గంజాయి సాగుతోంది | Marijuana cultivation was being like this | Sakshi
Sakshi News home page

గంజాయి సాగుతోంది

Published Wed, Jul 26 2017 2:12 AM | Last Updated on Tue, Oct 9 2018 2:23 PM

గంజాయి సాగుతోంది - Sakshi

గంజాయి సాగుతోంది

సరిహద్దు జిల్లాల్లోని మారుమూల ప్రాంతాల్లో గుప్పుగుప్పు
 
సాక్షి నెట్‌వర్క్‌: డ్రగ్స్‌.. కొద్దిరోజులుగా రాష్ట్రాన్ని కుదిపేస్తోంది! ఎల్‌ఎస్‌డీ, కొకైన్, ఎండీఎంఏ.. పేర్లు ఏవైతేనేం రాష్ట్ర రాజధానిలో పబ్‌ల నుంచి స్కూళ్ల దాకా చాపకింద నీరులా విస్తరించిన ఈ మహమ్మారి అందరినీ విస్తుబోయేలా చేసింది. మరి జిల్లాల్లో ఏం జరుగుతోంది? ఖరీదైన డ్రగ్స్‌ వాసన ఎక్కడా కనిపించడం లేదుగానీ అనేక జిల్లాల్లో గంజాయి మాత్రం గుప్పుగుప్పుమంటోంది! ఏజెన్సీ ప్రాంతాల్లో యథేచ్ఛగా సాగవుతోంది. ముఖ్యంగా గోదారి తీరం వెంట ఉన్న జిల్లాల్లో జోరుగా ఉంది. ఈ జిల్లాలు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రతో సరిహద్దు కలిగి ఉండటంతో ఆ రాష్ట్రాలకు చెందిన మాఫియా... తన ఏజెంట్ల ద్వారా తెలంగాణలో గంజాయి సాగును ప్రోత్సహిస్తోంది.

కొందరు రైతులను ప్రలోభాలకు గురి చేసి గంజాయి పంట తీస్తోంది. తమకు అనుకూలమైన గ్రామాలు, రైతులను ఎంపిక చేసుకొని విత్తనాలు సరఫరా చేయడం నుంచి పంటను కొనుగోలు చేయడం వరకు అన్ని పనులను ఏజెంట్లు చూసుకుంటున్నారు. గత పదేళ్లుగా ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో ఈ మాఫియా గంజాయి సాగును వ్యవస్థీకృతం చేసింది. ఇక్కడ్నుంచి గంజాయిని వివిధ మార్గాల ద్వారా హైదరాబాద్, ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. పలు జిల్లాల్లోని మారుమూల, ఏజెన్సీ ప్రాంతాల్లో ‘సాక్షి’క్షేత్రస్థాయిలో పరిశీలించగా అనేక విస్మయకర అంశాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసు, రైల్వే, ఎక్సైజ్‌శాఖల్లోని కొందరు అధికారులు మామూళ్ల మత్తులో జోగుతుండటంతో గంజాయి దందా నిరాటంకంగా సాగుతోంది.
 
సాగు చేస్తున్నారిలా..
గంజాయిపై నిషేధం ఉండటంతో ఏజెంట్లు అడవులకు సమీపంలోని గ్రామాల్లో సాగు చేయిస్తున్నారు. అటవీ సమీపంలోని పొలాలు, చేన్లకు నీటి సౌకర్యం తక్కువ. నేలలు కూడా అంత సారవంతమైనవి కాకపోవడంతో రైతులు ప్రధాన పంటలు వేయడం లేదు. అలాంటి వారు తొందరగా మాఫియా ఉచ్చులో చిక్కుకుంటున్నారు. గంజాయి బయటకు కనిపించకుండా ఉండేందుకు ముందుగా పొలంలో పత్తి, కంది, మిర్చి వంటి పంట వేస్తున్నారు. పత్తి, కంది విత్తనాలు మొలకెత్తి కనీసం అడుగు ఎత్తు పెరిగే వరకు వేచి చూసి ఆ తర్వాత అంతర్‌ పంటగా గంజాయి సాగును మొదలు పెడుతున్నారు. బయటకు పత్తి, కంది పంట తరహాలో కనిపించినా లోపల గంజాయి మొక్కలు ఉంటాయి. పత్తి కంటే గంజాయి మొక్క ఎక్కువ ఎత్తు పెరుగుతుంది. దీంతో గంజాయి మొక్క ఎదిగే క్రమంలో మధ్యలకు చీల్చుతారు. దీంతో మొక్క ఎదుగుదల పైకి కాకుండా నేలకు సమాంతరంగా ఉంటుంది.

సెప్టెంబర్‌లో విత్తనాలు చల్లితే జనవరికల్లా గంజాయి పంట చేతికి వస్తోంది. గంజాయి ఆకుల్ని కోసిన తర్వాత ఇళ్లలో ఎండబెట్టి సంచులు, బస్తాల్లో నింపుతున్నారు. వీటిని ట్రావెల్‌ బ్యాగులు, మిర్చి బస్తాల్లో నింపి రాష్ట్ర సరిహద్దులు దాటిస్తున్నారు. కేజీ గంజాయి ఆకులకు ఏజెంట్లు రూ.3 వేల దాకా రైతులకు ముట్టచెబుతున్నారు. ఎకరం విస్తీర్ణంలో గంజాయిని సాగుచేస్తే నికరంగా క్వింటాలు వరకు పంట చేతికొస్తోంది. కొన్నిచోట్ల గిరిజనుల భూముల్లో స్మగ్లర్లు కౌలుకు ఎకరానికి రూ.20 వేలు చెల్లించి పంటను వేయిస్తున్నారు.
 
ఇదీ ‘మత్తు’రూటు..
తెలంగాణ నుంచి పొరుగు రాష్ట్రాలకు వెళ్తున్న గంజాయిని అక్కడి స్మగ్లర్లు ప్రాసెసింగ్‌ చేసి తిరిగి మన రాష్ట్రానికే తెచ్చి విక్రయిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన స్మగ్లర్లు భద్రాచలం మీదుగా విజయవాడకు తరలిస్తున్నారు. మహారాష్ట్రకు చెందిన వ్యాపారులు బల్లార్షా–కాజీపేట–సికింద్రాబాద్‌ మార్గంలో తెస్తున్నారు. కామారెడ్డి, నిజామాబాద్‌ కేంద్రాలుగా గంజాయి దందా య«థేచ్ఛగా సాగుతోంది. విశాఖ మన్యం జిల్లాలతోపాటు వివిధ ప్రాంతాల నుంచి తెచ్చిన గంజాయిని ఇక్కడ పెద్ద మొత్తంలో డంప్‌ చేసి, మహారాష్ట్రలోని పుణె, ముంబై వంటి నగరాలకు రైలు, రోడ్డు మార్గాల ద్వారా రవాణా చేస్తున్నారు. విశాఖ ప్రాంతం నుంచి నిజామాబాద్‌ వరకు రైళ్ల రాకపోకలు అనువుగా ఉండటంతోపాటు కేవలం 20 నిమిషాల్లో రైలు, రోడ్డు మార్గాల ద్వారా మహారాష్ట్రలోకి వెళ్లేందుకు వీలుంంది. దీంతో నిజామాబాద్, కామారెడ్డి ప్రాంతాలను స్మగ్లర్లు డంప్‌లుగా మార్చుకున్నారు.
 
ఎక్కడెక్కడ సాగవుతోంది..?
జయశంకర్‌ జిల్లా రేగొండ మండలంలో రేపాక, గాంధీనగర్, కనిపర్తి, జూలపల్లి, భాగిర్ధిపేటలో..
భూపాలపల్లి మండలంలో ఆజాంనగర్‌ అటవీ ప్రాంతాలు, మహదేవపూర్‌ మండల కేంద్రం నుంచి–ముకునూరు వరకున్న గ్రామాలు, మొగుళ్లపల్లి మండలంలో ఇస్పీపేట గ్రామం, చిట్యాల మండలంలో కొన్ని గ్రామాల్లో..
వరంగల్‌ రూరల్‌ జిల్లా పరిధిలో పరకాల మండలం వెల్లంపల్లి, పోచారం, నాగారం, కంఠాత్మకూరు గ్రామాల్లో.. 
ఆదిలాబాద్‌ జిల్లాలోని సరిహద్దు ప్రాంతాలైన తానూరు, కుభీర్, కుంటాల, సారంగపూర్‌ మండలాలతోపాటు తలమడుగు మండలం నందిగామ, బజార్‌హత్నూర్‌ మండలం భూతాయి, గాదిగూడ, నార్నూర్, ఉట్నూర్, ఇంద్రవెల్లి ప్రాంతాల్లో..
కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల్లోని కొన్ని మారుమూల మండలాల్లో..
 
ఎలా రవాణా చేస్తున్నారంటే..?
కొన్నిచోట్ల కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళుతున్నట్లుగా కొందరు మహిళలను వాహనాల్లో ఎక్కించుకుని గంజాయి బ్యాగులను తరలిస్తున్నారు.
► మరికొన్నిచోట్ల రైళ్లలో ఒడ్డూ, పొడవులో ఆర్మీ/పోలీసులుగా కనిపించేవారిని ఎంపిక చేసుకుంటున్నారు. ప్యాక్‌ చేసిన గంజాయి పొట్లాలను ట్రంక్‌ పెట్టెల్లో పెట్టుకుని ప్రయాణికుల తరహాలో వీళ్లు రైళ్లు ఎక్కుతారు. ప్రవేశ ద్వారం వద్ద ఉండే టాయిలెట్ల సమీపంలో ఈ ట్రంకు పెట్టెలు ఉంచుతారు.గమ్యస్థానం రాగానే మాల్‌తో దిగిపోతారు.
రైల్లో గంజాయి రవాణా అవుతున్నట్లు ఆయా శాఖల అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చి రోడ్డు మార్గం ద్వారా తీసుకెళ్తున్నారు.
రైల్వేస్టేషన్‌లో వ్యాపార సముదాయాన్ని బినామీ పేర్లతో కాంట్రాక్టుకు తీసుకుని గంజాయి రవాణాకు అనుకూలంగా మార్చుకుంటున్నారు.
 
తులం చొప్పున విక్రయం
నిర్మల్‌ పట్టణంతోపాటు ఖానాపూర్, భైంసా పరిధిలోని పలు గ్రామాల్లో, హోటళ్లలో విక్రయిస్తున్నారు. విక్రేతలు ఎవరికి పడితే వారికి కాకుండా.. తెలిసిన కొనుగోలుదారులు, నమ్మకస్తులకే విక్రయిస్తున్నారు. పెద్దమొత్తంలో కాకుండా తులం చొప్పున ప్యాకెట్లలో ప్యాక్‌చేసి
రూ.100–150 వరకు అమ్ముతున్నారు.
 
గంజాయి చాక్లెట్లు..
నిజామాబాద్‌లో విక్రయిస్తున్న చాక్లెట్లు, పిప్పర్‌మెంట్లు గ‘మ్మత్తు’లో ముంచెత్తుతున్నాయి. ఆ చాక్లెట్‌గానీ, పిప్పర్‌మెంట్‌గానీ నోట్లో వేసుకుంటే మూడు నాలుగు గంటల పాటు మత్తులో తేలిపోవచ్చు. యువత, హమాలీలు, కూలీలు, చిన్నాచితక వ్యాపారాలు చేసుకునే వారే కాకుండా కొందరు విద్యార్థులు సైతం ఈ గంజాయి చాక్లెట్ల మత్తు ఊబిలో చిక్కుకుపోయారు. గంజాయి ఆకు, పువ్వును మిక్సర్‌లో వేసి మెత్తటి పేస్ట్‌గా తయారు చేస్తున్నారు. ఈ పేస్టును పది గ్రాములు, 20 గ్రాముల్లో చిన్న గోలీలుగా మార్చి.. వాటి చుట్టూ తియ్యటి పదార్థాన్ని చుట్టి పిప్పర్‌మెంట్లు తయారు చేసి అమ్ముతున్నారు. ఒక్కో పిప్పర్‌మెంట్‌ రూ.50 నుండి రూ.200 చొప్పున విక్రయిస్తున్నారు. గుట్టుగా సాగుతున్న  ఈ దందాను ఇటీవలే పోలీసులు ఛేదించారు. 
 
బంతి తోట మధ్య.. నాలుగెకరాల్లో..
అది ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులోని ఓ మారుమూల అటవీ గ్రామం. ఒకప్పుడు పోలీసు–నక్సల్స్‌ ఉద్రిక్తతలతో టెన్షన్‌తో ఉండేది. ఈ గ్రామానికి దూరంగా మరో కుగ్రామం. ఆ ఊరి నుంచి బైక్‌పై 45 నిమిషాలు వెళ్తే ఓ గుట్ట. అక్కడ్నుంచి నడుచుకుంటూ కాస్త దూరం వెళ్తే నాలుగెకరాల్లో బంతి తోట. కాస్త పరిశీలనగా చూస్తే.. ఒక వరుస బంతి చెట్లు.. మరో వరుసలో గంజాయి మొక్కలు. ‘సాక్షి’పరిశీలనలో కనిపించిన దృశ్యమిది. ఇక్కడ పంట చూసుకునేందుకు పని మనుషులు, విక్రయించేందుకు ఏజెంట్లు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. అనుమానం రాకుండా ‘సాక్షి’ప్రతినిధి అక్కడికి వెళ్లి బేరమాడగా.. ఏజెంట్‌ ఎన్ని కేజీలు కావాలని అడిగాడు. వారానికి సుమారు 2 కేజీలు కావాలని అడగ్గా కేజీ రూ.2 వేలు ఉంటుందని చెప్పారు. తమకు పోలీసులు, ఎక్సైజ్‌ సిబ్బంది కూడా తెలుసునని వారు చెప్పడం గమనార్హం.
 
షాక్‌కు గురయ్యా : కాజల్‌
గంజాయి కేసులో తన మేనేజర్‌ రోనీని అరెస్ట్‌ చేయడంపై హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ స్పందించారు. ఈ వ్యవహారంతో తాను షాక్‌ అయ్యానని, ఇలాంటి వ్యక్తికి సమాజంలో మద్దతు ఉండదని అన్నారు. ఇలాంటి వారికి తాను ఎట్టి పరిస్థితుల్లో మద్దతివ్వనని మంగళవారం ట్వీటర్‌లో పేర్కొన్నారు. తన కోసం పనిచేసే వారి పట్ల అభిమానంగా ఉంటానని, కానీ వారి వ్యక్తిగత జీవితాన్ని నియంత్రించలేనని అన్నారు. తన కెరీర్, వ్యక్తిగత విషయాలన్నీ తల్లిదండ్రులే చూసుకుంటున్నారని తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement