న్యూఢిల్లీ: అమెరికా (US) అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చైనా (China) వస్తువులపై అధిక సుంకాలు విధిస్తామని హెచ్చరిస్తున్న నేపథ్యంలో అందివచ్చే అవకాశాలను భారత్ సద్వినియోగం చేసుకునే వీలుందని అత్యున్నత స్థాయి ఎగుమతిదారుల సంస్థ– ఎఫ్‌ఐఈఓ పేర్కొంది. ఈ దిశలో అమెరికాకు భారత్ ఎగుమతులను పెంచడానికి వ్యూహాన్ని రూపొందించినట్లు కూడా ఎఫ్‌ఐఈఓ తెలిపింది.
ఈ ప్రణాళికలో భాగంగా దేశ ఎగుమతిదారులు (Exporters) అమెరికా అంతటా జరిగే వాణిజ్య, వ్యాపార ప్రదర్శనలలో పాల్గొనడానికి ఆర్థిక సహాయం అందించాలని ఎఫ్‌ఐఈఓ (ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్స్) వైస్ ప్రెసిడెంట్ ఇస్రార్ అహ్మద్ ఇక్కడ విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. తాను అధికారం చేపట్టింది వెంటనే మెక్సికో, కెనడా, చైనాలపై కొత్త టారిఫ్‌లు విధిస్తానని ట్రంప్ బెదిరించిన నేపథ్యంలో ఇస్రార్ అహ్మద్ ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ముఖ్యమైనవి...
అమెరికా మార్కెట్‌కు భారత్ ఎగుమతుల్లో వృద్ధిని పెంచడానికి రూపొందించిన వ్యూహంలో మేము ఐదు కీలక రంగాలను గుర్తించాము. దుస్తులు, ఎలక్ట్రానిక్స్, బొమ్మలు, పాదరక్షలు, ఆర్గానిక్ కెమికల్స్ రంగాలు ఇందులో ఉన్నాయి. ఈ రంగాలకు సంబంధించి అమెరికా వాణిజ్య సంఘాలతో చేతులు కలపాలని ఎఫ్‌ఐఈఓ భావిస్తోంది.
బంగ్లాదేశ్‌లో రాజకీయ అనిశ్చి తి కారణంగా చాలా దుస్తులు కంపెనీలు భారత్‌కు స్థావరాలను మార్చుకుంటున్నాయి.
అమెరికా మార్కెట్‌లో భారత్ ఎగుమతులు విస్తరించాల్సిన అవసరం, అవకాశాలు ఉన్నాయి. అమెరికాలో భారత్ ఉత్పత్తులను విస్తృత స్థాయిలో మార్కెటింగ్ చేయడానికి ఎగుమతిదారులకు తగిన ఆర్థిక మద్దతు అవసరం. అందివస్తున్న అవకాశాలను వినియోగించుకోవడంలో ఇది కీలకం.
దేశంలో పెద్ద ఫ్యాక్టరీలు వస్తున్నందున సామర్థ్యాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాలో భారత్ ఉనికి మరింత పెంచుకోవాలి. అవకాశాలను చేజిక్కించుకోవడానికి మార్కెట్ యాక్సెస్ ఇనిషియేటివ్స్ (ఎంఏఐ) పథకం కింద మరిన్ని నిధులు అడుగుతున్నాము. అమెరికాకు ఎగుమతులు లక్ష్యంగా ఈ పథకంపై దృష్టి పెట్టాలి. కనీసం మూడు సంవత్సరాలు దీనిని అమలు చేయాలి.
ప్రస్తుతం భారత్ ఎగుమతిదారులు ‘ద్రవ్య లభ్యత’ (లిక్విడిటీ) సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఫైనాన్స్ అవసరాలు తీవ్ర సవాళుగా ఉన్నాయి.
వస్తువులు, సేవలను కొనుగోలు చేసిన 45 రోజుల్లోగా ఎంఎస్‌ఎంఈ (లఘు, సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు)లకు చెల్లింపులు జరపాలన్న నిబంధనను సడలించాలి. రుణ వ్య యాలను తగ్గించుకోవడానికి సంబంధించిన – ఇంట్రస్ట్ ఈక్విలైజేషన్ స్కీమ్ (ఐఈఎస్)ను ఐదు సంవత్సరాల పొడిగించాలి.
దేశం నుంచి ఎగుమతయ్యే ఉత్పత్తులకు సంబంధించి కేంద్రం అమలుచేస్తున్న ఆర్‌ఓడీటీఈపీ (ఎగుమతి ఉత్పత్తులపై సుంకాలు, పన్నుల రిఫండ్) పథకం ప్రయోజనాలు అందిస్తున్నప్పటికీ, ఆయా ఉత్పత్తుల దిగుమతిదేశాలు విధిస్తున్న కౌంటర్‌వ్యాలింగ్
సుంకాలు (రాయితీలు పొందిన ఉత్పత్తులపై సుంకాలు– యాంటీ సబ్సిడీ సుంకాలు) ఎగుమతిదారులకు ఇబ్బందులను సృష్టిస్తున్నాయి. ఈ సమస్యపై ఈఐఎఫ్‌ఓ వాణిజ్య మంత్రిత్వశాఖతో చర్చిస్తోంది.
భారత్–అమెరికా వాణిజ్య బంధం ఇలా..
మార్చితో ముగిసిన గత 2023–24లో భారతదేశానికి అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. గత ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ఎగుమతులు 77.51 బిలియన్ డాలర్లుగా ఉండగా, దిగుమతులు 42.2 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్–అక్టోబర్ కాలంలో అమెరికాకు దేశ ఎగుమతులు 6.31 శాతం పెరిగి 47.24 బిలియన్ డాలర్లకు చేరుకోగా, దిగుమతులు 2.46 శాతం పెరిగి 26 బిలియన్ డాలర్లకు ఎగశాయి. కొత్త అమెరికా ప్రభుత్వం ’అమెరికా ఫస్ట్’ అజెండాను అనుసరించాలని నిర్ణయించుకుంటే ఆటోమొబైల్స్, టెక్స్‌టైల్స్, ఫార్మాస్యూటికల్స్ వంటి వస్తువులపై భారతీయ ఎగుమతిదారులు అధిక కస్టమ్స్ సుంకాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని వాణిజ్య నిపుణులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment