న్యూఢిల్లీ: భారత్ వస్తు ఎగుమతుల రికార్డు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) కూడా కొనసాగుతుందని భారత్ ఎగుమతి సంఘాల సమాఖ్య (ఎఫ్‌ఐఈఓ) ప్రెసిడెంట్ ఏ శక్తివేల్ స్పష్టం చేశారు. వివరాల్లోకి వెళితే, 2021–22లో ఎగుమతులు 422 బిలియన్ డాలర్ల రికార్డు స్థాయిని తాకాయి. 2022–23లో 3 నుంచి 5 శాతం వృద్ధితో 435–445 బిలియన్ డాలర్లకు చేరుతాయన్న విశ్వాసాన్ని తాజాగా శక్తివేల్ వ్యక్తం చేశారు.
అంతర్జాతీయంగా అనిశ్చితి, డిమాండ్ మందగమనం ఉన్నప్పటికీ భారత్ ఆల్‌టైమ్ రికార్డు కొనసాగుతందని విశ్లేషించారు. ఇటీవల విడుదలైన గణాంకాల ప్రకారం, భారత్ వస్తు ఎగుమతులు వరుసగా రెండోనెల జనవరిలోనూ క్షీణతను నమోదుచేశాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 10 నెలల కాలంలో (ఏప్రిల్–జనవరి) వస్తు ఎగుమతులు 8.51 శాతం పెరిగి 369.25 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
ఘనంగా 58వ వ్యవస్థపక దినోత్సవాలు
కాగా, ఎఫ్‌ఐఈఓ వ్యవస్థాపక దినోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు శక్తివేల్ ఈ సందర్భంగా తెలిపారు. మూడు వారాల పాటు జరిగే ఈ ఉత్సవాల సందర్భంగా– మార్చి 9 నుంచి 11 మధ్య ‘సోర్సెక్స్ ఇండియా’ పేరుతో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆహారం, ఫార్మా, ఆయుర్వేదం, హస్త కళలు, ఎఫ్‌ఎంసీజీ, జౌళి వంటి రంగాల్లో అవకాశాలను ఈ కార్యక్రమం ద్వారా ప్రచారం చేయడం జరుగుతుందన్నారు. సూపర్ మార్కెట్‌లు, హైపర్‌మార్కెట్లు, రిటైల్ చైన్‌లు, దిగుమతిదారులుసహా దాదాపు 35 దేశాలు నుంచి ప్రతినిధులు ఈ ఈవెంట్‌లో పాల్గొనేందుకు తమ ఆసక్తిని కనబరిచినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment