Federation of Indian Export Organisations
-
ఎఫ్ఐఈవో, బిజినెస్ రష్యా ఎంవోయూ
న్యూఢిల్లీ: భారత ఎగుమతిదారుల సమాఖ్య (ఎఫ్ఐఈవో), బిజినెస్ రష్యాతో అవగాహన ఒప్పందం చేసుకున్నట్టు ప్రకటించింది. ఇందులో భాగంగా రెండు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడుల విషయంలో ప్రోత్సాహం ఇచ్చిపుచ్చుకోనున్నట్టు తెలిపింది. రష్యా వ్యాపార మండలి, ఎఫ్ఐఈవో సంయుక్తంగా ఎగ్జిబిషన్లు, కొనుగోలుదారులు–విక్రయదారుల సమావేశాలు, వర్క్‌షాప్‌లు, సెమినార్లు ఏర్పాటు చేయడంతోపాటు, జాయింట్ వెంచర్ల ఏర్పాటు విషయంలో తమ దేశ సంస్థలకు సహకారం అందించనున్నాయి. ఆగ్రో, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకు చెందిన 50 మంది భారత ప్రతినిధుల బృందం మాస్కో పర్యటన సందర్భంగా ఈ ఎంవోయూ కుదిరింది. రెడీ టూ ఈట్ మీల్స్, ఫిష్ మీల్, జంతువులకు దాణా, సోయాబీన్ తదితర ఉత్పత్తుల విషయంలో జాయింట్ వెంచర్ల ఏర్పాటుపై ప్రతినిధుల బృందం దృష్టి పెట్టనున్నట్టు ఎఫ్ఐఈవో బోర్డ్ సభ్యుడు ఎన్కే కగ్లివాల్ తెలిపారు. భారత ప్రతినిధుల బృందానికి కగ్లివాల్ నేతృత్వం వహిస్తున్నారు. ఆగ్రో, ఆహార ప్రాసెసింగ్ ఎగుమతులు 750 మిలియన్ డాలర్ల నుంచి 3 బిలియన్ డాలర్లకు వచ్చే మూడేళ్లలో పెంచుకోవాలన్నది లక్ష్యమని తెలిపారు. కొన్ని అంశాల పరిష్కారానికి ఎగుమతిదారులు, దిగుమతిదారులు, బ్యాంకర్ల అదనపు కృషి చేయాల్సి ఉంటుందని ఎఫ్ఐఈవో డైరెక్టర్ జనరల్ అజయ్ సహాయ్ పేర్కొన్నారు. -
ఎగుమతుల ‘రికార్డు’ కొనసాగుతుంది
న్యూఢిల్లీ: భారత్ వస్తు ఎగుమతుల రికార్డు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) కూడా కొనసాగుతుందని భారత్ ఎగుమతి సంఘాల సమాఖ్య (ఎఫ్ఐఈఓ) ప్రెసిడెంట్ ఏ శక్తివేల్ స్పష్టం చేశారు. వివరాల్లోకి వెళితే, 2021–22లో ఎగుమతులు 422 బిలియన్ డాలర్ల రికార్డు స్థాయిని తాకాయి. 2022–23లో 3 నుంచి 5 శాతం వృద్ధితో 435–445 బిలియన్ డాలర్లకు చేరుతాయన్న విశ్వాసాన్ని తాజాగా శక్తివేల్ వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా అనిశ్చితి, డిమాండ్ మందగమనం ఉన్నప్పటికీ భారత్ ఆల్‌టైమ్ రికార్డు కొనసాగుతందని విశ్లేషించారు. ఇటీవల విడుదలైన గణాంకాల ప్రకారం, భారత్ వస్తు ఎగుమతులు వరుసగా రెండోనెల జనవరిలోనూ క్షీణతను నమోదుచేశాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 10 నెలల కాలంలో (ఏప్రిల్–జనవరి) వస్తు ఎగుమతులు 8.51 శాతం పెరిగి 369.25 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఘనంగా 58వ వ్యవస్థపక దినోత్సవాలు కాగా, ఎఫ్ఐఈఓ వ్యవస్థాపక దినోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు శక్తివేల్ ఈ సందర్భంగా తెలిపారు. మూడు వారాల పాటు జరిగే ఈ ఉత్సవాల సందర్భంగా– మార్చి 9 నుంచి 11 మధ్య ‘సోర్సెక్స్ ఇండియా’ పేరుతో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆహారం, ఫార్మా, ఆయుర్వేదం, హస్త కళలు, ఎఫ్ఎంసీజీ, జౌళి వంటి రంగాల్లో అవకాశాలను ఈ కార్యక్రమం ద్వారా ప్రచారం చేయడం జరుగుతుందన్నారు. సూపర్ మార్కెట్లు, హైపర్మార్కెట్లు, రిటైల్ చైన్లు, దిగుమతిదారులుసహా దాదాపు 35 దేశాలు నుంచి ప్రతినిధులు ఈ ఈవెంట్లో పాల్గొనేందుకు తమ ఆసక్తిని కనబరిచినట్లు తెలిపారు. -
లాజిస్టిక్స్ వ్యయాలు తగ్గుతాయి
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్‌పై సుంకాలతో పాటు ప్లాస్టిక్, స్టీల్ మొదలైన వాటికి సంబంధించిన ముడి సరుకులపై కస్టమ్స్ డ్యూటీలను తగ్గించడం వల్ల లాజిస్టిక్స్ వ్యయాలు దిగివచ్చేందుకు వీలవుతుం దని ఎగుమతిదారులు తెలిపారు. తయారీలో పోటీతత్వం మెరుగుపడేందుకు, విలువను జోడించిన ఉత్పత్తుల ఎగుమతులకు తోడ్పడగలదని పేర్కొన్నారు. అలాగే దేశీయంగా ద్రవ్యోల్బణం తగ్గగల దని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేష న్స్ (ఎఫ్ఐఈవో) ప్రెసిడెంట్ ఎ. శక్తివేల్ తెలిపారు. టెక్స్టైల్స్ ముడి వనరుల విషయంలోనూ ఇదే తరహా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. పత్తి ఎగుమతులపై సుంకాలు విధించి, కాటన్ యార్న్ దిగుమతులపై సుంకాలు ఎత్తివేస్తే దేశీ పరిశ్రమలకు సహాయకరంగా ఉంటుందని పేర్కొన్నా రు. పెట్రోల్‌పై లీటరుకు రూ. 8, డీజిల్‌పై లీటరుకు రూ. 6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. వీటితో పాటు ఉక్కు, ప్లాస్టిక్ ముడి సరుకులకు సంబంధిం చి దిగుమతి సుంకాలను కూడా తగ్గించిన కేంద్రం.. ముడి ఇనుము, ఉక్కు ఇంటర్మీడియట్స్పై ఎగుమతి సుంకాన్ని పెంచింది. -
వచ్చే రెండేళ్లలో జీడీపీ 8 శాతం
న్యూఢిల్లీ: వచ్చే రెండేళ్ల పాటు దేశ జీడీపీ వృద్ధి రేటు 8 శాతానికి సమీపంలో నమోదవుతుందని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) పేర్కొంది. బలమైన సంస్కరణలు, ద్రవ్య క్రమశిక్షణ వృద్ధికి గట్టి పునాదులు వేశాయని సీఐఐ అభిప్రాయం వ్యక్తం చేసింది. ‘‘ఆర్థిక వ్యవస్థ మంచి దశలో ఉందిప్పుడు. గత కొన్ని సంవత్సరాల్లో చేపట్టిన ఆర్థిక సంస్కరణలకు చాలావరకూ సర్దుబాటు జరిగింది. సామర్థ్య వినియోగం పుంజుకుంటే దేశీయ పరిశ్రమలు తాజా పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నాయి’’ అని సీఐఐ ప్రెసిడెంట్ రాకేశ్ భారతి మిట్టల్ తెలిపారు. రూ.50 వేల కోట్ల పెట్టుబడుల ప్రణాళికలను సీఐఐ ఇటీవలే ప్రకటించడం గమనార్హం. ‘‘వచ్చే కొన్ని సంవత్సరాల పాటు జీడీపీ 8 శాతం సమీపానికి పుంజుకుంటుందని పరిశ్రమలు భావిస్తున్నాయి. ద్రవ్య క్రమశిక్షణ, స్థూల ఆర్థిక నిర్వహణ, బలమైన సంస్కరణల ప్రక్రియ వృద్ధికి గట్టి పునాది వేశాయి’’ అని రాకేశ్ పేర్కొన్నారు. సీఈవోల అభిప్రాయాలపై సీఐఐ నిర్వహించిన పోల్‌లో, 82 శాతం మంది జీడీపీ 2018–19 సంవత్సరానికి 7 శాతానికి పైనే నమోదవుతుందని తెలియజేయగా, మరో 10 శాతం మంది సీఈవోలు 7.5 శాతంపైనే ఉండొచ్చని అభిప్రాయం తెలిపారు. -
ఆఫ్రికాలో రాబడి ఎక్కువే..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అపార వాణిజ్య అవకాశాలున్న ఆఫ్రికాలో పెట్టుబడులపై రాబడులు అధికంగా ఉంటాయని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్ (ఎఫ్ఐఈవో) అంటోంది. రాబడులతోపాటు ఆఫ్రికాలోని కొన్ని దేశాల్లో రిస్క్ కూడా ఉందని ఎఫ్ఐఈవో దక్షిణ ప్రాంత చైర్మన్ వాల్టర్ డిసౌజా అన్నారు. కెన్యాలో వ్యాపార అవకాశాలపై శుక్రవారమిక్కడ జరిగిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. ఫార్మా, ఆటోమొబైల్, విడిభాగాలు, మౌలిక రంగం, టెలికం, ఐటీ, ఆరోగ్య రంగాల్లో అవకాశాలు పుష్కలమని తెలిపారు. కెన్యా, ఇథియోపియా, టాంజానియా, ఐవరీకోస్ట్, ఘనా, బెనిన్, జాంబియా దేశాలు వ్యాపారానికి అనుకూలమని చెప్పారు. నైరోబీలో మార్చి 27-29 తేదీల్లో ఇండియా ఎక్స్పో జరుగుతోందని వివరించారు. భారత్ నుంచి సుమారు 100 కంపెనీలు ఎక్స్‌పోలో పాల్గొనే అవకాశం ఉందని తెలిపారు. ఆఫ్రికా-భారత్‌ల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2013-14లో 75 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఆఫ్రికాలో రూ.180 లక్షల కోట్ల వ్యాపార అవకాశాలున్నాయని కెన్యా మాజీ ప్రధాని రైలా ఒడింగా అన్నారు. కార్యక్రమంలో టీఎస్ఐఐసీ వైస్ చైర్మన్ జయేష్ రంజన్ తదితరులు పాల్గొన్నారు. -
లక్ష్యాన్ని మించనున్న ఎగుమతులు
ముంబై: తయారీ రంగం ఊపందుకోనుండడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 35,000 కోట్ల డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని భారత్ అధిగమించే అవకాశం ఉందని దేశీయ ఎగుమతి సంఘాల సమాఖ్య (ఎఫ్ఐఈఓ) తెలిపింది. ‘అమెరికా, యూరోపియన్ యూనియన్లతో పాటు వర్థమాన దేశాల్లో అభివృద్ధి జోరందుకుంటోంది. దీంతో భారత్ నుంచి ఎగుమతులు త్వరలోనే పెరుగుతాయి...’ అని ఎఫ్ఐఈఓ అధ్యక్షుడు రఫీక్ అహ్మద్ సోమవారం మీడియాతో చెప్పారు. గత నెల(జూలై)లో ఎగుమతుల వృద్ధి రేటు 7.33 శాతానికి తగ్గిపోగా దిగుమతులు 4.25 శాతం పెరిగాయి. అంకెల్లో చూస్తే జూలైలో ఎగుమతులు 2,772 కోట్ల డాలర్లు కాగా దిగుమతులు 3,995 కోట్ల డాలర్లు. గత నెలలో ఎగుమతులు పది శాతానికి మించి పెరుగుతాయని భావించామని అహ్మద్ చెప్పారు. ఇంజినీరింగ్, కెమికల్స్, ఔషధాలు, దుస్తులు, తోలు, సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు మెరుగ్గా ఉన్నప్పటికీ రత్నాలు, ఆభరణాలు, ఎలక్ట్రానిక్స్, జౌళి ఉత్పత్తుల ఎగుమతులు క్షీణించాయన్నారు. దాని ప్రభావం మొత్తం ఎగుమతులపై పడిందని వివరించారు. జూలైలో చమురు దిగుమతులు 12.75 శాతం పెరిగి 1,435 కోట్ల డాలర్లకు, చమురేతర దిగుమతులు 0.03 శాతం వృద్ధితో 2,560 కోట్ల డాలర్లకు చేరాయని పేర్కొన్నారు. బంగారం దిగుమతులు 26.39 శాతం క్షీణించి 181 కోట్ల డాలర్లకు చేరాయని తెలిపారు. ఎగుమతులు మే నెలలో 12.4 శాతం, జూన్‌లో 10.22 శాతం వృద్ధిచెందాయని అన్నారు. స్వల్పంగా పెరగనున్న వాణిజ్యలోటు: సిటీ న్యూఢిల్లీ: వాణిజ్యలోటు (దిగుమతులు-ఎగుమతుల విలువ మధ్య ఉన్న వ్యత్యాసం) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 142 బిలియన్ డాలర్లు ఉండవచ్చని సిటీగ్రూప్ పరిశోధనా నివేదిక ఒకటి తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం ఈ లోటు 139 బిలియన్ డాలర్లు. ఇక కరెంట్ అకౌంట్ లోటు (క్యాపిటల్ ఇన్‌ఫ్లోస్ మినహా దేశంలోకి వచ్చీ-పోయే విదేశీ మారకద్రవ్యం మధ్య ఉన్న వ్యత్యాసం) 39.3 బిలియన్ డాలర్లు (జీడీపీ పరిమాణంలో 1.9 శాతం) ఉంటుందనీ అంచనావేసింది. డాలర్ మారకంలో రూపాయి రూ.59-62 శ్రేణిలో ఉంటుందని విశ్లేషించింది. -
ఎగుమతుల మందగమనం
న్యూఢిల్లీ: దేశీ ఎగుమతుల వృద్ధి రేటు తక్కువ స్థాయిలో నమోదయ్యింది. గత యేడాది ఇదే నెలతో పోల్చితే కేవలం 7.33 శాతంగా ఉంది. దీనితో వాణిజ్యలోటు సైతం ఏడాది గరిష్ట స్థాయికి ఎగసింది. మే, జూన్ నెలల్లో ఈ వృద్ధి రేటు రెండంకెల్లో నమోదయ్యింది. ప్రభుత్వ గణాంకాల్లోకి వెళితే... జూలైలో ఎగుమతుల విలువ 27.72 బిలియన్ డాలర్లు దిగుమతుల విలువ 39.95 బిలియన్ డాలర్లు. ఇది వార్షిక ప్రాతిపదికన 4.25 శాతం ఎగసింది. ఈ నేపథ్యంలో వాణిజ్యలోటు (ఎగుమతులు-దిగుమతుల విలువ మధ్య వ్యత్యాసం) 12.22 బిలియన్ డాలర్లు. ఇది యేడాది గరిష్ట స్థాయి. రంగాల వారీగా చూస్తే... ఎగుమతుల్లో మంచి ఫలితాలను ఇచ్చిన రంగాల్లో జౌళి (13.3%), పెట్రోలియం ఉత్పత్తులు (28%), ఇంజనీరింగ్ (23.9%) లెదర్ (17.23 శాతం), మెరైన్ ప్రొడక్ట్స్ (25%), ఆయిల్ సీడ్స్ (19.25%), కెమికల్స్ (16.67%), ఔషధాలు (10.78%) ఉన్నాయి. ఎఫ్ఐఈఓ వ్యాఖ్య... తాజా గణాంకాల నేపథ్యంలో భారత ఎగుమతి సంఘాల సమాఖ్య (ఎఫ్ఐఈఓ) ఒక ప్రకటన చేస్తూ రత్నాలు, ఆభరణాలు, ఎలక్ట్రానిక్స్ రంగాల ఎగుమతుల ప్రతికూల వృద్ధి ఆందోళన కలిగిస్తోందని పేర్కొంది. రానున్న విదేశీ వాణిజ్య విధానం ఎగుమతుల వృద్ధికి తగిన చర్యలను తీసుకుంటుందన్న విశ్వాసాన్ని వెలిబుచ్చింది. బంగారం, వెండి ఇలా... కాగా జూలైలో బంగారం, వెండి దిగుమతులు వార్షిక ప్రాతిపదికన 34.46% తగ్గాయి. 1.94 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇందులో బంగారం వాటా 1.81 బిలియన్ డాలర్లు. ఒక్క బంగారాన్ని చూసుకుంటే దిగుమతులు వార్షిక ప్రాతిపదికన 26.39 శాతం పడిపోయాయి. క్యాడ్ కట్టడిలో భాగంగా ప్రభుత్వం తీసుకున్న చర్యలు దీనికి ప్రధాన కారణం. వార్షికంగా చూస్తే... ఏప్రిల్-జూలై మధ్య కాలంలో గత ఏడాది ఇదే కాలంతో పోల్చిచూస్తే- ఎగుమతుల విలువ 99.28 బిలియన్ డాలర్ల నుంచి 107.83 బిలియన్ డాలర్లకు ఎగసింది. వృద్ధి 8.62%. కాగా దిగుమతులు 3.8 శాతం క్షీణించి 159.15 బిలియన్ డాలర్ల నుంచి 153.15 బిలియన్ డాలర్లకు తగ్గాయి. గత ఆర్థిక సంవత్సరం మొత్తంమీద ఎగుమతులు విలువ 312 బిలియన్ డాలర్లు కాగా, ఈ యేడాది ఈ విలువ 325 బిలియన్ డాలర్లకు పెంచాలన్నది లక్ష్యం. -
రూ. 17,000 కోట్ల ఆదాయం!
విశాఖపట్నం, న్యూస్‌లైన్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వైజాగ్ కస్టమ్స్ జోన్ రూ. 17,000 కోట్ల ఆదాయాన్ని అంచనావేస్తోంది. విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, కృష్ణపట్నం రేవులు ఈ జోన్ పరిధిలో వున్నాయి. 2012-13లో రూ. 15, 373 కోట్ల ఆదాయాన్ని ఈ జోన్ వసూలు చేయగలిగింది. ఈ అంశాల్ని చీఫ్ కమిషనర్ ఆఫ్ కష్టమ్స్ ఎక్జైజ్ అండ్ సర్వీస్ టాక్స్ (విశాఖ జోన్) దీపా బి.దాస్‌గుప్తా వివరిస్తూ గత ఏడాది ఎగుమతులు ఆశించిన స్థాయిలో జరిగాయన్నారు. శుక్రవారం ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్ పోర్టు ఆర్గనైజేషన్స్ (ఎఫ్ఐఇఓ), వైజాగ్ పటం చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్రీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ముఖ్య అతిధిగా ఆమె మాట్లాడుతూ ఆర్ధిక మందగమనంలో ఉన్నా ఎగుమతులు బాగా జరుగుతున్నాయన్నారు. కమిషనర్ ఆఫ్ కష్టమ్స్ (వైజాగ్-1) సి.రాజేందిరన్ మాట్లాడుతూ గత ఏడాది ఏప్రిల్ నుండి డిసెంబర్ వరకు రూ.22,900కోట్లు ఎగుమతులు జరిగాయన్నారు. అంతకుముందు ఏడాది రూ.14,991 కోట్లు ఎగుమతులు జరిగాయన్నారు. ఇనుప ఖనిజం ఎగుమతులు బాగా పెరిగాయన్నారు.