ఎగుమతుల మందగమనం | India's Export Growth Slowed in July | Sakshi
Sakshi News home page

ఎగుమతుల మందగమనం

Published Fri, Aug 15 2014 1:17 AM | Last Updated on Sat, Sep 2 2017 11:52 AM

ఎగుమతుల మందగమనం

ఎగుమతుల మందగమనం

 న్యూఢిల్లీ: దేశీ ఎగుమతుల వృద్ధి రేటు తక్కువ స్థాయిలో నమోదయ్యింది. గత యేడాది ఇదే నెలతో పోల్చితే కేవలం 7.33 శాతంగా ఉంది. దీనితో వాణిజ్యలోటు సైతం ఏడాది గరిష్ట స్థాయికి ఎగసింది. మే, జూన్ నెలల్లో ఈ వృద్ధి రేటు రెండంకెల్లో నమోదయ్యింది.

 ప్రభుత్వ గణాంకాల్లోకి వెళితే...
     
జూలైలో ఎగుమతుల విలువ 27.72 బిలియన్ డాలర్లు
     
దిగుమతుల విలువ 39.95 బిలియన్ డాలర్లు. ఇది వార్షిక ప్రాతిపదికన 4.25 శాతం ఎగసింది.
     
ఈ నేపథ్యంలో వాణిజ్యలోటు (ఎగుమతులు-దిగుమతుల విలువ మధ్య వ్యత్యాసం) 12.22 బిలియన్ డాలర్లు. ఇది యేడాది గరిష్ట స్థాయి.
 
రంగాల వారీగా చూస్తే...
 ఎగుమతుల్లో మంచి ఫలితాలను ఇచ్చిన రంగాల్లో జౌళి (13.3%), పెట్రోలియం ఉత్పత్తులు (28%), ఇంజనీరింగ్ (23.9%) లెదర్ (17.23 శాతం), మెరైన్ ప్రొడక్ట్స్ (25%), ఆయిల్ సీడ్స్ (19.25%), కెమికల్స్ (16.67%), ఔషధాలు (10.78%) ఉన్నాయి.

 ఎఫ్‌ఐఈఓ వ్యాఖ్య...
 తాజా గణాంకాల నేపథ్యంలో భారత ఎగుమతి సంఘాల సమాఖ్య (ఎఫ్‌ఐఈఓ) ఒక ప్రకటన చేస్తూ రత్నాలు, ఆభరణాలు, ఎలక్ట్రానిక్స్ రంగాల ఎగుమతుల ప్రతికూల వృద్ధి ఆందోళన కలిగిస్తోందని పేర్కొంది. రానున్న విదేశీ వాణిజ్య విధానం ఎగుమతుల వృద్ధికి తగిన చర్యలను తీసుకుంటుందన్న విశ్వాసాన్ని వెలిబుచ్చింది.
 
బంగారం, వెండి ఇలా...
 కాగా జూలైలో బంగారం, వెండి దిగుమతులు వార్షిక ప్రాతిపదికన 34.46% తగ్గాయి. 1.94 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇందులో బంగారం వాటా 1.81 బిలియన్ డాలర్లు. ఒక్క బంగారాన్ని చూసుకుంటే దిగుమతులు వార్షిక ప్రాతిపదికన 26.39 శాతం పడిపోయాయి. క్యాడ్ కట్టడిలో భాగంగా ప్రభుత్వం తీసుకున్న చర్యలు దీనికి ప్రధాన కారణం.
 
వార్షికంగా చూస్తే...
 ఏప్రిల్-జూలై మధ్య కాలంలో గత ఏడాది ఇదే కాలంతో పోల్చిచూస్తే- ఎగుమతుల విలువ 99.28 బిలియన్ డాలర్ల నుంచి 107.83 బిలియన్ డాలర్లకు ఎగసింది. వృద్ధి 8.62%. కాగా దిగుమతులు 3.8 శాతం క్షీణించి 159.15 బిలియన్ డాలర్ల నుంచి 153.15 బిలియన్ డాలర్లకు తగ్గాయి. గత ఆర్థిక సంవత్సరం మొత్తంమీద ఎగుమతులు విలువ 312 బిలియన్ డాలర్లు కాగా, ఈ యేడాది ఈ విలువ 325 బిలియన్ డాలర్లకు పెంచాలన్నది లక్ష్యం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement