సుప్రీం కోర్టు తీర్పును అంగీకరించబోను: మమతా బెనర్జీ | CM Mamata Banerjee Objects SC Judgement Invalidating Teachers appointments | Sakshi
Sakshi News home page

‘సుప్రీం’ తీర్పును అంగీకరించబోం.. నోట్ల కట్టలతో దొరికిన జడ్జిని ఏం చేశారు?: మమతా బెనర్జీ

Published Thu, Apr 3 2025 4:45 PM | Last Updated on Thu, Apr 3 2025 4:54 PM

CM Mamata Banerjee Objects SC Judgement Invalidating Teachers appointments

న్యూఢిల్లీ, సాక్షి: పశ్చిమ బెంగాల్‌లో 25 వేల మంది టీచర్ల నియామకాలను రద్దుచేస్తూ సుప్రీం కోర్టు(Supreme Court) ఇచ్చిన తీర్పుపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. న్యాయ వ్యవస్థపై తమ ప్రభుత్వానికి అపారమైన గౌరవం ఉందని.. అయినప్పటికీ ఈ తీర్పును అంగీకరించబోమని అన్నారామె.

ఈ దేశ పౌరురాలిగా నాకు ప్రతీ హక్కు ఉంటుంది. అలా.. మానవతా ధృక్పథంతో నా అభిప్రాయం తెలియజేస్తున్నా. న్యాయమూర్తులపై అపారమైన గౌరవం ఉన్నప్పటికీ ఈ తీర్పును నేను అంగీకరించబోను. అయినప్పటికీ ప్రభుత్వపరంగా కోర్టు చెప్పినట్లు నడుచుకుంటాం. స్కూల్‌ సర్వీస్‌ కమిషన్‌ను రిక్రూట్‌మెంట్‌ ప్రాసెస్‌ తిరిగి ప్రారంభించాలని కోరినట్లు తెలిపారామె. ఈ క్రమంలోనే ఢిల్లీ నోట్ల కట్టల జడ్జి(Delhi Notes Judge) అంశాన్ని ఆమె ప్రస్తావించారు.

ఒక సిట్టింగ్‌ జడ్జి నివాసంలో నోట్ల కట్టలు దొరికితే కేవలం ట్రాన్స్‌ఫర్‌తో సరిపెడతారా?. అదే నియామకాల్లో మోసం జరిగిందని మొత్తం ప్రక్రియనే రద్దు చేస్తారా?. అలాంటప్పుడు వీళ్లను(అభ్యర్థులను) ఎందుకు బదిలీతో సరిపెట్టకూడదు అని మమతా అన్నారు. అలాగే.. నియామకాల రద్దుకు సంబంధించి ఆదేశాలు ఇచ్చిన తొలి జడ్జి ఇప్పుడు బీజేపీ ఎంపీగా(అభిజిత్‌ గంగోపాధ్యాయను ఉద్దేశించి..) ఉన్నారని, ఈ తీర్పు వెనుక బీజేపీ, సీపీఎంల కుట్ర దాగుంది అని అన్నారామె. బెంగాల్‌ విద్యా వ్యవస్థ కుప్పకూల్చాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోందని మండిపడ్డారామె. 

బెంగాల్‌లో 25 వేల మంది టీచర్లు, నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ నియమకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు(Calcutta High Court) తీర్పు ఇచ్చింది. ఇవాళ సుప్రీం కోర్టు ఆ తీర్పును సమర్థించింది. ఈ నియామకాల ప్రక్రియ మొత్తం  మోసపూరితంగా జరిగినట్లు స్పష్టమవుతోంది. తిరిగి సరిదిద్దుకోలేని కళంకం ఇది. ఎలాంటి మోసానికి పాల్పడకుండా ఎంపికైన అభ్యర్థులు కూడా బాధపడాల్సి వస్తోందని సుప్రీంకోర్టు  వ్యాఖ్యానించింది.  హైకోర్టు తీర్పు విషయంలో ఎలాంటి జోక్యం చేసుకోబోమని చీఫ్‌ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ సంజయ్‌ ఖన్నా నేతృత్వంలోని బెంచ్‌ స్పష్టం చేసింది.

అయితే సుప్రీం కోర్టు వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ మమతా బెనర్జీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొందరి కారణంగా.. అంతమందిని శిక్షించడం ఏంటని ప్రశ్నించారామె. ఇది కేవలం 25 వేల మంది అభ్యర్థులకు మాత్రమే సంబంధించిన విషయం కాదని.. వాళ్ల కుటుంబాలకు సంబంధించిన అంశమని అన్నారామె.  

2016లో జరిగిన 25 వేల టీచర్ల నియామకాల్లో అక్రమాలు జరిగినట్లు గతంలో పిటిషనర్లు కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన కలకత్తా హైకోర్టు ఈ నియామకాలను రద్దు చేసింది. దీన్ని సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈక్రమంలో విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. హైకోర్టు తీర్పుపై జోక్యం చేసుకునేందుకు సరైన కారణాలు లేవని పేర్కొంది. మూడు నెలల్లో కొత్తగా టీచర్ల నియామకాలు చేపట్టాలని ఆదేశించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement