TCS CEO
-
ఉద్యోగుల విషయంలో టీసీఎస్ తప్పు తెలుసుకుందా?
TCS plans to increase headcount : ఐటీ పరిశ్రమలో లేఆఫ్‌లు నిత్య కృత్యమైన ప్రస్తుత తరుణంలో చాలా కంపెనీలు నియామకాల జోలికే వెళ్లడం లేదు. ఈ క్రమంలో దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఆశ్చర్యకరమైన ప్రణాళికను బయటపెట్టింది. గతేడాది టీసీఎస్ సైతం గణనీయమైన తొలగింపులు చేపట్టింది. రానున్న రోజుల్లో మరిన్ని తొలగింపులు ఉంటాయని భావిస్తుండగా ఇందుకు విరుద్ధంగా తమ శ్రామిక శక్తిని పెంచుకోవాలనే ఉద్దేశాన్ని టీసీఎస్ ప్రకటించింది. కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కేకే కృతివాసన్ నాస్కామ్ సెషన్లో టీసీఎస్ నియామకాల లక్ష్యాల గురించి మాట్లాడారు. రిక్రూట్మెంట్ ప్రయత్నాలను తగ్గించే ప్రణాళికలేవీ లేవని స్పష్టం చేశారు. కీలక మార్కెట్ల నుంచి డిమాండ్ మందగించడంతో సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగాల నియామకాలు తగ్గుతాయని పరిశ్రమ నివేదికలు సూచిస్తున్న తరుణంలో ఇందుకు విరుద్ధంగా టీసీఎస్ నుంచి ఈ ప్రకటన వచ్చింది. ముఖ్యంగా 2023లో టీసీఎస్ వేలాది మంది ఉద్యోగులను తొలగించింది. లైవ్‌మింట్ నివేదిక ప్రకారం.. గత సంవత్సరంలో 10,818 మంది ఉద్యోగులను టీసీఎస్ తొలగించింది. నియామక ధోరణుల గురించి ఆందోళనలను ప్రస్తావిస్తూ.. " ఇప్పటికే ఆర్థిక వ్యవస్థలో కొన్ని సానుకూలతలు చూస్తున్నాం. మాకు మరింత మంది సిబ్బంది అవసరం ఉంది" అని కృతివాసన్ పేర్కొన్నారు. నియామక ప్రక్రియలో సర్దుబాట్లు చేసినప్పటికీ, రిక్రూట్మెంట్ కార్యక్రమాలలో ఎలాంటి తగ్గింపు ఉండదని సూచిస్తూ కంపెనీ నియామక ఎజెండా పట్ల టీసీఎస్ నిబద్ధతను ఆయన స్పష్టం చేశారు. 6 లక్షల మందికిపైగా ఉద్యోగులున్న టీసీఎస్.. మార్కెట్లో సవాళ్లు ప్రబలంగా ఉన్నప్పటికీ దాని మధ్యస్థ, దీర్ఘకాలిక అవకాశాల గురించి ఆశాజనకంగా ఉందని పీటీఐ నివేదించింది. ఇటీవలి త్రైమాసిక ఫలితాలలో టీసీఎస్ నికర లాభంలో 8.2 శాతం వృద్ధిని సాధించింది. టీసీఎస్ నియామక ప్రణాళికలతోపాటు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంపై కంపెనీ వైఖరిని సైతం కృతివాసన్ ప్రస్తావించారు. సంస్థాగత సంస్కృతి, విలువలను మెరుగుపరచడానికి రిమోట్ వర్క్ లేదా హైబ్రిడ్ మోడల్‌లు సరైనవి కాదన్నారు. వ్యక్తిగత సహకారం, అభ్యాసం ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు. సహోద్యోగులను, సీనియర్లను గమనిస్తూ విలువైన పాఠాలు కార్యాలయ వాతావరణంలో ఉత్తమంగా నేర్చుకోవచ్చని సూచించారు. -
TCS CEO: రాజేష్ గోపీనాథన్ సంపాదన ఎంతో తెలుసా?
వ్యాపార ప్రపంచంలో ఎదగటానికి కృషి, సంకల్పం, అకుంఠిత దీక్ష వంటివి తప్పనిసరిగా అవసరం. ఇలాంటి కఠినమైన నియమాలతో గొప్పస్థాయికి చేరుకున్న ప్రముఖ ఎగ్జిక్యూటివ్‌లలో రాజేష్ గోపీనాథన్ ఒకరు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ పదవిలో ఉన్న రాజేష్ గోపీనాథన్, సంస్థ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. ఆయన ఎన్ఐటి నుంచి ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన తరువాత మేనేజ్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా పొందడానికి అహ్మదాబాద్‌లోని IIM లో చేరాడు. TCS మేనేజింగ్ పార్టనర్ అండ్ టాప్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమితులైన తర్వాత కంపెనీ వార్షిక ఆదాయాన్ని భారీగా పెంచాడు. 2021 - 2022 ఆర్థిక సంవత్సరంలో 26.6 శాతం వృద్ధిని చూపించాడు. రాజేష్ గోపీనాథన్ జీతం 1.5 కోట్లు అని, 2.25 కోట్ల రూపాయలు ప్రయోజనాలు, ఇతర అలవెన్సులు మొత్తం భారీ సంపాదన ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. (ఇదీ చదవండి: వెహికల్ స్క్రాపింగ్‌పై క్లారిటీ వచ్చేసింది.. చూశారా!) రాజేష్ గోపీనాథన్ 2022లో బోర్డ్ ఆఫ్ కామర్స్‌కు, UK ఇన్వెస్ట్మెంట్ కౌన్సిల్, CII నేషనల్ కౌన్సిల్ వంటి వాటికి మాత్రమే కాకుండా ఇండియా US CEO ఫోరమ్ అండ్ 2001 ఇండియా-జపాన్ బిజినెస్ లీడర్స్ ఫోరమ్‌లో భాగంగా ఉన్నారు. కంపెనీ ఫైనాన్స్ వైస్ ప్రెసిడెంట్‌గా నియమించిన్నప్పుడు అతనికి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఇవ్వబడింది. ఫిబ్రవరి 2013లో అతను CFOగా నియమితుడయ్యాడు. -
దుమ్మురేపిన టీసీఎస్...! తొలిసారి రికార్డు స్థాయిలో..!
ముంబై: సాఫ్ట్వేర్ సేవల టాప్ ర్యాంకు దేశీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) మరోసారి ఆర్థిక ఫలితాలలో యస్ అనిపించింది. గత ఆర్థిక సంవత్సరం(2021–22) చివరి త్రైమాసికంలో తొలిసారి ఆదాయం రూ. 50,000 కోట్ల మైలురాయిని దాటింది. వెరసి క్యూ4(జనవరి–మార్చి)లో ఆదాయం 15.8 శాతం జంప్‌చేసి రూ. 50,591 కోట్లకు చేరింది. ఇక నికర లాభం 7.4 శాతం వార్షిక వృద్ధితో రూ. 9,926 కోట్లను తాకింది. అయితే మార్జిన్లు 1.8 శాతం నీరసించి 25.3 శాతానికి పరిమితమైనట్లు కంపెనీ వెల్లడించింది. లేదంటే ఒక త్రైమాసికంలో నికర లాభం రూ. 10,000 కోట్ల మార్క్‌ను అందుకునేదని తెలియజేసింది. వాటాదారులకు షేరుకి రూ. 22 చొప్పున తుది డివిడెండును ప్రకటించింది. 25 బిలియన్ డాలర్లు మార్చితో ముగిసిన గతేడాదిలో టీసీఎస్ తొలిసారి 25.7 బిలియన్ డాలర్ల(రూ. 1,91,754 కోట్లు) టర్నోవర్ సాధించింది. ఇది 16.8 శాతం అధికంకాగా.. నికర లాభం 14.8 శాతం ఎగసి రూ. 38,327 కోట్లకు చేరింది. ఆర్డర్‌బుక్ విలువ కంపెనీ చరిత్రలోనే గరిష్టస్థాయికి చేరినట్లు టీసీఎస్ వెల్లడించింది. 46 దేశాలలో కార్యకలాపాలు విస్తరించిన కంపెనీ ఉద్యోగుల సంఖ్య 5,92,000కు అధిగమించినట్లు తెలియజేసింది. అయితే ఉద్యోగ వలస(అట్రిషన్ రేటు) అత్యధికంగా 17.4 శాతానికి చేరినట్లు తెలియజేసింది. సాఫ్ట్వేర్ సేవల పరిశ్రమలోనే అత్యధికంగా 25.3 శాతం నిర్వహణ మార్జిన్లను సాధించినట్లు కంపెనీ వెల్లడించింది. నికరలాభ మార్జిన్లు 19.6 శాతంగా నమోదైనట్లు తెలియజేసింది. నాలుగో బైబ్యాక్ సవాళ్లను అధిగమిస్తూ మరోసారి పరిశ్రమలోనే చెప్పుకోదగ్గ నిర్వహణ లాభాలు ఆర్జించినట్లు కంపెనీ సీఎఫ్‌వో సమీర్ శేక్సారియా పేర్కొన్నారు. గత ఐదేళ్లలో నాలుగోసారి ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌ను విజయవంతంగా పూర్తిచేసినట్లు తెలియజేశారు. క్యూ4లో రిటైల్, సీపీజీ విభాగం 22.1 శాతం, తయారీ 19 శాతం, కమ్యూనికేషన్స్, మీడియా 18.7 శాతం, టెక్నాలజీ సర్వీసులు 18 శాతం, లైఫ్ సైన్సెస్, హెల్త్‌కేర్ 16.4 శాతం, బీఎఫ్ఎస్ఐ 12.9 శాతం చొప్పున వృద్ధి సాధించినట్లు వివరించారు. ప్రాంతాలవారీగా చూస్తే ఉత్తర అమెరికా 18.7 శాతం, ఇంగ్లండ్ 13 శాతం, కాంటినెంటల్ యూరోప్ 10 శాతం, లాటిన్ అమెరికా 20.6 శాతం, మధ్యప్రాచ్యం, ఆఫ్రికా 7.3 శాతం, భారత్ 7 శాతం, ఆసియా పసిఫిక్ 5.5 శాతం చొప్పున పుంజుకున్నట్లు తెలియజేశారు. ఇతర హైలైట్స్ ► క్యూ4లో జత కలసిన 10 కోట్ల డాలర్లకుపైగా విలువైన 10 కొత్త క్లయింట్లు. ► 5 కోట్ల డాలర్లకుపైగా విలువైన 19 కస్టమర్లు కంపెనీ చెంతకు. ► 2 కోట్ల డాలర్ల క్లయింట్లు 40, కోటి డాలర్ల కస్టమర్లు 52 చేరిక. ► క్యూ4లో నికరంగా 35,209 మందికి ఉపాధి. ► ఏడాదిలో నికరంగా 1,03,546 మందికి ఉద్యోగాలు. ప్రైవేట్ రంగంలో రికార్డ్. ► మొత్తం ఉద్యోగుల సంఖ్య 5,92,195కాగా.. 35.6 శాతం మంది మహిళలే. ► కంపెనీ ఫ్రీ క్యాష్ ఫ్లో రూ. 39,181 కోట్లుకాగా.. రూ. 31,424 కోట్లను షేర్ల బైబ్యాక్, డివిడెండ్ల ద్వారా వాటాదారులకు చెల్లించింది. ► ఈ ఏడాది(2022–23)లో 40,000 మంది ఫ్రెషర్స్‌కు ఉపాధి కల్పిస్తామన్న సీవోవో ఎన్జీ సుబ్రమణ్యం. గతేడాది సైతం ఇదే స్థాయిలో లక్ష్యాన్ని పెట్టుకున్నప్పటికీ లక్ష మందికిపైగా ఉద్యోగాలిచ్చినట్లు తెలియజేశారు. రికార్డ్ ఆర్డర్లు క్యూ4లో అత్యధికంగా 3.533 బిలియన్ డాలర్ల ఇంక్రిమెంటల్ రెవెన్యూ అదనంగా జత కలసింది. 11.3 బిలియన్ డాలర్లతో ఆల్‌టైమ్ గరిష్టానికి ఆర్డర్‌బుక్ చేరింది. పూర్తి ఏడాదికి 34.6 బిలియన్ డాలర్ల విలువైన ఆర్డర్లను కలిగి ఉన్నాం. కస్టమర్ల వృద్ధికి, ట్రాన్స్‌ఫార్మేషన్‌కు సహకరించడం ద్వారా 15 శాతం వృద్ధితో గతేడాదిని పటిష్టంగా ముగించాం. కంపెనీ చరిత్రలోనే రికార్డు ఆర్డర్ బుక్‌ను సాధించడంతో భవిష్యత్‌లోనూ పురోగతి బాటలో కొనసాగనున్నాం. కొత్త సామర్థ్యాలపై పెట్టుబడులు వెచ్చిస్తున్నాం. – రాజేష్ గోపీనాథన్, సీఈవో, ఎండీ, టీసీఎస్. కంపెనీ మార్కెట్లు ముగిశాక ఫలితాలు విడుదల చేసింది. ఈ నేపథ్యంలో టీసీఎస్ షేరు ఎన్ఎస్ఈలో 0.4 శాతం బలపడి రూ. 3,699 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 3,712–3,656 మధ్య ఊగిసలాడింది. చదవండి: వారానికి నాలుగు రోజుల పని...! చేసేందుకు సిద్దమంటోన్న ఉద్యోగులు..! కంపెనీల నిర్ణయం ఇలా..! -
టీసీఎస్ మరో బంపర్ బైబ్యాక్
ముంబై: దేశీ సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) భారీ స్థాయిలో షేర్ల బైబ్యాక్ ప్రకటించింది. సుమారు రూ. 16,000 కోట్లతో 5.33 కోట్ల షేర్లను బైబ్యాక్ చేయనుంది. షేరు ఒక్కింటికి రూ. 3,000 వెచ్చించనుంది. బుధవారం బీఎస్ఈలో షేరు ముగింపు ధర రూ. 2,737తో పోలిస్తే ఇది 9% అధికం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా టీసీఎస్ ఈ విషయం వెల్లడించింది. 2017, 2018లో కూడా టీసీఎస్ భారీ స్థాయిలో షేర్ల బైబ్యాక్ చేసింది. 2018లో దాదాపు రూ. 16,000 కోట్లతో షేరు ఒక్కింటికి రూ. 2,100 రేటు చొప్పున 7.61 కోట్ల షేర్ల బైబ్యాక్ ప్రకటించింది. కంపెనీ వద్ద ప్రస్తుతం రూ. 58,500 కోట్ల మేర నగదు నిల్వలు ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో దేశీ ఐటీ సంస్థ బైబ్యాక్ ప్రకటించడం ఇదే ప్రథమం. ఇక, మరో ఐటీ సంస్థ విప్రో కూడా అక్టోబర్ 13న షేర్ల బైబ్యాక్‌ను పరిశీలించనున్నట్లు పేర్కొంది. మరోవైపు, క్యూ2లో టీసీఎస్ నికర లాభం రూ. 7,475 కోట్లుగా (కన్సాలిడేటెడ్) నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో రూ. 8,042 కోట్లతో పోలిస్తే సుమారు 7% క్షీణించింది. తాజా క్యూ2లో అమెరికన్ సంస్థ ఎపిక్ సిస్టమ్స్ కార్పొరేషన్‌తో లీగల్ వివాదానికి సంబంధించి రూ. 1,218 కోట్లు కేటాయించాల్సి రావడంతో ఫలితాలపై ప్రభావం పడిందని టీసీఎస్ తెలిపింది. రెండో త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ. 38,977 కోట్ల నుంచి 3% వృద్ధితో రూ. 40,135 కోట్లకు చేరింది. సీక్వెన్షియల్‌గా చూస్తే ఆదాయం 4.7%, లాభం 6.7% పెరిగింది. షేరు ఒక్కింటికి రూ.12 చొప్పున టీసీఎస్ మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. దీనికి రికార్డు తేదీ అక్టోబర్ 15 కాగా నవంబర్ 3న చెల్లింపు జరుగుతుంది. ‘పటిష్టమైన ఆర్డర్ బుక్, మార్కెట్ షేరును పెంచుకుంటూ ఉండటం తదితర అంశాలతో కంపెనీ భవిష్యత్ అవకాశాలపై మరింత ధీమాగా ఉన్నాం‘ అని టీసీఎస్ సీఈవో రాజేశ్ గోపీనాథన్ చెప్పారు. జీతాల పెంపు.. ఉద్యోగుల జీతాల పెంపును అక్టోబర్ 1 నుంచి అమలు చేస్తున్నట్లు టీసీఎస్ తెలిపింది. సెప్టెంబర్ ఆఖరుకి కంపెనీలో ఉద్యోగుల సంఖ్య 4,53,540గా ఉంది. ‘కష్టకాలంలో అసాధారణ స్థాయి లో పనిచేసిన టీసీఎస్ సిబ్బంది అందరికీ ధన్యవాదాలు. అక్టోబర్ 1 నుంచి జీతాల పెంపును అమలు చేయబోతున్నాం‘ అని సంస్థ గ్లోబల్ హెడ్ (మానవ వనరుల విభాగం) మిలింద్ లాకడ్ తెలిపారు. ఫ్రెషర్లను తీసుకోవడం ప్రారంభించామని, సెప్టెంబర్ క్వార్టర్లో అంతర్జాతీయంగా రిక్రూట్మెంట్ పెంచామని వివరించారు. అట్రిషన్ రేటు (ఉద్యోగుల వలసలు) ఆల్‌టైమ్ కనిష్టమైన 8.9%గా ఉన్నట్లు కంపెనీ తెలిపింది. ఇతర విశేషాలు... ► క్యూ2లో విభాగాల వారీగా చూస్తే బీఎఫ్ఎస్ఐ (6.2 శాతం), రిటైల్ (8.8 శాతం), లైఫ్ సైన్సెస్–హెల్త్‌కేర్ (6.9 శాతం), టెక్నాలజీ–సర్వీసెస్ (3.1 శాతం) తయారీ (1.4 శాతం) విభాగాలు వృద్ధి నమోదు చేశాయి. కమ్యూనికేషన్స్ మీడియా విభాగం 2.4 శాతం క్షీణించింది. ► సీక్వెన్షియల్‌గా ఉత్తర అమెరికా మార్కెట్ 3.6 శాతం, బ్రిటన్ 3.8 శాతం, యూరప్ 6.1 శాతం వృద్ధి చెందింది. వర్ధమాన దేశాల్లో భారత మార్కెట్ 20 శాతం వృద్ధి నమోదు చేసింది. ► సెప్టెంబర్ క్వార్టర్లో 8.6 బిలియన్ డాలర్ల విలువ చేసే డీల్స్ కుదిరాయి. తాజాగా డీల్స్ కుదుర్చుకున్న సంస్థల్లో టీపీజీ టెలికం, టయోటా మోటార్స్ నార్త్ అమెరికా మొదలైనవి ఉన్నాయి. ► చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ వి. రామకృష్ణన్ 2021 ఏప్రిల్ 30న పదవీ విరమణ చేయనున్నారు. మే 1 నుంచి ఆయన స్థానంలో సమీర్ సక్సారియా బాధ్యతలు చేపడతారు. 1999లో టీసీఎస్‌లో చేరిన సక్సారియా ప్రస్తుతం ఫైనాన్స్ విభాగం వైస్–ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ► బీఎస్ఈలో టీసీఎస్ షేరు బుధవారం 0.78 శాతం పెరిగి రూ. 2,737 వద్ద ముగిసింది. మార్కెట్ ముగిసిన తర్వాత ఆర్థిక ఫలితాలు వెలువడ్డాయి. -
టీసీఎస్ రికార్డు లాభాలు..
ముంబై: దేశీ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీస్ (టీసీఎస్) బంపర్ లాభాలతో క్యూ3 సీజన్‌కు బోణీ కొట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో లాభం 24.1 శాతం ఎగిసి రూ. 8,105 కోట్లకు పెరిగింది. ఒక త్రైమాసికంలో కంపెనీ ఏకంగా రూ. 8,000 కోట్ల మైలురాయి దాటడం ఇదే ప్రథమం. అంతక్రితం ఏడాది ఇదే వ్యవధిలో నికర లాభం రూ.6,531 కోట్లు. మరోవైపు, ఆదాయం కూడా 20.8 శాతం వృద్ధితో రూ. 30,904 కోట్ల నుంచి రూ. 37,338 కోట్లకు ఎగిసింది. స్థిర కరెన్సీ ప్రాతిపదికన చూస్తే ఆదాయ వృద్ధి 12.1 శాతంగా నమోదైందని కంపెనీ తెలిపింది. సీక్వెన్షియల్‌గా సెప్టెంబర్ త్రైమాసికంలో రూ. 7,901 కోట్లతో పోలిస్తే లాభం 2.6 శాతం పెరిగింది. ఆదాయం 1.3 శాతం వృద్ధి నమోదు చేసింది. స్థిర కరెన్సీ ప్రాతిపదికన సీక్వెన్షియల్‌గా ఆదాయం 1.8 శాతం ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి. ఆదాయాల వృద్ధికి ఉత్తర అమెరికా మార్కెట్ ఊతంగా నిలవగా, అటు కీలకమైన బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) విభాగం పనితీరు కూడా దోహదపడింది. మూడో మధ్యంతర డివిడెండ్ కింద షేరు ఒక్కింటికి రూ. 4 చెల్లించనున్నట్లు కంపెనీ తెలిపింది. డివిడెండ్‌కు సంబంధించి రికార్డు తేదీ జనవరి 18 కాగా, చెల్లింపు తేదీ జనవరి 24గా ఉంటుందని పేర్కొంది. డిజిటల్ 52 శాతం వృద్ధి.. డిసెంబర్ క్వార్టర్లో టీసీఎస్ మొత్తం ఆదాయాల్లో డిజిటల్ వ్యాపార విభాగం వాటా అత్యధికంగా 30.1 శాతంగా ఉంది. అంతక్రితం ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 52.7 శాతం వృద్ధి నమోదు చేసింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) విభాగం 8.6 శాతం, ఎనర్జీ యుటిలిటీస్ 18 శాతం వృద్ధి సాధించాయి. అటు ప్రాంతాల వారీగా చూస్తే బ్రిటన్‌లో ఆదాయాలు 25.1%, మిగతా యూరప్ దేశాల్లో ఆదాయాలు 17.6% మేర పెరిగాయి. ఆసియా పసిఫిక్ వ్యాపార విభాగం 12.6%, ఉత్తర అమెరికా 8.2%, భారత్ 9.7%, లాటిన్ అమెరికా వ్యాపార విభాగం 7.6 శాతం వృద్ధి నమోదు చేశాయి. 5.9 బిలియన్ డాలర్ల ఆర్డర్లు.. టీసీఎస్ క్యూ3లో 5.9 బిలియన్ డాలర్ల ఆర్డర్లు దక్కించుకుంది. ఇందులో బీఎఫ్ఎస్ విభాగం వాటా 2 బిలియన్ డాలర్లుగా ఉండగా, రిటైల్ విభాగం వాటా 800 మిలియన్ డాలర్లుగా ఉంది. మూడో త్రైమాసికంలో కొత్తగా 100 మిలియన్ డాలర్ల పైచిలుకు కాంట్రాక్టు ఒకటి దక్కించుకున్నట్లు టీసీఎస్ తెలిపింది. వివిధ కరెన్సీలతో పోలిస్తే రూపాయి మారకం విలువ తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవడంతో పాటు కొన్ని ప్రధాన మార్కెట్లలో నిర్వహణ వ్యయాలు గణనీయంగా పెరిగినప్పటికీ నిర్వహణ మార్జిన్లను కాపాడుకోగలిగామని టీసీఎస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ వి.రామకృష్ణన్ తెలిపారు. ఆదాయాలను పెంచుకునే దిశగా కార్యకలాపాలను విస్తరించడం, భవిష్యత్ వృద్ధి సాధనాలపై పెట్టుబడిపైనే టీసీఎస్ ప్రధానంగా దృష్టి పెట్టిందన్నారు. కొత్త ఆర్డర్ల డిమాండ్‌కి తగ్గట్లుగా మరింత మంది ఉద్యోగులను నియమించుకోవాల్సి రావడంతో.. మార్జిన్లపై కొంత ప్రభావం పడిందని రామకృష్ణన్ చెప్పారు. సీక్వెన్షియల్‌గా చూస్తే ఆపరేటింగ్ మార్జిన్ క్యూ3లో 90 బేసిస్ పాయింట్ల మేర తగ్గి 25.6%కి చేరింది. కరెన్సీ హెచ్చుతగ్గులు, సబ్–కాంట్రాక్టుల వ్యయాలు పెరగడం ఇందుకు కారణం. ఆశావహంగా కొత్త ఏడాది.. ‘ప్రపంచవ్యాప్తంగా అన్ని మార్కెట్లలో కీలకమైన విభాగాలన్నీ మెరుగైన పనితీరు కనపర్చడంతో 2018లో ఆదాయం గణనీయంగా వృద్ధి చెందింది. డిసెంబర్ త్రైమాసికంలో నమోదైన వృద్ధి.. 14 త్రైమాసికాల గరిష్టం‘ అని టీసీఎస్ సీఈవో, ఎండీ రాజేష్ గోపీనాథన్ చెప్పారు. పటిష్టమైన ఆర్డర్ బుక్, క్లయింట్స్, డిజిటల్ సేవల వృద్ధి, భారీ కొత్త ఆర్డర్లు వంటివి టీసీఎస్ సామర్థ్యాలకు నిదర్శనమని చెప్పారాయన. దీంతో కొత్త ఏడాదిలో మరింత మెరుగైన ఫలితాలు సాధించగలమని రాజేష్ గోపీనాథన్ ధీమా వ్యక్తం చేశారు. ‘డిసెంబర్ త్రైమాసికంలో పెద్ద సంఖ్యలో ఆర్డర్లు సాధించాం. మరిన్ని కాంట్రాక్టులు కుదుర్చుకోబోతున్నాం. వీటి ఊతంతో కొత్త సంవత్సరం ఆశావహంగా ఉండబోతోంది‘ అని ఆయన తెలిపారు. తమ క్లయింట్లు.. ఐటీ వ్యయాల్లో కోత విధించే సూచనలేమీ కనిపించలేదని, అయితే మార్చి క్వార్టర్ మధ్యలో మాత్రమే దీనిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. పూర్తి ఏడాదికి రెండంకెల స్థాయిలో వృద్ధి రేటు సాధించేంతగా టీసీఎస్ పటిష్టమైన స్థితిలో ఉందని గోపీనాథన్ ధీమా వ్యక్తం చేశారు. అయితే, యూరప్ దేశాలు, బ్రిటన్‌లో ఆర్థిక సేవల విభాగం కొంత మందగించవచ్చని, రిటైల్ విభాగం ఫలితాలు మిశ్రమంగా ఉండవచ్చని ఆయన పేర్కొన్నారు. క్యూ3 ముగిసేనాటికి కంపెనీ చేతిలో రూ. 43,000 కోట్ల మేర నగదు, తత్సమాన నిల్వలు ఉన్నాయని గోపీనాథన్ చెప్పారు. తమ వ్యూహాలకు అనువైన సంస్థల కొనుగోలు అవకాశాల అన్వేషణ కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు. 6వేల పైచిలుకు నియామకాలు అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో టీసీఎస్ నికరంగా 6,827 మంది ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంది. దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 4,17,929కి చేరింది. వార్షికంగా చూస్తే ఉద్యోగుల సంఖ్య 27,049 మేర పెరిగినట్లయింది. గడిచిన పన్నెండు నెలల్లో ఉద్యోగుల వలసల రేటు (అట్రిషన్) ఐటీ పరిశ్రమతో పోలిస్తే అత్యల్పంగా 11.2 శాతంగా ఉంది. 2,92,000 మందికి డిజిటల్ టెక్నాలజీల్లో శిక్షణనిచ్చినట్లు టీసీఎస్ పేర్కొంది. మార్కెట్ ముగిశాక ఫలితాలు వెలువడ్డాయి. టీసీఎస్ షేరు గురువారం బీఎస్ఈలో 0.02 శాతం పెరిగి రూ. 1,888.15 వద్ద క్లోజయ్యింది. -
భారీగా పెరిగిన టీసీఎస్ సీఈవో వేతనం
ముంబై : దేశంలో అతిపెద్ద టెక్ దిగ్గజంగా పేరున్న టీసీఎస్‌ను నడిపిస్తున్న సీఈవో రాజేష్ గోపినాథన్ వేతనం భారీగా పెరిగింది. ఆయన వేతానాన్ని గతేడాది కంటే ఈ ఏడాది రెండింతలు చేసింది ఆ కంపెనీ. 2018 ఆర్థిక సంవత్సరంలో గోపినాథన్ దాదాపు రూ.12 కోట్లకు పైగా ఆర్జించారని, ఇది 2017 ఆర్థిక సంవత్సరానికి రెండింతలు ఎక్కువని కంపెనీ తన వార్షిక రిపోర్టులో వెల్లడించింది. టాప్ జాబ్‌కు ఆయన్ను ఎంపిక చేసిన అనంతరమే ఈ పెంపును కంపెనీ భారీగా చేపట్టింది. అంతకముందు గోపినాథన్ టీసీఎస్‌లో చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్‌గా పనిచేసేవారు. గోపినాథన్ అందుకునే రెమ్యునరేషన్లో రూ.1.02 కోట్ల బేస్ శాలరీ, రూ.10 కోట్ల కమిషన్, రూ. 86.8 లక్షల ఇతర అలవెన్స్‌లు, ఇతరాత్రవి ఉన్నాయి. 2017 ఆర్థిక సంవత్సరంలో ఆయన కేవలం రూ.6.2 కోట్లను మాత్రమే ఇంటికి తీసుకెళ్లేవారు. ప్రస్తుతం గోపినాథన్ పుచ్చుకుంటున్న రెమ్యునరేషన్, సాధారణ టీసీఎస్ ఉద్యోగి అందుకునే రెమ్యునరేషన్ ఆర్జించే స్థాయి కంటే 212 సార్లు ఎక్కువ. ఇతర ఎగ్జిక్యూటివ్‌లు, నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల వేతనాలను కూడా కంపెనీ బయటికి విడుదల చేసింది. వారిలో టాప్‌లో రెండో స్థానంలో ఉన్న సీఓఓ ఎన్ గణపతి సుబ్రహ్మణ్యం రూ.9 కోట్లకు పైగా రెమ్యునరేషన్ పొందుతున్నట్టు తెలిసింది. ఈయన కూడా ముందటి ఆర్థిక సంవత్సరంలో కేవలం రూ.6.15 కోట్లను మాత్రమే పరిహారాలుగా పొందేవారు. 2017 ఫిబ్రవరిలోనే వీరిద్దరూ తమ బాధ్యతలను స్వీకరించారు. గోపినాథన్ 2001 నుంచి టీసీఎస్‌లో పనిచేస్తున్నారు. 2013 ఫిబ్రవరిలో కంపెనీ సీఎఫ్ఓగా ఎంపికయ్యారు. టాటా ఇండస్ట్రీస్‌లో కూడా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. మార్చి క్వార్టర్ ఫలితాల సందర్భంగా క్వార్టర్లీ ఇచ్చే వేరియబుల్ పేను 120 శాతం ఆఫర్ చేస్తున్నట్టు ప్రకటించింది. తమకు వచ్చిన మెరుగైన క్వార్టర్ ఫలితాల ప్రయోజనాలను ఉద్యోగులకు చేరవేస్తామని తెలిపింది. 2019 ఆర్థిక సంవత్సరంలో వేతన పెంపులు 2 శాతం నుంచి 6 శాతం వరకు ఉంటాయని కంపెనీ చెప్పింది. -
టీసీఎస్ సీఈవోగా చివరి రోజు...బిగ్ అనౌన్స్మెంట్
ముంబై : దేశంలోనే అతిపెద్ద ఐటీ అగ్రగామిగా ఉన్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్)కు ఇన్నిరోజులు చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా, మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న నటరాజన్ చంద్రశేఖరన్ మంగళవారం తన పదవి నుంచి దిగిపోతున్నారు. ఈ కీలకమైన బాధ్యతల నుంచి వైదొలుగుతున్న సమయంలో ఓ బిగ్ అనౌన్స్‌మెంట్‌తో ఇన్వెస్టర్ల ముందుకు వెళ్లబోతున్నారు. షేర్ల బైబ్యాక్ ప్రకటనను నేడు చంద్రశేఖరన్ ప్రకటించనున్నారు. బైబ్యాక్ ప్రతిపాదనపై నేడు భేటీ అవుతున్న టీసీఎస్ బోర్డు, ఇందుకోసం ఎంతమొత్తాన్ని వెచ్చించాలి, ఎన్ని షేర్లను బైబ్యాక్ రూపంలో కొనుగోలు చేయాలన్న దానిపై చర్చించనుంది. ఈ బిగ్ అనౌన్స్మెంట్ అనంతరం ఎన్. చంద్రశేఖరన్ తన బాధ్యతల నుంచి పక్కకు తప్పుకోనున్నారు. ఆయన పదవి స్థానంలో రాజేష్ గోపినాథ్‌ను టీసీఎస్ బోర్డు నియమించింది. కాగా, టాటా సన్స్ చైర్మన్‌గా సైరస్ మిస్త్రీకి ఉద్వాసన పలికిన తర్వాత, గ్రూప్‌కు తాత్కాలిక చైర్మన్‌గా రతన్ టాటా వ్యవహరించారు. అనంతరం టాటా సన్స్ కొత్త చైర్మన్‌గా ఎన్. చంద్రశేఖరన్ ను నియమించారు. కుప్పలు తెప్పలుగా ఉన్న నగదు నిల్వలను ఇన్వెస్టర్లకు పంపిణీ చేసి వారిని శాంతింపజేయాలనే నేపథ్యంలో టీసీఎస్ బైబ్యాక్ ప్రతిపాదనను బోర్డు ముందుకు తీసుకొచ్చింది. మరోవైపు ఇన్ఫోసిస్ కూడా దీనికోసం తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. -
