Record level
-
USA: హెలెన్ విధ్వంసం
ఫ్లోరిడా: అమెరికాను తాకిన భీకర హెలెన్ తుపాను ఫ్లోరిడాతో పాటు ఆగ్నేయ అమెరికాలో అపారమైన విధ్వంసం సృష్టించింది. జార్జియా, నార్త్ కరోలినా, సౌత్ కరోలినా, వర్జీనియాల్లో వరదలు, ఇళ్లు కూలిన ఘటనల్లో 72 మంది చనిపోయారు. మృతుల సంఖ్య పెరిగేలా ఉంది. వరద నష్టం 15 నుంచి 26 బిలియన్ డాలర్ల దాకా ఉంటుందని మూడీస్ అంచనా వేసింది. టెన్నెసీలోని యునికోయ్ కౌంటీ హాస్పిటల్లోకి వరద చేరడంతో మొత్తం 54 మంది భవనంపైకి చేరారు. వారిని హెలికాప్టర్ ద్వారా కాపాడారు. న్యూపోర్టు సమీపంలో జలాశయం పొంగిపొర్లుతుండటంతో 7 వేల మందిని తరలించారు. నార్త్ కరోలినాలో వందేళ్లలోనే రికార్డు స్థాయిలో వరదలు సంభవించాయని అధికారులు వెల్లడించారు. అట్లాంటాలో 48 గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో 28.24 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. ఇక్కడ 1878 తర్వాత ఈ స్థాయి వర్షం ఇదే మొదటిసారని జార్జియా వాతావరణ విభాగం ప్రకటించింది. వరదల ధాటికి పార్కు చేసిన కార్లన్నీ మునిగిపోయాయి. ఈ ప్రాంతాన్ని ముంచెత్తాయి. ఫ్లోరిడాలో పలు ప్రాంతాలకు చేరేందుకు పడవలే దిక్కయ్యాయి. ఫ్లోరిడా, జార్జియా, కరోలినాల్లో 30 లక్షల ఇళ్లు, వ్యాపారసంస్థలకు కరెంటు నిలిచిపోయింది. ఇటీవలి ఇడాలియా, డెబ్బీ తుపాన్లను మించిన నష్టం కలిగిందని ఫ్లోరిడా గవర్నర్ రాన్ డీ శాంటిస్ తెలిపారు. తుపాను తీవ్రత తగ్గినా కుండపోత కొనసాగుతుందని వాతావరణ విభాగం హెచ్చరించింది. -
రికార్డు స్థాయిలో కృష్ణమ్మ వరద
సాక్షి, నాగర్‌కర్నూల్: ఈసారి వానాకాలం సీజన్లో కృష్ణానదిలో రికార్డుస్థాయిలో వరద పోటెత్తింది. గడిచిన 50 రోజులుగా శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువన తుంగభద్ర, కృష్ణానదిలో పెరిగిన నీటి ప్రవాహంతో కేవ లం పదిరోజుల్లోనే శ్రీశైలం ప్రాజెక్ట్ పూర్తిస్థాయిలో నిండింది. ఈ ప్రాజెక్టు నీటినిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా, ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరదతో ఇప్పటివరకు 1,139 టీఎంసీల నీ రు శ్రీశైలం జలాశయానికి చేరింది. శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను ఎత్తి నీటిని కిందకు విడుదల చేయడంతో గత 50 రోజుల్లో 558 టీఎంసీల నీరు దిగువనున్న నాగార్జునసాగర్‌కు విడుదల చేశారు. గత రెండేళ్లలో శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి కూడా చేరుకోలేదు. ఈ సారి కృష్ణానదిలో భారీ స్థాయిలో వచ్చి న వరదలకు జూలై చివరకల్లా ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యానికి చేరుకుంది. పది రోజుల్లోనే నిండిన ప్రాజెక్టు కృష్ణమ్మ పరవళ్లతో ఈసారి కేవలం పదిరోజుల వ్యవధిలోనే శ్రీశైలం ప్రాజెక్టు డెడ్‌స్టోరేజీ నుంచి ప్రాజెక్టు స్పిల్‌వే ద్వారా నీటిని విడుదల చేసే వరకు చేరింది. జూలై నెల ప్రారంభంలో నీరు లేక వెలవెలబోయిన ప్రాజెక్టు చివరికల్లా నిండుకుండలా మారింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 215.807 టీఎంసీలకు జూలై 20 నాటికి కేవలం 35.629 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. గరిష్ట నీటిమట్టం 885 అడుగులకు జలాశయంలో నీటినిల్వ 812.30 అడుగులకు మాత్రమే పరిమితమైంది. అయితే తుంగభద్ర నదితో పాటు కృష్ణానదికి ఎగువ ప్రాంతం నుంచి వరద ప్రవాహం పెరగడంతో అనూహ్యంగా పదిరోజుల వ్యవధిలోనే శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండింది. తొమ్మిది రోజుల్లోనే 179 టీఎంసీల నీరు ప్రాజెక్టులో వచ్చి చేరింది. దీంతో జూలై 30న అధికారులు ప్రాజెక్టు గేట్లను ఎత్తి నీటిని కిందకు విడుదల చేశారు. ఆగస్టు, సెపె్టంబర్‌లోనూ నిత్యం 1.50 లక్షల క్యూసెక్కులకు పైగా నీటి ప్రవాహం కొనసాగడంతో ఇప్పటివరకు నాలుగు పర్యాయాలు గేట్లను ఎత్తి స్పిల్‌వే ద్వారా నీటిని కిందకు వదిలారు. ఆగస్టు నెలలో వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో సుమారు 20 రోజుల పాటు ప్రాజెక్టు పదిగేట్లను ఎత్తి నీటిని నాగార్జున సాగర్‌కు విడుదల చేశారు. పవర్‌హౌస్‌లో 17 మి.యూనిట్ల విద్యుదుత్పత్తిశ్రీశైలం ఎడమ గట్టున ఉన్న తెలంగాణ భూగర్భ జలవిద్యుత్ కేంద్రానికి నిత్యం 37 వేల క్యూసెక్కుల నీరు విడుదల అవుతుండగా రోజుకు 17 నుంచి 18 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. ఇప్పటి వరకు ప్రాజెక్టు నుంచి భూగర్భ జలవిద్యుత్ కేంద్రానికి మొత్తం 152.74 టీఎంసీల నీటిని విడుదల చేశారు. ఈ కేంద్రంలో మొత్తం ఆరు యూనిట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం 900 మెగావాట్లు కాగా, ప్రస్తుతం ఐదు యూనిట్ల ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. గత జూలై 16 నుంచి భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించగా, నిత్యం 35 వేల క్యూసెక్కులకు పైగా నీటితో గరిష్ట స్థాయిలో విద్యుదుత్పత్తిని కొనసాగిస్తున్నారు. -
టోలు ఒలుస్తున్నారు!
సాక్షి, అమరావతి: వాహనంతో రోడ్డెక్కితే చాలు ‘టోలు’ ఒలిచేస్తున్నారు. దేశంలో టోల్ చార్జీల రాబడి రికార్డుస్థాయిలో పెరిగింది. దేశంలో 2023–24లో రూ.64,809 కోట్లు టోల్ చార్జీల రూపంలో వసూలు చేయడం విశేషం. ఇది 2022–23 కంటే 39శాతం అధికం. కేంద్ర ప్రభుత్వం ‘బిల్డ్–ఆపరేట్–ట్రాన్స్ఫర్’(బీవోటీ) విధానంలో జాతీయ రహదారులను నిర్మిస్తుండటంతో కొత్త రహదారులు టోల్ చార్జీల పరిధిలోకి వస్తున్నాయి. దేశంలో 2022 డిసెంబర్ నాటికి 35,996 కి.మీ.మేర టోల్ చార్జీలు వసూలు చేసే జాతీయ రహదారులు ఉండేవి. కాగా, 2023 డిసెంబర్ నాటికి జాతీయ రహదారులు 45,428 కి.మీ.కు పెరిగాయి. దాంతోపాటు వాహనాల సంఖ్య పెరుగుతుండటంతో టోల్ చార్జీల రూపంలో జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ(ఎన్హెచ్ఏఐ)కు ఆదాయం అమాంతంగా పెరుగుతోంది. 8 కోట్లకుపైగా ఫాస్టాగ్‌లు వాహనదారుల నుంచి టోల్ చార్జీల వసూలు చేసేందుకు 2023, డిసెంబర్ నాటికి 8కోట్లకు పైగా ఫాస్టాగ్‌లను జారీచేశారు. దీంతో ప్రస్తుతం దేశంలో రోజుకు సగటున రూ.147.31కోట్లు టోల్ చార్జీల రూపంలో వసూలు చేస్తున్నారు. ఇక త్వరలోనే శాటిలైట్ ఆధారిత టోల్ ఫీజు విధానాన్ని ఎన్హెచ్ఏఐ ప్రవేశపెట్టనుంది. టోల్ చార్జీలను కూడా దశలవారీగా పెంచనుంది.వాస్తవానికి ఈ ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి టోల్ చార్జీలు పెంచాలని ఎన్హెచ్ఏఐ ముందుగా నిర్ణయించింది. కానీ, సాధారణ ఎన్నికల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఆ నిర్ణయం అమలును రెండు నెలలు వాయిదా వేసింది. ఈ నెల 4వ తేదీన ఎన్నికల కౌంటింగ్ ముగిసిన తర్వాత 5శాతం టోల్ చార్జీలను పెంచింది. శాటిలైట్ ఆధారిత టోల్ ఫీజు అమల్లోకి వచ్చినప్పుడు మళ్లీ పెంచే అవకాశం ఉంది. దీంతో వాహనదారులపై టోల్ చార్జీల భారం మరింత పెరగనుంది. -
పెట్టుబడులు సిప్ చేస్తున్నారు
న్యూఢిల్లీ: ఆర్థిక పరిస్థితులపై సానుకూల అంచనాల నేపథ్యంలో క్రమాణుగత పెట్టు బడులు (సిప్) 2023–2024లో రూ. 2 లక్షల కోట్ల రికార్డ్ స్థాయికి చేరాయి. 2022–2023తో పోలిస్తే ఇది 28% అధికం. ఫండ్స్ సంస్థల సమాఖ్య యాంఫీ గణాంకాల ప్రకారం 2016–17లో రూ. 43,921 కోట్లుగా ఉన్న సిప్ పెట్టుబడులు 2022–23 నాటికి రూ. 1.56 లక్షల కోట్లకు చేరాయి. ఇవి 2020–21లో రూ. 96,080 కోట్లుగా, 2021–22లో రూ. 1.24 లక్షల కోట్లుగా ఉన్నాయి. మరోవైపు, గతేడాది మార్చి నెలలో సిప్ల రూపంలో రూ. 14,276 కోట్లు రాగా ఈ ఏడాది మార్చిలో 35 శాతం వృద్ధి చెంది ఆల్–టైమ్ గరిష్ట స్థాయి రూ. 19,270 కోట్లు వచ్చాయి. ఫిబ్రవరి, మార్చిలో వరుసగా రెండు నెలల పాటు సిప్ పెట్టుబడులు రూ. 19,000 కోట్ల మార్కును దాటాయి. -
బాప్రే.. భగభగలు
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో వేసవి ఉష్ణోగ్రతలు ఏప్రిల్‌లోనే రికార్డు సృష్టిస్తున్నాయి. ఏప్రిల్ నెలలో మునుపెన్నడూ లేనంత తీవ్ర స్థాయిలో నమోదవుతున్నాయి. శనివారం ఏడు జిల్లాల్లో దాదాపు 45 డిగ్రీలకు చేరువలోకొచ్చి మంట పుట్టించాయి. రాష్ట్రంలోని 670 మండలాలకు గాను 358 మండలాల్లో (సగానికి పైగా) వడగాడ్పులు, తీవ్ర వడగాడ్పులు దడ పుట్టించాయి. 127 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 231 మండలాల్లో వడగాడ్పులు ప్రభావం చూపాయి. శనివారం అనకాపల్లి జిల్లా రావికమతం, నంద్యాల జిల్లా బ్రాహ్మణ కొట్కూరు, పల్నాడు జిల్లా రావిపాడు, పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ, ప్రకాశం జిల్లా తోకపల్లె, వైఎస్సార్ జిల్లా బలపనూరుల్లో రికార్డు స్థాయిలో 44.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పల్నాడు జిల్లా రెంటచింతలలో 44.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లోనూ 40 నుంచి 44 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. ఆదివారం 64 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 222 మండలాల్లో వడగాడ్పులు, సోమవారం 22 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఆదివారం శ్రీకాకుళం జిల్లాలో 15, విజయనగరం 24, పార్వతీపురం మన్యంలో 11, విశాఖపట్నం 1, అనకాపల్లి 7, కాకినాడ 4, తూర్పుగోదావరి జిల్లాలోని 2 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీస్తాయని తెలిపింది. ఎండలు, వడగాడ్పుల బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. రేపట్నుంచి కాస్త చల్లదనం.. కొద్దిరోజులుగా భానుడి భగభగలతో అల్లాడుతున్న రాష్ట్ర ప్రజలకు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఒకింత చల్లని వార్తను మోసుకొచి్చంది. సోమవారం నుంచి మూడు రోజుల పాటు కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అదే సమయంలో ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడేందుకు కూడా ఆస్కారం ఉందని పేర్కొంది. ఫలితంగా పగటి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టి కాస్త ఊరటనిస్తాయని తెలిపింది. ఉష్ణతాపం తగ్గినా పలు ప్రాంతాల్లో ఉక్కపోత, అసౌకర్య వాతావరణం మాత్రం ఉంటుందని వివరించింది. -
AP: రికార్డు స్థాయిలో పాస్‌పోర్ట్ సేవలు
సాక్షి, విశాఖపట్నం : రాష్ట్రంలో పాస్‌పోర్టు సేవలు మెరుగయ్యాయి. ముఖ్యంగా విశాఖ రీజనల్ పాస్‌పోర్ట్ కేంద్రంలో గతంలో మాదిరిగా నెలల తరబడి నిరీక్షణకు చెక్ చెబుతూ.. ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తూ.. దరఖాస్తుల క్లియరెన్స్‌పై దృష్టిసారించారు. ఇతర ప్రాంతాలకు వెళ్లేవారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రోజు రోజుకీ దరఖాస్తులు పెరుగుతున్నాయి. ఫలితంగా.. విశాఖ ఆర్పీవో కిక్కిరిసిపోతోంది. రోజుకు 1,290 అపాయింట్మెంట్స్ అందిస్తున్నారు. 2023లో ఏకంగా 1,98,577 పాస్‌పోర్టులు రికార్డు స్థాయిలో జారీ చేయడం విశేషం. ఇక్కడ నుంచి 13 జిల్లాలకు పాస్‌పోర్టు సేవలందుతున్నాయి. ఉపాధి, ఉన్నత విద్య, ఇతర అవసరాల కోసం విదేశాలకు వెళ్లాలంటే పాస్‌పోర్టు పొందడానికి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చేది. రోజులు, నెలల తరబడి కాళ్లరిగేలా తిరిగినా స్లాట్లు దొరికే పరిస్థితి ఉండేది కాదు. కానీ.. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తీసుకున్న కీలక నిర్ణయాలతో పాస్‌పోర్టు సేవలు సులువయ్యాయి. దళారుల ప్రమేయం లేకుండానే.. దరఖాస్తుదారుల చేతికి సులువుగా పాస్‌పోర్టు లభిస్తోంది. రాష్ట్రంలోని ప్రధానమైన విశాఖపట్నం ప్రాంతీయ పాస్‌పోర్టు కేంద్రంలో తత్కాల్, సాధారణ అపాయింట్మెంట్లను పెంచి, కాలపరిమితిని తగ్గించడంతో పాటు శనివారం కూడా సేవలు అందిస్తుండటంతో.. పాస్‌పోర్టుల జారీ ప్రక్రియ కూడా వేగవంతమైంది. మరోవైపు పోలీసుల వెరిఫికేషన్ ప్రక్రియ కూడా త్వరితగతిన పూర్తి చేస్తూ.. క్లియరెన్స్ సర్టిఫికెట్స్(పీసీసీ) ఇస్తున్నారు. ఈ సంస్కరణల కారణంగా.. విశాఖపట్నం పాస్‌పోర్టు కేంద్రాల్లో పనితీరు జోరందుకుంది. 2023లో 1,98,577 పాస్‌పోర్టుల జారీ పాత నిబంధనల ప్రకారం పాస్‌పోర్టు కోసం, పోలీస్ విచారణ కోసం నెలల తరబడి వేచి ఉండాల్సి వచ్చేది. ప్రజల సౌలభ్యం కోసం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇచ్చిన ఆదేశాల మేరకు దరఖాస్తుతో పాటు నాలుగు పత్రాలుంటే వారం రోజుల్లో పాస్‌పోర్ట్ చేతిలో ఉంటుంది. ఆధార్‌కార్డు(ఇందులో డేట్ ఆఫ్ బర్త్ కచ్చితంగా ఉండాలి). ఎల్రక్టానిక్ ఫొటో ఐడెంటిటీ కార్డు, పాన్ కార్డు ఉండాలి. వీటితో పాటుగా స్థానికత, క్రిమినల్ రికార్డు, ఇంటి చిరునామాతో కూడిన వివరాలు పొందుపరిచి ఉండేలా లాయర్ అఫిడవిట్ ఉంటే చాలు. వీటిలో ఉన్న సమాచారం నిజమని నిర్ధారించుకున్న వెంటనే పాస్‌పోర్టు ఇస్తున్నారు. విశాఖ ప్రాంతీయ కేంద్రంలో పాస్‌పోర్ట్, పోలీస్ క్లియరెన్స్ సర్టీఫికేట్స్ కోసం రోజుకు సగటున 1,290 వరకూ అపాయింట్మెంట్స్ ఇచ్చి దరఖాస్తుల్ని పరిశీలిస్తున్నారు. 2023 జనవరి సమయంలో దరఖాస్తు చేసుకుంటే అపాయింట్మెంట్ 25 పనిదినాల్లోపు ఇచ్చేవారు. ఇప్పుడు కేవలం ఒక్క రోజులో ఇస్తున్నారు. పీవో పీఎస్కేల పరిధిలో విస్తృతంగా సేవలు.. ఏడాదిన్నర కిందట తపాలా కార్యాలయాల్లోనూ పాస్‌పోర్టు సేవలు అందుబాటులోకొచ్చాయి. విశాఖ ఆర్పీవో పరిధిలో రెండు పాస్‌పోర్టు సేవా కేంద్రాలతో పాటు ఏడు పోస్టాఫీస్ పాస్‌పోర్టు సేవా కేంద్రాలు (పీవోపీఎస్కే) ఉన్నాయి. ఈ పీవోపీఎస్కేల ద్వారానే పోలీస్ క్లియరెన్స్ సర్టీఫికెట్స్(పీసీసీ) స్లాట్లు కూడా జారీ చేస్తుండటంతో పరిశీలన ప్రక్రియ మరింత సులభంగా మారింది. విశాఖ ఆర్పీవో పరిధిలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశి్చమ గోదావరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, యానాం జిల్లాలున్నాయి. పారదర్శకంగా సేవలు దరఖాస్తుదారులకు సమీప తేదీల్లో అపాయింట్మెంట్ ఉండేలా చర్యలకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. రెన్యువల్ కోసం చివరి తేదీ వరకూ ఆలస్యం చేస్తుండటం సరికాదు. ఆరు నెలల ముందుగానే దరఖాస్తు చేసుకుంటే.. పాత పాస్‌పోర్టు గడువు ముగిసేలోగా కొత్త పాస్‌పోర్టు మంజూరవుతుంది. ఏదైనా విచారణ కోసం ఆర్పీవోకి ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 లోపు ఎలాంటి అపాయింట్మెంట్ లేకపోయినా హాజరుకావచ్చు. – విశ్వంజలి గైక్వాడ్ విశాఖ ఆర్పీవో అధికారి -
70,000 వాలా!
ముంబై: స్టాక్ మార్కెట్ రికార్డు ర్యాలీలో భాగంగా సెన్సెక్స్ సరికొత్త మైలురాయిని తాకింది. 44 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో తొలిసారి 70,000 పాయింట్లను తాకింది. మరో సూచీ నిఫ్టీ 21,000 శిఖరానికి కేవలం 3 పాయింట్ల దూరంలో నిలిచింది. కొంతకాలంగా విదేశీ పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది., ఆర్బీఐ వరుసగా అయిదోసారి వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచడంతో పాటు దేశీయ వృద్ధి అవుట్‌లుక్‌ను పెంచింది. అయిదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 3 రాష్ట్రాల్లో గెలుపుతో రాజకీయ స్థిరత్వం రావొచ్చనే ఆశావహ అంచనాలు నెలకొన్నాయి. ప్రాథమిక మార్కెట్లు ఐపీఓలతో కళకళలాడుతున్నాయి. దీంతో కొన్ని వారాలుగా దలాల్ స్ట్రీట్‌లో కొనుగోళ్ల పర్వం కొనసాగుతోంది. ఈ క్రమంలో సెన్సెక్స్ నిఫ్టీలు కొత్త రికార్డుల దిశగా సాగుతున్నాయి. యూఎస్ ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్ఓఎంసీ) నిర్ణయాలు బుధవారం వెలువడనున్న నేపథ్యంలో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు స్తబ్దుగా ట్రేడవుతున్నాయి. ఒడిదుడుకులున్నా.., సరికొత్త శిఖరాలకు .... ఆసియా మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం స్వల్ప లాభాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 100 పాయింట్లు పెరిగి 69,926 వద్ద, నిఫ్టీ నాలుగు పాయింట్లు నష్టపోయి 20,965 వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి. బ్యాంకింగ్, ఐటీ, మెటల్ షేర్లకు రాణించడంతో ప్రథమార్ధంలోనే 232 పాయింట్లు పెరిగి 70,000 స్థాయిపై 70,058 వద్ద, నిఫ్టీ 57 పాయింట్లు బలపడి 21,026 వద్ద కొత్త జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి. అయితే ద్వితీయార్ధంలో రికార్డు స్థాయిల వద్ద లాభాల స్వీకరణతో సూచీలు కొంతమేర లాభాలు కొల్పోయాయి. చివరికి సెన్సెక్స్ 103 పాయింట్ల లాభంతో 69,929 వద్ద, నిఫ్టీ 28 పాయింట్లు బలపడి 21,000 శిఖరానికి కేవలం 3 పాయింట్ల దూరంలో 20,997 నిలిచింది. ‘‘కొత్త ఏడాదికి సరిగ్గా 20 రోజుల ముందు సెన్సెక్స్ 70 వేల పాయింట్ల ధమాకా ఇచి్చంది. అయితే నేడు(మంగళవారం) అమెరికా, భారత్‌ల నవంబర్ ద్రవ్యోల్బణ, పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ)డేటా వెల్లడి నేపథ్యంలో అప్రమత్తత వహిస్తూ లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. మరో ఏడాది కాలంలో సెన్సెక్స్ 80 వేల స్థాయిని అందుకునేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా మౌలిక, ప్రభుత్వ రంగాల షేర్లు ర్యాలీకి ప్రాతినిథ్యం వహించవచ్చు. వచ్చే ఏడాది సాధారణ ఎన్నికల ప్రభావంతో ఈక్విటీ మార్కెట్లో కొంత అస్థిరతర ఉండొచ్చు.’’ అని మార్కెట్ నిపుణుడు విజయ్ కేడియా తెలిపారు. మార్కెట్లో మరిన్ని సంగతులు ► నిధుల సమీకరణ, ఎన్ఎస్ఈ ఎక్సే్చంజీలో లిస్టింగ్ ప్రణాళికల నేపథ్యంలో స్పైస్‌జెట్ షేరు. బీఎస్ఈలో 10%పైగా లాభపడి రూ.60.57 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో 16% ఎగసి రూ.63.69 వద్ద ఏడాది గరిష్టాన్ని అందుకుంది. ► అమెరికా నియంత్రణ సంస్థ హైదరాబాద్ రీసెర్చ్ ఫ్యాకల్టీ యూనిట్‌కు 3 అభ్యంతరాలు జారీ చేయడంతో డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ 5% నష్టపోయి రూ.5,473 వద్ద స్థిరపడింది. ► ఓఎన్జీసీ నుంచి రూ.1,145 కోట్ల ఆర్డరు దక్కించుకోవడంతో మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్ షేరు 3% పెరిగి రూ.2118 వద్ద నిలిచింది. ► సెన్సెక్స్ 65,000 స్థాయి నుంచి 70,000 పాయింట్లకు చేరేందుకు కేవలం 110 రోజుల సమయం పట్టింది. ► 1979లో 100 పాయింట్ల వద్ద తన ప్రయాణాన్ని ప్రారంభించిన సెన్సెక్స్ ఈ ఏడాది డిసెంబర్ నాటికి 70 వేల స్థాయికి చేరుకుంది. అంటే 44 ఏళ్లలో సెన్సెక్స్ ఇన్వెస్టర్లకు 700 రెట్ల లాభాలు పంచింది. ► సెన్సెక్స్ కొత్త రికార్డు స్థాయి నెలకొల్పడంతో సోమవారం రూ.1.85 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.351.09 లక్షల కోట్లకు చేరింది. -
రూ.20,000 కోట్లు సమీకరించిన రిలయన్స్
న్యూఢిల్లీ: భారీ వ్యాపార వృద్ధి ప్రణాళికలతో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ రికార్డు స్థాయిలో నిధులు సమీకరించింది. 7.79 శాతం రేటుపై పదేళ్ల కాల బాండ్లు జారీ చేయడం ద్వారా రూ.20,000 కోట్లు సమకూర్చుకుంది. కేంద్ర ప్రభుత్వం రుణ సమీకరణ రేటు కంటే రిలయన్స్ 0.40 శాతం ఎక్కువ ఆఫర్ చేసింది. 20,00,000 సెక్యూర్డ్, రెడీమబుల్, నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లను (ఎన్సీడీలు), రూ.1,00,000 ముఖ విలువపై ప్రైవేటు ప్లేస్మెంట్ విధానంలో జారీ చేసినట్టు స్టాక్ ఎక్సే్ఛంజ్‌లకు రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలిపింది. కనీస ఇష్యూ సైజు రూ.10,000 కోట్లు కాగా, స్పందన ఆధారంగా మరో రూ. 10,000 కోట్లను గ్రీన్ షూ ఆప్షన్ కింద రిలయన్స్ ఇండస్ట్రీస్ నిధుల సమీకరణ చేసింది. రిలయన్స్ బాండ్ల ఇష్యూకు మొత్తం రూ.27,115 కోట్ల విలువ చేసే బిడ్లు వచ్చాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎన్సీడీలు బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో లిస్ట్ కానున్నాయి. -
ICC World Cup 2023: వరల్డ్ కప్ మ్యాచ్‌లకు స్పాన్సర్ల క్యూ..
న్యూఢిల్లీ: నేటి నుంచి ప్రారంభమవుతున్న ఐసీసీ వరల్డ్ కప్ 2023 మ్యాచ్‌లను స్పాన్సర్ చేసేందుకు కంపెనీలు భారీ ఎత్తున క్యూ కడుతున్నాయి. ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 26 స్పాన్సర్లు, 500 ప్రకటనకర్తలు నమోదు చేసుకున్నట్లు టీవీ, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో మ్యాచ్‌ల ప్రసార హక్కులను దక్కించుకున్న డిస్నీ స్టార్ స్పోర్ట్స్ విభాగం హెడ్ సంజోగ్ గుప్తా తెలిపారు. వీటిలో చాలా స్పాన్సర్లు టీవీ, డిజిటల్ ఫార్మాట్లను ఎంచుకోగా, కొన్ని కంపెనీలు కేవలం డిజిటల్ లేదా టీవీని మాత్రమే ఎంచుకున్నట్లు ఆయన వివరించారు. ఐసీసీ మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్‌లో భాగంగా నిర్వహించే 48 మ్యాచ్‌లను డిస్నీ స్టార్ తమ టీవీ చానళ్లు, ఓటీటీ ప్లాట్‌ఫాం డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో ప్రసారం చేయనుంది. వరల్డ్ కప్ మ్యాచ్‌లు తొమ్మిది భాషల్లో 100 పైచిలుకు కామెంటేటర్స్‌తో డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో ప్రసారం కానున్నాయి. వీటిలో తెలుగు, తమిళం తదితర భాషలు కూడా ఉన్నాయి. పన్నెండేళ్ల తర్వా త వరల్డ్ కప్ మ్యాచ్‌లకు భారత్ ఆతిథ్యమిస్తోంది. భారత్‌పై అంచనాలు.. పండుగ సీజన్ దన్ను ఆసియా కప్‌లో భారత మెరుగైన పనితీరు, పండుగ సీజన్, భారత్ టీమ్‌పై భారీ అంచనాలు తదితర సానుకూలాంశాల కారణంగా అడ్వరై్టజర్లు భారీగా ఆసక్తి చూపుతున్నట్లు గుప్తా చెప్పారు. అన్ని కేటగిరీల కంపెనీలూ స్పాన్సర్ చేసేందుకు లేదా ప్రకటనలు ఇచ్చేందుకు ఆసక్తిగా ఉన్నాయన్నారు. సాధారణంగా పండుగ సీజన్లో కంపెనీలు ప్రకటనలపై భారీగా వెచ్చిస్తుంటాయని తెలిపారు. స్పాన్సర్ల జాబితాలో కోకాకోలా, ఫోన్‌పే, మహీంద్రా అండ్ మహీంద్రా, డ్రీమ్11, హెచ్‌యూఎల్, హావెల్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, పెర్నాడ్ ఇండియా, బుకింగ్‌డాట్‌కామ్, పీటర్ ఇంగ్లాండ్, కింగ్‌ఫిషర్ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్, మాండెలీజ్, ఎమిరేట్స్, డయాజియో, ఎంఆర్ఎఫ్, లెండింగ్‌కార్ట్, బీపీసీఎల్, హెర్బాలైఫ్, హయర్, యాంఫీ, గూగుల్ పే, పాలీ క్యాబ్, అమూల్, విడా, అమెజాన్ మొదలైన సంస్థలు న్నాయి. కోకా–కోలా, ఫోన్‌పే, హెచ్‌యూఎల్ వంటి పలు కంపెనీలు ఇటు టీవీ, అటు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లోనూ స్పాన్సర్ చేస్తున్నాయి. అనువైన ప్యాకేజీలు.. ప్రకటనకర్తల బడ్జెట్, అవసరాలను బట్టి వారికి అనువైన ప్యాకేజీలను రూపొందించినట్లు గుప్తా చెప్పారు. ‘పండుగ సీజన్ సందర్భంగా.. ఎవరైనా అడ్వరై్టజరు దీపావళి సమయంలో ఎక్కువ మంది కస్టమర్లు తమ ఉత్పత్తులపై మక్కువ చూపుతారనే ఉద్దేశంతో పండుగకి ముందు ఓ రెండు వారాలపాటు ప్రకటనలు ఇవ్వదల్చుకున్నారనుకుందాం. కాస్త ప్రీమియం చెల్లించి ఆ వ్యవధిలో మాత్రమే తమ ప్రకటనలను ప్రసారం చేసుకునేందుకు వీలు కలి్పంచేలా వారికోసం కస్టమైజ్డ్ ప్యాకేజీని అందిస్తున్నాం’ అని తెలిపారు. వరల్డ్ కప్‌లో మరింత మంది ప్రకటనకర్తలు భాగమయ్యేందుకు డిజిటల్ ప్లాట్ఫామ్లో ‘‘సెల్ఫ్–సర్వ్ ఫ్రేమ్‌వర్క్’ను ప్రవేశపెట్టినట్లు గుప్తా తెలిపారు. ఏజెన్సీలు, అడ్వరై్టజర్లు సేల్స్ టీమ్స్ జోక్యం లేకుండా, తమకు అవసరమైన వాటిని స్వయంగా బుక్ చేసుకునే వీలుంటుందని వివరించారు. -
ప్రిన్సెస్ డయానా స్వెటర్ ధర రూ. 9.14 కోట్లు
లండన్: దివంగత బ్రిటిష్ యువరాణి డయానా ధరించిన స్వెటర్ ఒకటి వేలంలో రికార్డు స్థాయిలో రూ.9.14 కోట్లు పలికింది. రాజ కుటుంబానికి చెందిన వస్తువుకు అంచనాకు మించి ఇంతటి ధర పలకడం ఇదే మొదటిసారి. ప్రముఖ సోథ్‌బీ సంస్థ నిర్వహించిన ఆన్లైన్ ఫ్యాషన్ ఐకాన్ సేల్ వేలంలో గుర్తు తెలియని వ్యక్తి ఒకరు రూ.9,14,58,510కి ఈ స్వెటర్‌ను సొంతం చేసుకున్నారు. గురువారం ఆఖరి రోజు చివరి 15 నిమిషాల వరకు ఈ స్వెటర్‌కు అత్యధికంగా 1.90 లక్షల డాలర్ల వరకు పలికింది. చివరి నిమిషాల్లో ఒక్కసారిగా 11 లక్షల డాలర్లకు బిడ్ వేశారని సోథ్‌బీ తెలిపింది. జనవరిలో సోథ్‌బీ సంస్థ నిర్వహించిన డయానా ధరించిన బాల్ గౌన్ సైతం రూ.5 కోట్లకు పైగా పలకడం గమనార్హం. -
సగం సమయం కూడా పని చెయ్యలేదు
న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు షెడ్యూల్ సమయంలో సగం కూడా పని చెయ్యలేదు. అయినప్పటికీ రికార్టు స్థాయిలో 23 బిల్లులు పాసయ్యాయి. మణిపూర్‌లో జాతుల ఘర్షణ ఈ సారి ఉభయసభల్ని కుదిపేసింది. లోక్‌సభ కార్యకలాపాలు 43% జరిగితే, రాజ్యసభ 55% సమయం కార్యకలాపాలు కొనసాగించింది. పాలసీ రీసెర్చ్ స్టడీస్ (పీఆర్ఎస్) అందించిన డేటా ప్రకారం లోక్‌సభ 17 రోజులు సమావేశమైంది. అవిశ్వాస తీర్మానంపై 20 గంటల సేపు చర్చ జరిగింది. ఈ చర్చలో 60 మంది సభ్యులు పాల్గొన్నారు. పార్లమెంటు ఆమోదించిన బిల్లుల్లో ఢిల్లీలో పాలనాధికార బిల్లు, డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటక్షన్ బిల్లు, అటవీ సంరక్షణ సవరణ బిల్లు, మైన్స్ అండ్ మినరల్స్ సవరణ బిల్లు ప్రధానమైనవి. ఈసారి సభలో ప్రవేశ పెట్టిన బిల్లుల్లో 56% కేవలం ఎనిమిది రోజుల్లో పార్లమెంటు ఆమోదాన్ని పొందాయి. మరో 17% బిల్లుల్ని కమిటీల పరిశీలనకు పంపారు. -
ఫారెక్స్ @ రికార్డుకు మరో 50 బిలియన్ డాలర్ల దూరంలో..!
ముంబై: భారత్ విదేశీ మారకద్రవ్య నిల్వలు (ఫారెక్స్) జూన్ 30వ తేదీతో ముగిసిన వారంలో అంతక్రితం ఇదే వారంతో (జూన్ 23వ తేదీ) పోల్చి చూస్తే.. 1.85 బిలియన్ డాలర్లు పెరిగి 595.051 బిలియన్ డాలర్లకు ఎగశాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజా గణాంకాలను విడుదల చేసిన గణాంకాల ప్రకారం రికార్డు స్థాయికి మరో 50 బిలియన్ డాలర్ల దూరానికి ఫారెక్స్ నిల్వలు చేరాయి. 2021 అక్టోబర్‌లో ఫారెక్స్ నిల్వలు ఆల్‌టైమ్ రికార్డు 645 బిలియన్ డాలర్లను తాకాయి. రూపాయి పతన నివారణకు చర్యలుసహా ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు ఆర్బీఐ తీసుకున్న పలు చర్యల నేపథ్యంలో రికార్డు స్థాయి నుంచి 100 బిలియన్ డాలర్లు కిందకు దిగాయి. తిరిగి మళ్లీ పురోగమన బాటన పయనిస్తున్నాయి. నెల రోజుల నుంచి నిలకడగా 595 డాలర్ల వద్ద కొంచెం అటు ఇటుగా కొనసాగుతున్నాయి. ప్రస్తుత ఫారెక్స్ నిల్వలు దేశ దాదాపు 12 నెలల దిగుమతులకు సరిపోతాయని అంచనా. నిల్వలను వేర్వేరుగా చూస్తే.. ► డాలర్ల రూపంలో పేర్కొనే ఫారిన్ కరెన్సీ అసెట్స్ 2.5 బిలియన్ డాలర్లు పెరిగి 527.97 బిలియన్ డాలర్లకు చేరింది. ► పసిడి నిల్వల విలువ 472 మిలియన్ డాలర్లు తగ్గి, 43.83 బిలియన్ డాలర్లకు తగ్గింది. ► ఇక అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) వద్ద స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్డీఆర్) విలువ కూడా 95 మిలియన్ డాలర్లు తగ్గి 18.23 బిలియన్ డాలర్లకు చేరింది. ► ఐఎంఎఫ్ రిజర్వ్ పరిమాణా కూడా 118 మిలియన్ డాలర్ల తగ్గి 5 బిలియన్ డాలర్లకు పడింది. -
సింహాచలం చరిత్రలోనే రికార్డ్ స్థాయిలో పోటెత్తిన భక్తులు
-
ఎగుమతుల ‘రికార్డు’ కొనసాగుతుంది
న్యూఢిల్లీ: భారత్ వస్తు ఎగుమతుల రికార్డు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) కూడా కొనసాగుతుందని భారత్ ఎగుమతి సంఘాల సమాఖ్య (ఎఫ్ఐఈఓ) ప్రెసిడెంట్ ఏ శక్తివేల్ స్పష్టం చేశారు. వివరాల్లోకి వెళితే, 2021–22లో ఎగుమతులు 422 బిలియన్ డాలర్ల రికార్డు స్థాయిని తాకాయి. 2022–23లో 3 నుంచి 5 శాతం వృద్ధితో 435–445 బిలియన్ డాలర్లకు చేరుతాయన్న విశ్వాసాన్ని తాజాగా శక్తివేల్ వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా అనిశ్చితి, డిమాండ్ మందగమనం ఉన్నప్పటికీ భారత్ ఆల్‌టైమ్ రికార్డు కొనసాగుతందని విశ్లేషించారు. ఇటీవల విడుదలైన గణాంకాల ప్రకారం, భారత్ వస్తు ఎగుమతులు వరుసగా రెండోనెల జనవరిలోనూ క్షీణతను నమోదుచేశాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 10 నెలల కాలంలో (ఏప్రిల్–జనవరి) వస్తు ఎగుమతులు 8.51 శాతం పెరిగి 369.25 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఘనంగా 58వ వ్యవస్థపక దినోత్సవాలు కాగా, ఎఫ్ఐఈఓ వ్యవస్థాపక దినోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు శక్తివేల్ ఈ సందర్భంగా తెలిపారు. మూడు వారాల పాటు జరిగే ఈ ఉత్సవాల సందర్భంగా– మార్చి 9 నుంచి 11 మధ్య ‘సోర్సెక్స్ ఇండియా’ పేరుతో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆహారం, ఫార్మా, ఆయుర్వేదం, హస్త కళలు, ఎఫ్ఎంసీజీ, జౌళి వంటి రంగాల్లో అవకాశాలను ఈ కార్యక్రమం ద్వారా ప్రచారం చేయడం జరుగుతుందన్నారు. సూపర్ మార్కెట్లు, హైపర్మార్కెట్లు, రిటైల్ చైన్లు, దిగుమతిదారులుసహా దాదాపు 35 దేశాలు నుంచి ప్రతినిధులు ఈ ఈవెంట్లో పాల్గొనేందుకు తమ ఆసక్తిని కనబరిచినట్లు తెలిపారు. -
ముగిసిన ఆటో ఎక్స్పో
గ్రేటర్ నోయిడా: సుమారు వారం రోజులు సాగిన ఆటో ఎక్స్పో బుధవారంతో ముగిసింది. ఈసారి రికార్డు స్థాయిలో 6,36,743 మంది షోను సందర్శించినట్లు దేశీ వాహన తయారీ సంస్థల సమాఖ్య సియామ్ తెలిపింది. రెండేళ్లకోసారి జరిగే ఆటో షోను వాస్తవానికి 2022లోనే నిర్వహించాల్సి ఉన్నప్పటికీ కోవిడ్–19 కారణంగా 2023కి వాయిదా పడింది. ఈ ఏడాది జనవరి 11న ప్రారంభమై 18తో ముగిసింది. తొలి రెండు రోజులు (11,12) మీడియా కోసం కేటాయించగా, 13–18 వరకు సందర్శకులను అనుమతించారు. ఆటో కంపెనీలు ఇందులో 75 పైచిలుకు వాహనాలను ఆవిష్కరించాయి. ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రధానంగా దృష్టి పెట్టాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటర్స్, కియా ఇండియా వంటివి పాల్గొనగా మహీంద్రా అండ్ మహీంద్రా, స్కోడా వంటి కంపెనీలు దూరంగా ఉన్నాయి. మారుతీ సుజుకీ అయిదు డోర్ల జిమ్నీ వెర్షన్‌ను, హ్యుందాయ్ మోటర్స్ ఇండియా అయానిక్ 5ని, కియా ఇండియా తమ కాన్సెప్ట్ ఈవీ9 మొదలైన వాహనాలను ఆవిష్కరించాయి. గ్రేటర్ నోయిడాలో ఆటో ఎక్స్పో 2023 సందర్భంగా బుధవారం టయోటా పెవీలియన్‌లో సందర్శకులు -
అమెరికాలో ఎవియన్ ఫ్లూ... 5 కోట్ల కోళ్లు బలి
వాషింగ్టన్: అమెరికాలో ఎవియన్ ఫ్లూ అక్షరాలా విలయం సృష్టిస్తోంది. ఈ ఏడాది ఇప్పటిదాకా రికార్డు స్థాయిలో ఏకంగా 5 కోట్ల కోళ్లు, పక్షులను బలి తీసుకుంది! ఇది దేశ చరిత్రలోనే అత్యంత ప్రాణాంతకమైన విపత్తని వ్యవసాయ శాఖ పేర్కొంది. దీని దెబ్బకు దేశవ్యాప్తంగా గుడ్లు, కోడి మాంసం తదితరాల రేట్లు చుక్కలనంటుతున్నాయి. అసలే ద్రవ్యోల్బణంతో అల్లాడుతున్న జనం జేబుకు మరింత చిల్లి పెడుతున్నాయి. హైలీ పాథోజెనిక్ ఎవియన్ ఇన్ఫ్లుయెంజా (హెచ్పీఏఐ)గా పిలిచే ఈ ఫ్లూ అడవి బాతుల వంటి వాటి వ్యర్థాలు, ఈకల ద్వారా సోకుతుంది. ఇది అమెరికాలో ఫిబ్రవరిలో వెలుగు చూసింది. చూస్తుండగానే కార్చిచ్చులా దేశమంతటా వ్యాపించి ఏకంగా 46 రాష్ట్రాలను చుట్టేసింది. దాంతో ఫ్లూ వ్యాప్తిని అడ్డుకునేందుకు లక్షలు, కోట్ల సంఖ్యలో కోళ్లు, ఇతర పక్షులను చంపేయాల్సి వచ్చింది! 2015లోనూ యూఎస్‌లో ఇలాగే దాదాపు 5 కోట్ల పక్షులు ఫ్లూకు బలయ్యాయి. బ్రిటన్‌తో సహా పలు యూరప్ దేశాల్లో కూడా ఎవియన్ ఫ్లూ విలయం సృష్టిస్తోంది. ఎంతలా అంటే బ్రిటన్‌లో పలు సూపర్ మార్కెట్లు ఒక్కో కస్టమర్ ఇన్ని గుడ్లు మాత్రమే కొనాలంటూ రేషన్ పెడుతున్నాయి! -
చైనాతో వాణిజ్యం కొత్త పుంతలు
బీజింగ్: భారత్–చైనా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2021లో రికార్డు స్థాయిలో 125 బిలియన్ డాలర్లకు (రూ.9.37 లక్షల కోట్లు) విస్తరించింది. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 43 శాతం పెరిగింది. ఇరు దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు దీర్ఘకాలంగా కొనసాగుతున్నప్పటికీ వాటి ప్రభావం వాణిజ్యంపై పడలేదని స్పష్టమవుతోంది. చైనా నుంచి దిగుమతులు పెరిగిపోవడంతో ఆ దేశంతో భారత్ వాణిజ్య లోటు 69 బిలియన్ డాలర్లకు (బిలియన్ డాలర్లు అంటే సుమారు రూ.7,500కోట్లు) విస్తరించింది. 2021లో చైనా నుంచి భారత్‌కు ఎగుమతులు 46 శాతం పెరిగి 97.52 బిలియన్ డాలర్లకు విస్తరించగా.. భారత్ నుంచి చైనాకు ఎగుమతులు 34 శాతం వృద్ధితో 28.14 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు కస్టమ్స్ విభాగం డేటా ఆధారంగా గ్లోబల్‌టైమ్స్ పేర్కొంది. భారత్ ఆందోళన.. గత దశాబ్దకాలంగా చైనాతో వాణిజ్యలోటు పెరిగిపోతుండడం పట్ల భారత్ ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తోంది. భారత ఐటీ, ఫార్మా ఉత్పత్తులకు ద్వారాలు తెరవాలని చైనాను గట్టిగా డిమాండ్ చేస్తోంది. అయినా బీజింగ్ పట్టించుకోవడం లేదు. కరోనా రెండో విడత ప్రభావంతో వైద్య పరికరాల దిగుమతి, ఫార్మా కంపెనీలు ముడి సరుకుల కోసం చైనాపై ఆధారపడడమే ఆ దేశం నుంచి భారత్‌కు ఎగుమతులు భారీగా పెరిగేందుకు కారణమని పరిశీలకులు పేర్కొంటున్నారు. 2021 మే5 న ప్యాంగాంగ్ సరస్సు వద్ద ఇరు దేశ సైనికుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకోవడం తెలిసిందే. పదుల సంఖ్యలో సైనికులు ఇరువైపులా ప్రాణాలు కోల్పోయారు. దాంతో ద్వైపాక్షిక సంబంధాలు క్లిష్టంగా మారాయి. ఆ తర్వాత నుంచి కేంద్రంలోని మోదీ సర్కారు చైనా నుంచి దిగుమతులను తగ్గించడంపై దృష్టి సారించింది. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని (పీఎల్ఐ) తీసుకొచ్చింది. ఇప్పటికే 13–14 రంగాలకు దీన్ని అమలు చేస్తోంది. తద్వారా ఆయా ఉత్పత్తుల తయారీని స్థానికంగానే పెంచుకుని, ప్రపంచానికి ఎగుమతి కేంద్రంగా మార్చాలన్నది కేంద్ర సర్కారు ప్రణాళిక. ఇది ఆచరణ రూపం దాలిస్తే చైనాపై ఆధారపడడం తగ్గుతుంది. -
బంగారానికి ‘ద్రవ్యోల్బణం’ భరోసా
ముంబై: ద్రవ్యోల్బణం భయాలు, డాలర్ ఇండెక్స్ బలోపేతం వంటి అంశాల నేపథ్యంలో బంగారం ధర మళ్లీ రికార్డు స్థాయిల వైపు నడుస్తోంది. అమెరికా, చైనా, భారత్‌వంటి దేశాల్లో ద్రవ్యోల్బణం భయాలు తీవ్రమవుతున్నాయి. దీనితో పెట్టుబడులకు సురక్షిత సాధనంగా ఇన్వెస్టర్లు తక్షణం పడిడివైపు చూస్తున్న పరిస్థితి కనబడుతోంది. అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్– నైమెక్స్‌లో ఔన్స్ (31.1గ్రా) ధర 1,900 డాలర్ల దిశగా కదులుతోంది. ఈ వార్త రాస్తున్న 11 గంటల సమయంలో బుధవారం ముగింపుతో పోల్చితే ఔన్స్ 20 డాలర్ల లాభంతో 1,865 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. దేశీయంగా ధర అంతర్జాతీయ సరళిని అనుసరిస్తోంది. అంతర్జాతీయంగా బులిష్ ధోరణితోపాటు రూపాయి బలహీనత కూడా దేశంలో బంగారానికి వరంగా మారుతోంది. దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్ (ఎంసీఎక్స్)లో ధర 10 గ్రాములకు రూ. 400 లాభంతో 49,250 వద్ద ట్రేడవుతోంది. ఇక దేశంలో ప్రధాన స్పాట్ మార్కెట్ ముంబైలో ధర క్రితంతో పోల్చితే 99.9 స్వచ్చత 10 గ్రాముల ధర రూ.980 లాభంతో రూ.49,351 వద్ద ముగిసింది. 99.5 స్వచ్చత ధర రూ.976 పెరిగి రూ.49,153 వద్దకు చేరింది. కేజీ వెండి ధర రూ.1,814 పెరిగి రూ.66,594 వద్ద ముగిసింది. ఢిల్లీ స్పాట్ మార్కెట్లో పసిడి కూడా ధర రూ.883 పెరిగి రూ.48,218 వద్ద ముగిసింది. వెండి కేజీ ధర రూ.1,890 ఎగసి రూ.65,190కి చేరింది. -
ఏపీ: ఖరీఫ్ జోరు.. అన్నదాత హుషారు
సాక్షి, అమరావతి: ఖరీఫ్ సాగు జోరందుకోవడంతో పల్లెలు పచ్చదనాన్ని సింగారించుకుంటున్నాయి. సీజన్‌కు ఆరంభానికి ముందే వైఎస్సార్ రైతు భరోసా (పెట్టుబడి సాయం) అందడం.. ఆర్బీకేల ద్వారా నాణ్యమైన సబ్సిడీ, నాన్ సబ్సిడీ విత్తనాలు సరఫరా చేయడం.. అవసరమైనన్ని ఎరువులు, పురుగుల మందుల నిల్వల్ని అందుబాటులో ఉంచడం.. ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడంతో రైతులు రెట్టించిన ఉత్సాహంతో సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. గడచిన రెండేళ్ల ఖరీఫ్ రికార్డులను తిరగరాసే దిశగా దూసుకెళ్తున్నారు. రూ.3,829 కోట్ల పెట్టుబడి సాయం సీజన్‌కు ముందుగానే వైఎస్సార్ రైతు భరోసా కింద 54 లక్షల మంది రైతులకు తొలి విడతగా ఒక్కొక్కరికీ రూ.7,500 చొప్పున రూ.3,829 కోట్ల పెట్టుబడి సాయమందించిన రాష్ట్ర ప్రభుత్వం సాగులోæ అన్నివిధాల అండగా నిలుస్తోంది. రైతు భరోసా కేంద్రాల ద్వారా 7.49 లక్షల క్వింటాళ్ల సబ్సిడీ విత్తనాలు రైతులకు అందాయి. వీటిలో 45,412 ప్యాకెట్ల మిరప, 28,144 క్వింటాళ్ల మొక్కజొన్న, పత్తి విత్తనాలు ఉన్నాయి. 5.80 లక్షల టన్నుల ఎరువులు, 10 టన్నుల పురుగుల మందులను సైతం రైతులకు ఇప్పటికే పంపిణీ చేశారు. రికార్డు తిరగరాసే దిశగా.. ఖరీఫ్ చరిత్రలో రికార్డు స్థాయిలో 2019లో 90.38 లక్షల ఎకరాల్లో, 2020లో 90.20 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. 2021 ఖరీఫ్‌లో 95.35 లక్షల ఎకరాల్లో వివిధ పంటల్ని సాగు చేయించాలని వ్యవసాయ శాఖ లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఆరంభంలో కాస్త ఆచితూచి అడుగులేసిన అన్నదాతలు పరిస్థితులు ఆశాజనకంగా ఉండటంతో ఇప్పుడు సాగు జోరు పెంచారు. ఇప్పటికే 42.8 లక్షల (46శాతం)ఎకరాల్లో వివిధ పంటలకు సంబంధించి నాట్లు పూర్తయ్యాయి. ఈ ఏడాది 39.97 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయించాలని లక్ష్యంగా నిర్దేశించగా, ఇప్పటివరకు 16.33 లక్షల (43శాతం) ఎకరాల్లో వరి నాట్లు పూర్తయ్యాయి. గడచిన రెండేళ్లతో పోల్చుకుంటే ఈ ఏడాది వరి ఎక్కువ విస్తీర్ణంలో సాగవుతోంది. ఇదే సమయానికి 2019లో 15.82 లక్షల ఎకరాలు, 2020లో 16.20 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పడ్డాయి. ఇప్పటివరకు 10.83 లక్షల ఎకరాల్లో నూనె గింజలు, 8.9 లక్షల ఎకరాల్లో పత్తి, 2.6 లక్షల ఎకరాల్లో అపరాల నాట్లు పూర్తయ్యాయి. ప్రోత్సాహం బాగుంది ఖరీఫ్‌లో 15 ఎకరాలు కౌలుకు తీసుకుని వరి సాగు చేస్తున్నా. తొలిసారి మా గ్రామంలోని ఆర్బీకే ద్వారా విత్తనాలు, ఎరువులు తీసుకున్నాను. వాతావరణం అనుకూలంగా ఉండటంతో నాట్లు పూర్తయ్యాయి. – గుంజా బసవయ్య, రైతు, కానూరు, కృష్ణా జిల్లా లక్ష్యం దిశగా ఖరీఫ్ సాగు లక్ష్యం దిశగా ఖరీఫ్ సాగు జరుగుతోంది. రైతులకు అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా నిలుస్తోంది. రైతు భరోసా యాత్రలు సత్ఫలితాలనిచ్చాయి. సిఫార్సు చేసిన పంటలను సాగు చేసేవిధంగా రైతుల్లో అవగాహన కల్పించాం. గడచిన రెండేళ్ల కంటే మిన్నగా ఈ ఏడాది ఖరీఫ్ సాగవుతుందని అంచనా వేస్తున్నాం. – హెచ్.అరుణ్‌కుమార్, కమిషనర్, వ్యవసాయ శాఖ -
ఎఫ్ఎంసీజీ అమ్మకాల్లో ఆన్లైన్ జోరు!
న్యూఢిల్లీ: దేశీయ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) కంపెనీలు రూటు మార్చేశాయి. కొనుగోలుదారులు ఈ–కామర్స్ బాటపట్టడంతో ఎఫ్ఎంసీజీలు కూడా అదే బాటపట్టాయి. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌తో మొదలైన ఎఫ్ఎంసీజీల ఈ–కామర్స్ సేల్స్ క్రమంగా పెరుగుతున్నాయి. ఆయా కంపెనీల మొత్తం అమ్మకాల్లో ఆన్లైన్ వాటా 2–8 శాతం వరకున్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ త్రైమాసికంలో ఎఫ్ఎంసీజీ కంపెనీల ఆన్లైన్ అమ్మకాలు రికార్డ్ స్థాయిలో జరిగాయి. 2020లో 3 బిలియన్ డాలర్లుగా ఉన్న దేశీయ ఈ–గ్రాసరీ మార్కెట్ 2024 నాటికి 18.2 బిలియన్ డాలర్లకు చేరుతుందని రెడ్‌సీర్, బిగ్‌బాస్కెట్ నివేదిక అంచనా వేసింది. ప్రముఖ ఎఫ్ఎంసీజీ కంపెనీలైన నెస్లే, హిందుస్తాన్ యూనిలివర్, పార్లే ప్రొడక్ట్స్, అమూల్, మారికో వంటి సంస్థల ఆన్లైన్ అమ్మకాలు క్యూ2లో అధిక స్థాయిలో జరిగాయి. దేశవ్యాప్తంగా లాక్డౌన్ ఆంక్షలు ఎత్తేసినా సరే కొనుగోలుదారులు ఈ–కామర్స్ కొనుగోళ్ల మీదే మక్కువ చూపించడమే ఈ వృద్ధికి కారణం. గతేడాది హెచ్‌యూఎల్ మొత్తం అమ్మకాల్లో 3 శాతంగా ఉన్న ఆన్లైన్ అమ్మకాలు ఈ ఏడాది క్యూ2 నాటికి 6 శాతానికి పెరిగింది. నెస్లే కంపెనీ ఈ–కామర్స్ సేల్స్ కూడా సెప్టెంబర్ నాటికి రెట్టింపయింది. ‘గతేడాదితో పోలిస్తే నెస్లే ఆన్లైన్ సేల్స్‌లో 97 శాతం వృద్ధిని నమోదు చేసింది. ప్రస్తుతం మొత్తం అమ్మకాల్లో ఈ–కామర్స్ వాటా 4 శాతంగా ఉందని’’ నెస్లే చైర్మన్ సురేష్ నారాయనన్ తెలిపారు. ప్యాకేజ్ ఫుడ్స్‌కు డిమాండ్.. కొనుగోలుదారులు ఇంట్లో ఉంటూ ప్యాకేజ్డ్ ఫుడ్స్‌ను ఎక్కువగా ఆర్డర్ చేస్తున్నారు. అందుకే మ్యాగీ నూడుల్స్, మంచ్, కిట్‌క్యాట్ చాక్లెట్స్ అమ్మకాలు రెండంకెల వృద్ధిని నమోదు చేశాయి. లాక్డౌన్ సమయంలో ఈ–గ్రాసరీ షాపింగ్ జోరుగా సాగింది. లాక్డౌన్ ఆంక్షలు ఎత్తేసినా సరే ఈ–కామర్స్‌దే హవా నడుస్తుంది. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల నుంచి ఈ–కామర్స్ అమ్మకాలు ఎక్కువగా జరుగుతున్నాయని, తొలిసారి ఆన్లైన్ కొనుగోలుదారులు ఎక్కువగా గ్రాసరీలను కొంటున్నారని పార్లే ప్రొడక్ట్స్ సీనియర్ కేటగిరీ హెడ్ మయాంక్ షా తెలిపారు. గతేడాది 2.3 శాతంగా ఉన్న ఐటీసీ కంపెనీ ఆన్లైన్ అమ్మకాలు గత 12 నెలల్లో 4.2 శాతానికి పెరిగింది. ఐటీసీ ఉత్పత్తులైన సన్‌ఫీస్ట్ బిస్కెట్లు, ఆశీర్వాద్ పిండి ఆన్లైన్ అమ్మకాలు జోరందుకున్నాయి. ఏడాదిక్రితం డాబర్ అమ్మకాల్లో 1.5 శాతంగా ఉన్న ఆన్‌ౖ లెన్ సేల్స్ వాటా ప్రస్తుతం 6 శాతానికి పెరిగింది. 2–8 శాతం ఆన్లైన్ వాటా.. దేశంలోని అన్ని ఎఫ్ఎంసీజీ కంపెనీల అమ్మకాల్లో ఆన్లైన్ వాటా కనీసం 2–8 శాతం మధ్య ఉన్నాయి. ఈ–కామర్స్ వృద్ధిలో ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల నుంచి ఎక్కువగా జరుగుతున్నాయి. లక్షలాది స్థానిక కిరాణా స్టోర్లు కూడా ఆన్లైన్లో ఉత్పత్తులను విక్రయిస్తున్నాయి. గ్రాసరీ మార్కెట్లో ఆన్లైన్ వాటా 0.5 శాతంగా మాత్రమే ఉంది. ఆరు నెలల వ్యవధిలో అమూల్ డెయిరీ ఉత్పత్తుల అమ్మకాలు 3 శాతం నుంచి 7–8 శాతానికి పెరిగిందని కంపెనీ ఎండీ ఆర్ఎస్ సోధి తెలిపారు. రాబోయే కాలంలో మరింత వృద్ధి కనబరుస్తుందని పేర్కొన్నారు. ఈ–కామర్స్ అమ్మకాలు దీర్ఘకాలిక వృద్ధిని నమోదు చేస్తాయని మారికో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సంజయ్ మిశ్రా తెలిపారు. మారికో ఉత్పత్తులైన పారాచ్యూట్ హెయిర్ ఆయిల్, సఫోలా ఓట్స్ ఉత్పత్తులు సెప్టెంబర్ త్రైమాసికంలో 39 శాతం వృద్ధిని నమోదు చేశాయి. కంపెనీ మొత్తం టర్నోవర్‌లో ఆన్లైన్ వాటా 8 శాతంగా ఉంది. -
10 లక్షలకు చేరువలో..
న్యూఢిల్లీ: కరోనా వైరస్ గుప్పిట్లో చిక్కుకొని భారత్ విలవిలలాడుతోంది. రోజు రోజుకి కేసుల సంఖ్య పెరిగిపోతూ ఉండడంతో శరవేగంగా 10 లక్షలకు చేరువలో నిలిచి భయపెడుతోంది. ఒకే రోజు రికార్డు స్థాయిలో ఏకంగా 32,695 కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 9,68,876కి చేరుకుందని గురువారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక 24 గంటల్లో 606 మంది ప్రాణాలు కోల్పోవడంతో మృతుల సంఖ్య 24,915కి చేరుకుంది. కేసుల ఉధృతి ఎంత పెరుగుతున్నా రికవరీ రేటు 63.25%గా ఉండడం ఊరటనిస్తోంది. ఇప్పటివరకు 6,12,814 మంది వైరస్ నుంచి కోలుకుంటే యాక్టివ్ కేసులు 3,31,146గా ఉన్నాయి. 130 కోట్ల జనాభా ఉన్న దేశంలో కరోనాని బాగానే కట్టడి చేస్తున్నామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ అన్నారు. రికవరీ రేటు 63.25శాతంగా ఉండడం సామాన్యమైన విషయం కాదన్నారు. మృతుల రేటు కూడా ఇతర దేశాలతో పోల్చి చూస్తే చాలా తక్కువగా 2.75%గా ఉందని చెప్పారు. వైద్య సిబ్బందిలో భయం భయం రోగులకు చికిత్స అందించాల్సిన వైద్యులే కోవిడ్ బారిన పడుతూ ఉండడం ప్రమాదఘంటికలు మోగిస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనాతో 99 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారు. మరో 1300 మంది వైరస్ బారినపడ్డారు. దీంతో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రెడ్ అలెర్ట్ ప్రకటించింది. వైద్య సిబ్బంది మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. క్వారంటైన్లోకి సీఎం, డిప్యూటీ సీఎం కోహిమా: నాగాలాండ్ ముఖ్యమంత్రి నీఫియూ రియో, డిప్యూటీ సీఎం వై.పట్టోన్తోపాటు నలుగురు మంత్రులు క్వారంటైన్లోకి వెళ్లిపోయారు. అధికార సమావేశాల నిమిత్తం ఢిల్లీ వెళ్లి వచ్చిన వెంటనే వీరు పరీక్షలు చేయించుకోగా కరోనా నెగెటివ్ అని తేలింది. అయిన్పటికీ, ముందు జాగ్రత్తగా క్వారంటైన్లో గడపనున్నాననీ, అధికారిక విధులు కొనసాగిస్తానని సీఎం తెలిపారు. మార్చి 2021నాటికి 6 కోట్ల మందికి ? కరోనా కేసుల తీవ్రతపై ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (ఐఐఎస్సీ) కొన్ని అంచనాలు విడుదల చేసింది. వచ్చే ఏడాది మార్చి నాటికి దేశంలో కనీసం 37.4 లక్షల కేసులు నమోదవుతాయని, అదే వైరస్ అడ్డూ అదుçపూ లేకుండా విస్తరిస్తే 6.18 కోట్ల వరకు కేసులు నమోదయ్యే అవకాశాలున్నాయని తెలిపింది. మార్చి 23 నుంచి జూన్ 18 వరకు దేశంలో కరోనా వైరస్ విస్తరణ, రెట్టింపు అవడానికి పట్టే రోజులు, వివిధ రాష్ట్రాలకి పాకుతున్న తీరుతెన్నులు వంటివి పరిగణనలోకి తీసుకొని ఈ అంచనాలు వేసింది. సెప్టెంబర్ రెండోవారం లేదంటే అక్టోబర్ మొదటివారంలో కరోనా కేసులు అత్యధిక స్థాయికి చేరుకుంటాయని ఆ సంస్థ తెలిపింది. వారంలో మూడు రోజులు దేశవ్యాప్త లాక్డౌన్ అమలుతో కరోనాని కట్టడి చేయవచ్చునని పేర్కొంది. కర్ణాటకను దేవుడే రక్షించాలి –మంత్రి బి.శ్రీరాములు వ్యాఖ్య కర్ణాటకలో కరోనా వ్యాప్తిని కట్టడి చేయడంలో ప్రజా సహకారం చాలా ముఖ్యమని, వైరస్ వ్యాప్తి నుంచి రాష్ట్రాన్ని ఆ దేవుడే కాపాడగలడని ఆరోగ్య శాఖ మంత్రి బి.శ్రీరాములు అన్నారు. కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలమైందంటూ ప్రతిపక్ష కాంగ్రెస్ చేసిన ఆరోపణలపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అనంతరం తన మాటలను ఒక వర్గం మీడియా వక్రీకరించిందని శ్రీరాములు విమర్శించారు. -
దేశంలో 500 కోవిడ్ మరణాలు
న్యూఢిల్లీ: ఇండియాలో రికార్డు స్థాయిలో కరోనా కొత్త కేసులు బయటపడ్డాయి. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు 28,701 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 500 మంది కరోనా బాధితులు కన్నుమూశారు. ఇప్పటివరకు మొత్తం కేసులు 8,78,254కు, మరణాలు 23,174కు చేరుకున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం ప్రకటించింది. మొత్తం బాధితుల్లో 5,53,470 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 3,01,609 మంది చికిత్స పొందుతున్నారు. అంటే 63.01 శాతం మంది కోలుకున్నట్లు స్పష్టమవుతోంది. కరోనా నిర్ధారణ పరీక్షల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా 1,18,06,256 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. 19 రాష్ట్రాల్లో అధిక రికవరీ రేటు దేశంలో కరోనా రికవరీ రేటు ప్రస్తుతం63.02 కాగా, 19 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇది జాతీయ సగటు కంటే అధికంగా నమోదైనట్లు ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. కరోనా మరణాల శాతం 2.64 కాగా, 30 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో జాతీయ సగటు కంటే తక్కువగానే ఉందని పేర్కొంది. తెలంగాణలో రికవరీ రేటు 64.84 శాతమని వెల్లడించింది. ఫవిపిరవిర్ ధర 27% తగ్గింపు కోవిడ్ చికిత్సలో వాడే యాంటీ వైరల్ డ్రగ్ ‘ఫవిపిరవిర్’ మాత్రల ధరను 27 శాతం తగ్గించినట్లు గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్ తెలిపింది. ఒక్కో మాత్ర ఖరీదు రూ.103 కాగా, ఇకపై రూ.75కు అమ్ముతారు. మాత్రలు ఫాబీఫ్లూ అనే బ్రాండ్ నేమ్‌తో లభ్యమవుతున్నాయి. వీటిని గత నెలలోనే అందుబాటులోకి తీసుకొచ్చారు. ఫవిపిరవిర్‌ను ఇప్పుడు భారత్‌లోనే తయారు చేస్తున్నామని, అందుకే ఖర్చు తగ్గిందని, ఆ ప్రయోజనాన్ని కరోనా బాధితులకు బదిలీ చేస్తున్నామని గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్ వెల్లడించింది. -
లాటిన్ అమెరికాలో పెరుగుతున్న కరోనా కేసులు
