న్యూఢిల్లీ: భారత్ వస్తు, సేవల ఎగుమతులు ఏప్రిల్‌తో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2023–24) 900 బిలియన్ డాలర్లను దాటే అవకాశం ఉందని ఎగుమతిదారులు అంచనావేస్తున్నారు. అమెరికాసహా కీలక ప్రపంచ మార్కెట్లలో దేశీయ వస్తువులకు పటిష్ట డిమాండ్, అలాగే వాణిజ్య ఒప్పందాల వల్ల కలిగే ప్రయోజనాలు ఇందుకు దోహదపడతాయన్నది వారి విశ్లేషణ. రష్యా వంటి ఇతర దేశాల్లో డిమాండ్ కూడా భారత్ ఎగుమతులకు దోహదపడే అంశమని వారు పేర్కొంటున్నారు.
ఆయా దేశాలకు ముఖ్యంగా వ్యవసాయ, ఆహార ప్రాసెసింగ్ రంగాలలో భారీ ఎగుమతులకు అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. 2023–24లో 500 నుంచి 510 బిలియన్ డాలర్ల మేర వస్తు ఎగుమతులు జరిగే అవకాశం ఉందని భారత్ ఎగుమతి సంఘాల సమాఖ్య (ఎఫ్‌ఐఈఓ) పేర్కొంది. దీనితోపాటు సేవల ఎగుమతులు సైతం 2022–23తో పోల్చితే (322.72 బిలియన్ డాలర్లు) భారీగా 390 బిలియన్ డాలర్లకు పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడింది. 2021–22లో భారత్ వస్తు ఎగుమతులు 422 బిలియన్ డాలర్లు ఉంటే, 2022–23లో 6 శాతం పెరిగి 447.5 బిలియన్ డాలర్లకు చేరిన సంగతి తెలిసిందే.
అంచనాలు ఇలా...
► అంతర్జాతీయ వాణిజ్యంలో మన రూపాయికి కూడా తగిన స్థాయిని కల్పించాలన్న ప్రభుత్వ లక్ష్యం... ఎగుమతులకు సంబంధించి లావాదేవీల వ్యయాలను తగ్గిస్తుంది.
► పర్యాటకం, రవాణా, వైద్యం, ఆతిథ్యం సహా పలు రంగాలు గతేడాది వృద్ధికి దోహదం చేశాయి. ఐటీ, ఐటీ ఆధారిత సేవల ఎగుమతులు బలంగా సాగుతున్నాయి. యాత్రల రంగం త్వరలో వృద్ధి బాట పట్టనుంది.
► కరోనా అనంతర ఆర్థిక పునరుద్ధరణ విదేశీ మార్కెట్ల నుండి వస్తువులు, సేవలకు పెరుగు తున్న డిమాండ్‌ను సృష్టించింది. సరుకు రవాణా ఛార్జీల స్థిరీకరణ, సరఫరా వ్యవస్థ సాధారణీకరణ రవాణా రంగానికి సానుకూల పరిణామాలు.
► ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, లీగల్, అకౌంటింగ్ సేవలు, పరిశోధన, మేనేజ్‌మెంట్ కన్సల్టింగ్ వంటి వ్యాపార సేవలు ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా అందించిన అవకాశాలను సద్వినియో గం చేసుకోవడంలో ప్రయోజనం పొందుతాయి.
► ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో వృద్ధికి గణనీయమైన అవకాశం ఉంది. ఎగుమతి గమ్యస్థానాల వైవిధ్యం సంప్రదాయ మార్కెట్లపై ఆధారపడడాన్ని తగ్గించడానికి, ఎగుమతులకు కొత్త అవకాశాలను తెరవడానికి సాయపడుతుంది.
► ఎగుమతుల పురోగతే లక్ష్యంగా దేశం ఇటీవల ఆవిష్కరించిన విదేశీ వాణిజ్య పాలసీ (ఎఫ్‌టీపీ)ని భారత్‌ను ఈ రంగంలో వృద్ధి బాటన నడుపుతుంది. 2030 నాటికి దేశ ఎగుమతులను ఏకంగా 2 ట్రిలియన్ డాలర్లకు చేర్చడంతో పాటు రూపాయిని గ్లోబల్ కరెన్సీగా చేయాలని పాలసీ దోహదపడుతుందన్న విశ్వాసం ఉంది.
► వృద్ధి రేటును మరింత పెంచేందుకు కొన్ని ప్రో త్సాహకాలు అవసరం ఎంతైనా ఉంది. ప్రభు త్వం సరైన సహాయంతో గేమింగ్, ఎంటర్‌టైన్‌మెంట్‌లు చాలా బాగా పని చేస్తాయి.
మిగిలిన రంగాలకూ తగిన సహాయ సహకారాలు అందాలి.
ఎఫ్‌టీఏల దన్ను...
వస్తు, సేవల ఎగుమతులు రెండూ కలిసి 2023–24లో విలువ 900 బిలియన్ డాలర్లుగా ఉండే వీలుంది. యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ (యూఏఈ), ఆస్ట్రేలియాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్‌టీఏ) ఆ మార్కెట్లలో ఎగుమతులను పెంచడానికి భారీ వేదికను అందిస్తాయి. ప్రొడక్షన్–లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కూడా భారత్ ఎగుమతులకు ప్రోత్సాహాన్ని అందిస్తుంది. ఎందుకంటే ప్రోత్సా హకాల కారణంగా దేశీయ ఉత్పత్తి పెరుగుతుంది.
– అజయ్ సహాయ్, ఎఫ్‌ఐఈఓ డైరెక్టర్ జనరల్
ఆర్డర్ బుక్ పటిష్టం
అమెరికా ఆర్థిక వృద్ధి పుంజుకుంటుందన్న సంకేతాలు ఉన్నాయి. భారత్ ఎగుమతుల్లో అమెరికా మార్కెట్ వాటా దాదాపు 18 శాతం. ఎగుమతులకు సంబంధించి ఆర్డర్ బుక్ బాగుంది. ఇదే ట్రెండ్ 2023–24 అంతా కొనసాగుతుందని భావిస్తున్నాం. దీనితో వస్తు ఎగుమతులు 500 బిలియన్ డాలర్లు దాటతాయని భావిస్తున్నాం.
– ఎస్‌సి రాల్హాన్, హ్యాండ్ టూల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్
యుద్ధ ప్రభావం తగ్గుతోంది
2022–23 కంటే 2023–24 ఆర్థిక సంవత్సరం ఎగుమతులుకు బాగుంటుందని భావిస్తున్నాం. మన పరిశ్రమపై రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం తగ్గిపోతోంది. ఎందుకంటే వాణిజ్యం–ఇంధన వనరులకు పరిశ్రమ ప్రత్యామ్నాయ మార్గాన్ని కనుగొన్నది. భారతదేశంలో మౌలిక సదుపాయాలలో గణనీయమైన మెరుగుదల ఉంది. అది ఎగుమతిదారులకు గట్టి మద్దతునిస్తుంది.
– శారదా కుమార్ సరాఫ్, టెక్నోక్రాఫ్ట్ ఇండస్ట్రీస్ చైర్మన్
2022–23కంటే బెటర్...
గత ఆర్థిక సంవత్సరం కంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఎగుమతులు పటిష్టంగా ఉంటాయని విశ్వసిస్తున్నాను. ముఖ్యంగా... కార్మికరంగం ఆవశ్యకత ఉన్న రంగాలు మంచి పనితనాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఇది ఎగుమతులకు దోహపదడే అంశాల్లో ఒకటి.
– ఖలీద్ ఖాన్, జికో ట్రేడింగ్ కార్పొరేషన్ డైరెక్టర్
Comments
Please login to add a commentAdd a comment