పట్టుదలతోనే కలలు సాకారం
జేఎన్టీయూహెచ్ స్నాతకోత్సవంలో టీసీఎస్ సీఈవో నటరాజన్ చంద్రశేఖరన్ సాక్షి, హైదరాబాద్ : ‘‘కలలు కనే అవకాశం మీలో ప్రతి ఒక్కరికీ ఉంది. ఆ కలలు అప్పటికప్పుడు నెరవేరకపోవచ్చు. పట్టుదలతో శ్రమిస్తే వాటిని సాకారం చేసుకునే ఎన్నో అవకాశాలు మీ చెంతకు వస్తాయి’’అని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సీఈవో డాక్టర్ నటరాజన్ చంద్రశేఖరన్ భావి ఇంజనీర్లకు పిలుపునిచ్చారు. గురువారం జరిగిన జేఎన్టీయూహెచ్ ఐదో స్నాతకోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన చంద్రశేఖరన్, వర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ రామేశ్వర్రావు చేతుల మీదుగా గౌరవ డాక్టరేట్‌ను అందుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సక్సెస్ అంటే ఎక్కువ డిగ్రీలు పొందడమే కాదన్నారు. అవకాశాలను అందిపుచ్చుకొని తమ కలలను సాకారం చేసుకుంటే.. కుటుంబ సభ్యులతోపాటు ప్రపంచమంతా పండగ చేసుకుంటుందన్నారు. 27ఏళ్ల కిందట ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చే శాక తన లక్ష్యాలను అందుకోవడానికి ఎంతో శ్రమించాల్సి వచ్చిందన్నారు. సవాళ్లను ఎదుర్కొనే ప్రయత్నం చేయాలన్నారు. చదువు కేవలం ఉద్యోగం కోసమేనని భావించకుండా సమాజ అభివృద్ధికి దోహద పడేలా కృషిచేయాలని కోరారు. గౌరవ డాక్టరేట్ కు తనను ఎంపిక చేసిన జేఎన్టీయూహెచ్ అధికారులందరికీ చంద్రశేఖరన్ కృతజ్ఞతలు తెలిపారు. వీసీ రామేశ్వరరావు మాట్లాడుతూ ప్రపంచస్థాయి ప్రమాణాలను అందుకునే దిశగా జేఎన్టీయూహెచ్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. 98 మందికి విద్యార్థులకు బంగారు పతకాలు, 158 మందికి పీహెచ్‌డీలను ప్రదానం చేశారు. పీహెచ్‌డీలను అందుకున్న వారిలో డీఆర్డీవో డెరైక్టర్ జనరల్ అవినాష్ చందర్ కూడా ఉండడం విశేషం. మీ సేవలు అవసరం: కేసీఆర్ రాష్ట్ర పునర్నిర్మాణంలో సాఫ్ట్వేర్ దిగ్గజ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) సేవలను వినియోగించుకుంటామని సీఎం కేసీఆర్ చెప్పారు. టీసీఎస్ రాష్ట్రంలో ఎంతో మంది యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తోందని ప్రశంసించారు. సంస్థ వ్యాపార విస్తరణ కార్యక్రమాలకు ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు. టీసీఎస్ సీఈవో చంద్రశేఖరన్, వైస్ ప్రెసిడెంట్ వి.రాజన్నలు గురువారం సచివాలయంలో కేసీఆర్‌ను కలుసుకున్నారు. సాఫ్ట్వేర్ రంగం విస్తరిస్తున్న ఆదిభట్ల ప్రాంతంలో పోలీసుస్టేషన్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే హైదరాబాద్‌లో 26 వేల మంది ఐటీ ఉద్యోగులు తమ సంస్థలో పనిచేస్తున్నారని, త్వరలో మరో 28 వేల మంది ఐటీ నిపుణులకు ఉద్యోగవకాశాలు కల్పిస్తామని టీసీఎస్ ప్రతినిధులు సీఎంకు చెప్పారు.