రాళ్ల మధ్యలో డ్రగ్స్ పెట్టి స్మగ్లింగ్!
శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అంటారు. డ్రగ్స్‌ను ఏ మార్గంలో తరలించినా పోలీసులు ఇట్టే పట్టేసుకోవడంతో మాఫియా వాళ్లు ఎప్పటికప్పుడు సరికొత్త మార్గాలు వెతుకుతున్నారు. ఒకటి కాదు.. రెండు కాదు.. దాదాపు 726 కిలోల బరువున్న మారిజువానా అనే డ్రగ్‌ను లాండ్‌స్కేపింగ్ రాళ్ల మధ్య దాచి తరలిస్తుండగా అమెరికా ఫెడరల్ అధికారులు పట్టుకున్నారు. లాండ్‌స్కేపింగ్ కోసం ఉపయోగించే పెద్ద సైజు బండరాళ్లను మెక్సికో సరిహద్దులలోని ఒటే మెసా కార్గో ద్వారా తరలిస్తుండగా.. అనుమానం వచ్చిన యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ అధికారులు ఎక్స్‌రే పరికరంతో మొత్తం పరిశీలించారు.
ఈ ట్రక్కులలో ఏదో తేడా ఉన్నట్లు వాళ్లకు అనుమానం వచ్చింది. మరోసారి డ్రగ్స్‌ను పసిగట్టే శునకాలతో క్షుణ్ణంగా తనిఖీలు చేయగా, అవి అందులో డ్రగ్స్ ఉన్న విషయాన్ని పట్టేశాయి. దాంతో ఒక రాయిని ఓ కస్టమ్స్ అధికారి డ్రిల్లింగ్ చేసి చూడగా, అందులో ఏదో ఆకుపచ్చటి పదార్థం మధ్యలో ఉన్నట్లు కనిపించింది. దాంతో మొత్తం రాళ్లన్నింటినీ డ్రిల్ చేయగా, 577 ప్యాకెట్లలో మారిజువానా బయటపడింది. ఈ డ్రగ్స్ విలువ దాదాపు రూ. 5.5 కోట్లుగా అధికారులు అంచనా వేశారు.