
చైనాకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్టిమేటం
34 శాతం ప్రతీకార సుంకాలపై ధ్వజం
తక్షణం రద్దు చేయండి
లేదంటే రేపట్నుంచే అమలు
టారిఫ్‌లపై తగ్గేదే లేదన్న అధ్యక్షుడు
వాషింగ్టన్: చైనాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి విరుచుకుపడ్డారు. అమెరికాపై 34 శాతం ప్రతీకార సుంకాలు విధించడంపై తీవ్రంగా మండిపడ్డారు. ఆ నిర్ణయాన్ని మంగళవారంలోగా వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే బుధవారం నుంచి చైనాపై ఏకంగా మరో 50 శాతం అదనపు సుంకాలు విధిస్తానని సోమవారం హెచ్చరించారు. అంతేకాదు, ‘‘చైనా విజ్ఞప్తి మేరకు పలు అంశాలపై ఆ దేశంతో పురోగతిలో ఉన్న అన్నిరకాల చర్చలనూ ఉన్నపళాన నిలిపేస్తాం.
బదులుగా ఇతర దేశాలపై దృష్టి సారిస్తాం. ఆయా రంగాల్లో వాటితో బంధాలను పటిష్టం చేసుకుంటాం’’ అని కుండబద్దలు కొట్టారు. చైనాపై ట్రంప్ ఇటీవలే 34 శాతం సుంకాలు విధించడం, బదులుగా అమెరికాపైనా అంతే శాతం సుంకాలు విధిస్తున్నట్టు చైనా ప్రకటించడం తెలిసిందే. అంతేగాక తమనుంచి అమెరికా దిగుమతి చేసుకుంటున్న పలు కీలక ఖనిజాలపై ఆంక్షలు కూడా విధించింది.
దీనిపై ట్రంప్ తీవ్రంగా మండిపడుతూ తన సోషల్ మీడియా హాండిల్ ట్రూత్‌లో పలు పోస్టులు పెట్టారు. ‘‘అమెరికా ఉత్పత్తులపై చైనా ఏళ్లుగా రికార్డు స్థాయిలో భారీ టారిఫ్‌లు వసూలు చేస్తోంది. అవి చాలవన్నట్టు నిన్న మరో 34 శాతం ప్రతీకార సుంకాలు విధించింది. ఇవిగాక చైనా కంపెనీలు అనైతిక సబ్సిడీలు, భారీ ద్రవ్య అవకతవకల వంటివాటికి పాల్పడుతూ వస్తున్నాయి! నేను విధించిన సుంకాలపై ఏ దేశమైనా ప్రతీకార చర్యలకు దిగితే సహించబోమని స్పష్టంగా హెచ్చరించా. వాటిపై అదనపు బాదుడు తప్పదని అప్పుడే స్పష్టం చేశా. చైనా ఇప్పుడు వాటిని రుచిచూడబోతోంది’’ అని ప్రకటించారు.
అమెరికాలో ద్రవ్యోల్బణం లేదు
తన సుంకాల దెబ్బకు ప్రపంచ మార్కెట్లన్నీ పతనమవుతున్నా ట్రంప్ మాత్రం డోంట్ కేర్ అంటున్నారు. అమెరికా ద్రవ్యోల్బణం కోరల్లో చిక్కుతోందని ఆర్థిక నిపుణులంతా గగ్గోలు పెడుతున్నా అదేమీ లేదని చెప్పుకొచ్చారు. ఎవరేమన్నా సుంకాలపై తగ్గే ప్రసక్తే లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. ప్రపంచం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలంటికీ అమెరికా గత పాలకులు, తమను ఇంతకాలంగా దోచేసిన చైనా వంటి దేశాలే కారణమని నిందించారు.
‘‘ఒక్కోసారి చేదుగా ఉన్నా చికిత్స తప్పదు. నా చర్యల ఫలితాలు ఇప్పటికే కని్పస్తున్నాయి. చమురు ధరలు దిగొచ్చాయి. వడ్డీ రేట్లూ తగ్గుముఖం పడుతున్నాయి. ఆహార పదార్థాల ధరలూ తగ్గుతున్నాయి. ఇక ద్రవ్యోల్బణం ఎక్కడున్నట్టు? పలు దేశాలు అమెరికాను ఇంతకాలం పీల్చి పిప్పి చేశాయి. ముఖ్యంగా చైనా! ఇప్పుడు చూడండి, నా టారిఫ్‌ల దెబ్బకు చైనా మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. ఇకపై అమెరికాకు ప్రతి వారం ఏకంగా బిలియన్ల కొద్దీ డాలర్లు వచి్చపడతాయి. చూసుకోండి’’ అంటూ స్పష్టం చేశారు.
ఇక భారత్‌లోనే ఉత్పత్తి!
యాపిల్, సామ్‌సంగ్ యోచన
మొబైళ్ల తయారీ దిగ్గజాలు యాపిల్, సామ్‌సంగ్ ట్రంప్ టారిఫ్‌ల ప్రభావాన్ని తప్పించుకునే మార్గాల అన్వేషణలో పడ్డాయి. తమ అంతర్జాతీయ ఉత్పత్తి కేంద్రాలను లాభదాయక ప్రాంతాలకు తరలించాలని యోచిస్తున్నాయి. వియత్నాంపై 46 శాతం చైనాపై 34 శాతం చొప్పున సుంకాలు విధించిన ట్రంప్ భారత్‌పై 26 శాతంతో సరిపెట్టడం తెలిసిందే. దాంతో భారత్‌లో ఉత్పత్తిని వీలైనంతగా పెంచడంతో పాటు అంతర్జాతీయ ఉత్పత్తి వ్యవస్థలను వీలైనంత వరకూ ఇక్కడికి తరలించాలని యాపిల్, సామ్‌సంగ్ యోచిస్తున్నట్టు సమాచారం. యాపిల్ చాలాకాలంగా భారత్‌లో ఐఫోన్లు తయారు చేస్తోంది. ‘‘చైనాలో ఉత్పత్తిని వీలైనంతగా తగ్గించుకోవాలని కంపెనీ నిర్ణయానికి వచి్చంది. ఇకమీదట అమెరికాకు కేవలం భారత్‌లో తయారైన ఐఫోన్లనే పంపనుంది. ప్రస్తుతానికి చైనాలో తయారు చేసిన ఫోన్లను యూరప్, లాటిన్ అమెరికా, ఆసియా దేశాలకు పంపిస్తుంది’’ అని కంపెనీ వర్గాలను ఉటంకిస్తూ వార్తలొస్తున్నాయి. అంతేగాక ట్రంప్ టారిఫ్‌ల దెబ్బకు అమెరికాలో ఐఫోన్ల ధరలు 40 శాతం దాకా పెరగవచ్చంటున్నారు.