పట్టుదలతోనే కలలు సాకారం
జేఎన్టీయూహెచ్ స్నాతకోత్సవంలో టీసీఎస్ సీఈవో నటరాజన్ చంద్రశేఖరన్
సాక్షి, హైదరాబాద్ : ‘‘కలలు కనే అవకాశం మీలో ప్రతి ఒక్కరికీ ఉంది. ఆ కలలు అప్పటికప్పుడు నెరవేరకపోవచ్చు. పట్టుదలతో శ్రమిస్తే వాటిని సాకారం చేసుకునే ఎన్నో అవకాశాలు మీ చెంతకు వస్తాయి’’అని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సీఈవో డాక్టర్ నటరాజన్ చంద్రశేఖరన్ భావి ఇంజనీర్లకు పిలుపునిచ్చారు. గురువారం జరిగిన జేఎన్టీయూహెచ్ ఐదో స్నాతకోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన చంద్రశేఖరన్, వర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ రామేశ్వర్‌రావు చేతుల మీదుగా గౌరవ డాక్టరేట్‌ను అందుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సక్సెస్ అంటే ఎక్కువ డిగ్రీలు పొందడమే కాదన్నారు.
అవకాశాలను అందిపుచ్చుకొని తమ కలలను సాకారం చేసుకుంటే.. కుటుంబ సభ్యులతోపాటు ప్రపంచమంతా పండగ చేసుకుంటుందన్నారు. 27ఏళ్ల కిందట ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చే శాక తన లక్ష్యాలను అందుకోవడానికి ఎంతో శ్రమించాల్సి వచ్చిందన్నారు. సవాళ్లను ఎదుర్కొనే ప్రయత్నం చేయాలన్నారు. చదువు కేవలం ఉద్యోగం కోసమేనని భావించకుండా సమాజ అభివృద్ధికి దోహద పడేలా కృషిచేయాలని కోరారు. గౌరవ డాక్టరేట్ కు తనను ఎంపిక చేసిన జేఎన్టీయూహెచ్ అధికారులందరికీ చంద్రశేఖరన్ కృతజ్ఞతలు తెలిపారు. వీసీ రామేశ్వరరావు మాట్లాడుతూ ప్రపంచస్థాయి ప్రమాణాలను అందుకునే దిశగా జేఎన్టీయూహెచ్‌లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. 98 మందికి విద్యార్థులకు బంగారు పతకాలు, 158 మందికి పీహెచ్‌డీలను ప్రదానం చేశారు. పీహెచ్‌డీలను అందుకున్న వారిలో డీఆర్‌డీవో డెరైక్టర్ జనరల్ అవినాష్ చందర్ కూడా ఉండడం విశేషం.
మీ సేవలు అవసరం: కేసీఆర్
రాష్ట్ర పునర్నిర్మాణంలో సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) సేవలను వినియోగించుకుంటామని సీఎం కేసీఆర్ చెప్పారు. టీసీఎస్ రాష్ట్రంలో ఎంతో మంది యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తోందని ప్రశంసించారు. సంస్థ వ్యాపార విస్తరణ కార్యక్రమాలకు ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు. టీసీఎస్ సీఈవో చంద్రశేఖరన్, వైస్ ప్రెసిడెంట్ వి.రాజన్నలు గురువారం సచివాలయంలో కేసీఆర్‌ను కలుసుకున్నారు. సాఫ్ట్‌వేర్ రంగం విస్తరిస్తున్న ఆదిభట్ల ప్రాంతంలో పోలీసుస్టేషన్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే హైదరాబాద్‌లో 26 వేల మంది ఐటీ ఉద్యోగులు తమ సంస్థలో పనిచేస్తున్నారని, త్వరలో మరో 28 వేల మంది ఐటీ నిపుణులకు ఉద్యోగవకాశాలు కల్పిస్తామని టీసీఎస్ ప్రతినిధులు సీఎంకు చెప్పారు.