
మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేసిన కేంద్రం
న్యూఢిల్లీ: అమెరికాలో టారిఫ్‌ల విధింపుతో చైనా ఉత్పత్తులు భారత్‌లోకి వెల్లువెత్తే అవకాశాలున్న నేపథ్యంలో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి అంతర్–మంత్రిత్వ శాఖల మానిటరింగ్ సెల్‌ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అటు అగ్రరాజ్యంపై చైనా ప్రతీకార టారిఫ్‌ల వల్ల అమెరికా వ్యవసాయోత్పత్తులు కూడా భారత్‌లోకి భారీగా వచ్చి పడే అవకాశాలు ఉన్నట్లు అంచనాలు నెలకొన్నాయి.
ఈ నేపథ్యంలో దిగుమతుల్లో అసాధారణ ధోరణులేమైనా కనిపించిన పక్షంలో దేశీ పరిశ్రమల ప్రయోజనాలను పరిరక్షించే దిశగా యాంటీ–డంపింగ్ సుంకాల్లాంటివి విధించవచ్చని వాణిజ్య శాఖ అదనపు కార్యదర్శి ఎల్ సత్య శ్రీనివాస్ చెప్పారు. కమోడిటీలు, దేశాలవారీగా ట్రెండ్స్‌ను మానిటరింగ్ గ్రూప్ ప్రతి వారం సమీక్షిస్తున్నట్లు తెలిపారు.
ఇందులో వాణిజ్య శాఖ, డీజీఎఫ్‌టీ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్), సీబీఐసీ (పరోక్ష పన్నులు, కస్టమ్స్ కేంద్రీయ బోర్డు), పరిశ్రమలు .. అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) మొదలైన విభాగాల నుంచి ప్రతినిధులు ఉన్నారు.