టీసీఎస్‌ రికార్డు లాభాలు.. | TCS Q3 profit jumps 24% YoY to Rs 8,105 crore | Sakshi
Sakshi News home page

టీసీఎస్‌ రికార్డు లాభాలు..

Published Fri, Jan 11 2019 4:29 AM | Last Updated on Fri, Jan 11 2019 7:41 AM

TCS Q3 profit jumps 24% YoY to Rs 8,105 crore - Sakshi

ముంబై: దేశీ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీస్‌ (టీసీఎస్‌) బంపర్‌ లాభాలతో క్యూ3 సీజన్‌కు బోణీ కొట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో లాభం 24.1 శాతం ఎగిసి రూ. 8,105 కోట్లకు పెరిగింది. ఒక త్రైమాసికంలో కంపెనీ ఏకంగా రూ. 8,000 కోట్ల మైలురాయి దాటడం ఇదే ప్రథమం. అంతక్రితం ఏడాది ఇదే వ్యవధిలో నికర లాభం రూ.6,531 కోట్లు. మరోవైపు, ఆదాయం కూడా 20.8 శాతం వృద్ధితో రూ. 30,904 కోట్ల నుంచి రూ. 37,338 కోట్లకు ఎగిసింది.

స్థిర కరెన్సీ ప్రాతిపదికన చూస్తే ఆదాయ వృద్ధి 12.1 శాతంగా నమోదైందని కంపెనీ తెలిపింది. సీక్వెన్షియల్‌గా సెప్టెంబర్‌ త్రైమాసికంలో రూ. 7,901 కోట్లతో పోలిస్తే లాభం 2.6 శాతం పెరిగింది. ఆదాయం 1.3 శాతం వృద్ధి నమోదు చేసింది. స్థిర కరెన్సీ ప్రాతిపదికన సీక్వెన్షియల్‌గా ఆదాయం 1.8 శాతం ఉండొచ్చని మార్కెట్‌ వర్గాలు అంచనా వేశాయి. ఆదాయాల వృద్ధికి ఉత్తర అమెరికా మార్కెట్‌ ఊతంగా నిలవగా, అటు కీలకమైన బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ సర్వీసెస్, ఇన్సూరెన్స్‌ (బీఎఫ్‌ఎస్‌ఐ) విభాగం పనితీరు కూడా దోహదపడింది. మూడో మధ్యంతర డివిడెండ్‌ కింద షేరు ఒక్కింటికి రూ. 4 చెల్లించనున్నట్లు కంపెనీ తెలిపింది. డివిడెండ్‌కు సంబంధించి రికార్డు తేదీ జనవరి 18 కాగా, చెల్లింపు తేదీ జనవరి 24గా ఉంటుందని పేర్కొంది.  

డిజిటల్‌ 52 శాతం వృద్ధి..
డిసెంబర్‌ క్వార్టర్‌లో టీసీఎస్‌ మొత్తం ఆదాయాల్లో డిజిటల్‌ వ్యాపార విభాగం వాటా అత్యధికంగా 30.1 శాతంగా ఉంది. అంతక్రితం ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 52.7 శాతం వృద్ధి నమోదు చేసింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ సర్వీసెస్, ఇన్సూరెన్స్‌ (బీఎఫ్‌ఎస్‌ఐ) విభాగం 8.6 శాతం, ఎనర్జీ యుటిలిటీస్‌ 18 శాతం వృద్ధి సాధించాయి. అటు ప్రాంతాల వారీగా చూస్తే బ్రిటన్‌లో ఆదాయాలు 25.1%, మిగతా యూరప్‌ దేశాల్లో ఆదాయాలు 17.6% మేర పెరిగాయి. ఆసియా పసిఫిక్‌ వ్యాపార విభాగం 12.6%, ఉత్తర అమెరికా 8.2%, భారత్‌ 9.7%, లాటిన్‌ అమెరికా వ్యాపార విభాగం 7.6 శాతం వృద్ధి నమోదు చేశాయి.  

5.9 బిలియన్‌ డాలర్ల ఆర్డర్లు..
టీసీఎస్‌ క్యూ3లో 5.9 బిలియన్‌ డాలర్ల ఆర్డర్లు దక్కించుకుంది. ఇందులో బీఎఫ్‌ఎస్‌ విభాగం వాటా 2 బిలియన్‌ డాలర్లుగా ఉండగా, రిటైల్‌ విభాగం వాటా 800 మిలియన్‌ డాలర్లుగా ఉంది. మూడో త్రైమాసికంలో కొత్తగా 100 మిలియన్‌ డాలర్ల పైచిలుకు కాంట్రాక్టు ఒకటి దక్కించుకున్నట్లు టీసీఎస్‌ తెలిపింది. వివిధ కరెన్సీలతో పోలిస్తే రూపాయి మారకం విలువ తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవడంతో పాటు కొన్ని ప్రధాన మార్కెట్లలో నిర్వహణ వ్యయాలు గణనీయంగా పెరిగినప్పటికీ నిర్వహణ మార్జిన్లను కాపాడుకోగలిగామని టీసీఎస్‌ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ వి.రామకృష్ణన్‌ తెలిపారు.

ఆదాయాలను పెంచుకునే దిశగా కార్యకలాపాలను విస్తరించడం, భవిష్యత్‌ వృద్ధి సాధనాలపై పెట్టుబడిపైనే టీసీఎస్‌ ప్రధానంగా దృష్టి పెట్టిందన్నారు. కొత్త ఆర్డర్ల డిమాండ్‌కి తగ్గట్లుగా మరింత మంది ఉద్యోగులను నియమించుకోవాల్సి రావడంతో.. మార్జిన్లపై కొంత ప్రభావం పడిందని రామకృష్ణన్‌ చెప్పారు. సీక్వెన్షియల్‌గా చూస్తే ఆపరేటింగ్‌ మార్జిన్‌ క్యూ3లో 90 బేసిస్‌ పాయింట్ల మేర తగ్గి 25.6%కి చేరింది. కరెన్సీ హెచ్చుతగ్గులు, సబ్‌–కాంట్రాక్టుల వ్యయాలు పెరగడం ఇందుకు కారణం.

ఆశావహంగా కొత్త ఏడాది..
‘ప్రపంచవ్యాప్తంగా అన్ని మార్కెట్లలో కీలకమైన విభాగాలన్నీ మెరుగైన పనితీరు కనపర్చడంతో 2018లో ఆదాయం గణనీయంగా వృద్ధి చెందింది. డిసెంబర్‌ త్రైమాసికంలో నమోదైన వృద్ధి.. 14 త్రైమాసికాల గరిష్టం‘ అని టీసీఎస్‌ సీఈవో, ఎండీ రాజేష్‌ గోపీనాథన్‌ చెప్పారు.  పటిష్టమైన ఆర్డర్‌ బుక్, క్లయింట్స్, డిజిటల్‌ సేవల వృద్ధి, భారీ కొత్త ఆర్డర్లు వంటివి టీసీఎస్‌ సామర్థ్యాలకు నిదర్శనమని చెప్పారాయన. దీంతో కొత్త ఏడాదిలో మరింత మెరుగైన ఫలితాలు సాధించగలమని రాజేష్‌ గోపీనాథన్‌ ధీమా వ్యక్తం చేశారు. ‘డిసెంబర్‌ త్రైమాసికంలో పెద్ద సంఖ్యలో ఆర్డర్లు సాధించాం. మరిన్ని కాంట్రాక్టులు కుదుర్చుకోబోతున్నాం. వీటి ఊతంతో కొత్త సంవత్సరం ఆశావహంగా ఉండబోతోంది‘ అని ఆయన తెలిపారు.

తమ క్లయింట్లు.. ఐటీ వ్యయాల్లో కోత విధించే సూచనలేమీ కనిపించలేదని, అయితే మార్చి క్వార్టర్‌ మధ్యలో మాత్రమే దీనిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. పూర్తి ఏడాదికి రెండంకెల స్థాయిలో వృద్ధి రేటు సాధించేంతగా టీసీఎస్‌ పటిష్టమైన స్థితిలో ఉందని గోపీనాథన్‌ ధీమా వ్యక్తం చేశారు. అయితే, యూరప్‌ దేశాలు, బ్రిటన్‌లో ఆర్థిక సేవల విభాగం కొంత మందగించవచ్చని, రిటైల్‌ విభాగం ఫలితాలు మిశ్రమంగా ఉండవచ్చని ఆయన పేర్కొన్నారు. క్యూ3 ముగిసేనాటికి కంపెనీ చేతిలో రూ. 43,000 కోట్ల మేర నగదు, తత్సమాన నిల్వలు ఉన్నాయని గోపీనాథన్‌ చెప్పారు. తమ వ్యూహాలకు అనువైన సంస్థల కొనుగోలు అవకాశాల అన్వేషణ కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు.

6వేల పైచిలుకు నియామకాలు
అక్టోబర్‌–డిసెంబర్‌ త్రైమాసికంలో టీసీఎస్‌ నికరంగా 6,827 మంది ఉద్యోగులను రిక్రూట్‌ చేసుకుంది. దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 4,17,929కి చేరింది. వార్షికంగా చూస్తే ఉద్యోగుల సంఖ్య 27,049 మేర పెరిగినట్లయింది. గడిచిన పన్నెండు నెలల్లో ఉద్యోగుల వలసల రేటు (అట్రిషన్‌) ఐటీ పరిశ్రమతో పోలిస్తే అత్యల్పంగా 11.2 శాతంగా ఉంది. 2,92,000 మందికి డిజిటల్‌ టెక్నాలజీల్లో శిక్షణనిచ్చినట్లు టీసీఎస్‌ పేర్కొంది. మార్కెట్‌ ముగిశాక ఫలితాలు వెలువడ్డాయి. టీసీఎస్‌ షేరు గురువారం బీఎస్‌ఈలో 0.02 శాతం పెరిగి రూ. 1,888.15 వద్ద క్లోజయ్యింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement