అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన డొనాల్డ్ ట్రంప్ ప్రారంభోపన్యాసంలో పనామా కాలువ గురించి చేసిన వ్యాఖ్యలపై విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పనామా కాలువను బల ప్రయోగంతోనైనా స్వాదీనం చేసుకుంటామంటూ ట్రంప్ చేసిన ప్రకటన మున్ముందు ప్రమాదకర పరిస్థితులకు దారి తీస్తుందంటున్నారు. ప్రారంభ ప్రసంగంలో ట్రంప్ పనామా కాలువ చైనా నియంత్రణలోకి వెళ్లిపోయిందని, 1977 నాటి ఒప్పందాన్ని పనామా ఉల్లంఘించిందని ఆరోపించారు. అప్పట్లో కాలువను అమెరికా మూర్ఖంగా పనామాకు ఇచ్చివేసిందని వ్యాఖ్యానించారు.
అమెరికా నౌకల నుంచి భారీగా ఫీజులు వసూలు చేస్తోందని, అందుకే స్వాధీనం చేసుకుంటామని పేర్కొన్నారు. చైనా దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకే ట్రంప్ ఈ ప్రకటన చేసినట్లుగా భావించినప్పటికీ డ్రాగన్ దేశ విస్తరణ కాంక్షకు బలమిస్తున్నట్లు అవుతుందని అంటున్నారు. తైవాన్‌ను, ఇతర ప్రాంతాలను కలిపేసుకునేందుకు ఇదో సాకుగా చూపే ప్రమాదముందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో, తైవాన్ పట్ల చైనాను సంయమనంగా వ్యవహరించేలా చేయడమన్న దశాబ్దాల అమెరికా విధానానికి వీడ్కోలు పలుకుతూ ట్రంప్ చేసిన అనూహ్య ప్రకటన తన విస్తరణ కాంక్షకు చట్టబద్ధతగా ఆ దేశం భావించే ప్రమాదముందని చెబుతున్నారు.
రష్యా, చైనాల సరసన అమెరికా?
అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టకమునుపే ట్రంప్ పనామా కాలువ అమెరికాకే చెందుతుందంటూ చేసిన వ్యాఖ్యలపై నిపుణులు పెదవి విరిచారు. అలాంటప్పుడు, చైనా, రష్యాల చర్యల కంటే అమెరికా ఏవిధంగా మెరుగనే ప్రశ్న ఉత్పన్నమవుతుందని వారన్నారు. ఉక్రెయిన్ తమకే చెందుతుందంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆ దేశాన్ని ఆక్రమించుకున్నారు. తైవాన్‌ను బలప్రయోగంతోనైనా స్వాదీనం చేసుకుంటామని చైనా బెదిరింపులకు దిగుతోంది. ట్రంప్ కూడా పనామా, గ్రీన్‌ల్యాండ్‌లను సైనిక చర్యతో అయినా స్వాధీనం చేసుకుంటామంటున్నారు. ఆ రెండు దేశాలకు, అమెరికాకు తేడా ఏముంటుంది?’అని న్యూయార్క్‌కు చెందిన జర్నలిస్ట్ గెరాల్డో రివెరా ‘ఎక్స్’లో పేర్కొన్నారు. సార్వభౌమ దేశాన్ని స్వాదీనం చేసుకుంటామనడం ట్రంప్ విస్తరణవాదానికి ఉదాహరణ అని వాషింగ్టన్‌కు చెందిన మరో జర్నలిస్ట్ పేర్కొన్నారు.
చైనాకు ఓ అవకాశం కానుందా?
పనామా కాలువతోపాటు సరిహద్దులను ఆనుకుని ఉన్న కెనడాను, ఉత్తర అట్లాంటిక్ సముద్రంలోని డెన్మార్క్ పాలనలోని గ్రీన్‌ల్యాండ్‌ను కలిపేసుకుంటామంటూ ట్రంప్ చేసిన ప్రకటనలు.. రష్యా, చైనాలు కూడా తమ ఆక్రమణలను అమెరికా గుర్తిస్తుందనే సంకేతాలిచ్చినట్లవుతుందని సీఎన్‌ఎన్ యాంకర్ జిమ్ సియుట్టో ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ఇటువంటి ప్రకటనలు అమెరికా విశ్వసనీయతను దెబ్బతీస్తాయని, చైనాకు విస్తరణకు గేట్లు తెరిచినట్లవుతుందని ఆ దేశ విశ్లేషకులు అంటున్నారు. ఒక వేళ అమెరికా గ్రీన్‌ల్యాండ్‌ను ఆక్రమిస్తే చైనా తైవాన్‌ను తప్పక స్వా«దీనం చేసుకుంటుందని వాంగ్ జియాంగ్‌యు అనే హాంకాంగ్ ప్రొఫెసర్ స్పష్టం చేస్తున్నారు. అత్యంత క్లిష్టమైన తైవాన్ అంశం సహా అన్ని విషయాలపైనా ట్రంప్‌తో బేరసారాలకు అవకాశముంటుందని చైనా అధికార వర్గాలు భావిస్తున్నాయని షాంఘైలోని ఫుడాన్ వర్సిటీ ఇంటర్నేషనల్ స్టడీస్ ప్రొఫెసర్ ఝావో మింగ్‌హావో అంటున్నారు.
కాలువపై చైనా పెత్తనం నిజమేనా?
పసిఫిక్–అట్లాంటిక్ సముద్రాలను కలుపుతూ అమెరికా ప్రభుత్వం 1904–1914 సంవత్సరాల మధ్య పనామా కాలువను తవ్వించింది. దీనివల్ల ఈ రెండు సముద్రాల మధ్య ప్రయాణ దూరం చాలా తగ్గింది. 1977లో కుదిరిన ఒప్పందం ప్రకారం 1999 నుంచి పనామా నియంత్రణ కొనసాగుతోంది. పనామా కాలువ గుండా వెళ్లే ఓడల్లో 70 శాతం అమెరికావే కావడం గమనార్హం. భద్రతకు ముప్పు కలిగితే కాపాడేందుకు అమెరికా జోక్యం చేసుకోవచ్చు. ప్రస్తుతం, కాలువను చైనా నియంత్రించడం లేదు, నిర్వహించడం లేదు. కానీ, హాంకాంగ్‌కు చెందిన సీకే హచిసన్ అనుబంధ కంపెనీ పనామా కాలువలోని కరీబియన్, పసిఫిక్ ఎంట్రన్స్ వద్ద నిర్వహణ బాధ్యతలను నిర్వహిస్తోంది.
ఇదికాకుండా, చైనా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్‌లో 2017లో చేరిన మొట్టమొదటి లాటిన్ అమెరికా దేశం పనామాయే. 2016లో చైనా ప్రభుత్వ సీవోఎస్‌సీవోకు చెందిన ఓట మొదటిసారిగా పనామా కాలువలోకి ప్రవేశించింది. అదే ఏడాది, చైనా కంపెనీ లాండ్‌బ్రిడ్జి గ్రూపు మార్గరిటా దీవిలోని అతిపెద్ద నౌకాశ్రయాన్ని కొనుగోలు చేసింది. పనామా కాలువపై మరో వంతెన నిర్మాణ కాంట్రాక్టును చైనా కంపెనీలే దక్కించుకున్నాయి. ఈ ప్రాంతంలో చైనా ప్రాబల్యం విస్తరిస్తుండటం అమెరికాకు కంటగింపుగా మారింది. ‘సాంకేతికంగా కాలువపై హక్కులు మావే. మరో దేశం చేతుల్లోకి కాలువ వెళుతోంది. వాస్తవానికి పరాయి దేశం తన కంపెనీల ద్వారా కాలువపై పెత్తనం సాగిస్తోంది’అని విదేశాంగ మంత్రి మార్కో రుబియో సైతం పేర్కొన్నారు. కాలువను అమెరికా కొంటుందనే ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment