
ముంబై: ప్రపంచ దేశాల మధ్య టారిఫ్‌ల కారణంగా తలెత్తిన అనిశ్చితి స్వల్పకాలమే కొనసాగనున్నట్లు సాఫ్ట్‌వేర్ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) సీఈవో, ఎండీ కె.కృతివాసన్ పేర్కొన్నారు. వెరసి ఐటీ సేవల పరిశ్రమకు కొంతకాలమే అనిశ్చితి సవాళ్లు సృష్టించనున్నట్లు అభిప్రాయపడ్డారు. కొద్ది నెలల్లోనే పరిష్కారం లభించనున్నట్లు అంచనా వేశారు.
39 బిలియన్ డాలర్ల విలువైన కంపెనీ ఆర్డర్ బుక్ భవిష్యత్ ఆదాయ ఆర్జనకు హామీ ఇస్తున్నట్లు ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. డీల్ పైప్‌లైన్ పటిష్టంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులతో కొంతమంది క్లయింట్ల నుంచి విచక్షణ వ్యయాలు నిలిచిపోతున్నట్లు వెల్లడించారు. అయితే ధరల విషయంగా ఒత్తిడిలేదని స్పష్టం చేశారు.
నిజానికి వార్షికంగా, త్రైమాసికవారీగా ధరలు స్వల్పంగా మెరుగుపడినట్లు తెలియజేశారు. గతేడాదికి 30 బిలియన్ డాలర్ల ఆదాయం సాధించిన కంపెనీ విచక్షణ వ్యయాల వాటాపై వివరణ ఇవ్వని సంగతి తెలిసిందే. ఇవి ఆదాయంలో కీలకమే అయినప్పటికీ ప్రస్తుత ట్రెండ్‌వల్ల కంపెనీపై ప్రతికూల ప్రభావం పడలేదని వివరించారు.
యూఎస్‌లో పరిస్థితులు సర్దుకుంటే ఉత్తర అమెరికా బిజినెస్‌లో తిరిగి పురోభివృద్ధి అందుకోగలమని అంచనా వేశారు. సాఫ్ట్‌వేర్ సేవల ఔట్‌సోర్సింగ్‌కు ప్రపంచంలోనే యూఎస్ అతిపెద్ద మార్కెట్‌కాగా.. ప్రస్తుతం కంపెనీ ఆదాయంలో వాటా 48%కి పరిమితం కావడం గమనార్హం!