
భారత్‌పై 27 కాదు, 26 శాతమే
మరోసారి సవరించిన అమెరికా
న్యూఢిల్లీ: 26 శాతం. కాదు 27. కాదు, కాదు... 26 శాతమే! భారత్‌పై విధించిన ప్రతీకార సుంకాల టారిఫ్ విషయంలో అమెరికా వరుస పిల్లిమొగ్గలివి. జనమే ఉండని అంటార్కిటికాతో పాటు ప్రపంచ దేశాలన్నింటినీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం ఎడాపెడా టారిఫ్‌లతో బాదేయడం తెలిసిందే. వైట్‌హౌస్ రూపొందించిన టారిఫ్‌ల చార్టును చేతిలో పట్టుకుని మరీ ఒక్కో దేశంపై టారిఫ్‌లను ప్రకటించారాయన. అమెరికాలోకి ప్రవేశించే ప్రతి ఉత్పత్తిపైనా 10 శాతం సుంకాలు విధిస్తున్నట్టు పేర్కొన్నారు. భారత్‌పై 26 శాతం సుంకాలు విధిస్తున్నట్టు ఆ సందర్భంగా ట్రంప్ వెల్లడించారు.
‘‘భారత్ మాపై ఏకంగా 52 శాతం సుంకాలు విధిస్తోంది. అందులో సగం మాత్రమే మేం వసూలు చేయబోతున్నాం. ఆ లెక్కన చూస్తే మేమిప్పటికీ ఉదారంగానే వ్యవహరిస్తున్నట్టే’’ అని చెప్పుకున్నారు. కానీ మ ర్నాటికల్లా వాటిని 27 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. భారత్‌తో పా టు మొత్తం 14 దేశాలపై ట్రంప్ ప్రకటించిన టారిఫ్‌లను వైట్‌హౌస్ గురువారం సవరించింది. ఆ మేరకు అనుబంధ ప్రకటన విడుదల చేసింది. అయితే శుక్రవారానికల్లా మళ్లీ కథ మొదటికి వచ్చింది. భారత్‌పై టారిఫ్‌ను అమెరికా తిరిగి 26 శాతానికి తగ్గించేసింది. తాజాగా విడుదల చేసిన ప్రకటనలో వైట్‌హౌస్ ఈ మేరకు పేర్కొంది.
ఈ సుంకాలు ఏప్రిల్ 9 నుంచి అమల్లోకి రానున్నాయి. భారత్ విషయంలో ఈ ‘ఒక్క శాతం’ తడబాటుపై ఆర్థిక నిపుణులు ఆసక్తికరంగా స్పందిస్తున్నారు. టారిఫ్‌ల విధింపు విషయంలో బహుశా ట్రంప్, ఆయన యంత్రాంగంలో నెలకొన్న తీవ్ర అయోమయానికి ఇది నిదర్శనమని వారంటున్నారు. ఈ దుందుడుకు టారిఫ్‌లు అంతిమంగా అమెరికా పుట్టినే ముంచుతాయని ఇంటా బయటా జోరుగా విశ్లేషణలు వెల్లువెత్తుతుండటం తెలిసిందే. బయటికి బెదిరింపు స్వరం వినిపిస్తున్నా, ఆ విశ్లేషణల ప్రభావం ట్రంప్ టీమ్‌పై బాగానే పడుతున్నట్టు కనిపిస్తోంది.