ఇదిగో ‘ట్రంప్‌’కార్డు  | US will sell gold card to wealthy foreigners | Sakshi

ఇదిగో ‘ట్రంప్‌’కార్డు 

Apr 5 2025 4:07 AM | Updated on Apr 5 2025 4:07 AM

US will sell gold card to wealthy foreigners

కొత్త లుక్కుతో గోల్డ్‌కార్డు 

మీడియాకు చూపిన ట్రంప్‌ 

వేదికైన ఎయిర్‌ఫోర్స్‌వన్‌ 

వాషింగ్టన్‌: అమెరికా అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గోల్డ్‌ కార్డు తాలూకు కొత్త లుక్కును అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విడుదల చేశారు. గురువారం ఎయిర్‌ఫోర్స్‌వన్‌ విమానంలో ప్రయాణిస్తూ దాన్ని మీడియాతో పంచుకున్నారు. ‘‘ఇదేమిటో తెలుసా? గోల్డ్‌ కార్డు. ట్రంప్‌ కార్డు. ఐదు మిలియన్‌ డాలర్లకే దీన్ని సొంతం చేసుకోవచ్చు’’ అని చెప్పుకొచ్చారు. ట్రంప్‌కార్డు తొలి కొనుగోలుదారు ఎవరని మీడియా ప్రశ్నించగా, ‘నేనే’నంటూ అధ్యక్షుడు బదులిచ్చారు. 

కొత్త కార్డును రెండు వారాల్లో విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. ట్రంప్‌కార్డును పేరుకు తగ్గట్టే బంగారు రంగులో రూపొందించారు. కార్డులో ఎడమవైపు దాదాపుగా సగం మేరకు ట్రంప్‌ ఫొటో ఆక్రమించింది. ఆ పక్కనే చుట్టూ చుక్కల నడుమ ‘ద ట్రంప్‌ కార్డ్‌’ అని రాసుంది. కింద ట్రంప్‌ సంతకం, 5,000,000 సంఖ్య ఉన్నాయి. కార్డు విలువ 50 లక్షల డాలర్లని చెప్పేలా ఎడమవైపున పైన, కింద 5ఎం అని రాసుంది. 

విదేశీ సంపన్నులకు అమెరికాలో శాశ్వత నివాసానికి, అంతిమంగా పౌరసత్వానికి వీలు కల్పించేలా ఈ గోల్డ్‌కార్డును రూపొందించడం తెలిసిందే. ఈబీ–5 వీసా స్థానంలో కొద్దివారాల క్రితమే దాన్ని తీసుకొచ్చారు. ఇటీవల ఒక్క రోజులోనే ఏకంగా వెయ్యి గోల్డ్‌ కార్డులు అమ్ముడైనట్టు అమెరికా ప్రకటించింది కూడా. తర్వాత దాని పేరును ట్రంప్‌ కార్డుగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. అమెరికన్ల కోరిక మేరకే ఈ మార్పు చేసినట్టు ట్రంప్‌ చెప్పుకున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement