యక్షునిగా సోమవారం ఆయన ప్రమాణస్వీకారం చేశారు. ఆ వెంటనే జాతినుద్దేశించి ఉద్వేగపూరితంగా ప్రసంగించారు. నాలుగేళ్ల డెమొక్రాట్ల పాలనలో అమెరికాకు అన్ని రంగాల్లోనూ తీరని ద్రోహం జరిగిందని ఆక్షేపించారు. దాన్ని సమూలంగా సరిదిద్దేలా ప్రజలు ఎన్నికల్లో తనకు అనుకూలంగా తీర్పు ఇచ్చారన్నారు. ‘‘అమెరికా పతనానికి ఈ క్షణమే అడ్డుకట్ట పడింది. స్వర్ణయుగం మొదలైంది. ఈ జనవరి 20 అమెరికా పాలిట విముక్తి దినం. భవిష్యత్తంతా ఇక మనదే. మన దేశం నేటినుంచి అన్నిరంగాల్లోనూ అద్భుతంగా రాణిస్తుంది. భూమిపైనే అత్యంత శక్తిమంతమైన, గౌరవప్రదమైన దేశంగా ప్రపంచమంతటా మన్ననలు పొందుతుంది. ప్రతి దేశమూ అబ్బురపడేలా, అసూయ చెందేలా, అభినందించేలా అభివృద్ధి చెందుతుంది. అన్ని విషయాల్లోనూ ‘అమెరికా ఫస్ట్’ అన్నదే మన నినాదం. అదే మన మూలమంత్రం’’ అని 78 ఏళ్ల ట్రంప్ ప్రకటించారు. ‘‘మీ నమ్మకాన్ని మీ సంపదను, ప్రజాస్వామ్యాన్ని, స్వేచ్ఛను మీకు తిరిగిస్తా’’ అని అమెరికా ప్రజలకు వాగ్దానం చేశారు. అరగంట పాటు సాగిన తొలి ప్రసంగంలో ట్రంప్ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంటలు రేపే నిర్ణయాలు ప్రకటించారు. మెక్సికో సరిహద్దుల్లో తక్షణమే జాతీయ ఎమర్జెన్సీ విధిస్తున్నట్టు ప్రకటించారు. ‘‘అమెరికాలోకి వలసలపై ఉక్కుపాదం మోపుతాం. గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును గల్ఫ్ ఆఫ్ అమెరికాగా పేరు మారుస్తున్నాం. పనామా కాల్వను అమెరికా స్వా«దీనం చేసుకుంటుంది’’ అని ప్రకటించారు. పనామా కాల్వపై చైనా పెత్తనం సాగుతోందని, వద్ద అమెరికా నౌకలపై భారీగా సుంకాలు విధిస్తున్నారని ఆక్షేపించారు. ‘‘వరక్త వ్యవస్థను సమూలంగా మారుస్తాం. అమెరికన్లను సంపన్నులుగా మార్చడమే లక్ష్యంగా పలు దేశాలపై సుంకాలు, ఇతర టారిఫ్‌లను పెంచుతాం. వాటి వసూలుకు ప్రత్యేక ప్రభుత్వ విభాగాన్ని ఏర్పాటు చేస్తాం. డ్రగ్ కార్టల్స్‌ను అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలుగా ప్రకటిస్తాం. 1978 నాటి విదేశీ శత్రువుల చట్టాన్ని తిరిగి తెచ్చి వాటిని అంతం చేస్తాం. పారిస్ పర్యావరణ ఒప్పందం నుంచి అమెరికా వైదొలుగుతోంది’’ అని ప్రకటించారు. లూథర్‌కింగ్ కలలను నిజం చేస్తా ట్రంప్ తన ప్రసంగంలో బైడెన్ పాలనపై నిప్పులు చిమ్మారు. ‘‘ఆర్థిక, విద్య, ఆరోగ్య వ్యవస్థలన్నింటినీ బైడెన్ యంత్రాంగం కుప్పకూల్చింది. లాస్ ఏంజెలెస్ మంటల వంటి మామూలు సమస్యలను కూడా పరిష్కరించలేకపోయింది. భయంకరమైన నేరగాళ్లకు, డ్రగ్స్ బానిసలకు దేశాన్ని స్వర్గధామంగా మార్చింది. న్యాయవ్యవస్థను విషపూరితంగా, హింసాత్మకంగా మార్చి ఆయుధంలా వాడుకుంది’’ అని ఆరోపించారు. ‘‘న్యాయవ్యవస్థకు సంకెళ్ల నుంచి విముక్తి కల్పిస్తా. అడ్డూ అదుపూ లేకుండా పెరుగుతున్న ధరలకు, ద్రవ్యోల్బణానికి కళ్లెం వేస్తా. దేశీయ చమురు ఉత్పత్తిని భారీగా పెంచుతా. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించే కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నాం’’ అని ప్రకటించారు. ‘‘250 ఏళ్ల అమెరికా చరిత్రలో ఏ అధ్యక్షుడూ ఎదుర్కోనన్ని పరీక్షలను ఎనిమిదేళ్లుగా ఎదుర్కొంటూ వచ్చా. బహుశా అమెరికాను తిరిగి గొప్పగా తీర్చిదిద్దేందుకే దేవుడు నన్ను హత్యాయత్నం నుంచి కాపాడాడేమో’’ అన్నారు. దాంతో రిపబ్లికన్ నేతలంతా పెద్దపెట్టున హర్షధ్వానాలు చేశారు. బైడెన్, హారిస్ మౌనంగా వీక్షించారు. ‘‘ఈ రోజు హక్కుల ఉద్యమకారుడు మార్టీన్ లూథర్‌కింగ్ జూనియర్ డే. అమెరికా కోసం ఆయన కన్న కలలను సాకారం చేసి చూపిస్తా. మార్టీన్ లూథర్ లక్ష్యాల సాధనకు మనమంతా సమైక్యంగా కృషి చేద్దాం’’ అని ప్రజలకు ట్రంప్ పిలుపునిచ్చారు. వైట్‌హౌస్‌కు స్వాగతం: బైడెన్ అంతకుముందు సోమవారం ఉదయం బైడెన్ తన వారసుడు ట్రంప్‌ను అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లోకి ఆత్మియంగా ఆహ్వానించారు. ట్రంప్ దంపతులు వాహనం దిగగానే ప్రధాన ద్వారం వద్ద భార్య జిల్‌తో కలిసి స్వాగతించారు. ‘వైట్‌హౌస్‌కు మరోసారి స్వాగతం’ అంటూ అభినందనలు తెలిపారు. అధ్యక్ష సంప్రదాయం ప్రకారం ట్రంప్ కోసం ఓవల్ కార్యాలయంలో లేఖ రాసిపెట్టారా అని మీడియా ప్రశ్నించగా, ‘అది మా ఇద్దరి మధ్య వ్యవహారం’ అంటూ చమత్కరించారు. అనంతరం ట్రంప్ దంపతులను లోనికి తీసుకెళ్లారు. సంప్రదాయం ప్రకారం వారికి తేనీటి విందు ఇచ్చారు. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ దంపతులు కూడా కాబోయే ఉపాధ్యక్షుడు వాన్స్, ఉష దంపతులకు స్వాగతం పలికారు. వాన్స్‌కు హారిస్ అభినందనలు తెలిపారు. ఫొటోలకు పోజులిచ్చాక వాన్స్ దంపతులను హారిస్ దంపతులు వైట్‌హౌస్ లోనికి తోడ్కొని వెళ్లారు. అంతకుముందు ట్రంప్ తన కుటుంబీకులతో కలిసి వైట్‌హౌస్ సమీపంలోని చారిత్రక సెయింట్ జాన్ ఎపిస్కోపల్ చర్చి వద్ద సంప్రదాయ ప్రార్థనలు జరిపారు. అర్జెంటీనా ప్రెసిడెంట్ మెయిలీతో పాటు కూడా పారిశ్రామిక దిగ్గజాలంతా వాటిలో పాల్గొనడం విశేషం.ప్రమాణస్వీకారం ఇలా..ట్రంప్ నాలుగేళ్ల విరామం అనంతరం వైట్‌హౌస్‌లో తిరిగి అడుగుపెట్టారు. సోమవారం మధ్యాహ్నం క్యాపిటల్ హిల్ భవనంలోని రొటుండా హాల్లో డెమొక్రాట్ నేత 82 ఏళ్ల జో బైడెన్ నుంచి లాంఛనంగా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. విపరీతమైన చలి నేపథ్యంలో ఇండోర్‌లో జరిగిన కార్యక్రమంలో అమెరికా మాజీ అధ్యక్షులు జార్జి డబ్లు్య.బుష్, బిల్ క్లింటన్ దంపతులు, బరాక్ ఒబామా, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మెయిలీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ పాల్గొన్నారు. అమెరికా అధ్యక్షుని ప్రమాణస్వీకారానికి దేశాధినేతలు రావడం ఇదే తొలిసారి. దిగ్గజ టెక్ కంపెనీల సారథులు, పారిశ్రామికవేత్తలు ఎలాన్ మస్క్, సుందర్ పిచాయ్, మార్క్ జుకర్‌బర్గ్, జెఫ్ బెజోస్, టిమ్ కుక్, ముకేశ్ అంబానీ దంపతులు, రూపర్డ్ మర్డోక్ షౌ చూ తదితరులు కూడా హాజరయ్యారు. అంతకుముందు ట్రంప్ దంపతులు వైట్‌హౌస్‌లో అధ్యక్షుడు జో బైడెన్ దంపతుల నుంచి సంప్రదాయ తేనీటి విందు స్వీకరించారు. తర్వాత బైడెన్‌తో కలిసి ట్రంప్ ఒకే కారులో క్యాపిటల్ హిల్‌కు చేరుకున్నారు. ఇద్దరూ కలిసే రొటుండా హాల్లో అడుగుపెట్టారు. వెంటనే హాలంతా చప్పట్లతో దద్దరిల్లిపోయింది. ఆహూతులంతా ట్రంప్‌కు, ఆయన రన్నింగ్‌మేట్ జె.డి.వాన్స్, ఉష దంపతులకు ఘనస్వాగతం పలికారు. తొలుత వాన్స్‌తో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బ్రెట్ కవనా ఉపాధ్యక్షునిగా ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం మరో న్యాయమూర్తి జస్టిస్ జాన్ రాబర్ట్స్ ట్రంప్‌తో ప్రమాణస్వీకారం చేయించారు. ‘‘అమెరికా అధ్యక్షునిగా నా బాధ్యతలను విశ్వాసపాత్రునిగా నెరవేరుస్తా. అమెరికాను, దేశ రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు శాయశక్తులా కృషి చేస్తా’’ అంటూ తన తల్లి ఇచి్చన వ్యక్తిగత బైబిల్‌తో పాటు లింకన్ బైబిల్‌పై ప్రమాణం చేశారు. అనంతరం భార్య మెలానియా చెంపపై ముద్దాడారు. ఆమె హ్యాట్ అడ్డురావడంతో చిరునవ్వులు చిందించారు. ట్రంప్‌కు ప్రపంచం నలుమూలల నుంచీ అభినందనల సందేశాలు వెల్లువెత్తాయి. ‘నా ప్రియమిత్రుడు ట్రంప్‌కు హృదయపూర్వక అభినందనలు’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఉత్తర్వులే ఉత్తర్వులు! బాధ్యతలు చేపట్టిన తొలి రోజే ట్రంప్ భారీగా అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. వలసలపై ఉక్కుపాదం, మెక్సికో సరిహద్దుల్లో మరిన్ని సైనిక దళాల మోహరింపు, జన్మతః పౌరసత్వ విధానం రద్దు, చైనా, కెనడాలపై టారిఫ్‌ల పెంపు, గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్చడం వంటివి వీటిలో ఉన్నట్టు వైట్‌హౌస్ వర్గాలు చెప్పాయి. వివరాలు వెల్లడించేందుకు నిరాకరించాయి. అయితే చాలా ఉత్తర్వుల అమలుపై న్యాయపరమైన సవాలు ఎదురవడం ఖాయమంటున్నారు. ట్రంప్ రాకతో వైట్‌హౌస్ వెబ్సైట్ కూడా కొత్త రూపు సంతరించుకుంది. ‘అమెరికా ఈజ్ బ్యాక్’ అనే హెడ్డింగ్‌తో ‘నా ప్రతి శ్వాసతోనూ అమెరికన్ల కోసమే పోరాడతా’ అంటూ ట్రంప్ సందేశాన్ని హోం పేజీలో హైలైట్ చేసింది. ట్రంప్ తాజా నిర్ణయాలను పోస్ట్ చేసింది. ‘‘పన్నులు, చమురు ధరలు, విద్యుత్ చార్జీలు తగ్గుతాయి. సైన్యాన్ని ఆధునికీకరిస్తారు. విఫల విధానాలు రద్దవుతాయి. పలు దేశాల్లో జరుగుతున్న యుద్ధాలకు తెర దించేందుకు ట్రంప్ ప్రాధాన్యమిస్తారు’’ అని పేర్కొంది. ఎక్స్, ఫేస్బుక్, ఇన్‌స్టా వంటి వైట్‌హౌస్ సోషల్ మీడియా ఖాతాలకు కూడా కొత్త రూపు వచ్చింది.విక్టరీ ర్యాలీలో ట్రంప్ డ్యాన్స్ ఆశ్చర్యపరిచిన విలేజ్ పీపుల్ ప్రదర్శన వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’విక్టరీ ర్యాలీని తన ఐకానిక్ డ్యాన్స్ మూవ్స్‌తో ముగించారు. 1978 నుంచి హిట్ అయిన ‘విలేజ్ పీపుల్’ట్రాక్ మరోసారి మార్మోగింది. ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఈ విలేజ్ పీపుల్ బ్యాండ్ ఈ పాటను ప్రదర్శించగా వారి వెనుక నిలబడిన ట్రంప్ అప్పుడప్పుడు పాడారు. స్టేజ్ మీద విలేజ్ పీపుల్ ఏడో సభ్యుడిగా చేరి ట్రంప్ డ్యాన్స్ చేశారు. మార్పుకోసం ఎదురుచూస్తున్నా వాషింగ్టన్: ట్రంప్ సారథ్యంలో అమెరికాలో చాలా మార్పులు చేయడానికి తాను ఎదురు చూస్తున్నానని టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడిగా ప్ర మాణ స్వీకారానికి ముందు వాషింగ్టన్‌లోని క్యాపిటల్ వన్ ఏరీనాలో ఆదివారం రాత్రి జరిగిన మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ విజయోత్సవ ర్యాలీలో మస్క్ పాల్గొని ప్రసంగించారు. ‘‘మేం చాలా మార్పులు చేయాలని చూస్తున్నాం. శతాబ్దాలపాటు అమెరికా బలీయశక్తి గా కొనసాగేందుకు వీలుగా మార్పులు చేయ డం ముఖ్యం. అమెరికాను మళ్లీ గొప్పగా మా ర్చుదాం’’అని మస్క్ అన్నారు. మస్క్... లిటి ల్ ఎక్స్ అని పిలుచుకునే తన కుమారుడు ఎ క్స్ ఎ–12 ను కూడా వేదికపైకి తీసుకొచ్చారు. -
ట్రంప్ టెన్షన్.. 1500 మంది అక్రమ వలసదారుల కొత్త వ్యూహం!
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయాన్ని అందుకున్నారు. వచ్చే ఏడాది జనవరిలో ట్రంప్ ప్రభుత్వ పగ్గాలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ కుర్చీ ఎక్కేలోగా వలసదారులు అమెరికా చేరుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నారు. దాదాపు 1500 మంది అక్రమ వలసదారులు అమెరికాలోకి ప్రవేశించేందుకు రెడీగా ఉన్నట్టు సమాచారం.డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టే నాటికి అక్రమ వలసదారులు అమెరికాలోకి వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. మెక్సికన్ సిటీ తపచులా నుంచి దాదాపు 1500 మంది వలసదారులు అమెరికాకు బయలుదేరినట్టు కథనాలు వెలువడ్డాయి. సరిహద్దుల వెంట 2600 కిలోమీటర్లు నడక మార్గంలో ప్రయాణించి అమెరికా చేరుకోవాలని వారు ప్రణాళిక చేసుకున్నారు. అయితే, ఎలాగైనా అమెరికా చేరుకుని ట్రంప్ అధికారంలోకి రాక ముందే అక్కడ ఆశ్రయం పొందాలనేది తమ ప్రణాళిక సదరు వలస బృందంలోని ఓ వ్యక్తి చెప్పినట్లుగా అంతర్జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.ఇదిలా ఉండగా.. తాను అధికారంలోకి వస్తే అక్రమ వలసదారులను దేశంలోకి రాకుండా అరికడతానని, అమెరికాలో ఉన్నవారిని పంపించి వేస్తానని ఎన్నికల సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ వాగ్దానం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జనవరి 20న ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించే లోపే అమెరికాలో అడుగుపెట్టాలని శరణార్థులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు.. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలిచిన తర్వాత పలువురు అక్రమ వలసదారులు ఇప్పటికే అమెరికాను విడిచివెళ్లినట్టు సమాచారం. Tapachula: This morning, Nov. 20th, another caravan departed southern Mexico. This is the sixth caravan to leave Chiapas since Claudia Sheinbaum's presidency; five have left from Tapachula and one from Tuxtla Gutiérrez with the intention of reaching central Mexico. “Fear,… pic.twitter.com/Y9W98aIQIY— Auden B. Cabello (@CabelloAuden) November 20, 2024 -
ప్యాంటు చెక్ చేస్తే నిండా పాములు, బల్లులు.. అధికారులే షాక్!
వాషింగ్టన్: పాముల వంటి విష జీవులను తాకేందుకే భయంతో వణికిపోతాం. అయితే, ఓ వ్యక్తి తన దుస్తుల్లో దాచిపెట్టి వాటిని స్మగ్లింగ్ చేస్తున్నాడు. ఇటీవలే తన ప్యాంటులో 60 రకాల పాములు, బల్లులు, ఇతర సరిసృపాలను దాచిపెట్టి స్మగ్లింగ్ చేస్తుండగా దొరికిపోయాడు. ఈ సంఘటన అమెరికా- మెక్సికో సరిహద్దులో వెలుగు చూసింది. 7,50,000 డాలర్ల విలువైన సరిసృపాల స్మగ్లింగ్‌లో భాగంగా ప్యాంటులో దాచిపెట్టి అమెరికాలోకి వెళ్లేందుకు ప్రయత్నించినట్లు అధికారులు తెలిపారు. వన్యప్రాణుల అక్రమ రవాణాకు పాల్పడిన నిందితుడికి రెండు దశాబ్దాలకిపైగా జైలు శిక్ష పడినట్లు వెల్లడించారు. దక్షిణ కాలిఫోర్నియాకు చెందిన జోస్ మాన్యుయెల్ పెరెజ్ అనే వ్యక్తి ఆరేళ్లలో 1,700 జంతువులను మెక్సికో, హాంకాంగ్‌ల నుంచి అమెరికాకు స్మగ్లింగ్ చేసినట్లు చెప్పారు అధికారులు. నిరాటంకంగా సాగుతున్న అతడి అక్రమ రవాణా ఈ ఏడాది మార్చిలో బట్టబయలైంది. పాములు, బల్లులు వంటి వాటిని ప్యాంటులో దాచి మెక్సికో నుంచి తరలిస్తుండగా పట్టుబడ్డాడు. అయితే, ముందు తన పెంపుడు బల్లులను తీసుకెళ్తున్నాని కస్టమ్స్ అధికారులకు తెలిపాడు. కానీ, అతడి దుస్తులు మొత్తం విప్పి పరిశీలించగా ప్యాంటులో 60 పాములు, బల్లుల వంటివి బయపడినట్లు అధికారులు తెలిపారు. కోర్టు విచారణ సందర్భంగా తన స్మగ్లింగ్‌పై ఆశ్చర్యకర విషయాలు వెల్లడించాడు నిందితుడు జోస్ పెరెజ్. కొన్నిసార్లు గాడిదలపై తరలించేందుకు డబ్బులు చెల్లించానని, ఇతర సమయాల్లో తానే సరిహద్దులు దాటానని ఒప్పుకున్నాడు. అతడు అక్రమ రవాణా చేసి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా తన ఖాతాదారులకు సుమారు 7,39,000 డాలర్లకు సరిసృపాలను విక్రయించినట్లు పత్రాలు సమర్పించారు అధికారులు. అందులో యుకాటాన్ బాక్స్ తాబేళ్లు, మెక్సికన్ బాక్స్ తాబేళ్లు, పిల్ల మొసళ్లు, మెక్సికన్ పూసల బల్లులు సహా ఇతర జంతువులు ఉన్నాయి. రెండు కేసుల్లో అతడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. ఇదీ చదవండి: ప్రపంచం చుట్టేశాడు.. రెండు గిన్నిస్ రికార్డులు పట్టేశాడు -
ఘోర రోడ్డు ప్రమాదం :15 మంది దుర్మరణం
వాషింగ్టన్: అమెరికా-మెక్సికో సరిహద్దు సమీపంలో మంగళవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. దక్షిణ కాలిఫోర్నియా- మెక్సికో సరిహద్దులోని స్టేట్ రూట్ 115, ఇంపీరియల్ కౌంటీలోని నోరిష్ రోడ్లో యూఎస్వీ కారును ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో 14 మంది అక్కడికక్కడే కన్నుమూయగా, మరొకరు ఆసుపత్రిలో చనిపోయారు. మరో ఏడుగురు తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నట్లు ఎల్ సెంట్రో రీజినల్ మెడికల్ సెంటర్ అత్యవసర విభాగం డైరెక్టర్ జూడీ క్రజ్ తెలిపారు. ఎస్‌యూవీని ట్రక్కు బలంగా ఢీకొట్టడంతో అందులో చిక్కుకున్న వారిని, మృతదేహాలను వెలికి తీసేందుకు శ్రమించాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. బాధితులంతా 15 నుంచి 53 ఏళ్ల వయసున్న స్త్రీ, పురుషులు ఉన్నారని,డ్రైవర్ కూడా తీవ్ర గాయాలపాలైనట్టు వెల్లడించారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు జరుపుతున్నట్లు జాతీయ రవాణా భద్రతా బోర్డు వెల్లడించింది. కెపాసిటీకి మించి తీసుకు వెళుతూ ప్రమాదానికి గురైందనీ, దాదాపు సుమారు 27 మంది వరకు ఉన్నట్లు స్తానిక బోర్డర్ డివిజన్ చీఫ్ ఆర్టురో ప్లేటెరో పేర్కొన్నారు. మృతుల్లో పది మంది మెక్సికన్ పౌరులు ఉన్నారని, ఇతరుల వివరాలు ఇంకా తెలియరాలేదన్నారు. -
యూఎస్ నుంచి 161 మంది వెనక్కు
వాషింగ్టన్: అమెరికాలోకి మెక్సికో సరిహద్దు ద్వారా అక్రమంగా చొరబడిన 161 మంది భారతీయులను ఆ దేశం ఈ వారం వెనక్కు పంపనుంది. అమెరికాలో ఉండేందుకు వారికి ఉన్న న్యాయపరమైన అవకాశాలు అన్నీ ముగిశాయని తెలిపింది. ప్రత్యేక విమానంలో వారిని పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు పంపించనున్నారు. ఆ 161 మందిలో హరియాణాకు చెందిన వారు 76 మంది, పంజాబ్‌కు చెందినవారు 56 మంది, గుజరాత్‌కు చెందిన వారు 12 మంది, యూపీవారు ఐదుగురు, మహారాష్ట్రవారు నలుగురు, కేరళ, తెలంగాణ, తమిళనాడు వారు ఇద్దరు చొప్పున, ఆంధ్రప్రదేశ్, గోవాలకు చెందినవారు ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. వీరిలో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. అమెరికాలోని 95 జైళ్లలో ఉన్న 1739 మంది భారతీయుల్లో వీరు కూడా భాగమేనని నార్త్ అమెరికన్ పంజాబీ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సత్నామ్ సింగ్ చాహల్ వెల్లడించారు. అక్రమంగా ప్రవేశించిన వీరందరిని ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్(ఐసీఈ) అధికారులు అరెస్ట్ చేశారు. స్వదేశంలో వివక్షను, హింసను ఎదుర్కొంటున్నామని, అమెరికాలో తమకు ఆశ్రయం కల్పించాలని వీరిలో అత్యధికులు కోర్టును వేడుకుంటున్నా.. వారి వాదనను అమెరికాలోని కోర్టులు విశ్వసించడం లేదని చాహల్ తెలిపారు. ఉత్తర భారతదేశంలో, ముఖ్యంగా పంజాబ్‌లో మనుషుల అక్రమ రవాణాదారులున్నారని, వారికి అధికారులు కూడా సహకరిస్తున్నారని ఆయన ఆరోపించారు. వారు యువకుల నుంచి రూ. 35 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకు వసూలు చేసి, అమెరికాలోకి అక్రమంగా పంపిస్తున్నారన్నారు. 2019లో 1616 మంది భారతీయులను అమెరికా భారత్‌కు పంపించింది. -
వలసదారులపై బాష్పవాయువు
టిజుయానా: మెక్సికో సరిహద్దుల గుండా అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించాలనుకున్న వలసదారులను యూఎస్ సరిహద్దు దళాలు అడ్డుకున్నాయి. వీరిలో 25 మందిని అరెస్టు చేశాయి. నూతన సంవత్సర వేడుకలు జరుగుతున్న సమయంలో దాదాపు 100 మంది వలసదారులు అమెరికాలోకి చొరబడేందుకు యత్నించారని స్థానిక మీడియా పేర్కొంది. మెక్సికో సరిహద్దు నుంచి దేశంలోకి ప్రవేశించేందుకు యత్నించిన 45 మంది వలసదారులను అడ్డుకున్నామని యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ మంగళవారం వెల్లడించింది. కొద్దిసేపటి తర్వాత వీరంతా సీబీపీ అధికారులపై రాళ్ల వర్షం కురిపించారని తెలిపింది. వలసదారులను అదుపు చేసేందుకు బాష్పవాయువు, పెప్పర్ స్ప్రేను వాడామని వివరించింది. -
ట్రంప్‌కు షాకిచ్చిన అమెరికా కోర్టు
శాన్ఫ్రాన్సిస్కో : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మరోసారి షాక్ తగిలింది. మెక్సికో సరిహద్దు నుంచి దేశంలోకి వస్తున్న అక్రమ వలసదారుల్ని నిషేధిస్తూ ఆయనిచ్చిన ఉత్తర్వులపై దిగువకోర్టు విధించిన స్టేను ఎత్తివేసేందుకు 9వ యూఎస్ సర్కిల్ కోర్టు ఆఫ్ అప్పీల్స్ నిరాకరించింది. ట్రంప్ ఇచ్చిన ఆదేశాలు ప్రసుత్తమున్న అమెరికా చట్టాలకు అనుగుణంగా లేవనీ, సాక్షాత్తూ కాంగ్రెస్‌ను విస్మరించేలా ఉన్నాయని న్యాయస్థానం అభిప్రాయపడింది. చట్టాలను కోర్టు గదుల నుంచి, ఓవల్ (అధ్యక్ష) కార్యాలయం నుంచి చేయలేమని చురకలు అంటించింది. ఓ వ్యక్తి అమెరికాలోకి ఎలా ప్రవేశించాడన్న ఆధారంగా అతనిపై నిషేధం విధించడం సరికాదని వ్యాఖ్యానించింది. ఈ మేరకు ప్రభుత్వం దాఖలుచేసిన పిటిషన్‌ను 2-1 మెజారిటీతో తోసిప్చుంది. అమెరికా–మెక్సికో సరిహద్దు ద్వారా ఆశ్రయం కోరుతూ వలస దారులు దేశంలోకి రావడాన్ని ట్రంప్ గత నెల 9న నిషేధించారు. -
‘నా పిల్లలు బతికి ఉంటే చాలు.. ఇంకేం వద్దు’
వాషింగ్టన్ : అమెరికా- మెక్సికో సరిహద్దుల్లో మరోసారి అలజడి చెలరేగుతోంది. మధ్య అమెరికాకు చెందిన శరణార్థులు తమ దేశంలోకి రాకుండా అడ్డుకునేందుకు యూఎస్ సరిహద్దు భద్రతా బలగాలు టియర్ గ్యాస్ ప్రయోగించడంతో సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పిల్లలపై కూడా భాష్పవాయువు ప్రయోగించడంతో వారు సొమ్మసిల్లి పడిపోతున్నారు. ఈ క్రమంలో వలసదారుల్ని వెనక్కి పంపించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న ‘జీరో టాలరెన్స్’ విధానం మరోసారి చర్చనీయాంశమైంది. ఈ ఫొటోలు ఇంటర్నెట్ను కుదిపేస్తున్నాయి... తమను నిలువరించేందుకు సరిహద్దు అధికారులు ప్రయోగిస్తున్న టియర్ గ్యాస్ నుంచి తమతో పాటు పిల్లల్ని రక్షించుకోవడం శరణార్థులకు కష్టంగా మారింది. ఈ క్రమంలో వాళ్లు పడుతున్న అవస్థలకు సంబంధించిన ఫొటోలు బయటికి రావడంతో అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం(డీహెచ్ఎస్) మరోసారి విమర్శల పాలవుతోంది. ముఖ్యంగా మారియా మెజా అనే మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి శరణార్థుల శిబిరంవైపునకు పరిగెత్తుతున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నాలాంటి వాళ్లు ఇంకెందరో... ‘హోండురస్‌లో పరిస్థితులు అస్సలు బాగోలేవు. అందుకే నా ఐదుగురు పిల్లలను తీసుకుని మెక్సికో సరిహద్దులోని తిజువానా పట్టణంలో ఓ వారం పాటు బస చేశాను. ఆ తర్వాత అమెరికా వెళ్లాలని నిర్ణయించుకున్నాను. ఈ క్రమంలోనే మెక్సికో సరిహద్దులకు చేరుకున్నాను. దీంతో మెక్సికో పోలీసులు మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం మాత్రమే చేశారు. కానీ అమెరికా భద్రతా సిబ్బంది మాత్రం ఒక్కసారిగా టియర్ గ్యాస్ ప్రయోగించడం మొదలుపెట్టారు. దీంతో సరిహద్దుల్లో ఉన్న వాళ్లంతా చెల్లాచెదురయ్యారు. టియర్ గ్యాస్ ప్రభావంతో నా కుమారుడు సొమ్మసిల్లి పడిపోయాడు. వాడితో పాటు నా కూతుళ్ల పరిస్థితి కూడా ఏమంత బాగాలేదు. ఆ సమయంలో ఏం చేయాలో అర్థం కాలేదు. చచ్చిపోతామేమోనని భయం వేసింది. వెంటనే తేరుకుని అందరినీ పొదిమి పట్టుకుని శరణార్థుల శిబిరంవైపునకు పరిగెత్తాను. అయితే ఒక విషయం... ఒకవేళ అమెరికాలో మా లాంటి శరణార్థులకు ఆశ్రయం లేదని తెలిస్తే ఇటువైపుగా వచ్చేవాళ్లమే కాదు. వాళ్లు మమ్మల్ని జంతువుల కన్నా హీనంగా చూశారు. పిల్లలనే జాలి కూడా లేదు వాళ్లకు. నిజంగా దేవుడు అనే వాడు ఒకడుంటే ఇక్కడ కాకపోతే మరోచోట ఆశ్రయం దొరుకుతుంది. ఎక్కడున్నా సరే నా పిల్లలు బతికి ఉంటే చాలు.. నాకు ఇంకేం అక్కర్లేదు’ అని మధ్య అమెరికా దేశం హోండరస్‌కు చెందిన మహిళ మెజా తన భయానక అనుభవాలు వెల్లడించారు. మెజా ప్రస్తుతం తన ఐదుగురు పిల్లలతో కలిసి మెక్సికోలోని తిజువానా పట్టణంలోని శరణార్థుల శిబిరంలో ఆశ్రయం పొందుతున్నారు. (అమెరికా వెళ్తే అంతే మరి..) వాళ్లని వెనక్కి పంపివేయాల్సిందే : ట్రంప్ వివిధ దేశాలకు చెందిన సుమారు 5,200 మంది ప్రజలు మెక్సికో సరిహద్దు గుండా అమెరికాలోకి ప్రవేశించడానికి ప్రయత్నించడంతో అమెరికా సరిహద్దు విభాగం అధికారులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో వీరంతా తిజువానాలో ఏర్పాటు చేసిన తాత్కాలిక గుడారాల్లో ఆశ్రయం పొందుతున్నారు. ఈ విషయంపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలసదారులందరినీ తమ తమ దేశాలకు పంపివేయాలంటూ మెక్సికో ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వారు శరణార్థులు కారని, అమెరికాలో అక్రమంగా చొరబడి ఆర్థికంగా లబ్ది పొందాలని చూస్తున్న ఆశావాదులని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాంటి వారిని అమెరికా ఎప్పుడూ కేవలం ఆర్థిక వలసదారులుగా మాత్రమే పరిగణిస్తుందని.. శరణార్థులుగా గుర్తించదని ఉద్ఘాటించారు. అంతేకాకుండా వలసదారులపై తమ అధికారులు టియర్ గ్యాస్ ప్రయోగించారన్న వార్తల్ని కొట్టిపారేశారు. హోండురస్‌లోని పరిస్థితులను తమ దేశానికి ఆపాదిస్తూ కొంతమంది అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. (జీరో టాలరెన్స్... అమెరికా వివరణ) కాగా, ట్రంప్ వ్యాఖ్యలపై అమెరికా చట్టసభ ప్రతినిధులు, మానవ హక్కుల నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సరిహద్దుల్లో చోటుచేసుకుంటున్న హింసకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఆయనకు కనపడటం లేదా అని మండిపడుతున్నారు. (జీరో టాలరెన్స్‌కి భారతీయులూ బలి) -
అమెరికా సరిహద్దు దాటిన వలసదారులు
తిజువానా(మెక్సికో): సెంట్రల్ అమెరికా నుంచి బయల్దేరిన వలసదారుల తొలి బృందం అమెరికా సరిహద్దు చేరుకుంది. కాలిఫోర్నియాతో సరిహద్దు పంచుకుంటున్న మెక్సికోలోని తిజువానాలో కంచె దాటిన 9 మందిని అమెరికా నిఘా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. వీరిలో తల్లి, నలుగురు పిల్లలు, 19 ఏళ్ల గర్భిణి ఉన్నారు. భద్రతా సిబ్బంది చూస్తుండగానే కంచె దాటి అమెరికా వైపు వెళ్లిన మరికొందరు ఆ వెంటనే వెనక్కి వచ్చారు. సుమారు 4 వేల మందితో కూడిన ప్రధాన బృందం కూడా త్వరలోనే ఇక్కడకి చేరుకునే అవకాశం ఉంది. స్వదేశంలో హింస, పేదరికానికి తాళలేక హొండూరస్, గ్వాటెమాల, ఎల్‌సాల్వడార్ దేశాల ప్రజలు అమెరికాలో ఆశ్రయం పొందడానికి సుదీర్ఘ ప్రయాణం చేస్తున్నారు. -
జీరో టాలరెన్స్ బాధితుల్లో భారతీయురాలు
వాషింగ్టన్: మెక్సికో సరిహద్దుల నుంచి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తూ పట్టుబడి బిడ్డలకు దూరమైన వారిలో భారత్‌కు చెందిన ఓ మహిళ ఉందని వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది. గుజరాత్‌కు చెందిన భావన్ పటేల్ (33) అనే మహిళ పట్టుబడగా, వికలాంగుడైన ఆమె కొడుకు (5)ను అమెరికా ప్రభుత్వం తల్లి నుంచి వేరుచేసి నిర్బంధ కేంద్రంలో ఉంచిందని తెలిపింది. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించే వారి పట్ల ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని అనుసరిస్తూ అక్రమ వలసదారుల పిల్లలను తల్లిదండ్రుల నుంచి అమెరికా వేరుచేయడం తెలిసిందే. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తూ పట్టుబడిన వారిలో 200 మంది వరకు భారతీయులు ఉండొచ్చని వార్తలొచ్చినా ఇలా వివరాలు వెల్లడవటం ఇదే తొలిసారి. మరోవైపు అధ్యక్షుడు ట్రంప్ వలస విధానాన్ని వ్యతిరేకిస్తూ రాజధాని వాషింగ్టన్‌లోని సెనేట్ బిల్డింగ్ ముందు ఆందోళన నిర్వహించిన 600 మంది ప్రజల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. -
వెనక్కి తగ్గిన ట్రంప్..
వాషింగ్టన్ : అమెరికా- మెక్సికో సరిహద్దుల్లో తల్లితండ్రుల నుంచి పిల్లలను వేరు చేసి నిర్భందించే విధానానికి స్వస్తిపలుకుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకాలు చేశారు. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించే కుటుంబాలను విచ్ఛిన్నం చేసేలా ప్రస్తుత విధానం ఉందనే విమర్శలు వెల్లువెత్తడంతో ట్రంప్ తాజా నిర్ణయం తీసుకున్నారు. అయితే వలస విధానం విషయంలో ఏమాత్రం తగ్గబోమని స్పష్టం చేశారు. అక్రమంగా సరిహద్దులు దాటి అమెరికాలో ప్రవేశించినందుకు ఇక కుటుంబాలను కలిపే ప్రాసిక్యూషన్ ఎదుర్కొనేలా చర్యలు చేపడతారు. ప్రస్తుతం అక్రమ వలసదారుల్లో పిల్లలను తల్లితండ్రులను వేర్వేరుగా నిర్భందిస్తుండటంపై విమర్శలు ఎదురవడంతో ట్రంప్ యంత్రాంగం పునరాలోచనలో పడింది. ‘ తమ సరిహద్దులు ఇప్పుడు మరింత పటిష్టంగా ఉన్నాయని, అయితే కుటుంబాలను సమిష్టిగా ఉంచాల్సిన బాధ్యత తమపై ఉంద’ని ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులపై సంతకాలు చేసిన అనంతరం ట్రంప్ వ్యాఖ్యానించారు. కుటుంబాలను వేరు చేశామన్న భావన ఎవరిలో కలగరాదనేది తన అభిమతమని ఆయన స్పష్టం చేశారు. కాగా వలసలపై తన కఠిన వైఖరిని పదేపదే సమర్ధించుకుంటున్న ట్రంప్ వలస వచ్చిన చిన్నారులను సరిహద్దులు దాటిన అనంతరం తల్లితండ్రుల నుంచి బలవంతంగా వేరుచేయడాన్నీ వెనకేసుకువచ్చేవారు. అయితే తల్లితండ్రులకు దూరమైన చిన్నారులు కంటతడి పెట్టే దృశ్యాలు, వారిని బోనుల్లో నిర్భందించడం వంటి ఫోటోలు అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తాయి. -
రాళ్ల మధ్యలో డ్రగ్స్ పెట్టి స్మగ్లింగ్!
శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అంటారు. డ్రగ్స్‌ను ఏ మార్గంలో తరలించినా పోలీసులు ఇట్టే పట్టేసుకోవడంతో మాఫియా వాళ్లు ఎప్పటికప్పుడు సరికొత్త మార్గాలు వెతుకుతున్నారు. ఒకటి కాదు.. రెండు కాదు.. దాదాపు 726 కిలోల బరువున్న మారిజువానా అనే డ్రగ్‌ను లాండ్‌స్కేపింగ్ రాళ్ల మధ్య దాచి తరలిస్తుండగా అమెరికా ఫెడరల్ అధికారులు పట్టుకున్నారు. లాండ్‌స్కేపింగ్ కోసం ఉపయోగించే పెద్ద సైజు బండరాళ్లను మెక్సికో సరిహద్దులలోని ఒటే మెసా కార్గో ద్వారా తరలిస్తుండగా.. అనుమానం వచ్చిన యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ అధికారులు ఎక్స్‌రే పరికరంతో మొత్తం పరిశీలించారు. ఈ ట్రక్కులలో ఏదో తేడా ఉన్నట్లు వాళ్లకు అనుమానం వచ్చింది. మరోసారి డ్రగ్స్‌ను పసిగట్టే శునకాలతో క్షుణ్ణంగా తనిఖీలు చేయగా, అవి అందులో డ్రగ్స్ ఉన్న విషయాన్ని పట్టేశాయి. దాంతో ఒక రాయిని ఓ కస్టమ్స్ అధికారి డ్రిల్లింగ్ చేసి చూడగా, అందులో ఏదో ఆకుపచ్చటి పదార్థం మధ్యలో ఉన్నట్లు కనిపించింది. దాంతో మొత్తం రాళ్లన్నింటినీ డ్రిల్ చేయగా, 577 ప్యాకెట్లలో మారిజువానా బయటపడింది. ఈ డ్రగ్స్ విలువ దాదాపు రూ. 5.5 కోట్లుగా అధికారులు అంచనా వేశారు.