వాషింగ్టన్ : అమెరికా- మెక్సికో సరిహద్దుల్లో తల్లితండ్రుల నుంచి పిల్లలను వేరు చేసి నిర్భందించే విధానానికి స్వస్తిపలుకుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకాలు చేశారు. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించే కుటుంబాలను విచ్ఛిన్నం చేసేలా ప్రస్తుత విధానం ఉందనే విమర్శలు వెల్లువెత్తడంతో ట్రంప్ తాజా నిర్ణయం తీసుకున్నారు. అయితే వలస విధానం విషయంలో ఏమాత్రం తగ్గబోమని స్పష్టం చేశారు. అక్రమంగా సరిహద్దులు దాటి అమెరికాలో ప్రవేశించినందుకు ఇక కుటుంబాలను కలిపే ప్రాసిక్యూషన్ ఎదుర్కొనేలా చర్యలు చేపడతారు. ప్రస్తుతం అక్రమ వలసదారుల్లో పిల్లలను తల్లితండ్రులను వేర్వేరుగా నిర్భందిస్తుండటంపై విమర్శలు ఎదురవడంతో ట్రంప్ యంత్రాంగం పునరాలోచనలో పడింది.
‘ తమ సరిహద్దులు ఇప్పుడు మరింత పటిష్టంగా ఉన్నాయని, అయితే కుటుంబాలను సమిష్టిగా ఉంచాల్సిన బాధ్యత తమపై ఉంద’ని ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులపై సంతకాలు చేసిన అనంతరం ట్రంప్ వ్యాఖ్యానించారు. కుటుంబాలను వేరు చేశామన్న భావన ఎవరిలో కలగరాదనేది తన అభిమతమని ఆయన స్పష్టం చేశారు.
కాగా వలసలపై తన కఠిన వైఖరిని పదేపదే సమర్ధించుకుంటున్న ట్రంప్ వలస వచ్చిన చిన్నారులను సరిహద్దులు దాటిన అనంతరం తల్లితండ్రుల నుంచి బలవంతంగా వేరుచేయడాన్నీ వెనకేసుకువచ్చేవారు. అయితే తల్లితండ్రులకు దూరమైన చిన్నారులు కంటతడి పెట్టే దృశ్యాలు, వారిని బోనుల్లో నిర్భందించడం వంటి ఫోటోలు అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తాయి.
Comments
Please login to add a commentAdd a comment