ఏలూరుకు చెందిన ఎండీ ఖాన్ ఓ మధ్య తరగతి కుటుంబానికి చెందిన విద్యార్థి.సరదాగా తన స్నేహితులతో కలిసి కిక్ కోసం గంజాయి కలిపిన సిగరెట్ తాగాడు. మెల్ల గా దానికి బానిసగా మారాడు. ఇంట్లో తల్లి అనేకమార్లు హెచ్చరించింది. ఏడాది గడిచిపోయింది.. కానీ ఆ మత్తు నుంచి బయటకు రాలేకపోతున్నాడు. గంజాయి తాగుతూ పోలీసులకు చిక్కాడు.’ ఇలా ఎందరో యువకులు.. మత్తుమాయలో పడి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. ఆ వివరాలు ఇలా..
ఏలూరు టౌన్: జిల్లాకేంద్రం ఏలూరు డ్రగ్స్ మాఫియాకు అడ్డాగా మారింది. ఇంజినీరింగ్, డిగ్రీ కళాశాలల విద్యార్థులే లక్ష్యంగా చేసుకుంటూ జోరుగా మత్తు పదార్థాలు విక్రయిస్తున్నారు. ఏలూరులో సత్రంపాడు, వట్లూరు, బీడీ కాలనీ, చొదిమెళ్ల, అమ్మపాలెం తదితర ప్రాంతాల్లో గంజాయి, హుక్కా, ప్రమాదకర ఇతర మత్తు పదార్థాల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఒక్క ఏలూరులోనే 200 మందికి పైగా విద్యార్థులు గంజాయికి బానిసలుగా మారటం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల గంజాయి తాగుతూ పట్టుబడిన ఇంజినీరింగ్, డిగ్రీ విద్యార్థులు నగరంలోని అన్ని ఇంజినీరింగ్ కాలేజీలకు చెందినవారు కావటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ మాఫియాలోని వ్యక్తులు ఆన్‌లైన్ నెట్‌వర్క్‌ను వినియోగిస్తూ జిల్లాలో విస్తృతంగా తమ వ్యాపారాన్ని సాగిస్తున్నారు.
విద్యార్థులు మత్తుకు చిత్తవుతూ తమ విలువైన భవిష్యత్తును నిలువునా బుగ్గిపాలు చేసుకుంటున్నారు. డబ్బు సంపాదనే ధ్యేయంగా మాఫియా వందలాది మంది విద్యార్థులకు మత్తు పదార్థాలు అలవాటు చేస్తూ బానిసలుగా మార్చేస్తున్నారు. గంజాయి మాఫియాల్లో హనుమాన్ జంక్షన్‌కు చెందిన ప్రవీణ్ వంటి విద్యార్థులు, హైదరాబాద్‌లో ఉంటున్న ఏలూరుకు చెందిన చిరుద్యోగి రఘువర్థన్ వంటి వారు సైతం ఉండటం విశేషం. మొదట్లో గంజాయికి అలవాటు పడిన కొందరు విద్యార్థులు ఆ తర్వాత గంజాయి వ్యాపారాలుగా అవతారం ఎత్తి తమలాంటి విద్యార్థులను ఈ మత్తులోకి లాగుతుండడం విశేషం. ఏలూరుతో పాటు భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, నరసాపురం, జంగారెడ్డిగూడెం కేంద్రాలుగా డ్రగ్స్ మాఫియా తమ కార్యకలాపాలు సాగిస్తోందని తెలుస్తోంది.
భారీగా గంజాయి అక్రమ రవాణా
పశ్చిమలోకి గంజాయిని సరిహద్దు జిల్లా ఖమ్మం నుంచి, అటు విశాఖపట్నం, అరకు నుంచి, ఇటు హైదరాబాద్, తెలంగాణ జిల్లాల నుంచి భారీ ఎత్తున డంప్ చేస్తున్నారు. నల్లజర్ల, దేవరపల్లి, జంగారెడ్డిగూడెం, చింతలపూడి, కొయ్యలగూడెం తదితర ప్రాంతాల్లో భారీస్థాయిలో గంజాయి అక్రమ రవాణా జరుగుతున్నట్టు పోలీస్ ఉన్నతాధికారులు సైతం ధ్రువీకరిస్తున్నారు. ఇక గంజాయి రవాణా చేసే వ్యక్తులపై కేసులు నమోదు చేసిన పోలీసు అధికారులు, విద్యార్థుల భవిష్యత్తుకు విఘాతం ఏర్పడుతుందనే కారణంగా కేసులు నమోదులో కొంత వెసులుబాటు కల్పిస్తున్నారు.
విద్యార్థులకుకౌన్సెలింగ్ ఇస్తున్నాం
మత్తు పదార్థాలకు అలవాటు పడి భవిష్యత్తును పాడుచేసుకుంటోన్న విద్యార్థులను గుర్తించి, వారికి కౌన్సెలింగ్ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇంజినీరింగ్ కళాశాలల్లో అవగాహన సదస్సులు సైతం ఏర్పాటు చేస్తున్నాం. గంజాయి అక్రమ రవాణాపై నిఘా ఉంచాం. –కె.ఈశ్వరరావు, డీఎస్పీ, ఏలూరు
Comments
Please login to add a commentAdd a comment