బెర్లిన్: లాటిన్ అమెరికాలో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఆ దేశాల్లో ప్రభుత్వాల నిర్లక్ష్యమే కేసుల్ని పెంచేస్తోంది. బ్రెజిల్, మెక్సికోలో ప్రతిరోజూ రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. లాక్‌డౌన్‌ను సరిగ్గా అమలు చేయకపోవడంతో తీవ్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. లాటిన్ అమెరికాలో ఇప్పటిదాకా ఆరు లక్షల కేసులు నమోదయ్యాయి. 30వేల మందికిపైగా మరణించారు. చిలీ, పెరూ, ఈక్వెడార్‌లో కరోనా రోగులతో ఆస్పత్రులు కిటకిటలాడిపోతున్నాయి. ఇక చైనాలో శనివారం ఒక్క కేసు కూడా నమోదుకాలేదు. ముందస్తుగా లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేసిన జర్మనీలో మళ్లీ కేసుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా చర్చిలు, రెస్టారెంట్లు ప్రారంభించాక వైరస్ వ్యాప్తి పెరిగింది. ఎన్నో రకాలుగా భౌతిక దూరం నిబంధనల్ని అమలు చేసినప్పటికీ ఎక్కువగా కేసులు పెరుగుతున్నాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. -
దేశంలో రికార్డు స్థాయిలో నమోదైన కరోనా కేసులు
-
ఒక్కరోజులో 1,752 పాజిటివ్
సాక్షి, న్యూఢిల్లీ/కోజికోడ్: దేశంలో కరోనా కల్లోలానికి కళ్లెం పడడం లేదు. గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం సాయంత్రం వరకు ఒక్కరోజులో 37 మంది కరోనాతో మృతిచెందారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. కొత్తగా రికార్డు స్థాయిలో 1,752 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 23,452కు, మొత్తం మరణాల సంఖ్య 723కు చేరుకుంది. యాక్టివ్ కరోనా కేసులు 17,915 కాగా, 4,813 మంది బాధితులు కోలుకున్నారు. మొత్తం పాజిటివ్ కేసుల్లో 20.52 శాతం మంది కోలుకున్నారని ఆరోగ్యశాఖ వెల్లడించింది. కేరళలో 4 నెలల చిన్నారి బలి కరోనా మహమ్మారి కేరళలో 4 నెలల పసికందును పొట్టన పెట్టుకుంది. మలప్పురం జిల్లాలోని పయనాడ్కు చెందిన ఈ పాప జ్వరం, దగ్గు, శ్వాస సమస్యలతో ఇబ్బంది పడుతుండడంతో ఈ నెల 21న కోజికోడ్‌లోని మెడికల్ కాలేజీ హాస్పిటల్లో చేర్చారు. పరీక్షించగా కరోనా పాజిటివ్‌గా తేలింది. అంతే కాకుండా ఈ చిన్నారి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. చికిత్స పొందు తూ శుక్రవారం ఉదయం మృతి చెందింది. కేరళలో మూడో కరోనా సంబంధిత మరణం ఈ పాపదే. రాష్ట్రంలో కరోనాతో మృతిచెందిన తొలి చిన్నారి ఈమె. ఆజాద్‌పూర్ మండీలో 300 దుకాణాలు మూసివేత ఆసియాలోనే అతిపెద్దదైన ఢిల్లీలోని ఆజాద్‌పూర్ మండీలోని డి–బ్లాక్‌లో 300 దుకాణాలను మూసివేశారు. ఈ మండీలో ఒక వ్యాపారి (57) ఏప్రిల్ 21న కరోనా వైరస్ సోకి మరణించాడు. బుధవారం మార్కెట్లో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదుకావడంతో దుకాణాలు మూసివేయాలని నిర్ణయించారు. -
బంగారం ధరలు పైపైకి
సాక్షి, ముంబై: దేశ వ్యాప్తంగా 21 రోజుల లాక్డౌన్ కారణంగా ఫిజికల్ కొనుగోళ్లు పడిపోయినప్పటికీ బంగారం ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. భారతదేశంలో బంగారం ధరలు ఫ్యూచర్ మార్కెట్లలో రికార్డు స్థాయిని తాకాయి. సోమవారం ఒక శాతానికిపైగా పుంజుకుని రికార్డును స్థాయికి చేరాయి. ఎంసీఎక్స్ లో జూన్ పసిడి ఫ్యూచర్స్ 10 గ్రాములకు 45,800కు చేరుకుంది. మరో విలువైన మెటల్ వెండి కూడా ఇదే బాటలో వుంది. మే నెల వెండి ఫ్యూచర్స్ కిలోకు 0.4 శాతం పెరిగి 43,670కు చేరుకుంది. బంగారం ధరలు పెరిగే అవకాశం ఎక్కువ కనిపిస్తోందని, మొత్తం ధోరణి సానుకూలంగా ఉందని ఎస్ఎంసి గ్లోబల్ ఒక నోట్లో పేర్కొంది. బంగారానికి పది గ్రాముల ధర రూ. 45 వేల దగ్గర, వెండి కిలో ధర 42,500 రూపాయల వద్ద గట్టి మద్దతు వుందని తెలిపింది. గ్లోబల్ మార్కెట్లలో, ఈ రోజు బంగారం రేట్లు ఫ్లాట్ గా ఉన్నప్పటికీ ఒక నెల గరిష్ట స్థాయి వద్ద స్థిరంగా ఉన్నాయి. కోవిడ్-19 (కరోనా వైరస్) వ్యాప్తి నేపథ్యంలో గత వారం యుఎస్ ఫెడరల్ రిజర్వ్ ప్రకటించిన, తాజా ఉద్దీపన చర్యల మధ్య ఆర్థిక వ్యవస్థపై ఆందోళనలు, బంగారానికి మద్దతు ఇస్తున్నాయని నిపుణుల అంచనా. స్పాట్ బంగారం ఔన్సు1,687 డాలర్లుగా వుంది. ఇతర విలువైన లోహాలలో, వెండి 0.5శాతం పెరిగి 15.40 డాలర్ల వద్ద,, ప్లాటినం 0.3శాతం క్షీణించి 745.74 డాలర్లకు చేరుకుంది. (కరోనా : రిలయన్స్ శాస్త్రవేత్తల ముందడుగు) భారతదేశంలో,మూడు వారాల లాక్ డౌన కారణంగా బంగారం భౌతిక కొనుగోళ్లు నిలిచిపోయాయి. అంతేకాదు లాక్ డౌన్ పొడిగింపుపై అనిశ్చితి కారణంగా జ్యువెలర్స్ మే డెలివరీకి కూడా ఆర్డర్లు ఇవ్వడం లేదని ముంబైకి చెందిన డీలర్‌ను ఉటంకిస్తూ రాయిటర్స్ తెలిపింది. రికార్డు ధరలు, లాక్ డౌన్ కారణంగామార్చిలో భారత బంగారు దిగుమతులు సంవత్సరానికి 73శాతం పడిపోయిన సంగతి తెలిసిందే. (కరోనా : ఆరు నెలల్లో తొలి వ్యాక్సిన్ సిద్ధం) చదవండి : కరోనా : ఎగతాళి చేసిన టిక్‌టాక్ స్టార్ కు పాజిటివ్ -
47.8 డిగ్రీలు
సాక్షి, హైదరాబాద్: రోహిణీ కార్తెలో రోళ్లు పగిలే ఎండలు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటం, గాలిలో తేమ శాతం పెద్ద ఎత్తున పడిపోతుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. రాష్ట్రంలోని 20 ప్రాంతాల్లో ఆదివారం 47 డిగ్రీలు కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడం, నిజామాబాద్‌లో 17, హైదరాబాద్‌లో 20 శాతానికి గాలిలో తేమ శాతం పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ 20 గ్రామాల్లో వాతావరణ శాఖ ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. మంచిర్యాల జిల్లా వేమన్‌పల్లి మండలం నీల్వాయి గ్రామంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 47.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయిందని ప్లానింగ్ డెవలప్మెంట్ సొసైటీ వెల్లడించింది. జగిత్యాల మండిపోతోంది... రాష్ట్రంలో ఆదివారం నమోదైన ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే జగిత్యాల జిల్లాలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన 20 గ్రామాల్లో 9 గ్రామాలు ఈ జిల్లాలోనే ఉండటం గమనార్హం. «జిల్లాలోని దర్మపురి, వెలగటూరు, బీర్పూరు, జగిత్యాల రూరల్, సారంగపూర్, ఇబ్రహీంపట్నం, మెట్పల్లి మండలాల్లో సూర్యప్రతాపం ఎక్కువగా కనిపించింది. ఈ జిల్లాలోని నాలుగు గ్రామాల్లో 47.5 నుంచి 47.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయంటే అక్కడ ఎండలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, మహబూబాబాద్, కరీంనగర్, సూర్యాపేట జిల్లాల్లోని పలు గ్రామాల్లో ఎండలు 47 డిగ్రీలు దాటిపోయాయి. తేమ తగ్గుతోంది... మండే ఎండలకు తోడు గాలిలో తేమ శాతం కూడా పడిపోతుండటంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఆదివారం నిజామాబాద్ జిల్లాలో గాలిలో తేమ శాతం 17 శాతానికి పడిపోయింది. హైదరాబాద్‌లో 20, ఆదిలాబాద్‌లో 22, రామగుండంలో 27, ఖమ్మం, మహబూబ్‌నగర్‌లో 28 శాతానికి పడిపోయింది. దీంతో ఆయా ప్రాంతాల్లో ఎండకు బయటికి వచ్చిన వారికి చుక్కలు కనిపిస్తున్నాయి. కాసేపు ఎండలో ఉంటేనే తీవ్ర తాపానికి గురవుతుండటం గమనార్హం. అయితే, మరో 3 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెపుతున్నారు. మండే ఎండలు, వడగాడ్పులు, తేమ శాతం వాతావరణంలో తక్కువ కావడం కొనసాగుతాయని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అమ్మో..యూవీ సెగ! ►ప్రమాదకరస్థాయిలో అతినీలలోహిత వికిరణ(యూవీ) ఇండెక్స్ ►12 పాయింట్ల గరిష్టానికి చేరుకున్న వైనం ప్రచండ భానుడి ‘వికిరణ’ తీవ్రతకు గ్రేటర్‌వాసులు హడలిపోతున్నారు. మహానగరంలో ఇప్పుడు అతినీలలోహిత వికిరణం (అల్ట్రావయొలెట్ రేడియేషన్–యూవీ) తీవ్రత గరిష్టంగా ‘12’పాయింట్లకు (పూర్తిస్థాయి గరిష్టం) చేరుకుంది. సెగ.. భగలతో హైదరాబాద్ నగరవాసులు విలవిల్లాడుతున్నారు. సాధారణంగా మే నెలలో యూవీ సూచి 10 పాయింట్లకు మించరాదు. కానీ ఈసారి 12 మార్కుకు చేరుకుంది. ఈ ట్రెండ్ మరో నాలుగు రోజుల పాటు ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. గ్రేటర్ విస్తీర్ణంలో హరితం శాతం 8 శాతానికే పరిమితం కావడం, ఊపిరి సలపని రీతిలో నిర్మించిన బహుళ అంతస్తుల కాంక్రీట్, గాజు మేడల నుంచి ఉష్ణం వాతావరణంలో తేలికగా కలవకుండా భూఉపరితల వాతావరణానికే పరిమితం కావడంతో నగరంలో వికిరణ తీవ్రత పెరిగింది. యూవీ సెగ..భగలతో అవస్థలివీ... ►అతినీలలోహిత వికిరణ తీవ్రత(యూవీ ఇండెక్స్)పెరగడంతో ఓజోన్ పొర మందం తగ్గి ప్రచండ భానుడి నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాలు నేరుగా భూ వాతావరణంలోకి చేరుకుంటున్నాయి. ►ఈ కిరణాలు నేరుగా భూ వాతావరణంలోకి చేరడంతోపాటు మనుషులపై పడుతుండటంతో కళ్లు, చర్మ సంబంధ వ్యాధులు ప్రబలుతాయి. ►అధిక సమయం ఎండలో తిరిగితే కళ్లు, చర్మం మండటం, రెటీనా దెబ్బతినడం వంటి పరిణామాలు తలెత్తుతున్నాయి. ►యూవీ సూచీ సర్వసాధారణంగా 7 పాయింట్లకు పరిమితమైతే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ 12 పాయింట్లు నమోదయితే చర్మం, కళ్లకు ప్రమాదం తథ్యం. ►ఇంటి నుంచి బయటికి వెళ్లే సమయంలో వికిరణ తీవ్రత నుంచి రక్షణ పొందేందుకు సన్‌స్క్రీన్ లోషన్లు రాసుకోవాలని, చలువ కళ్లద్దాలు, క్యాప్ ధరించాలని, ఎండ తీవ్రత నుంచి రక్షణ పొందేందుకు గొడుకు తీసుకెళ్లాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆదివారం నగరంలోని మాదాపూర్‌లో గరిష్టంగా 44.0 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ►దేశంలోని గ్రేటర్ నగరాల్లో హైదరాబాద్‌లోనే అత్యంత తక్కువ గ్రీన్‌బెల్ట్ 8 శాతానికే పరిమితం అయింది. ఇలా చేస్తే మేలు... నగరంలోని ప్రధాన రహదారులు, చెరువుల చుట్టూ పెద్దమొత్తంలో మొక్కలు నాటి గ్రీన్‌బెల్ట్ ఏర్పాటు చేయాలి. తద్వారా భూగర్భ జలమట్టాలు పెరిగి, కాలుష్యం బాగా తగ్గుతుంది. నూతనంగా ఏర్పడిన కాలనీల్లో 30 శాతం గ్రీన్‌బెల్ట్ ఉండేలా చూడాలి. నూతన లే అవుట్లకు అనుమతులిచ్చే సమయంలో ఈ విషయాన్ని తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాలి. వడదెబ్బతో ఎనిమిది మంది మృతి ఖమ్మం: ఎండలకు తాళలేక జనం పిట్టల్లా రాలిపోతున్నారు. సూర్యప్రతాపం నానాటికీ పెరుగుతుండడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వడదెబ్బతో ఆదివారం ఒక్కరోజే ఎనిమిది మంది మృతి చెందారు. దమ్మపేట మండల కేంద్రంలోని అర్బన్‌కాలనీకి చెందిన గుంజి వెంకమ్మ (62), ప్రకాష్‌నగర్ కాలనీకి చెందిన బడుగు నాగశిరోమణి (60), టేకులపల్లి మండలం బేతంపూడి గ్రామానికి చెందిన మేడ మల్లయ్య (70), కామేపల్లి మండల కేంద్రానికి చెందిన మంచాల చిట్టెమ్మ (50), ఖమ్మం రూరల్ మండలం ముత్తగూడెం గ్రామానికి చెందిన ఎస్కే యాకూబ్‌మియా (70), వేంసూరు మండలం దుద్దెపూడి గ్రామానికి చెందిన పర్సా లక్ష్మీనారాయణ (32), జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామానికి చెందిన తోట భిక్షం (70), జవ్వాది లింగమ్మ(81) మృత్యువాత పడ్డారు. ఎండలు అప్.. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. రాష్ట్రంలోని 20 ప్రాంతాల్లో ఆదివారం 47 డిగ్రీలు కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. తేమ డౌన్.. నిజామాబాద్ జిల్లాలో గాలిలో తేమ శాతం 17శాతానికి పడిపోయింది. హైదరాబాద్‌లో 20, ఆదిలాబాద్‌లో 22, రామగుండంలో 27, ఖమ్మం, మహబూబ్‌నగర్‌లో 28 శాతానికి పడిపోయింది. దీంతో ఆయా ప్రాంతాల్లో ఎండకు బయటికి వచ్చిన వారికి చుక్కలు కనిపిస్తున్నాయి. -
లీటరుకు 1,491 కిలోమీటర్లు..
లీటరు డీజిల్‌కు కారు ఎంత మైలేజీ ఇస్తుంది.. మహా అయితే ఓ 30 కిలో మీటర్ల వరకు ఇస్తుంది. కానీ ఈ ఫొటోలో ఉన్న కారు ఎంత ఇస్తుందో తెలుసా..? లీటరు డీజిల్‌కు ఏకంగా 1,491 కిలోమీటర్లు! ఇది రికార్డు స్థాయి అనే చెప్పుకోవచ్చు. దీన్ని నమ్మక తప్పదు.. ఇంతకీ ఈ కారు విశేషాలేంటో తెలుసా..? షెల్ మారథాన్ అనే ఈ కారును ఫోక్స్‌వ్యాగన్ కంపెనీ 1982లో తయారు చేసింది. గంటకు గరిష్టంగా 30 కిలోమీటర్ల వేగంతో మాత్రమే వెళ్తుంది. ఈ కారును ఇటీవల జర్మనీలోని ఎస్సెన్లో జరిగిన క్లాసిక్, ప్రెస్టిజ్ ఆటోమొబైల్స్ టెక్నో క్లాసికా అనే కార్ల ప్రదర్శనలో దీన్ని ప్రదర్శించారు. అక్కడికి వచ్చిన వారందరినీ ఈ కారు ఎంతగానో ఆకట్టుకుంది. -
కొనసాగుతున్న పెట్రో మంట
న్యూఢిల్లీ: పెట్రో ఉత్పత్తుల ధరలు రికార్డు స్థాయిలో కొనసాగుతున్నాయి. విపక్షాలు భారత్ బంద్ నిర్వహించినప్పటికీ ధరల పెరుగుదల ఆగలేదు. డాలర్‌తో రూపాయి మారకం విలువ పడిపోవడంతో దిగుమతుల ధర పెరిగింది. దీంతో సోమవారం పెట్రోల్ ధర లీటర్‌కు 23 పైసలు, డీజిల్ 22 పైసలు పెరిగింది. తాజా మార్పులతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.80.73కు చేరగా.. డీజిల్ ధర రూ.72.83గా ఉంది. కాగా, ప్రస్తుతానికి ధరలను నియంత్రించే అవకాశం లేదని కేంద్రం స్పష్టం చేయడంతో వినియోగదారులపై మరింత భారం తప్పేట్లు లేదు. -
రబీ వరి నాట్లు 120%
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రబీ వరి నాట్లు రికార్డు స్థాయిలో పడ్డాయి. తెలంగాణలో రబీ సీజన్ వరి సాధారణ సాగు విస్తీర్ణం 15.37 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 18.52 లక్షల ఎకరాల్లో నాట్లు పడినట్లు వ్యవసాయశాఖ బుధవారం విడుదల చేసిన నివేదికలో తెలిపింది. గతేడాది ఇదే సమయానికి 17.10 లక్షల ఎకరాల్లో నాట్లుపడడం గమనార్హం. వరితో కలిపి రాష్ట్రంలో ఆహారధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 24.12 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు లక్ష్యానికి మించి 25.82 లక్షల (107%) ఎకరాల్లో సాగు కావడం విశేషం. అందులో శనగ సాధారణ సాగు విస్తీర్ణం 2.37 లక్షల ఎకరాలుకాగా, ఇప్పటివరకు 2.52 లక్షల (106%) ఎకరాల్లో సాగైంది. ఇక వేరుశనగ సాధారణ సాగు విస్తీర్ణం 3.77 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 3.52 లక్షల (93%) ఎకరాల్లో సాగైంది. -
సైబరాబాద్‌లో ‘రికవరి’రికార్డు
⇒ స్వాధీనం చేసుకున్న సొత్తు 74 శాతం ⇒ ఛేదించిన కేసులు 68 శాతం ⇒ కొత్త సంస్కరణలతో ఉత్తమ ఫలితాలు: సీవీ ఆనంద్ సాక్షి, సిటీబ్యూరో: సైబరాబాద్ పోలీసులు రాష్ట్రంలోనే రికార్డు స్థాయిలో చోరీ సొత్తు రికవరీ చేశారు. వరుసగా ఇలా నాలుగేళ్లు రికార్డు సొంతం చేసుకున్న ఘనత వీరికే దక్కింది. నమోదైన కేసుల్లో ఎక్కువ శాతం పరిష్కారం చేసిన ఘనత కూడా వీరికే ఉంది. ఈ ఏడాది 74 శాతం రికవరీ సొత్తు స్వాధీనం చేసుకోగా, 68 శాతం కేసులను పరిష్కరించామని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. మంగళవారం గచ్చిబౌలిలోని కమిషనర్ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇందులో సైబరాబాద్ కమిషనరేట్‌లో నేరాలు-ఘోరాలు, సాధించిన విజయాలపై 2014 వార్షిక నివేదికను విడుదల చేశారు. కమిషనరేట్‌లో ఈ ఏడాది 24,922 కేసులు నమోదవగా, వాటిలో సొత్తు కోసం చేసిన చోరీలు 5343 ఉన్నాయన్నారు. వీటిలో 3620 కేసులు చేధించామన్నారు. చోరీ సొత్తులో రూ.22.76 కోట్లు (74 శాతం) రికవరీ చేసినట్టు ఆయన చెప్పారు. ఎస్ఓటీ, సీసీఎస్ పోలీసుల ప్రత్యేక కృషితో పాటు జోన్ల వారీ టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేయడం, ఠాణాలలో క్రైమ్, శాంతి భద్రతలపై వేర్వేరు ఇన్స్పెక్టర్లను నియమించడం వల్లనే ఇది సాధ్యమైందన్నారు. ఇక శివ ఎన్కౌంటర్ తరువాత సైబరాబాద్‌లో గణననీయమైన స్థాయిలో చైన్ స్నాచింగులు తగ్గాయని ఆనంద్ తెలిపారు. మహిళా భద్రతకు తీసుకున్న చర్యలతో వారిపై దాడులు గతేడాదికంటే తగ్గాయన్నారు. కార్డన్ సెర్చ్ వల్ల మంచి ఫలితాలు వచ్చాయన్నారు. స్నేక్ గ్యాంగ్ నిందితులకు శిక్షలు పడే విధంగా చార్జీషీట్ వేశామని వివరించారు. రాత్రి పోలీసు పెట్రోలింగ్, ఓఆర్ఆర్, హైవేలపై కూడా పెట్రోలింగ్‌లో మార్పులు చేపట్టామన్నారు. ఈ ఏడాది రోడ్డు ప్రమాదాలు, మృతులు, క్షతగ్రాతుల సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. ఈ సమావేశంలో జాయింట్ పోలీసు కమిషనర్ శశిధర్‌రెడ్డి, డీసీపీలు రవివర్మ, ఏఆర్ శ్రీనివాస్, కార్తికేయ, రమా రాజేశ్వరి, రమేష్ నాయుడు, రంగారెడ్డి, అవినాష్ మహంతి, అదనపు డీసీపీలు మద్దిలేటి శ్రీనివాస్, ప్రతాప్‌రెడ్డి, వాసుసేన తదితరులు పాల్గొన్నారు. ఎస్ఓటీ సాధించిన ఘనత ఎస్‌ఓటీలు 2013లో 188 కేసులు చేధించి రూ.5,82,91,255 సొత్తును స్వాధీనం చేసుకోగా ఈ ఏడాది 1084 కేసులను చేధించి రూ.12,30,31,349 సొత్తు స్వాధీనం చేసుకుని రికార్డు సృష్టించింది. ఎస్ఓటీ అదనపు డీసీపీ రామచంద్రారెడ్డి నేతృత్వంలో ఇన్స్పెక్టర్లు పుష్పన్ కుమార్, ఉమేందర్, వెంకట్‌రెడ్డి, గురురాఘవేంద్ర, ఎస్ఐలు ఆంజనేయులు, రాములు, శివలు ఈస్ట్, వెస్ట్ బృందాలుగా ఏర్పడి 179 పేకాట శిబిరాలు, 160 వ్యభిచార కేంద్రాలు, 11 డ్రగ్స్ మాఫియా గ్యాంగ్‌లు, తొమ్మిది సట్టా కేంద్రాలపై దాడులు చేశారు. ఈ ఏడాది పురోగతి ⇒ సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో సీటీపీ, ఎస్ఓటీ, సీఐ సెల్ విభాగాలను ఈస్ట్, వెస్ట్ జోన్లుగా రీ ఆర్గనైజేషన్ చేశారు. ⇒ జోన్ పరిధిలో కొత్తగా జోనల్ టాస్క్‌ఫోర్స్ టీములను ఏర్పాటు చేశారు. క్రైమ్, లా అండ్ ఆర్డర్‌పై సిబ్బంది, రాత్రి గస్తీ, సీసీఎస్, అడ్మిన్ ఎస్ఐ లాంటి అంశాల్లో పురోగతి సాధించారు. ⇒ భూ వివాదాలపై ఎస్ఓపీ, కార్డన్ సెర్చ్, నాకాబందీ, డ్రకంన్ డ్రైవ్‌లు చేపట్టారు. ⇒ ఐటీ కారిడార్‌లో మహిళల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు. ⇒ ప్రాపర్టీ నేరాల్లో రాష్ట్రంలోనే అత్యధికంగా 68 శాతం నేరాలను చేధించారు. 2014లో పెద్ద ఘటనలు ⇒ సిక్ చావుని అల్లర్లలో పోలీసు కాల్పుల్లో ముగ్గురి మృతి. ⇒ కరుడుగట్టిన చైన్ స్నాచర్ శివ ఎన్కౌంటర్. ⇒ నకిలీ నోట్ల ముఠాను పట్టుకునే ప్రయత్నంలో పోలీసులు చేపట్టిన డెకాయి ఆపరేషన్‌లో నిందితుల దాడిలో కానిస్టేబుల్ ఈశ్వర్రావు మృతి. పోలీసు కాల్పుల్లో ముస్తఫా అనే నిందితుడు మృతి. భవిష్యత్తు ప్రణాళిక ఇదీ.. ⇒ ఇంటిగ్రేటెడ్ ఈ-చలాన్ విధానం ⇒ సిటిజన్ కనెక్ట్ యాప్ రూపకల్పన ⇒ సోషల్ మీడియా పోలీసింగ్ ⇒ కోర్టు మానిటరింగ్ విధానం అమలు ⇒ సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్ మెసర్స్ -
రికార్డు స్థాయిలో బెల్లం లావాదేవీలు
* సీజన్లో గరిష్టంగా 32,664 దిమ్మల రాక * కిటకిటలాడిన మార్కెట్ * రైతుల్లో ఉత్సాహం అనకాపల్లి: అనకాపల్లి బెల్లం మార్కెట్లో సోమవారం ఈసీజన్‌కు రికార్డు స్థాయిలో లావాదేవీలు సాగాయి. మార్కెట్‌కు 32664 దిమ్మలొచ్చాయి. ఈ నెల 22న మార్కెట్‌కు 25962 ది మ్మలు రాగా, సోమవారం పెద్ద మొత్తంలో రైతులు తీసుకురావడంతో మా ర్కెట్ కళకళలాడింది. సంక్రాంతి పండగ నేపథ్యంలో రైతులు బెల్లాన్ని పెద్ద ఎత్తున తయారు చేసి మార్కెట్‌కు తరలించడం ఆనవాయితీ. అయితే ధరలు నిరాశజనకంగానే ఉన్నాయి. సీజన్ మొత్తంగా ఈ నెల 19న క్వింటా రూ. 3120లు ధర పలకడంతో రై తుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. అనంతరం ధరల్లో పెరుగుదల ఆశించినంతగా లేదు. సోమవారం మొదటిరకం గరిష్టంగా రూ.2830లకు మాత్ర మే అమ్ముడుపోవడంతో రైతులు ధరల పరంగా నిరాశకు గురయ్యారు. -
అన్నదాతకు అండగా ఉంటాం
బాదేపల్లి వ్యవసాయ మార్కెట్.. రాష్ట్రంలోనే రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు జరిగే వ్యాపారకేంద్రం. ఏటా రూ.300కోట్లకు పైగా ధాన్యం విక్రయాలు జరిగి.. ప్రభుత్వానికి ఏటా రూ.30 కోట్ల ఆదాయం సమకూరుతోంది. ఇంతటి వ్యాపార సముదాయంలో కనీస సౌకర్యాలైన టాయిలెట్లు లేవు. రైతులు భోజనం చేసేందుకు నీడలేదు. ధాన్యాన్ని చూసుకునేందుకు వాచ్మెన్ లేడు. రైతుబంధు పథకం ఉందనే విషయం చాలామంది రైతులకు తెలియదు. కమీషన్ కూడా ఎక్కువగానే లాగుతున్నారు. బుక్కచిట్టీలు వేసి రైతులను నిలువునా మోసం చేస్తున్నారు. ఎన్నో సమస్యలు ఉన్న బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌యార్డును స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చర్లకోల లక్ష్మారెడ్డి ‘సాక్షి’ తరఫున రిపోర్టర్‌గా మారి సమస్యలను తెలుసుకున్నారు. అన్నదాతకు అండగా ఉండి వారి కష్టాలు తీరుస్తానని భరోసా ఇచ్చారు. ఆయన సంభాషణ ఇలా సాగింది.. లకా్ష్మరెడ్డి: ఏం పెద్ద మనిషి.. ఏ ఊరు? మైసయ్య: వేముల నుంచి వచ్చిన..సారూ! లకా్ష్మరెడ్డి: మక్కలు ఎన్ని ఎకరాలు వస్తే.. ఎన్ని సంచులైనయ్ మైసయ్య: ఆరెకరాలు వేస్తే.. 23 పిండి సంచులు అయినవి. ఏం చేద్దాం సారూ..! పెట్టుబడి మీద పడ్డది. ఆరెకరాలకు రూ.40వేల పైనే అయ్యింది. ఇవి అమ్మితే పెట్టుబడి కూడా రాదు. లకా్ష్మరెడ్డి: మీరేం తీసుకొచ్చారన్నా? కృష్ణయ్య: వడ్లు తెల్చిన.. లకా్ష్మరెడ్డి: ఎన్ని ఎకరాలు వేస్తే... ఎన్ని సంచులైనవి? కృష్ణయ్య: రెండెకరాలు వేస్తే... 35 సంచులు అయినవి. ఈ సారి ఏం పాయిదా లేదు. ఒక్క ఎకరంలో కావాల్సిన వడ్లు, రెండు ఎకరాల్లో కూడా పండలేదు. లకా్ష్మరెడ్డి: ఎందుకట్లా? కృష్ణయ్య: ఎందుకేంటి? వానలు పడ్డయా? లేదయే..! గవర్నమెంటోళ్లు కరెంట్ ఇయ్యకపోయిరి. చేను ఎండిపాయే.. కావాలికాసి నీళ్లు పారపెట్టంగా.. ఈ ఇంత పండింది. లకా్ష్మరెడ్డి: ఏం సాయిరెడ్డి బాగున్నావా? ఏం తెచ్చినవ్? సాయిరెడ్డి: వడ్లు తెచ్చిన అన్నా.. లకా్ష్మరెడ్డి: మార్కెట్ల ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? సాయిరెడ్డి: చాన ఇబ్బందులు ఉన్నాయి. ఇంతపెద్ద మార్కెట్ల మరుగుదొడ్లు లేవు. క్యాంటీన్ లేదు. రైతులకు విశ్రాంతి గది లేదు. ధాన్యం విషయానికొస్తే.. మక్కలు తీసుకోకుండా రిటన్ పంపిస్తుండ్రు. మార్కెట్‌కు తీసుకొచ్చిన ధాన్యాన్ని కచ్చితంగా తీసుకోవాలని మీరు ఎన్నిసార్లు చెప్పినా అధికారులు వింటలేరు. కాస్త మీరు గట్టిగ చెప్పాలె. లకా్ష్మరెడ్డి: బాగాలేదని కొంటలేరా ఏంది? సాయిరెడ్డి: బాగలేని వాటిని కూడా సెకండ్‌గ్రేడ్ కింద కొనాలి కదా? ఫస్టు గ్రేడ్ ధాన్యాన్ని తీసుకుంటున్నరు. మిగతావి వదిలేస్తుండ్రు. ఈసారి సరిగా వానలు పడక పంటలే. అంతంతగా పండినయి. దాన్ని కూడా కొనకుండా రిటన్ పంపితే ఎట్ల ఎల్తది మాకు. లకా్ష్మరెడ్డి: సరే సాయిరెడ్డి ఈ విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తా. మీరు చెప్పండి పెద్దాయనా? శేఖర్: ఏం చెప్పమంటవు సారూ..! పంటలు అంతంతనే. ఇప్పుడు మళ్లీ యాసింగి పంట ఏ తమంటే యూరియా దొరుకుతలేదు. మూడు దినాల సంది తిరుగుతున్నా...దొరకక ఉట్టిగనే పోతున్నా. సేట్ల దగ్గరికి పోయినా లేదంటున్నరు. లకా్ష్మరెడ్డి: యూరియా ఇప్పుడు దొరక్కపోవడమేంటి? సరే ఈ విషయాన్ని అడిగి సమస్యను పరిష్కరిస్తా. పెద్దమనిషి మీరు చెప్పండి.. ఎక్కడి నుంచి వచ్చినవు? ఏం తెచ్చిండ్రు? శేఖర్‌రెడ్డి: గొరిట నుంచి వచ్చిన. మక్కలు తెచ్చిన లకా్ష్మరెడ్డి: మాల్ ఫస్టు క్లాస్ ఉంది. ఎన్ని ఎకరాలు వేసినవ్. ఎన్ని సంచులు అయినవి? శేఖర్‌రెడ్డి: ఐదెకరాలు వేసిన. మాల్ మంచిగా ఉందంటే.. ఇంటొళ్లం కష్టపడి, దగ్గరుండి చూసుకుంటే మంచిగా వచ్చింది. లకా్ష్మరెడ్డి: కొనుగోలు చేయలేదా? ఎట్లా? మహ్మద్ యూసఫ్: ఏం లేదు.. కొన్నరు. సారొళ్లను అడిగితే.. దినాం లారీలు రాలేదంటరు. రోజూ ఇట్లే గడిచిపోతుంది. లకా్ష్మరెడ్డి: సరే ఈ విషయాన్ని అధికారులను అడుగుతా? అమ్మా మీరు చెప్పండి ఏం ఇబ్బందులు ఉన్నయి? లక్ష్మమ్మ: ఈ మార్కెట్ల ఆడోళ్లకు చాన ఇబ్బంది ఉంది. బాత్రూంలు లేవు. తెచ్చిన గింజలు అమ్ముడుపోకపోతే.. రాత్రిల్ల ఇక్కడే ఉండాలె. ఈ మార్కెట్ల వాచ్మెన్ కూడా లేడు. ఎట్ల ఉండేది. ఎమ్మెల్యే సారూ.. నాకు తోచింది చెప్పిన ఏమీ అనుకోవు కదా? లకా్ష్మరెడ్డి: చూడమ్మా.. నేను ఇప్పుడు ‘సాక్షి’ రిపోర్టర్‌గా వచ్చిన. మీ సమస్యలు తెలుసుకోవడానికి ఇక్కడి వచ్చిన. నీవు చెప్పినదాంట్లో ఏం తప్పులేదు. నీవు అడిగిన వాటన్నింటికీ కూడా త్వరలో అయితవి. మొన్ననే శంకుస్థాపన చేసినం. త్వరలో పూర్తవుతయి. పెద్దమనిషి.. ఈ మార్కెట్ల రైతు బంధు పథకాన్ని ఉపయోగించుకుంటుండ్రా? తిరుమల్‌రెడ్డి: ఇది వరకు దాంక తెల్వదు. మొన్న మీటింగ్‌లో మీరు చెప్తే విన్నం. గింజలను పెట్టుకొని 75శాతం పైసలు మిత్తి లేకుండా ఇస్తమన్నరు. అట్ల చేస్తే బాగుంటది. ఇంకా ఇక్కడ ఏమైతుందంటే.. మక్కలను మార్క్‌ఫెడ్ వాళ్లు కొంటున్నరు. అయితే మమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టకుండా చూడమనండి. ఈడ సెలక్టు కావాలి. ఆడ సెలక్టు కావాలని మమ్మలను ముప్పు తిప్పలు పెడుతున్నరు. పైసలు కూడా నెల దినాలకు ఇస్తున్నరు. జర తొందర ఇప్పించెటట్లు చేయండి. లకా్ష్మరెడ్డి: ఏమ్మా... ఏమైంది? దేవమ్మ: ఏం సారూ.. ఇక్కడ మమ్మల్ని ఎవరూ పట్టించుకోరు. మారేపల్లి నుంచి నిన్న వడ్లు తీసుకొచ్చిన. ఫస్టు తీసుకుంటమని బేరం చేసిండ్రు. మళ్లీ వచ్చి మేం తీసుకోమని చెప్పి ఉత్తది చేసి పోయిండ్రు. ఎవరు చేసిండ్రు, ఎందుకు వద్దన్నరు? దేవమ్మా: ఇంకెవరు.. గవర్నమెంటోళ్లు. వడ్లు తాలున్నయని వద్దన్నరు. అంటే సోన చేనుకు తెగులు వచ్చి అంతా తాలుపోయింది. మరి తాలు అంటే మా చేతుల పనాసారూ? ఇట్ల వడ్లు తీసుకోకపోతే, రాత్రిళ్ల ఇక్కడ ఉండనింకె సచ్చిపోతున్నం. రైతులకు ఇంత ఇబ్బందా? లకా్ష్మరెడ్డి: సరేనమ్మా.. సెక్రటరీని అడుగుతా? సమస్యను పరిష్కరిస్తా.. ఏం రైతు సంఘం నాయకుడా? చెప్పు ఈ మార్కెట్లో ఎలాంటి సమస్యలున్నాయి? కరకాల కృష్ణారెడ్డి: ఈ మార్కెట్లో పూర్తిగా దోపిడీ జరుగుతుంది. కమీషన్ ఎక్కువ తీసుకుంటరు. బుక్కచిట్టీలు వేసి రైతులను మోసం చేస్తున్నరు. హమాలీలు చాట అని ఇష్టానుసారంగా ధాన్యం తీసుకుంటరు. మళ్లీ చాట కమీషన్ తీసుకుంటరు. ఇక మార్క్‌ఫెడ్ విషయానికొస్తే వాళ్లు పూర్తిగా వ్యాపారులకు కొమ్ముకాస్తున్నరు. ధా న్యాన్ని కమీషన్ ఏజెంట్ల నుంచి తీసుకుంటరు. ఒక వేళ నేరుగా రైతుల నుంచి తీసుకున్నా.. కమీషన్ వేస్తరు. చాలావరకు గతంలో జరిగిన తప్పిదమే జరుగుతుంది. ఇంకొకటి మార్క్‌ఫెడ్ వాళ్లు రైతుల నుంచి వంద సంచి తీసుకుంటే... వ్యాపారులతో కుమ్మక్కు అయి 180 సంచులు అని రాస్తరు. అందులో 80 వరకు కమీషన్ ఏజెంట్లు కలుపుకొని అమ్ముతున్నరు. లకా్ష్మరెడ్డి: మీరంతా హమాలీలా? హమాలీలు: అవును సారూ..! లకా్ష్మరెడ్డి: మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా? చెన్నయ్య: ఇబ్బందులైతే మాకు చాన ఉన్నయి. మాకు ఇప్పటి దాకా లెసైన్స్ కార్డులు ఇయ్యలేదు. లకా్ష్మరెడ్డి: దరఖాస్తు చేసుకున్నా రాలేదా? భుజంగం: అవును సార్.. ఇస్తం అంటున్నరు తప్ప ఇప్పటి దాకా రాలేదు. లకా్ష్మరెడ్డి: మీకు ఇంకా ఏమైనా సమస్యలున్నాయా? యాదయ్య: హమాలీ విషయంలో చాన డోక జ రుగుతుంది. మా అసోసియేషన్ తరఫున కమీష న్ రూ.3 పెట్టుకున్నం. అయితే రైసుమిల్లొళ్లు మాకు పని ఇస్తలేరు. బీహారొళ్లు రూ.2.50కే చేస్తున్నరని వాళ్లకే ఇస్తున్నరు. సేట్లను ఎంత బతిమాలినా మాకు ఇయ్యరు. 50పైసలు సూసుకొని వాళ్లకు ఇస్తున్నరు. మీరైనా వాళ్లకు కాస్త చెప్పండి సార్..! లకా్ష్మరెడ్డి: కమీషన్ ఏజెంట్ల సమస్యలు ఏమైనా ఉన్నాయా? బాలస్వామి: సమస్యలు మాకు ఉన్నయి. మార్క్‌ఫెడ్ వాళ్లు మక్కలు కొంటరు. లారీలోడ్ చేసి పంపుతరు. లారీలో ఒక్కటే ధాన్యం ఉండదు కదా? రెండు, మూడు రకాలు ఉంటది. అందులో ఏ ఒక్కటీ బాగోలేకపోయినా.. అన్నీ వాపస్ వస్తయి. అట్ల చేస్తే రైతులకు చాన ఇబ్బంది అయితది. లకా్ష్మరెడ్డి: కొన్నింట్లో వ్యాపారులు నాసిరకం ధాన్యం కలిపి పంపుతున్నరంట కదా? బాలస్వామి: సేట్లు అట్ల కలిపితే.. వాటిని అధికారులు పట్టుకోవాలి. వారిపై జరిమానా విధించాలి. అలా చేస్తే మేము మీ వెంట ఉంటం. సార్.. మీకొక విషయం చెప్పాలి. కర్ణాటకలో రైతులు తీసుకొచ్చే ధాన్యానికి మార్కెట్లో దడవాయి, కమీషన్ లేదు. కేవలం లేబర్ ఖర్చులు మాత్రమే తీసుకొని పేమెంట్ ఇచ్చేస్తరు. అట్ల మన దగ్గర కూడా చేస్తే రైతులకు చాన మేలు అయితది. లకా్ష్మరెడ్డి: సరే.. మీ చెప్పిన విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా... మార్కెట్ సెక్రటరీ ఎక్కడున్నారు? అనంతయ్య: సార్.. ఇక్కడే ఉన్నాను. లకా్ష్మరెడ్డి: ఏం సెక్రటరీ గారు.. మార్కెట్లో చాన సమస్యలున్నాయి. మీరు పట్టించుకోవడం లేదా? అనంతయ్య: టాయిలెట్లు, విశ్రాంతి గది తదితర సమస్యలపై మీ ద్వారా ప్రపోజల్స్ పంపిం చినం. అవన్నీ కూడా మంజూరయ్యాయి. పది రోజుల్లో టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తాం. లకా్ష్మరెడ్డి: మార్కెట్లో రైతుబంధు పథకం ఎందుకు అమలు కావడంలేదు? అనంతయ్య: నిజమే సార్.. ఈ పథకం విషయం లో కాస్త సమస్యలు ఉన్నాయి. గోదాములు మొత్తం కూడా మార్క్‌ఫెడ్, నాఫెడ్ వాళ్లకు ఇవ్వడం జరిగింది. దాని వల్ల ఇబ్బంది కలుగుతుంది. అయితే ఒక వేళ రైతులు ముందుకు వస్తే ప్రైవేట్‌గానైనా ఏర్పాటు చేస్తాం. లకా్ష్మరెడ్డి: ధాన్యం కూడా రోజుల తరబడి ఎందుకు నిల్వ ఉంచుతున్నారు. కొనుగోలు చేసిన వెంటనే ఎందుకు పంపడం లేదు? అనంతయ్య: మార్క్‌ఫెడ్ వాళ్లతో కాస్త సమస్య వస్తోంది. లారీల సమస్య ఉందంటున్నరు. ఈ విషయమై వారితో సీరియస్‌గా వాళ్లతో మాట్లాడినం.. తర్వలో సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తామన్నారు. లకా్ష్మరెడ్డి: అధికారుల తీరు వల్ల రైతులు చాన ఇబ్బంది పడుతున్నరు. లోపాలు ఎక్కడున్నయో చూసి, సమస్యలను వెంటనే పరిష్కరించండి. -
రూ.1,006 కోట్లు తాగేశారు
మద్యం అమ్మకాల్లోజిల్లా మూడో స్థానం జూన్‌లో మరో రూ.100 కోట్లు? జూలై నుంచి నూతన దుకాణాలు మద్యాన్ని మంచినీళ్లలా తాగేస్తున్నారు. నాలుగేళ్లుగా అమ్మకాలు ఏటా రూ.వందకోట్లు పెరుగుతున్నాయి. రికార్డుస్థాయి అమ్మకాలతో ఈ ఏడాది మన జిల్లా రాష్ట్రంలోనే మూడోస్థానంలో నిలిచింది. ఒక్క ఏడాదిలో రూ.1,006 కోట్ల మద్యం తాగేశారు. ఎన్నికల కమిషన్ ఆంక్షలు లేకుంటే అమ్మకాలు ఇంకా భారీగానే ఉండేవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కరీంనగర్ క్రైం :జిల్లాలో మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. తెలంగాణ రాష్ట్రం లో రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల తర్వాత మూడో స్థానంలో కరీంనగర్ జిల్లా నిలిచింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రంగారెడ్డి, హైదరాబాద్, విశాఖపట్నం తర్వాత స్థానం మన జిల్లా దే. గత నాలుగేళ్లుగా ఏటా సుమారు రూ.వంద కోట్ల మేర అమ్మకాలు పెరుగుతున్నాయి. జిల్లాలో 2010-11లో రూ.708.89 కోట్లు, 2011-12లో రూ.769.51 కోట్లు, 2012-13లో ఏకంగా రూ.1,087 కోట్ల అమ్మకాలు చేసి రికార్డు నెలకొల్పగా 2013-14లో మే వరకు రూ.1006 కోట్ల మద్యం అమ్మకాలు అయ్యా యి. జూన్ నెలలో కనీసం రూ.100 కోట్లకుపైగా అమ్మకాలు జరుగుతాయని ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది ఎన్నికల సీజన్ రాగా.. అందినకాడికి సొమ్ము చేసుకుందామనుకున్న వ్యాపారులకు ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. గతేడాది సదరు నెలలో ఎంత మద్యం అమ్మకాలు చేశారో... ఈ ఏడాది ఆ నెలలో అంతే మద్యం కేటాయించింది. దీంతో మార్చి, ఏప్రిల్‌లో అమ్మకాలు పూర్తిగా పడిపోయాయి. కొన్ని దుకాణాల్లో మద్యం స్టాక్ లేక దుకాణాలు మూసుకున్నారు. లేకుంటే అమ్మకాలు ఇంకా భారీగానే నమోదయ్యేవి. ఈనెల 30తో మద్యం దుకాణాల లెసైన్స్ కాలం పూర్తవుతుండగా జూలై 1 నుంచి నూతన టెండర్లు రానున్నాయి. ఈ ఏడాదీ అదే పాలసీ టెండర్ విధానానికి స్వస్తి చెబుతూ జనాభా ప్రకారం ధర నిర్ణయిస్తూ ప్రభుత్వం రెండేళ్ల క్రితం నూతన మద్యం పాలసీని అమల్లోకి తెచ్చింది. గతేడాది 315 దుకాణాలకు దరఖాస్తులు ఆహ్వానించింది. దరఖాస్తులు ఎక్కువ వచ్చిన చోట లక్కీడ్రా తీసి కేటాయించారు. 1112 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుకు రూ.25 వేలు చలానాగా నిర్ణయించారు. వీటిని తిరిగి చెల్లించరు. దరఖాస్తుల ద్వారానే ప్రభుత్వానికి రూ.278 కోట్ల ఆదాయం సమకూరింది. మొదట 109 దుకాణాలకు దరఖాస్తులు రాలేదు. 10 సార్లు టెండర్లు పిలవగా చివరకు 48 దుకాణాలు మిగిలిపోయాయి. వీటిని ఎక్సైజ్‌శాఖ నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసినా... ఆచరణలోకి రాలేదు. నగర శివారులోని మద్యం డిపో వద్ద ఒక్క దుకాణాన్ని ఎక్సైజ్‌శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. దుకాణాలకు కోటా ప్రకారం మద్యం కేటాయించారు. కోటాకు మించి మద్యం తీసుకోవాలనుకుంటే ప్రివిలేజ్ ఫీజు చెల్లించాలి. అదనపు మద్యం అమ్మకాలపై ప్రివిలేజ్ ఫీజుగా 14 శాతం ట్యాక్స్ అదనంగా చెల్లించాలి. దీంతో తమకు ఏమీ మిగలదని వ్యాపారులు అధిక మద్యం తీసుకునేందుకు ఆసక్తి చూపలేదు. ఈసారి సైతం పాత మద్యం విధానాన్నే ప్రభుత్వం ఖరారు చేసింది. ప్రివిలేజ్ ఫీజును 13.6 శాతానికి తగ్గించింది. దీంతో కొత్త పాలసీ వస్తుందని ఎదురుచూసిన వ్యాపారులకు నిరాశే మిగిలింది. బెల్టుషాపుల జోరు బెల్టుషాపులు లేకుండా చూస్తామని ప్రభుత్వం ప్రకటించినా... ఎక్కడా అడ్డుకట్ట పడలేదు. జిల్లాలో 1207 గ్రామాలుండగా 4 వేలకుపైగా బెల్టుషాప్‌లు నడిచాయని సమాచారం. మద్యం దుకాణాలు ఉదయం 10.30 నుంచి రాత్రి 10 వరకూ మద్యం అమ్మకాలు చేస్తుండగా బెల్టుదుకాణాలు 24 గంటలపాటు మద్యాన్ని అందుబాటులో ఉంచుతున్నాయి. వీటి ద్వారానే 60 శాతం అమ్మకాలు సాగుతున్నాయని సమాచారం. మద్యం అమ్మకాలు పెరగడంతో నకిలీ మద్యం తయారీ జోరందుకుంది. సిరిసిల్ల డివిజన్లోని ముస్తాబాద్‌లో, మంథని డివిజన్లో నకిలీ మద్యం పట్టుబడింది. చాలాచోట్ల నకిలీ మద్యం డంపులు, ముఠాలు పట్టుబడ్డాయి. ఇతర రాష్ట్రాలనుంచి కూడా మద్యాన్ని భారీ ఎత్తున జిల్లాకు తరలించారు. దీనివల్ల ప్రభుత్వం రూ.100 కోట్ల మేర ఆదాయం కోల్పోయిందని సమాచారం. వ్యాపారులు ముందుకు వచ్చేనా? 2013-14లో 315 దుకాణాలకు గాను 48 దుకాణాలు తీసుకునేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ప్రభుత్వం రూ.200 కోట్ల ఆదాయం కోల్పోయిందని సమాచారం. అసలే దరఖాస్తులు రాని 11 మద్యం దుకాణాలను ఈ సారి ఇతర ప్రాంతాలకు తరలించారు. దీంతో ప్రస్తుతం జిల్లాలో 304 దుకాణాలు మిగిలాయి. పూర్తిస్థాయిలో అమ్మకాలు చేస్తే రూ.1,300 కోట్ల మార్క్ దాటుతుందని ఎక్సైజ్ అధికారులు పేర్కొంటున్నారు. గత సీజన్లో ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని దుకాణాలు దక్కించుకున్న వ్యాపారులు... ఇప్పుడు ఎన్నికలు లేనందున ఎంతమంది ముందుకు వస్తారనేది వేచి చూడాల్సి ఉంది. ఇప్పుడున్న మద్యం పాలసీతో లాభాలు పెద్దగా రావడం లేదని... నూతన పాలసీ ప్రకటిస్తే బాగుండేదని వ్యాపారులు పేర్కొంటున్నారు. -
పిట్టల్లా.. రాలుతున్నారు
సాక్షి, కరీంనగర్/జగిత్యాల జోన్, న్యూస్‌లైన్ : మండుతున్న ఎండలతో జిల్లా నిప్పుల కొలిమిని తలపిస్తోంది. పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. వారం రోజులుగా 41 నుంచి 42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు కదలాడుతున్నాయి. ఉదయం 10 గంటలు దాటిందంటే వడగాల్పులు దడదడలాడిస్తున్నాయి. ఎండలో బయటకెళ్తే అటో ఇటో అన్నట్టుంది. సగటున రోజుకొక్కరు భానుడి ప్రతాపానికి బలవుతున్నారు. మార్చి 31 నుంచి ఈ నెల 2వరకు జిల్లావ్యాప్తంగా 28 మంది వడదెబ్బతో మరణించారు. మధ్యాహ్నం నెత్తిన కుంపటి మాదిరిగా ఎండవేడిమి మంట పుట్టిస్తోంది. ఆ సమయంలో బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. ఉదయం, సాయంత్రం వేళ్లల్లో పనులు పూర్తి చేసుకుని ఇంటిపట్టునే ఉంటున్నారు. పట్టణ ప్రజలు ఫ్యాన్లు, కూలర్ల కింద సేదదీరుతున్నారు. శీతలపానీయాలు సేవిస్తూ ఎండవేడిమి నుంచి ఉపశమనం తరువాయి పొందుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే తగిన జాగ్రత్తలు పాటిస్తున్నారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లోని రైతు కూలీల పరిస్థితే దయనీయంగా మారింది. పొట్టనింపుకునేందుకు ఎర్రటెండలోనూ పనులు చేయాల్సి వస్తోంది. దీంతో వడదెబ్బకు గురై ప్రాణాలకే ప్రమాదం వాటిల్లుతోంది. ఇప్పటివరకు వడదెబ్బతో మృతి చెందిన వారిలో రైతు, కూలీలు, వృద్ధులే అధికంగా ఉండటంగమనార్హం. ముందుంది మరింత మంట.. ఏటా మార్చి మొదటి వారం నుంచి ఎండలు ప్రారంభమై ఏప్రిల్‌లో ముదురుతాయి. మేలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. మూడేళ్ల నుంచి జూన్‌లోనూ ఎండ ప్రభావం చూపుతోంది. ప్రస్తుతం జిల్లా ప్రజలు భరించలేని ఎండవేడిమితో అల్లాడుతున్నారు. ఈ నెలాఖరు నుంచి జూన్ దాకా ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఉష్ణోగ్రత 42 డిగ్రీలకు చేరాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే వారం రోజుల్లో 45 డిగ్రీలకు, వేసవి ముగిసేలోపు 47 డిగ్రీలకు చేరుకునే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పెద్దపల్లి, మంథని డివిజన్ మండలాల్లో ఎండ ప్రభావం ఎక్కువగా ఉంది. ఓపెన్‌కాస్టు బొగ్గు గనులైతే అగ్నిగుండాన్ని తలపిస్తున్నాయి. నైరుతీ రుతుపవనాలు జిల్లాకు చేరే వరకు ఉష్ణోగ్రతలు ఇలాగే ఉంటాయని జగిత్యాల పొలాస పరిశోధన స్థానం డెరైక్టర్ డాక్టర్ లక్ష్మణ్ తెలిపారు. అంటే మరో నెలరోజులపాటు ఈ ఎండవేడిమి తప్పదన్నమాటే. జాగ్రత్తలు తీసుకోవాలి శరీరానికి ఎండ దెబ్బ తగలకుండా నీరు ఎక్కువగా తీసుకోవాలి. మజ్జిగ, కొబ్బరి నీరు తాగాలి. అత్యవసరమైతే తప్ప ఎండలో బయటకు వెళ్లకూడదు. బయటకు వెళ్లేప్పుడు ముఖానికి కర్చీఫ్, చేతులకు గ్లవ్స్ ధరించాలి. సన్‌స్క్రీన్ లోషన్స్ తప్పకుండా రాసుకోవాలి. వడదెబ్బకు గురైతే వెంటనే వైద్యుడి వద్దకు వెళ్లి చికిత్స చేయించుకోవాలి. -
‘ని’స్సహాయకం
నార్తురాజుపాళేనికి చెందిన జ్యోతి తోటి స్వయం సహాయక మహిళలు 20 మందితో కలిసి అవిశ్రాంతంగా శ్రమించి 750 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. దళారులతో పోటీపడి మరీ ధాన్యం కొనుగోలు చేశారు. మహిళలైనా ఏ మాత్రం భయపడకుండా ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చినట్టు ఆమె చెప్పింది. ఇంత వరకూ ఫలితం దక్కకపోవడంతో తీవ్ర నిరాశకు లోనయ్యామని ఆవేదన వ్యక్తం చేసింది. తమకు రూ.18 లక్షలకు పైగా కమీషన్ రావాలని చెబుతోంది. జిల్లా అధికారులు చొరవ తీసుకుని తమకు కమీషన్ ఇప్పించి న్యాయం చేయాలని ఆమె వేడుకుంటోంది. కోవూరుకు చెందిన వెంకటరమణమ్మ తోటి మహిళలతో కలిసి 800 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. రూ.18 లక్షలకు పైగా కమీషన్‌ను ప్రభుత్వం వారికి చెల్లించాల్సి ఉంది. కొనుగోళ్లకు సంబంధించి రికార్డులను కూడా సక్రమంగా నమోదు చేసినా ఏవేవో సాకులు చెబుతూ కమీషన్‌ను ఇచ్చేందుకు జాప్యం చేస్తున్నారనేది వెంకటరమణమ్మ ఆరోపణ. కలెక్టర్ శ్రీకాంత్ చొరవ తీసుకుని కమీషన్‌ను చెల్లించి తమ శ్రమకు తగిన ఫలితాన్ని దక్కేట్టు చేయాలని విన్నవిస్తున్నారు. నెల్లూరు(పొగతోట), న్యూస్‌లైన్ : కష్టానికి తగిన ఫలితం దక్కకపోవడంతో స్వయం సహాయక సంఘాల మహిళలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసినా తమకు ప్రతిఫలం అందలేదని నిర్వేదానికి లోనయ్యారు. 2012లో నాటి కలెక్టర్ ఎన్.శ్రీధర్ స్వయం సహాయక మహిళలతో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయించారు. కొనుగోలు చేసిన ధాన్యానికి కమీషన్ చెల్లిస్తామని ఆర్భాటంగా ప్రకటించారు. మహిళలు పోటీపడి 1,13,461 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. మహిళల శ్రమకు ప్రతిఫలంగా కమీషన్ కింద రూ.3.13 కోట్లు చెల్లించాల్సి ఉంది. రికార్డులు సక్రమంగా లేవనే సాకుతో నాలుగు పర్యాయాలు వాటిని పరిశీలించారు. మండల సమాఖ్య కమిటీ సభ్యులు డీఎస్ఓ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. పలు దఫాలు రికార్డులు పరిశీలించి గత ఏడాది రూ.1.55 కోట్లు చెల్లించారు. మిగిలిన రూ.1.58 కోట్లు చెల్లించడానికి రికార్డులు సక్రమంగా లేవని అధికారులు సాకులు చెబుతూ జాప్యం చేస్తున్నారు. కమీషన్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న స్వయం సహాయక మహిళలు తీవ్ర నిరాశ, నిస్పృహకు లోనయ్యారు. నార్త్రాజుపాళేనికి చెందిన జ్యోతి, కోవూరు నివాసి వెంకటరమణయ్య దళారులతో పోటీపడి ధాన్యం కొనుగోలు చేశారు. వారి కష్టానికి ఇంత వరకూ ఫలితం దక్కలేదు. బిల్లుల చెల్లింపులో అవకతవకలు బిల్లుల చెల్లింపుల్లో అనేక అవకతవకలు జరిగాయనే ఆరోపణలు వెల్తువెత్తాయి. సౌత్‌మోపూరు కొనుగోలు కేంద్రంలో ధాన్యం విక్రయించిన రైతులకు రూ.70 లక్షలు అధికంగా చెల్లించారు. రికార్డుల పరిశీలనలో ఈ వాస్తవం వెల్లడై రైతుల నుంచి అధికారులు రూ.70 లక్షలు రికవరీ చేశారు. బోగోలు, కావలి మండల సమాఖ్యలకు అధికంగా చెల్లించారని డీపీఎం శంకర్ తెలిపారు. రెండు మండలాల రికార్డులు పూర్తి స్థాయిలో పరిశీలించాల్సింది ఉందని ఆయన వెల్లడించారు. రూ.125 కోట్ల ధాన్యం కొనుగోలు 2012 వ్యవసాయ సీజన్లో 63 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. కేంద్రం ఏర్పాటు చేసిన ప్రాంతంలో స్వయం సహాయక సంఘాల మహిళలతో కమిటీ ఏర్పాటు చేశారు. సభ్యులు రైస్ మిల్లర్లు, దళారులతో పోటీపడి కల్లాల్లోకి వెళ్లి రూ.125 కోట్ల ధాన్యం కొనుగోలు చేశారు. ఇది రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసినట్టు. అధికారులు పాల్పడిన అవకతవకలకు మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటి వరకు కమీషన్ చెల్లించకపోవడంతో మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళల్లో కొరవడిన ఉత్సాహం కమీషన్ దక్కక పోవడంతో ధాన్యం కొనుగోలు చేసేందుకు మహిళలు ఉత్సాహం చూపడం లేదు. గత ఏడాది 50 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. రూ.1.35 లక్షలకు ధాన్యం కొనుగోలు చేశారు. ప్రస్తుతం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు వలన నష్టం వచ్చింది. ధాన్యం కొనుగోలు చేసినా చేయకపోయినా మహిళలకు కూలీ చెల్లించాలి. కేంద్రం నిర్వహణకు ఖర్చు అవుతుంది. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం వలన రైస్ మిల్లర్లు, దళారులు మద్దతు ధరకు మించి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. దీంతో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెలవెలపోతున్నాయి. ప్రస్తుతం 35 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోతే రైస్ మిల్లర్లు, దళారులు ధాన్యం ధరలు తగ్గించి కొనుగోలు చేస్తారు. రైతులకు మద్దతు ధర కల్పించేందుకే కేంద్రాలు ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. -
రికార్డు స్థాయిలో లావాదేవీలు
=22,282 బెల్లం దిమ్మల క్రయవిక్రయాలు =ఈ సీజన్లోనే అత్యధికం అనకాపల్లి, న్యూస్‌లైన్: అనకాపల్లి బెల్లం మార్కెట్‌కు శనివారం రికార్డు స్థాయిలో లావాదేవీలు జరిగాయి. ఈ సీజన్లోనే అత్యధిక బెల్లం దిమ్మల క్రయవిక్రయాలు నమోదయ్యాయి. మార్కెట్‌కు 22,282 దిమ్మలు రాగా, మొదటి రకం క్వింటాకు గరిష్టంగా రూ. 2800లు, మూడో రకం కనిష్టంగా రూ.2350 ధర పలికింది. ధరల విషయంలో ఒడిదుడుకులు కొనసాగుతుండగా, లావాదేవీలు క్రమేపీ పెరుగుతున్నాయి. సమైక్యాంధ్రకు మద్దతుగా ఆగస్టు, సెప్టెంబర్లలో జరిగిన బంద్‌లు, అక్టోబర్ నెలాఖరులో కురిసిన భారీ వర్షాల వల్ల లావాదేవీలు అప్పుడప్పుడు నిలిచిపోయాయి. సీజన్ తారాస్థాయికి చేరుకునే నెలగా డిసెంబర్‌కు గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలో మార్కెట్‌కు వచ్చిన 22 వేలకు పైగా బెల్లం దిమ్మల క్రయవిక్రయాలతో యార్డులన్నీ కళకళలాడాయి. ధరలు మాత్రం ఎప్పటిలాగే రైతులకు నిరాశ పరిచాయి. గత నెల 29న ఈ సీజన్లోనే అత్యల్పంగా రూ. 2,750ల ధర పలికింది. ఈ నెల నాలుగున మొదటి రకం క్వింటాల్‌కు రూ.మూడు వేలకు చేరుకున్నప్పటికీ మళ్లీ శని వారం రూ.2800లకు పడిపోయింది. ధరల వ్యవహారాల ను పక్కన పెడితే భారీ వర్షాలతో ముంపుకు గురైన చెరకు తోటల కు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆందోళన చెందుతున్న తరుణంలో లావాదేవీలు ఊపందుకోవడం ఊరటనిస్తోంది.