Exporters
-
అమెరికాకు ఎగుమతులు పెరిగే చాన్స్
న్యూఢిల్లీ: అమెరికా (US) అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చైనా (China) వస్తువులపై అధిక సుంకాలు విధిస్తామని హెచ్చరిస్తున్న నేపథ్యంలో అందివచ్చే అవకాశాలను భారత్ సద్వినియోగం చేసుకునే వీలుందని అత్యున్నత స్థాయి ఎగుమతిదారుల సంస్థ– ఎఫ్ఐఈఓ పేర్కొంది. ఈ దిశలో అమెరికాకు భారత్ ఎగుమతులను పెంచడానికి వ్యూహాన్ని రూపొందించినట్లు కూడా ఎఫ్ఐఈఓ తెలిపింది.ఈ ప్రణాళికలో భాగంగా దేశ ఎగుమతిదారులు (Exporters) అమెరికా అంతటా జరిగే వాణిజ్య, వ్యాపార ప్రదర్శనలలో పాల్గొనడానికి ఆర్థిక సహాయం అందించాలని ఎఫ్ఐఈఓ (ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్) వైస్ ప్రెసిడెంట్ ఇస్రార్ అహ్మద్ ఇక్కడ విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. తాను అధికారం చేపట్టింది వెంటనే మెక్సికో, కెనడా, చైనాలపై కొత్త టారిఫ్‌లు విధిస్తానని ట్రంప్ బెదిరించిన నేపథ్యంలో ఇస్రార్ అహ్మద్ ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ముఖ్యమైనవి...అమెరికా మార్కెట్‌కు భారత్ ఎగుమతుల్లో వృద్ధిని పెంచడానికి రూపొందించిన వ్యూహంలో మేము ఐదు కీలక రంగాలను గుర్తించాము. దుస్తులు, ఎలక్ట్రానిక్స్, బొమ్మలు, పాదరక్షలు, ఆర్గానిక్ కెమికల్స్ రంగాలు ఇందులో ఉన్నాయి. ఈ రంగాలకు సంబంధించి అమెరికా వాణిజ్య సంఘాలతో చేతులు కలపాలని ఎఫ్ఐఈఓ భావిస్తోంది. బంగ్లాదేశ్‌లో రాజకీయ అనిశ్చి తి కారణంగా చాలా దుస్తులు కంపెనీలు భారత్‌కు స్థావరాలను మార్చుకుంటున్నాయి. అమెరికా మార్కెట్లో భారత్ ఎగుమతులు విస్తరించాల్సిన అవసరం, అవకాశాలు ఉన్నాయి. అమెరికాలో భారత్ ఉత్పత్తులను విస్తృత స్థాయిలో మార్కెటింగ్ చేయడానికి ఎగుమతిదారులకు తగిన ఆర్థిక మద్దతు అవసరం. అందివస్తున్న అవకాశాలను వినియోగించుకోవడంలో ఇది కీలకం. దేశంలో పెద్ద ఫ్యాక్టరీలు వస్తున్నందున సామర్థ్యాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాలో భారత్ ఉనికి మరింత పెంచుకోవాలి. అవకాశాలను చేజిక్కించుకోవడానికి మార్కెట్ యాక్సెస్ ఇనిషియేటివ్స్ (ఎంఏఐ) పథకం కింద మరిన్ని నిధులు అడుగుతున్నాము. అమెరికాకు ఎగుమతులు లక్ష్యంగా ఈ పథకంపై దృష్టి పెట్టాలి. కనీసం మూడు సంవత్సరాలు దీనిని అమలు చేయాలి. ప్రస్తుతం భారత్ ఎగుమతిదారులు ‘ద్రవ్య లభ్యత’ (లిక్విడిటీ) సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఫైనాన్స్ అవసరాలు తీవ్ర సవాళుగా ఉన్నాయి.వస్తువులు, సేవలను కొనుగోలు చేసిన 45 రోజుల్లోగా ఎంఎస్ఎంఈ (లఘు, సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు)లకు చెల్లింపులు జరపాలన్న నిబంధనను సడలించాలి. రుణ వ్య యాలను తగ్గించుకోవడానికి సంబంధించిన – ఇంట్రస్ట్ ఈక్విలైజేషన్ స్కీమ్ (ఐఈఎస్)ను ఐదు సంవత్సరాల పొడిగించాలి. దేశం నుంచి ఎగుమతయ్యే ఉత్పత్తులకు సంబంధించి కేంద్రం అమలుచేస్తున్న ఆర్ఓడీటీఈపీ (ఎగుమతి ఉత్పత్తులపై సుంకాలు, పన్నుల రిఫండ్) పథకం ప్రయోజనాలు అందిస్తున్నప్పటికీ, ఆయా ఉత్పత్తుల దిగుమతిదేశాలు విధిస్తున్న కౌంటర్వ్యాలింగ్ సుంకాలు (రాయితీలు పొందిన ఉత్పత్తులపై సుంకాలు– యాంటీ సబ్సిడీ సుంకాలు) ఎగుమతిదారులకు ఇబ్బందులను సృష్టిస్తున్నాయి. ఈ సమస్యపై ఈఐఎఫ్ఓ వాణిజ్య మంత్రిత్వశాఖతో చర్చిస్తోంది.భారత్–అమెరికా వాణిజ్య బంధం ఇలా.. మార్చితో ముగిసిన గత 2023–24లో భారతదేశానికి అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. గత ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ఎగుమతులు 77.51 బిలియన్ డాలర్లుగా ఉండగా, దిగుమతులు 42.2 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్–అక్టోబర్ కాలంలో అమెరికాకు దేశ ఎగుమతులు 6.31 శాతం పెరిగి 47.24 బిలియన్ డాలర్లకు చేరుకోగా, దిగుమతులు 2.46 శాతం పెరిగి 26 బిలియన్ డాలర్లకు ఎగశాయి. కొత్త అమెరికా ప్రభుత్వం ’అమెరికా ఫస్ట్’ అజెండాను అనుసరించాలని నిర్ణయించుకుంటే ఆటోమొబైల్స్, టెక్స్టైల్స్, ఫార్మాస్యూటికల్స్ వంటి వస్తువులపై భారతీయ ఎగుమతిదారులు అధిక కస్టమ్స్ సుంకాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని వాణిజ్య నిపుణులు పేర్కొన్నారు. -
పది దేశాలకు మరింతగా ఎగుమతులు
న్యూఢిల్లీ: ప్రభుత్వ తోడ్పాటు, పటిష్టమైన మార్కెటింగ్ వ్యూహాలతో పది దేశాలకు ఎగుమతులను పెంచుకునేందుకు మరింతగా అవకాశాలు ఉన్నాయని ఎగుమతిదారుల సమాఖ్య ఎఫ్ఐఈవో ఒక నివేదికలో పేర్కొంది. అమెరికా, బ్రిటన్ తదితర దేశాలకు 112 బిలియన్ డాలర్ల మేర పెంచుకోవచ్చని వివరించింది. సదరు దేశాల్లో నిర్వహించే ఎగ్జిబిషన్లలో దేశీ సంస్థలు పాల్గొనేందుకు, విక్రేతలు–కొనుగోలుదారుల సమావేశాలు మొదలైన వాటిని నిర్వహించడంలో పరిశ్రమకు తోడ్పాటు అందించేందుకు ప్రభుత్వం ఒక స్కీమును రూపొందించవచ్చని ఎఫ్ఐఈవో తెలిపింది. అలాగే, విదేశాల్లోని దిగుమతి సంస్థలు, దేశీ ఎగుమతి సంస్థల మధ్య సమావేశాలు నిర్వహించడంలో ఆయా దేశాల్లోని భారతీయ మిషన్లు పరిశ్రమకు తోడ్పాటు అందించవచ్చని పేర్కొంది. తయారీ రంగంలో భారత్ సామర్థ్యాలను సదరు దేశాల్లో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రచారం చేసే అవకాశాలను కూడా పరిశీలించవచ్చని ఎఫ్ఐఈవో వివరించింది. ‘112 బిలియన్ డాలర్ల మేర మరింతగా ఎగుమతులను పెంచుకునేందుకు అవకాశాలున్న 10 దేశాల్లో అమెరికా (31 బిలియన్ డాలర్లు), చైనా (22 బిలియన్ డాలర్లు), యూఏఈ (11 బిలియన్ డాలర్లు), హాంకాంగ్ (8.5 బిలియన్ డాలర్లు), జర్మనీ (7.4 బిలియన్ డాలర్లు), వియత్నాం (9.3 బిలియన్ డాలర్లు), బంగ్లాదేశ్ (5 బిలియన్ డాలర్లు), బ్రిటన్ (5.4 బిలియన్ డాలర్లు), ఇండొనేషియా (6 బిలియన్ డాలర్లు), మలేషియా (5.8 బిలియన్ డాలర్లు) ఉన్నాయి‘ అని ఎఫ్ఐఈవో తెలిపింది. 2030 నాటికి ఉత్పత్తులు, సేవల ఎగుమతులను 2 ట్రిలియన్ (లక్షల కోట్ల) డాలర్లకు పెంచుకోవాలని భారత్ నిర్దేశించుకుంది. 2022–23లో ఇవి 776 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. నివేదికలోని మరిన్ని వివరాలు.. ► నివేదిక ప్రకారం పది దేశాలకు ఎగుమతులను పెంచుకునేందుకు అవకాశాలున్న ఉత్పత్తుల జాబితాలో వజ్రాలు, వాహనాలు, ఆభరణాలు, ఎల్రక్టానిక్ ఉత్పత్తులు, ఆటో విడిభాగాలు, మెరైన్ ఉత్పత్తులు, దుస్తులు, క్రిమిసంహాకరాలు, ఇనుము .. ఉక్కు, టీ, కాఫీ మొదలైనవి ఉన్నాయి. ► అమెరికాకు డైమండ్లు (3.7 బిలియన్ డాలర్లు), మోటర్ వాహనాలు (2.2 బిలియన్ డాలర్లు), ఆభరణాలు (1.4 బిలియన్ డాలర్లు), టెలిఫోన్ సెట్లు, ఇతరత్రా వాయిస్/ఇమేజ్ ట్రాన్స్మిషన్ పరికరాలు (1.3 బిలియన్ డాలర్లు) మొదలైన వాటి ఎగుమతులను పెంచుకోవడానికి అవకాశం ఉంది. ► చైనాకు మోటర్ వాహనాలు, ఆటో విడిభాగాలు, ఆభరణాలు, పశుమాంసం, రొయ్యలు, మిరియాలు, గ్రానైట్, ఆముదం, అల్యూమినియం వంటి ఉత్పత్తుల ఎగుమతులు పెంచుకోవచ్చు. ► జర్మనీకి అల్యూమినియం, కాఫీ, దుస్తులు, జీడిపప్పు, మోటర్ వాహనాలు, ఆభరణాలు ఎగుమతి చేయొచ్చు. ► బ్రిటన్‌కు వజ్రాలు, ఆభరణాలు, రొయ్యలు, కలప ఫరి్నచరు, బియ్యం, బ్లాక్ టీ, టర్బోజెట్లు, ఆటో విడిభాగాలు, శాండ్‌స్టోన్, పిల్లల దుస్తుల ఎగుమతులను పెంచుకోవచ్చు. ► ఇండొనేషియా, మలేíÙయాకు ఇనుము..ఉక్కు ఐటమ్లు, ఆటో విడిభాగాలు, క్రిమిసంహారకాలు, అల్యూమినియం మిశ్రమ లోహాలు, రాగి క్యాథోడ్లు, రొయ్యలు, ఫార్మా ఉత్పత్తులను మరింతగా ఎగుమతి చేయొచ్చు. ► ఎగుమతులు పెరగడం వల్ల దేశీయంగా ఉద్యోగాల కల్పనకు, తయారీకి ప్రోత్సాహం లభిస్తుంది. విదేశీ మారకాన్ని ఆర్జించేందుకు వీలవుతుంది. -
ఎగుమతులు 900 బిలియన్ డాలర్ల పైనే..!
న్యూఢిల్లీ: భారత్ వస్తు, సేవల ఎగుమతులు ఏప్రిల్‌తో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2023–24) 900 బిలియన్ డాలర్లను దాటే అవకాశం ఉందని ఎగుమతిదారులు అంచనావేస్తున్నారు. అమెరికాసహా కీలక ప్రపంచ మార్కెట్లలో దేశీయ వస్తువులకు పటిష్ట డిమాండ్, అలాగే వాణిజ్య ఒప్పందాల వల్ల కలిగే ప్రయోజనాలు ఇందుకు దోహదపడతాయన్నది వారి విశ్లేషణ. రష్యా వంటి ఇతర దేశాల్లో డిమాండ్ కూడా భారత్ ఎగుమతులకు దోహదపడే అంశమని వారు పేర్కొంటున్నారు. ఆయా దేశాలకు ముఖ్యంగా వ్యవసాయ, ఆహార ప్రాసెసింగ్ రంగాలలో భారీ ఎగుమతులకు అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. 2023–24లో 500 నుంచి 510 బిలియన్ డాలర్ల మేర వస్తు ఎగుమతులు జరిగే అవకాశం ఉందని భారత్ ఎగుమతి సంఘాల సమాఖ్య (ఎఫ్ఐఈఓ) పేర్కొంది. దీనితోపాటు సేవల ఎగుమతులు సైతం 2022–23తో పోల్చితే (322.72 బిలియన్ డాలర్లు) భారీగా 390 బిలియన్ డాలర్లకు పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడింది. 2021–22లో భారత్ వస్తు ఎగుమతులు 422 బిలియన్ డాలర్లు ఉంటే, 2022–23లో 6 శాతం పెరిగి 447.5 బిలియన్ డాలర్లకు చేరిన సంగతి తెలిసిందే. అంచనాలు ఇలా... ► అంతర్జాతీయ వాణిజ్యంలో మన రూపాయికి కూడా తగిన స్థాయిని కల్పించాలన్న ప్రభుత్వ లక్ష్యం... ఎగుమతులకు సంబంధించి లావాదేవీల వ్యయాలను తగ్గిస్తుంది. ► పర్యాటకం, రవాణా, వైద్యం, ఆతిథ్యం సహా పలు రంగాలు గతేడాది వృద్ధికి దోహదం చేశాయి. ఐటీ, ఐటీ ఆధారిత సేవల ఎగుమతులు బలంగా సాగుతున్నాయి. యాత్రల రంగం త్వరలో వృద్ధి బాట పట్టనుంది. ► కరోనా అనంతర ఆర్థిక పునరుద్ధరణ విదేశీ మార్కెట్ల నుండి వస్తువులు, సేవలకు పెరుగు తున్న డిమాండ్‌ను సృష్టించింది. సరుకు రవాణా ఛార్జీల స్థిరీకరణ, సరఫరా వ్యవస్థ సాధారణీకరణ రవాణా రంగానికి సానుకూల పరిణామాలు. ► ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, లీగల్, అకౌంటింగ్ సేవలు, పరిశోధన, మేనేజ్మెంట్ కన్సల్టింగ్ వంటి వ్యాపార సేవలు ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా అందించిన అవకాశాలను సద్వినియో గం చేసుకోవడంలో ప్రయోజనం పొందుతాయి. ► ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో వృద్ధికి గణనీయమైన అవకాశం ఉంది. ఎగుమతి గమ్యస్థానాల వైవిధ్యం సంప్రదాయ మార్కెట్లపై ఆధారపడడాన్ని తగ్గించడానికి, ఎగుమతులకు కొత్త అవకాశాలను తెరవడానికి సాయపడుతుంది. ► ఎగుమతుల పురోగతే లక్ష్యంగా దేశం ఇటీవల ఆవిష్కరించిన విదేశీ వాణిజ్య పాలసీ (ఎఫ్టీపీ)ని భారత్‌ను ఈ రంగంలో వృద్ధి బాటన నడుపుతుంది. 2030 నాటికి దేశ ఎగుమతులను ఏకంగా 2 ట్రిలియన్ డాలర్లకు చేర్చడంతో పాటు రూపాయిని గ్లోబల్ కరెన్సీగా చేయాలని పాలసీ దోహదపడుతుందన్న విశ్వాసం ఉంది. ► వృద్ధి రేటును మరింత పెంచేందుకు కొన్ని ప్రో త్సాహకాలు అవసరం ఎంతైనా ఉంది. ప్రభు త్వం సరైన సహాయంతో గేమింగ్, ఎంటర్టైన్మెంట్లు చాలా బాగా పని చేస్తాయి. మిగిలిన రంగాలకూ తగిన సహాయ సహకారాలు అందాలి. ఎఫ్‌టీఏల దన్ను... వస్తు, సేవల ఎగుమతులు రెండూ కలిసి 2023–24లో విలువ 900 బిలియన్ డాలర్లుగా ఉండే వీలుంది. యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ (యూఏఈ), ఆస్ట్రేలియాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్‌టీఏ) ఆ మార్కెట్లలో ఎగుమతులను పెంచడానికి భారీ వేదికను అందిస్తాయి. ప్రొడక్షన్–లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కూడా భారత్ ఎగుమతులకు ప్రోత్సాహాన్ని అందిస్తుంది. ఎందుకంటే ప్రోత్సా హకాల కారణంగా దేశీయ ఉత్పత్తి పెరుగుతుంది. – అజయ్ సహాయ్, ఎఫ్ఐఈఓ డైరెక్టర్ జనరల్ ఆర్డర్ బుక్ పటిష్టం అమెరికా ఆర్థిక వృద్ధి పుంజుకుంటుందన్న సంకేతాలు ఉన్నాయి. భారత్ ఎగుమతుల్లో అమెరికా మార్కెట్ వాటా దాదాపు 18 శాతం. ఎగుమతులకు సంబంధించి ఆర్డర్ బుక్ బాగుంది. ఇదే ట్రెండ్ 2023–24 అంతా కొనసాగుతుందని భావిస్తున్నాం. దీనితో వస్తు ఎగుమతులు 500 బిలియన్ డాలర్లు దాటతాయని భావిస్తున్నాం. – ఎస్సి రాల్హాన్, హ్యాండ్ టూల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ యుద్ధ ప్రభావం తగ్గుతోంది 2022–23 కంటే 2023–24 ఆర్థిక సంవత్సరం ఎగుమతులుకు బాగుంటుందని భావిస్తున్నాం. మన పరిశ్రమపై రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం తగ్గిపోతోంది. ఎందుకంటే వాణిజ్యం–ఇంధన వనరులకు పరిశ్రమ ప్రత్యామ్నాయ మార్గాన్ని కనుగొన్నది. భారతదేశంలో మౌలిక సదుపాయాలలో గణనీయమైన మెరుగుదల ఉంది. అది ఎగుమతిదారులకు గట్టి మద్దతునిస్తుంది. – శారదా కుమార్ సరాఫ్, టెక్నోక్రాఫ్ట్ ఇండస్ట్రీస్ చైర్మన్ 2022–23కంటే బెటర్... గత ఆర్థిక సంవత్సరం కంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఎగుమతులు పటిష్టంగా ఉంటాయని విశ్వసిస్తున్నాను. ముఖ్యంగా... కార్మికరంగం ఆవశ్యకత ఉన్న రంగాలు మంచి పనితనాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఇది ఎగుమతులకు దోహపదడే అంశాల్లో ఒకటి. – ఖలీద్ ఖాన్, జికో ట్రేడింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ -
లాజిస్టిక్స్ వ్యయాలు తగ్గుతాయి
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్‌పై సుంకాలతో పాటు ప్లాస్టిక్, స్టీల్ మొదలైన వాటికి సంబంధించిన ముడి సరుకులపై కస్టమ్స్ డ్యూటీలను తగ్గించడం వల్ల లాజిస్టిక్స్ వ్యయాలు దిగివచ్చేందుకు వీలవుతుం దని ఎగుమతిదారులు తెలిపారు. తయారీలో పోటీతత్వం మెరుగుపడేందుకు, విలువను జోడించిన ఉత్పత్తుల ఎగుమతులకు తోడ్పడగలదని పేర్కొన్నారు. అలాగే దేశీయంగా ద్రవ్యోల్బణం తగ్గగల దని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేష న్స్ (ఎఫ్ఐఈవో) ప్రెసిడెంట్ ఎ. శక్తివేల్ తెలిపారు. టెక్స్టైల్స్ ముడి వనరుల విషయంలోనూ ఇదే తరహా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. పత్తి ఎగుమతులపై సుంకాలు విధించి, కాటన్ యార్న్ దిగుమతులపై సుంకాలు ఎత్తివేస్తే దేశీ పరిశ్రమలకు సహాయకరంగా ఉంటుందని పేర్కొన్నా రు. పెట్రోల్‌పై లీటరుకు రూ. 8, డీజిల్‌పై లీటరుకు రూ. 6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. వీటితో పాటు ఉక్కు, ప్లాస్టిక్ ముడి సరుకులకు సంబంధిం చి దిగుమతి సుంకాలను కూడా తగ్గించిన కేంద్రం.. ముడి ఇనుము, ఉక్కు ఇంటర్మీడియట్స్పై ఎగుమతి సుంకాన్ని పెంచింది. -
శుభవార్త..వారికి రూ. 1.75 లక్షల కోట్ల రిఫండ్..!
ఎగుమతిదారులకు మార్చితో ముగిసిన క్రితం ఆర్థిక సంవత్సరంలో (2021–22) రూ.1.75 లక్షల కోట్ల డ్యూటీ డ్రాబ్యాక్, జీఎస్టీ రిఫండ్స్ జరిపినట్లు పరోక్ష పన్నులు, కస్టమ్స్ సెంట్రల్ బోర్డ్ (సీబీఐసీ) చైర్మన్ వివేక్ జోహ్రీ ‘సివిల్ సర్వీసెస్ డే’ కార్యక్రమంలో తెలిపారు. ఈ–కామర్స్ ద్వారా రత్నాలు, ఆభరణాల ఎగుమతులను సులభతరం చేయడానికి తమ శాఖ ఒక పథకంపై కసరత్తు చేస్తోందని ఆయన వెల్లడించారు. రిఫండ్స్ త్వరిత గతిన జరగడానికి, ఎగుమతిదారులకు వర్కింగ్ క్యాపిటల్ సౌలభ్యతకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. 2021–22లో డ్యూటీ డ్రాబ్యాక్ పంపిణీ రూ.24,000 కోట్లుకాగా, జీఎస్టీ రిఫండ్స్ విలువ రూ.1.51 లక్షల కోట్లని వివరించారు. 2020–21తో పోత్చితే ఇది 33 శాతం అధికమని వివరించారు. రెవెన్యూ పురోగతికి తమ శాఖ తగిన చర్యలు అన్నింటినీ తీసుకుంటున్నట్లు తెలిపారు. డిజిటలైజేషన్ ప్రణాళికలను ఆయన ప్రస్తావిస్తూ, ‘‘ప్రత్యేక ఆర్థిక జోన్ల (ఎస్ఈజెడ్) యూనిట్లకు వర్తించే కస్టమ్స్ ప్రాసెస్ మొత్తం డిజిటలైజేషన్ చేసే విషయంపై కసరత్తు చేస్తున్నాము. ఇ–కామర్స్ ద్వారా రత్నాలు– ఆభరణాల ఎగుమతుల కోసం పథకాలను రూపొందించడంపై దృష్టి సారిస్తున్నాము. దేశీయంగా ఇప్పటికే ఈ విధానం అమలవుతోంది. ఈ–కామర్స్ ద్వారా ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూర్చాలన్నది మా ప్రధాన ఉద్దేశం’’ అని అన్నారు. ఎగుమతులు–దిగుమతులు, ఇందుకు సంబంధించి చెల్లింపుల పరిష్కార ప్రక్రియలో ఈ–కామర్స్‌కు పెద్దపీట వేయడంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ఈ దిశలో ఆయా అంశాలను సరళీకరించి, హేతుబద్దీకరించడంపై కీలక చర్య తీసుకుంది. ఇందుకు వీలుగా ప్రస్తుత నిబంధనలను సవరించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఒక ముసాయిదా మార్గదర్శకాల పత్రాన్ని సెంట్రల్ బ్యాంక్ ప్రతిపాదించింది. ‘‘ఎగుమతి, దిగుమతులకు సంబంధించి చిన్న స్థాయి చెల్లింపుల పక్రియను ఈ కామర్స్ ద్వారా సులభతరం చేయడానికి తీసుకువస్తున్న ఆన్లైన్ ఎక్స్పోర్ట్–ఇంపోర్ట్ ఫెసిలిటేటర్స్’ అనే శీర్షికన మార్గదర్శకాలు జారీ అయ్యాయి. బ్యాంకులు, ఇతర సంబంధిత వర్గాల నుంచి స్వీకరించిన అభిప్రాయాల ప్రాతిపదిక, సమగ్ర సమీక్ష అనంతరం తగిన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది’’ అని ఇటీవల ఆర్బీఐ ప్రకటన సూచించింది. చదవండి: సిమెంటుకు పెరగనున్న డిమాండ్ -
ఐటీ కంపెనీలకు యుద్ధం సెగ
న్యూఢిల్లీ: ఉక్రెయిన్–రష్యా సంక్షోభ ప్రభావం భారత ఐటీ కంపెనీలనూ తాకుతోంది. ప్రత్యక్షంగా భారత ఐటీ కంపెనీలపై పడే ప్రభావం కంటే పరోక్ష ప్రభావమే ఎక్కువగా ఉండనుంది. ఐరోపా ప్రాంతంలోని క్లయింట్లు ఐటీపై చేసే వ్యయాలను తగ్గించుకోవడం లేదా వాయిదా వేసుకునే పరిస్థితి నెలకొని ఉన్నట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే అంతర్జాతీయ కంపెనీలు కొన్ని రష్యా నుంచి తప్పుకోవడం లేదా అక్కడి కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేయడాన్ని ప్రస్తావిస్తున్నారు. యుద్ధం కారణంగా పెరిగిపోయిన ద్రవ్యోల్బణ ప్రభావం కూడా కొత్త కాంట్రాక్టుల చార్జీల్లో జాప్యానికి దారితీస్తుందన్నది అంచనా. ఈ పరిస్థితులతో సాఫ్ట్వేర్ ఎగుమతిదారులు సమీప కాలంలో స్తబ్దత చూడొచ్చన్న అభిప్రాయం వినిపిస్తోంది. 227 బిలియన్ డాలర్ల దేశీ ఐటీ ఎగుమతుల్లో రష్యా వాటా 1–2 శాతం మేర ఉంటుంది. ‘‘రష్యా–ఉక్రెయిన్ మధ్య ఘర్షణతో భారత ఐటీ పరిశ్రమ ఇబ్బందులు ఎదుర్కొంటుందని మా అభిప్రాయం. వచ్చే కొన్ని త్రైమాసికాల్లో కాంట్రాక్టులకు సంబంధించి నిర్ణయాల్లో జాప్యానికి.. మొత్తం కాంట్రాక్టుల విలువ నిదానించడానికి దారితీస్తుంది’’అని దోలత్ క్యాపిటల్ పేర్కొంది. ఐటీపై తగ్గనున్న వ్యయాలు అంతర్జాతీయంగా ఐటీ సేవల వృద్ధి అంచనాలను 2022 సంవత్సరానికి 10 శాతం నుంచి 7 శాతానికి తగ్గిస్తున్నట్టు కన్సల్టెన్సీ సంస్థ హెచ్ఎఫ్ఎస్ రీసెర్చ్ ఇటీవలే ప్రకటించింది. ద్రవ్యోల్బణం అధికంగా ఉండడం, భౌగోళిక రాజకీయ సమస్యలతో ఐటీ సేవలపై చేసే ఖర్చు తగ్గుతుందన్నది ఈ సంస్థ అంచనా. మొత్తం కాంట్రాక్టుల విలువ తగ్గొచ్చని పేర్కొంది. నిజానికి కరోనా వచ్చిన తర్వాత నుంచి ఐటీ రంగం కొత్త దశను చూస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లోనూ డిజిటైజేషన్ ఊపందుకుంది. దీంతో కంపెనీలు పెద్ద సంఖ్యలో ఆర్డర్లను సంపాదించాయి. 2021లో అంతర్జాతీయంగా 33 బిలియన్ డాలర్ల ఐటీ సేవల ఆర్డర్లలో భారత ఐటీ సంస్థలు 31 శాతం అందుకున్నాయని.. ఈ వాటా ఇంకా పెరగొచ్చని ఐటీ పరిశోధనా సంస్థ ఐఎస్జీ అంచనా. మొదటిసారి వచ్చే ఆర్డర్లపై ప్రభావం ఉండకపోవచ్చని దోలత్ క్యాపిటల్ అంటోంది. అదే సమయంలో ఆదాయం, వ్యయాలపై ఉన్న ప్రభావాన్ని విస్మరించడానికి లేదని, ఐటీ సేవలకు సంబంధించి మరీ ఎక్కువ ఆశావహ అంచనాలు సరికాదని పేర్కొంది. భారత ఐటీ రంగం కరోనా ముందు నాటితో పోలిస్తే వేగంగా రెట్టింపై 227 బిలియన్ డాలర్లకు (రూ.17 లక్షల కోట్లు) చేరుకోవడం గమనార్హం. 2021–22 నాటికి 50 లక్షల మందికి ఉపాధి కల్పిస్తోంది. యుద్ధం మొదలైన తర్వాత నుంచి అమెరికా, ఐరోపా దేశాలు రష్యాపై ఎన్నో ఆర్థిక ఆంక్షలు విధించడం తెలిసిందే. దీంతో రష్యాతో వ్యాపారం నిర్వహించడం దాదాపు అధిక శాతం అంతర్జాతీయ కంపెనీలకు అసాధ్యమనే చెప్పుకోవాలి. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఇంధన ఎగుమతి దేశమైన రష్యాతో చమురు సరఫరా తెంపుకోవడం కూడా ద్రవ్యోల్బణం, కమోడిటీ ధరలు మరింత పెరగడానికి దారితీయవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితులు డిజిటల్, టెక్నాలజీపై చేసే వ్యయాలను తాత్కాలికంగా నిలిపివేయవచ్చన్నది దోలత్ విశ్లేషణగా ఉంది. -
Kannababu: ‘తూర్పు’లో పరిశ్రమల స్థాపనకు అవకాశాలు
కాకినాడ రూరల్: తూర్పుగోదావరి జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అన్ని సదుపాయాలూ ఉన్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న వాణిజ్య ఉత్సవంలో భాగంగా కాకినాడలో ఎగుమతిదారుల సమ్మేళనం (ఎక్స్‌పోర్టర్స్ కాన్క్లేవ్) శనివారం విజయవంతంగా నిర్వహించారు. ఈ సమ్మేళనాన్ని రాష్ట్ర మంత్రులు కన్నబాబు, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ప్రారంభించారు. ఈ సమ్మేళనంలో 28 స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో వాణిజ్య అభివృద్ధితో పాటు పరిశ్రమలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లతో పాటు పెద్ద పరిశ్రమలు నెలకొల్పేందుకు చక్కని అవకాశాలున్నాయని వివరించారు. ఇప్పటికే రెండు పోర్టులు అందుబాటులో ఉండగా మరొకటి రాబోతోందని తెలిపారు. ఎగుమతులను ప్రోత్సహించేందుకు తమ ప్రభుత్వం ముందుంటుందని, పెట్టుబడిదారులు ఉత్సాహంగా ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్, కాకినాడ ఎంపీ వంగా గీత, ఎమ్మెల్సీ పండుల రవీంద్ర, ఎమ్మెల్యేలు చంద్రశేఖరరెడ్డి, జక్కంపూడి రాజా, పొన్నాడ సతీష్ పాల్గొన్నారు. -
చైనాకు తెలుగు రాష్టాల నుంచి వెంట్రుకల స్మగ్లింగ్!
సాక్షి, హైదరాబాద్: చైనా సహా పలు దేశాలకు ‘ఫెమా’నిబంధనలను ఉల్లంఘించి తల వెంట్రుకలు ఎగుమతి చేస్తున్న తెలంగాణ, ఏపీకి చెందిన పలువురు వ్యాపారులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కొరడా ఝళిపించింది. హైదరాబాద్, తూర్పు గోదావరి జిల్లాలో 8 చోట్ల ఆకస్మిక తనిఖీలు చేపట్టి ఆయా వ్యాపారులు లెక్కల్లో చూపని రూ. 2.90 కోట్ల నగదును జప్తు చేసింది. అలాగే వారి నుంచి 12 సెల్ఫోన్లు, మూడు లాప్‌టాప్‌లు, ఒక కంప్యూటర్, కొన్ని డైరీలను స్వాధీనం చేసుకుంది. ఈ మేరకు ఈడీ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. చైనా యాప్స్‌పై దర్యాప్తులో కదిలిన డొంక.. చైనాకు చెందిన పలు ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్‌పై నమోదైన ఓ మనీలాండరింగ్ కేసును దర్యాప్తు చేస్తున్న క్రమంలో తెలంగాణ, ఏపీకి చెందిన తల వెంట్రుకల ఎగుమతిదారులకు రూ. 16 కోట్ల మేర హవాలా చెల్లింపులు జరిగినట్లు గుర్తించామని ఈడీ తెలిపింది. ఇందుకు సంబంధించి వారిపై ‘ఫెమా’నిబంధనల కింద దర్యాప్తు చేపట్టగా అక్రమ చైనీస్ యాప్‌ను ఉపయోగించి హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు వ్యాపారస్తులు ఈశాన్య ప్రాంతానికి చెందిన వ్యాపారస్తులకు తల వెంట్రుకలు విక్రయించి పేటీఎం ద్వారా రూ. 3.38 కోట్లు ఆర్జించినట్టు గుర్తించామని ఈడీ వివరించింది. ఈ వ్యవహారంలో కొందరు మయన్మార్ జాతీయుల ప్రమేయాన్ని గుర్తించినట్లు తెలిపింది. హైదరాబాద్‌లో తిష్ట వేసిన పలువురు మయన్మార్ జాతీయలు భారతీయులు/భారతీయ సంస్థల కోసం ఉద్దేశించిన ఇంపోర్ట్–ఎక్స్పోర్ట్ కోడ్‌ను వాడి తల వెంట్రుకల విలువను తక్కువగా చూపి వారి దేశానికి ఎగుమతి చేస్తున్నట్లు తేలిందని ఈడీ వివరించింది. మయన్మార్, బంగ్లాదేశ్, వియత్నాం, ఆస్ట్రియా తదితర దేశాలకు తక్కువ పరిమాణంలో వెంట్రుకలను చూపి ఎక్కువ పరిమాణంలో వాటిని విక్రయించినట్లు ప్రాథమిక పరిశీలనలో తేలినట్టు ఈడీ వెల్లడించింది. కొందరు వ్యాపారస్తులు తమ ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో విక్రయాల డబ్బులు పొందుతున్నట్లు ఈడీ గుర్తించింది. ఈ వ్యహారంపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు ప్రకటించింది. చైనా వయా మయన్మార్.. హైదరాబాద్, కోల్‌కతా, గువాహటికి చెందిన చాలా మంది వ్యాపారస్తులు విదేశీ వ్యాపారులకు వెంట్రుకలను ఎగుమతి చేస్తున్నట్టు ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. మోరెహ్ (మణిపూర్), జొఖాతర్ (మిజోరం), ఐజ్వాల్ (మిజోరం) గుండా మండాలె (మయన్మార్)కు, అక్కడి నుంచి చైనాకు వెంట్రుకలను స్మగ్లింగ్ చేస్తున్నట్లు ఈడీ గుర్తించింది. భారత్ నుంచి స్మగ్లింగ్ చేసిన వెంట్రుకలను చైనీస్ వెంట్రుకలుగా అక్కడి వ్యాపారస్తులు పేర్కొని దిగుమతి సమయంలో 28 శాతం సుంకాన్ని ఎగ్గొట్టడంతోపాటు ఎగుమతి సమయంలో 8 శాతం రాయితీలను పొందుతున్నారు. చాలా మంది భారత వ్యాపారవేత్తలు సైతం వెంట్రుకల ఎగుమతి సమయంలో వాటి పరిమాణాన్ని తగ్గించి చూపి ఎగుమతి సుంకాన్ని ఎగ్గొట్టుతున్నట్టు ఈడీ గుర్తించింది. -
తాలిబాన్ ఎఫెక్ట్.. ఎగుమతిదారుల్లో ఆందోళన
న్యూఢిల్లీ: అఫ్గానిస్తాన్‌లో నెలకొన్న అనిశ్చితి కారణంగా ఆ దేశంతో భారత్ ద్వైపాక్షిక వాణిజ్యంపై గణనీయంగా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ఎగుమతిదారుల సమాఖ్య ఎఫ్ఐఈవో అభిప్రాయపడింది. అఫ్గానిస్తాన్‌లో రాజకీయ పరిణామాలు, ముఖ్యంగా చెల్లింపులకు సంబంధించిన విషయాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలని దేశీ ఎగుమతిదారులకు ఎఫ్ఐఈవో డైరెక్టర్ జనరల్ అజయ్ సహాయ్ సూచించారు. అఫ్గానిస్తాన్.. తాలిబాన్ల నియంత్రణలోకి వెళ్లిపోవడం, పరిస్థితులు అదుపు తప్పడం వంటి పరిణామాల కారణంగా కొంత సమయం పాటు ఇరు దేశాల మధ్య వాణిజ్యం స్తంభించిపోవచ్చని ఎఫ్ఐఈవో వైస్ ప్రెసిడెంట్ ఖాలిద్ ఖాన్ తెలిపారు. అనిశ్చితి తొలగిపోయిన తర్వాతే తిరిగి లావాదేవీలు ప్రారంభం కావచ్చని వివరించారు. అఫ్గానిస్తాన్‌కు భారత్ ఇస్తున్న ఆర్థిక సహాయం వల్ల దేశీ ఉత్పత్తులకు మార్కెట్ ఉంటోందని, ప్రస్తుత పరిస్థితుల్లో ఇదంతా నిల్చిపోవచ్చని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ప్రొఫెసర్ బిస్వజిత్ ధర్ పేర్కొన్నారు. సకాలంలో చెల్లింపులు జరుగుతాయో లేదోనన్న సందేహాల వల్ల అఫ్గానిస్తాన్‌కు భారత్ నుంచి ఎగుమతులు పూర్తిగా నిల్చిపోవచ్చని సాయి ఇంటర్నేషనల్ సంస్థ చీఫ్ రాజీవ్ మల్హోత్రా పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2019–20 ఆర్థిక సంవత్సరంలో 1.52 బిలియన్ డాలర్లుగా ఉండగా, 2020–21లో 1.4 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. భారత్ నుంచి ఎగుమతులు 826 మిలియన్ డాలర్లుగా ఉండగా, దిగుమతులు 510 మిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. -
చైనా ఉత్పత్తుల బహిష్కరణ సాధ్యమేనా?
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి ప్రకంపనలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించడం, దేశ సరిహద్దు వద్ద చైనా దుశ్చర్యతో 20 మంది సైనికుల మరణం తరువాత దేశీయంగా చైనాపై ఆగ్రహం మరింత రాజుకుంది. చైనా వస్తువులు, దిగుమతులను నిషేధించి, దాని ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టాలన్న డిమాండ్ ఎక్కువగా వినిపిస్తోంది. అయితే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్ ఇందుకు భిన్నంగా స్పందించింది. చైనా వస్తువులను బహిష్కరించడం సాధ్యం కాకపోవచ్చని వ్యాఖ్యానించింది. చైనా దిగుమతులపై భారత్ ఎక్కువగా ఆధారపడి ఉన్నందున బహిష్కరణ డిమాండ్ నెరవేరకపోవచ్చని గురువారం అభిప్రాయపడింది. అయితే చైనా ఉత్పత్తులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు ప్రయత్నించాలని తెలిపింది. (గణేష్ విగ్రహాలు కూడా చైనా నుంచేనా ?) దేశ సరిహద్దు వద్ద చైనాతో ఏర్పడిన వివాదం నేపథ్యంలో భారతదేశ స్వావలంబన అంశంపై ప్రభుత్వానికి మద్దతునిస్తున్నాం, కానీ మనం చాలా కీలకమైన ముడి పదార్థాల కోసం చైనాపై ఆధారపడుతున్నామనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్ అధ్యక్షుడు శరద్ కుమార్ సారాఫ్ అన్నారు. భారతీయ వస్తువులకు ప్రాధాన్యత ఇవ్వాలని, చైనా వస్తువులను కొనడం మానేయాలని ప్రభుత్వం భారతీయులను కోరాలి. కానీ చైనా ఉత్పత్తులను నిషేధించడం లేదా బహిష్కరించాలన్న డిమాండ్ అన్ని భారతీయ తయారీదారులను కష్టాల్లోకి నెడుతుందన్నారు. మనం ఎగుమతి చేసే వస్తువులను తయారు చేయడానికి చాలా ముడి పదార్థాలను దిగుమతి చేసుకుంటామని సంస్థ డైరెక్టర్ జనరల్ అజయ్ సహాయ్ అన్నారు. (బాయ్ కాట్ చైనా : సీఏఐటీ మరో అడుగు) కాగా చైనా ఉత్పత్తులను బహిష్కరించాలనే ప్రచారంలో ముందంజలో ఉన్న ట్రేడ్ బాడీ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) 'చైనాను బహిష్కరించండి' అంటూ దేశీయ టాప్ పారిశ్రామికవేత్తలకు ఒక లేఖ రాసిన సంగతి తెలిసిందే. -
ఎగుమతిదారులకు వడ్డీ రాయితీ స్కీమ్ పొడిగింపు!
న్యూఢిల్లీ: ఎగుమతిదారులకు వడ్డీ రాయితీ పథకాన్ని (ఈక్వలైజేషన్ స్కీమ్) కేంద్ర ప్రభుత్వం పొడిగించే అవకాశాలున్నాయి. ఎగుమతుల రంగానికి సంబంధించిన ఈ పథకం 2015, ఏప్రిల్‌లో మొదలైంది. ఎంపిక చేసిన వస్తువులకు సంబంధించిన రుణాలపై 3–5 శాతం సబ్సిడీనిచ్చే ఈ స్కీమ్ ఈ ఏడాది మార్చి 31న ముగిసింది. కరోనా వైరస్ కల్లోలంతో కుదేలైన ఎగుమతుల రంగాన్ని ఆదుకునే చర్యల్లో భాగంగా ఈ స్కీమ్‌ను పొడిగించే అవకాశాలున్నాయని ప్రభుత్వ ఉన్నతాధికారొకరు సూచన ప్రాయంగా వెల్లడించారు. ఫిక్కీ నిర్వహించిన వెబినార్‌లో విదేశీ వాణిజ్య విభాగం డైరెక్టర్ జనరల్ అమిత్ యాదవ్ మాట్లాడారు. రానున్న వారాల్లో ఈ స్కీమ్ పొడిగింపునకు సంబంధించి శుభవార్త వింటారనిపేర్కొన్నారు -
ఉత్పత్తులు నేరుగా సరఫరా చేయండి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘వివిధ దేశాలకు చెందిన విక్రేతలు భారత్ నుంచి ఉత్పత్తులను కొనుగోలు చేసి ఐక్యరాజ్యసమితికి సరఫరా చేస్తున్నారు. అలా కాకుండా తయారీదారులే నేరుగా ఎగుమతి చేసే స్థాయికి ఎదగాలి’ అని ఐక్యరాజ్యసమితి ప్రొక్యూర్మెంట్ డివిజన్ సీనియర్ ప్రొక్యూర్మెంట్ ఆఫీసర్ బ్రూనో మబోజా చెప్పారు. ‘యునైటెడ్ నేషన్స్‌తో వ్యాపార అవకాశాలు’ అన్న అంశంపై గురువారం ఫ్యాప్సీ ఆధ్వర్యంలో ఇక్కడ జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఎగుమతిదారులతో మాట్లాడారు. ఐరాసతో (యూఎన్) వ్యాపారం చేయడం చాలా సులభమన్నారు. ‘‘కాకపోతే ఉత్పత్తులు గానీ, సేవలు గానీ నిబంధనలకు అనుగుణంగా ఉండి తీరాలి. ‘2017లో పలు దేశాల నుంచి యునైటెడ్ నేషన్స్ చేసిన కొనుగోళ్ల విలువ రూ.1,26,000 కోట్లు. ఇందులో భారత్ రూ.6,350 కోట్ల విలువైన ఎగుమతులతో రెండవ స్థానంలో ఉంది’ అని వివరించారు. కొనుగోలు కేంద్రం పెట్టండి..: ఐక్యరాజ్యసమితి ప్రొక్యూర్మెంట్ డివిజన్ ప్రాంతీయ కొనుగోలు కేంద్రం హైదరాబాద్‌లో నెలకొల్పాల్సిందిగా భారత విదేశాంగ శాఖ, హైదరాబాద్ బ్రాంచ్ సెక్రటేరియట్ హెడ్, రీజినల్ పాస్‌పోర్ట్ ఆఫీసర్ ఇ.విష్ణువర్ధన్ రెడ్డి కోరారు. ఇ–ప్రొక్యూర్మెంట్ నిబంధనలు ఇక్కడి ఎగుమతిదార్లకు అనుగుణంగా రూపొందించాలని అభ్యర్థించారు. ఫార్మా వంటి ఉత్పత్తుల ఎగుమతికోసం నిర్దేశించిన టెక్నికల్ స్పెసిఫికేషన్లలో అడ్డంకులు ఉన్నాయని, వాటిని తొలగించాలని కోరారు. యూఎన్‌కు ఎగుమతులకై ఇక్కడి వ్యాపారులకు సాయపడేందుకు ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఒకటి ఏర్పాటు చేయాలని తెలంగాణ పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ ఫ్యాప్సీని కోరారు. అడ్డంకులను తొలగించడం ద్వారా రాష్ట్రం నుంచి ఎగుమతులను పెంచేందుకు బలమైన వ్యూహాన్ని అమలు చేయనున్నట్టు చెప్పారు. -
మొట్టమొదటిసారి పెరుగుతున్న వాణిజ్య అడ్డంకులు
గత దశాబ్దకాలంలో తొలిసారి ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య అడ్డంకులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఓ వైపు బ్రెగ్జిట్ చర్చలు, మరోవైపు అమెరికా విధిస్తున్న టారిఫ్‌లు, దాని ప్రతీకారంగా ఇతర దేశాలు తీసుకుంటున్న నిర్ణయాలు అంతర్జాతీయ వాణిజ్యాన్ని దెబ్బకొడుతున్నాయి. బ్రెగ్జిట్ చర్చలతో వ్యాపార మార్కెట్లో అస్థిరత ఏర్పడిన సంగతి తెలిసిందే. ఆ అస్థిరత ఇంకా కొనసాగుతూ ఉండగానే... అమెరికా ఇతర దేశాల నుంచి దిగుమతి అయ్యే స్టీల్, అల్యూమినియంపై టారిఫ్‌లు విధించింది. ఈ టారిఫ్‌లను తీవ్రంగా నిరసిస్తూ.. ఇతర దేశాలు కూడా అమెరికాపై ప్రతీకార చర్యలు తీసుకుంటున్నాయి. దీంతో అంతర్జాతీయ వాణిజ్యం సన్నగిల్లుతోందని ప్రపంచ నేతలు అంటున్నారు. తాజాగా కెనడాలో జరిగిన జీ7 సమావేశంలో కూడా అంతర్జాతీయ ప్రతినిధులు ఇదే విషయంపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. పశ్చిమ దేశాల అధినేతలందరూ తమ తమ ఆందోళనను వెల్లబుచ్చారు. ఈ నేపథ్యంలో ప్రపంచంలో అతిపెద్ద ఎగుమతిదారుల జాబితా కూడా మారిపోయిందని తెలిసింది. అసలు 2017లో టాప్ ఎగుమతిదారులుగా ఉన్న దేశాలేమిటో ఓ సారి చూద్దాం.. ఏడాదికి 2.26 ట్రిలియన్ డాలర్ల ఎగుమతులతో 2017లో చైనా ఆధిపత్య స్థానంలో ఉంది. ఆ అనంతరం జర్మనీ భారీ మొత్తంలో ఆటోమొబైల్స్‌ను ఎగుమతి చేసి.. ప్రతేడాది 1.45 ట్రిలియన్ డాలర్లను ఆర్జించింది. అంటే ఒక్కో వ్యక్తికి 18వేల డాలర్లు వచ్చాయన్న మాట. అయితే అమెరికా ప్రపంచంలో రెండో అతిపెద్ద ఎగుమతిదారిగా ఉన్నప్పటికీ, తలసరి ఆదాయం పరంగా చూసుకుంటే మాత్రం మొత్తం ఎగుమతుల్లో జర్మనీ కంటే తక్కువ స్థాయిల్లోనే ఉన్నట్టు వెల్లడైంది. 2017లో అమెరికా 1.55 ట్రిలియన్ డాలర్ల ఎగుమతలు చేపట్టింది. అంటే ఒక్కో వ్యక్తికి 4,800 డాలర్లు మాత్రమే ఆర్జించింది. -
ఆక్వా రైతులతో సీఎం సమావేశం
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆక్వా రైతులు, ఎగుమతిదారులతో శనివారం సమావేశం ఏర్పాటు చేశారు. ఆక్వా రంగాన్ని, రాయలసీమలో ఉద్యాన రంగాన్ని తాము ప్రోత్సహిస్తూ వచ్చామని, ఆక్వా రైతు బాగుండాలనే విద్యుత్ ధరలు తగ్గించినట్టు చెప్పారు. ఆక్వా సాగుకు వినియోగించే విద్యుత్‌పై మరింత సబ్సిడీ ఇవ్వనున్నామని తెలిపారు. ఏడాది పాటు యూనిట్ విద్యుత్ రూ.2కే సరఫరా చేయనున్నట్టు పేర్కొన్నారు. దీంతో ప్రభుత్వంపై రూ.300 కోట్లకు పైగా అదనపు భారం పడనుందని చెప్పారు. పర్యావరణ పరిరక్షణకు ఆక్వా రైతులు ప్రాముఖ్యత ఇవ్వాలని, ఇష్టానుసారంగా యాంటీ బయాటిక్స్ వినియోగించడం మంచిది కాదని చంద్రబాబు రైతులకు సూచించారు. పర్యావరణ రహితంగా వ్యాధుల నియంత్రణపై దృష్టి పెట్టాలని, పెట్టుబడి వ్యయాన్ని తగ్గించుకోవాలని రైతులకు చెప్పారు. రిజిస్ట్రేషన్ లేకుండా ఆక్వా సాగు సరికాదని, అక్రమ సాగుపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించకుండా.. నష్టపోకుండా అందరూ జాగ్రత్త పడాలని హెచ్చరించారు. ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పేందుకు ముందుకొచ్చేవారికి రైతులు సహకరించినప్పుడే గిట్టుబాటు ధర లభిస్తుందని, రొయ్యల ఫీడ్ ధరలపై ఉత్పత్తిదారులు-రైతులు ఒకరిని ఒకరు నిందించుకోకుండా సమస్యను పరిష్కరించుకోవాలని చంద్రబాబు సూచించారు. -
విత్‌డ్రా పరిమితిని రూ.5లక్షలకు పెంచండి!
పెద్దనోట్ల రద్దుతో ఉత్పత్తి చైన్‌లో ఏర్పడిన అవాంతరాలకు ఆందోళన చెందుతున్న ఎగుమతిదారులకు వాణిజ్యశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ భరోసా ఇచ్చారు. వారు కోరుతున్నట్లు విత్‌డ్రా పరిమితులు పెంచాలనే డిమాండ్‌ను ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ దృష్టికి తీసుకెళ్లనున్నట్టు నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు. నోట్ల రద్దు ప్రభావంతో ఉత్పత్తి చైన్‌లో ఏర్పడిన అడ్డంకులపై ఎక్స్‌పోర్టు ప్రమోషన్ కౌన్సిల్ సోమవారం సీతారామన్‌తో భేటీ అయింది. నోట్ల రద్దుతో వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై మంత్రితో కౌన్సిల్ చర్చించింది. ముడి పదార్థాల సేకరణ విభాగంలో ఎక్కువగా నగదు లావాదేవీలే జరుగుతాయని చాలామంది చెప్పినట్టు సీతారామన్ పేర్కొన్నారు. ప్రస్తుతమున్న విత్‌డ్రా పరిమితి రూ.50వేల నుంచి రూ.5 లక్షలకు పెంచాలని ఎగుమతిదారులు డిమాండ్ చేస్తున్నట్టు ఆమె తెలిపారు. కార్పెట్, హ్యాండ్లూమ్ వంటి రంగాల్లో కార్మికులు ఎక్కువగా ఉంటారని, ఈ రంగాలు నగదు లావాదేవీలపైనే పనిచేస్తాయని, వారు విత్‌డ్రా పరిమితిని రూ.3 లక్షలు లేదా రూ.4 లక్షలు లేదా రూ.5 లక్షలకు పెంచాలని కోరుతున్నట్టు ఆమె పేర్కొన్నారు. ఎగుమతిదారులు కోరుతున్న ఈ డిమాండ్లను వెంటనే ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీకి దృష్టికి తీసుకెళ్తామని, వెంటనే దీనికి ఉపశమన చర్యలు తీసుకునేలా సహకరిస్తామని హామీ ఇచ్చినట్టు సీతారామన్ వివరించారు. నగదు ఉపసంహరణ పరిమితులతో కొన్ని రంగాలోని యూనిట్లు వారం రోజులు నిలిపివేయాలని నిర్ణయించగా.. కొన్ని యూనిట్లు 100 లేదా 70 శాతంగా ఉన్న ఉత్పత్తి సామర్థ్యాన్ని 35 నుంచి 40 శాతానికి కుందించనున్నాయి. -
చౌకగా.. నాణ్యమైన ఉత్పత్తులు
ఎగుమతిదారులకు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సూచన న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా డిమాండ్ మందగించడం వల్ల ఎగుమతులు క్షీణిస్తుండటంపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆందోళన వ్యక్తం చేశారు. ఎగుమతులకు ప్రోత్సాహం ఇచ్చేలా అనువైన పరిస్థితులు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అంతర్జాతీయంగా ఎదురైన అనుభవాలను బట్టి చూస్తే ప్రపంచ దేశాలు నాణ్యమైన ఉత్పత్తులు, చౌకగా లభిస్తే కొనుక్కునేందుకు మొగ్గు చూపుతున్నాయని తెలుస్తుందని ఆయన చెప్పారు. అంతర్జాతీయంగా వినియోగదారుల కొనుగోలు శక్తి తగ్గుతోందని, దీంతో తమ ఉత్పత్తులను కొనగలిగేవారిని చేరడం విక్రేతలకు కష్టంగా మారుతోందని ఆయన వివరించారు. ఇతరులకన్నా భిన్నంగా యోచించి నాణ్యమైన ఉత్పత్తులు చౌకగా అందించే ప్రయత్నం చేయాలని, తద్వారా అవకాశాలను అందిపుచ్చుకోవాలని జైట్లీ సూచించారు. ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. ఎగుమతులు వరుసగా 11వ నెలలోనూ క్షీణించడం, అక్టోబర్‌లో 17.5% తగ్గి 21.35 బిలియన్ డాలర్లకు పడియాయి. మరోవైపు, వాణిజ్య కార్యకలాపాలు పెరిగేందుకు ట్రేడ్ ఫెయిర్స్ ఊతమిస్తాయని జైట్లీ చెప్పారు. ఈ ఏడాది ఐఐటీఎఫ్‌ను 17 లక్షల మంది పైగా సందర్శించారని పేర్కొన్నారు. -
వారం కనిష్టానికి రూపాయి
ముంబై: డాలర్‌తో రూపాయి మారకం విలువ సోమవారం 34 పైసలు క్షీణించి 66.48 కి పడిపోయింది. ఇది వారం కనిష్ట స్థాయి. నెలాఖరు నేపథ్యంలో డాలర్ల కోసం ఎగుమతిదారుల నుంచి డిమాండ్ పెరగడంతో డాలర్ విలువ పెరిగింది. -
రూపాయి రికవరీ...
55 పైసల లాభంతో 66.10 వద్ద క్లోజింగ్ ముంబై: ఎగుమతిదారులు, బ్యాంకులు డాలర్లను భారీగా విక్రయించడంతో మంగళవారం రూపా యి గణనీయంగా బలపడింది. డాలర్‌తో పోలిస్తే 55 పైసల పెరుగుదలతో 66.10 వద్ద ముగిసింది. ఒక్క రోజే రూపాయి ఇంతగా పెరగడం ఏడు నెలల వ్యవధిలో ఇదే తొలిసారి. దేశీ స్టాక్‌మార్కెట్ కోలుకోవడం, ఈక్విటీ.. డెట్ మార్కెట్లలోకి కొత్తగా నిధుల రాకతో డాలర్ల సరఫరా మెరుగుపడటం తదితర అంశాలు ఇందుకు దోహదపడ్డాయని ఫారెక్స్ డీలర్లు పేర్కొన్నారు. -
ఎస్ఈజెడ్లకు మ్యాట్ మినహాయించాలి
కేంద్రానికి ఎగుమతిదారుల విజ్ఞప్తి న్యూఢిల్లీ: ప్రత్యేక ఆర్థిక మండళ్లను(ఎస్ఈజెడ్) కనీస ప్రత్యామ్నాయ పన్ను(మ్యాట్) నుంచి మినహాయించాలని ఎగుమతిదారుల మండలి సోమవారం కేంద్ర ఆర్థిక శాఖకు విజ్ఞప్తి చేసింది. ఈ చర్య ఎగుమతుల వృద్ధితోపాటు, దేశీయ తయారీ రంగానికి సైతం సానుకూల ప్రయోజనం కల్పిస్తుందని ఈఓయూ అండ్ ఎస్ఈజెడ్ ఎగుమతి అభివృద్ధి మండలి(ఈపీసీఈఎస్) తన ప్రీ-బడ్జెట్ సంప్రదింపుల సందర్భంగా ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీకి తెలియజేసింది. ఎస్ఈజెడ్లపై మ్యాట్‌ను తొలగించాలన్నది తమ ప్రథమ డిమాండ్ అని పేర్కొంది. ఒకవేళ ఇది సాధ్యం కాకపోతే కనీసం దీనిని 7.5 శాతానికి తగ్గించాలని విజ్ఞప్తి చేసింది. ఎస్ఈజెడ్ డెవలపర్లను డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ నుంచి మినహాయించాలని కూడా సూచించింది. మ్యాట్, డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ పన్నులు ఎస్ఈజెడ్లకు సంబంధించి ‘పెట్టుబడుల సానుకూల ధోరణిని’ దెబ్బతీస్తున్నాయని పేర్కొంది. సేవల పన్నుల నుంచి సైతం ఎస్ఈజెడ్లను మినహాయించాలని కోరింది. దేశ ఎగుమతుల్లో ఎస్ఈజెడ్లదే కీలకపాత్ర. దేశ మొత్తం ఎగుమతుల్లో దాదాపు 33 శాతం ఎస్ఈజెడ్లదే. దాదాపు 15 లక్షల మందికి ఎస్ఈజెడ్లు ఉపాధి కల్పిస్తున్నాయి. ఎస్ఈజెడ్ల నుంచి 2005-06లో ఎగుమతుల విలువ రూ.22,840 కోట్లు. 2013-14లో ఈ విలువ రూ.4.94 లక్షల కోట్లకు ఎగసింది. -
సమైక్యానికి సపోర్టు
కాకినాడ, న్యూస్‌లైన్ : రెక్కాడితేగానీ డొక్కాడని కార్మికులు... రోజూ పనికి వెళ్తే తప్ప పూటగడవని లారీ వర్కర్లు... బార్జీలపై పనిచేసే సరంగులు, కళాసీలు... ఎగుమతి, దిగుమతులతో నిత్యం రూ.కోట్లలో వ్యాపారం చేసే ఎక్స్‌పోర్టర్లు... ఇలా అన్నివర్గాలు ఏకతాటిపై నిలిచి సమైక్యరాగాన్ని అందుకున్నాయి. రాష్ట్ర విభజనను నిరసిస్తూ మంగళవారం ఉదయం నుంచి 24 గంటల బంద్‌కు కోకనాడ చాంబర్ ఆఫ్ కామర్స్ ఇచ్చిన పిలుపు విజయవంతమైంది. పోర్టు ఆధారిత వర్గాలన్నీ సమ్మెలో స్వచ్ఛందంగా పాల్గొనడం ద్వారా సమైక్యాంధ్ర కోసం సమైక్య ఉద్యమబాట పట్టి మిగిలిన సంఘాలకు స్ఫూర్తిగా నిలిచారు. పోర్టు కార్మికులు, లారీ ఓనర్లు, ఎక్స్‌పోర్టర్లు, బాడ్జీ యజమానులతో సహా అన్నివర్గాలు స్వచ్ఛంద బంద్ పాటించడంతో ఎక్కడి కార్యకలాపాలు అక్కడే నిలిచిపోయాయి. ప్రధానంగా చాంబర్ పిలుపు మేరకు కాకినాడ లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజాన నగేష్ ఆధ్వర్యంలో దాదాపు రెండువేల లారీలను పూర్తిగా నిలిపివేశారు. సీరియల్‌ను కూడా రద్దు చేయడంతో రేవుతోపాటు ఇతర రవాణా కార్యకలాపాలకు కూడా అంతరాయం ఏర్పడింది. మరో వైపు బార్జీలపై పనిచేసే సరంగులు, కళాసీలు, లారీలపై పనిచేసే డ్రైవర్లు, క్లీనర్లు, ఎగుమతి, దిగుమతుల్లో పనిచేసే కార్మికులు వెరసి దాదాపు 15వేల మంది కార్మికులు విధులకు దూరంగా ఉన్నారు. పనికి వెళ్లకపోతే రోజు గడవని స్థితిలో కూడా సమైక్యాంధ్రకు కోసం ఒక్కరోజు పనిలేకపోయినా ఇబ్బంది లేదని, అవసరమైతే మరింతగా ఉద్యమించడానికి కూడా సిద్ధమంటూ ప్రతిజ్ఞ చేశారు. ఇదిలా ఉంటే పోర్టు రవాణాలో కీలకంగా వ్యవహరించే స్టీల్బార్జీలు కూడా ఎక్కడికక్కడే నిలిపివేశారు. 89 బార్జీలు ఆగిపోయాయి. రేవు కార్యకలాపాలు నిలిచిన సందర్భంగా నిత్యం వేలాదిమంది కార్మికులతో కళకళలాడుతూ కనిపించే యాంకరేజ్‌పోర్టు ప్రాంతం నిర్మానుష్యంగా మారింది. బంద్ ప్రభావంతో ఎగుమతి, దిగుమతులు, కార్మికుల వేతనాలు, ఓడలు, రైల్వే రాక్ల డెమరేజ్, లారీల అద్దెలు ద్వారా ఒక్కరోజుకు దాదాపు రూ.10 కోట్లు మేరకు నష్టం వాటిల్లిందని రేవు ఆధారిత వర్గాలు చెప్పాయి. భారీ ర్యాలీ సమైక్యాంధ్ర కోరుతూ కోకనాడ చాంబర్ కార్యాలయం నుంచి సినిమారోడ్డు, మెయిన్‌రోడ్డు మీదుగా జగన్నాధపురం వంతెన వరకు భారీ ర్యాలీ చేశారు. కాకినాడ తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ర్యాలీకి సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా చాంబర్ అధ్యక్షుడు దంటు సూర్యారావు మాట్లాడుతూ 1953లో మద్రాస్ నుంచి తట్టాబుట్టతో వెళ్లగొట్టారని, ఇప్పుడు 2013లో అటువంటి పరిస్థితి ఎదురైతే చూస్తూ ఊరుకునేందుకు ఏ ఒక్కరూ సిద్ధంగా లేరన్నారు. తాజా మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ ఇటువంటి ప్రజా ఉద్యమాన్ని చూసైనా ప్రభుత్వం పునరాలోచించాలని డిమాండ్ చేశారు. ఆందోళన కార్యక్రమాల్లో షోర్లేబర్ యూనియన్ అధ్యక్షుడు తలాటం వీరబాబు, స్టీవ్‌డోర్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు పితాని నూకరాజు, క్లియరెన్స్ అండ్ ఫార్వర్డింగ్ (సీఅండ్ ఆఫ్) ఏజెంట్ల ప్రతినిధి పీవీ రావు, ఏవీ రంగారావు, రాఘవులు, రావిపాటి రామ్‌గోపాల్, స్టీవ్‌డోర్ ఓనర్స్ అధ్యక్షుడు మహేష్, లారీ వర్కర్స్ యూనియన్అధ్యక్షుడు బుద్ధన బాబ్జి, స్టీల్ బార్జీ ప్రతినిధి అనుబాబుతో సహా పెద్దసంఖ్యలో హాజరయ్యారు.