పట్టుబడ్డ గంజాయి, నిందితుడితో అధికారులు.. (ఇన్‌సెట్‌లో) గంజాయి చాక్లెట్లు
సాక్షి, హైదరాబాద్: స్కూల్ విద్యార్థులే లక్ష్యంగా డ్రగ్స్ మాఫియా గంజాయి చాక్‌లెట్లు, బిస్కెట్లు మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. బిహార్ కేంద్రంగా పనిచేస్తున్న మాఫియా ముఠా పాత బస్తీకి చెందిన నిరుద్యోగ యువత ద్వారా హైదరాబాద్ మార్కెట్లోకి వీటిని ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది. ప్రముఖ పాఠశాలలు, కార్పొరేట్ సంస్థల వద్ద పాన్ డబ్బాలు, టీ స్టాల్స్‌లో పెట్టి ఆయుర్వేద చాక్‌లెట్ల పేరుతో పాఠశాల విద్యార్థులకు విక్రయిస్తున్నారు. పాతబస్తీలోని ఓ కార్పొరేట్ తరహా పాఠశాల సమీపంలో వీటిని విక్రయిస్తుండగా ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంటు అసిస్టెంట్ కమిషనర్ అంజిరెడ్డి బృందం దాడి చేసి పట్టుకున్నారు. ఉన్నత పాఠశాల స్థాయి విద్యార్థులే ఎక్కువగా గంజాయి ఆధారిత చాక్‌లెట్లకు ఆకర్షితులవుతున్నట్లు తేలింది.
పాతబస్తీలో విక్రయాలు
పాతబస్తీలోని ఓ కార్పొరేట్ పాఠశాల సమీపంలో గంజాయి విక్రయిస్తున్నారనే పక్కా సమాచారంతో హైదరాబాద్ డీసీ వివేకానందరెడ్డి ఆదేశాలతో శనివారం మధ్యాహ్నం ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంటు అధికారులు ఓ ఇంటిపై దాడి చేసి లాల్ బహుదూర్‌సింగ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఎక్సైజ్ అధికారుల రాకను ముందే పసిగట్టిన బహుదూర్‌సింగ్ గంజాయిని గుర్తు తెలియని ప్రాంతంలో దాచిపెట్టి, అధికారులను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. అయితే అనుమానితుని ఇంటికి సమీపంలో తిని పారేసిన గుట్కా పాకెట్ లాంటి కవర్ ఒకటి ఎన్‌ఫోర్స్‌మెంటు ఏఈఎస్ అంజిరెడ్డి దృష్టిని ఆకర్షించింది. ‘టైగర్ మునక్క’అనే లోగో, ‘పులి’ట్రేడ్ మార్కు చిత్రంతో ఉన్న కవర్‌పై ఆయుర్వేదిక్ మెడిసిన్ అని రాసి ఉంది. గతంలో ఇలాంటి గుట్కా ఏదీ మార్కెట్‌లో కనిపించకపోవటంతో అనుమానించిన అంజిరెడ్డి అనుమానితుని ఇంట్లో సోదాలు చేశారు. ఇంట్లోని రహస్య ప్రదేశంలో దాచిపెట్టిన రెండు దండలుగా ఉన్న 70 చాక్‌లెట్లు, 3 కిలోల గంజాయి పొడి, 650 గ్రాముల తడి గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
విద్యార్థులు కొనేందుకు వీలుగా రూ.20కే చాక్‌లెట్
విద్యార్థులు కొనేందుకు వీలుగా ఒక్కొక్క గంజాయి చాక్‌లెట్‌ను రూ.20 చొప్పున విక్రయిస్తున్నట్లు అధికారుల విచారణలో తేలింది. 50 గ్రాముల ప్యాకెట్ చొప్పున ప్యాక్ చేసిన ఒక్కొక్క ప్యాకెట్‌ను రూ.500 చొప్పున అమ్ముతున్నారు. వీటిని లోయర్ ధూల్‌పేట ప్రాంతానికి చెందిన బ్రిజ్‌రాజ్‌సింగ్ అనే డ్రగ్స్ నిందితుడు సరఫరా చేసినట్లు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. బిహార్ రాష్ట్రం నుంచి ఆయుర్వేదిక్ మెడిసిన్ రూపంలో స్మగ్లింగ్ చేసి స్థానికంగా ఏజెంట్ల ద్వారా విక్రయిస్తున్నట్లు అంచనాకు వచ్చారు. బ్రిజ్‌రాజ్‌సింగ్ పట్టుబడితే ఇంకా ఏమేమి గంజాయి ఉత్పత్తులు సరఫరా చేస్తున్నారో తెలిసే అవకాశం ఉందని, త్వరలోనే అతన్ని పట్టుకుంటామని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంటు అధికారులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment