
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియా తమ ప్రయాణాన్ని ప్రారంభించింది. ఈ మెగా టోర్నీలో భాగంగా దుబాయ్ వేదికగా భారత్ తమ తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి అరుదైన ఘనత సాధించాడు.
అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న మూడో ఆటగాడిగా భారత క్రికెట్ దిగ్గజం మహ్మద్ అజారుద్దీన్ రికార్డును కోహ్లి సమం చేశాడు. అజారుద్దీన్ 334 మ్యాచ్‌ల్లో 156 క్యాచ్‌లు అందుకోగా.. విరాట్ కేవలం 298 మ్యాచ్‌ల్లో సరిగ్గా 156 క్యాచ్‌లను తీసుకున్నాడు. కోహ్లి మరో క్యాచ్ అందుకుంటే అజారుద్దీన్‌ను అధిగమిస్తాడు.
హృదయ్ విరోచిత సెంచరీ..
ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 49.4 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌటైంది. 35 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన బంగ్లాను తౌహిద్ హృదయ్, జాకర్ అలీ తమ అద్బుత ఇన్నింగ్స్‌లతో ఆదుకున్నారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 154 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు.
తౌహిద్ హ్రిదయ్(118 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 100) విరోచిత సెంచరీతో చెలరేగగా.. జాకర్ అలీ(68) రాణించాడు. హ్రిదయ్ ఓ వైపు కాలి కండరాలు గాయంతో బాధపడుతున్నప్పటికి.. ఫైటింగ్ నాక్‌తో తన జట్టుకు గౌరవప్రదమైన స్కోర్‌ను అందించాడు. అయితే బంగ్లా స్టార్ ప్లేయర్లు సౌమ్యా సర్కార్, కెప్టెన్ నజ్ముల్ హోస్సేన్ శాంటో, ముష్పికర్ రహీం ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరారు.
ఐదేసిన షమీ..
ఇక టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ మరోసారి ఐసీసీ ఈవెంట్‌లో సత్తాచాటాడు. ఈ మ్యాచ్‌లో షమీ ఫైవ్ వికెట్ హాల్‌ను సాధించాడు. తన 10 ఓవర్ల కోటాలో షమీ 53 పరుగులిచ్చి 5 వికెట్లు సాధించాడు. వన్డేల్లో షమీకి ఇది ఏడో ఫైవ్ వికెట్ హాల్ కావడం గమనార్హం. అదేవిధంగా వన్డేల్లో బంతుల పరంగా అత్యంత వేగంగా 200 వికెట్లు సాధించిన బౌలర్ షమీ చరిత్ర సృష్టించాడు.
షమీ ఈ ఫీట్ సాధించేందుకు 5126 బంతులు అవసరమయ్యాయి. ఇంతకు ముందు ఈ రికార్డు మిచెల్ స్టార్క్ పేరిట ఉండింది. స్టార్క్ 5240 బంతుల్లో 200 వన్డే వికెట్ల మైలురాయిని తాకాడు. కాగా షమీతో పాటు హర్షిత్ రాణా మూడు వికెట్లు పడగొట్టాడు.
చదవండి: Champions Trophy 2025: బంగ్లాదేశ్‌తో మ్యాచ్.. డబుల్ సెంచరీ కొట్టిన షమీ
Comments
Please login to add a commentAdd a comment