teachers recruitment scam
-
‘సుప్రీం’ కీలక నిర్ణయం.. పశ్చిమ బెంగాల్ టీచర్లకు స్వల్ప ఊరట
న్యూఢిల్లీ: విద్యార్థులు ఇబ్బందులు పడకూడదని, నియామకాల్లో అవకతవకల కారణంగా ఈ నెల ప్రారంభంలో నియామకాలు రద్దు చేసిన పశ్చిమ బెంగాల్ ఉపాధ్యాయులు.. తాజా ఎంపిక ప్రక్రియ పూర్తయ్యే వరకు విధుల్లో కొనసాగవచ్చని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పశ్చిమబెంగాల్ ఉపాధ్యాయ నియామక కుంభకోణంపై ఈ నెల ప్రారంభంలో విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు 2016లో చేపట్టిన 25,753 మంది టీచర్లు, నాన్ టీచింగ్ సిబ్బంది నియామకాలు చెల్లవని తేల్చి చెప్పింది. ఆ నియామకాలను రద్దు చేస్తూ గతంలో కోల్‌కతా హైకోర్టు ఇచ్చిన తీర్పును సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం సమర్థించింది. తాజాగా, టీచర్ల నియామకం రద్దులో స్వల్ప ఊరట కల్పించింది.ఆ ఉద్యోగులకు వర్తించదుకొత్త టీచర్ల ఎంపిక ప్రక్రియ పూర్తయ్యే వరకు బోధన కొనసాగించవచ్చని సుప్రీంకోర్టు గురువారం పేర్కొంది. అయితే, ఈ ఉపశమనం 2016 నియామకాలపై దర్యాప్తు సమయంలో ఆరోపణలు లేని అసిస్టెంట్ టీచర్లకే వర్తిస్తుంది. గ్రూప్- సీ, గ్రూప్-డీ, నాన్-టిచింగ్ ఉద్యోగులకు ఇది వర్తించదు. ఎందుకంటే వారిలో ఎక్కువమంది నియామకాల్లో అవినీతి పాల్పడ్డారని సుప్రీం కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. కొత్త నియామక ప్రక్రియ ఎప్పుడంటేచీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం, పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ (SSC)కు స్పష్టమైన గడువు విధించింది. కొత్త నియామక ప్రక్రియకు సంబంధించిన ప్రకటన మే 31లోపు విడుదల చేయాలి. డిసెంబర్ 31లోపు ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలి. ఈ ప్రక్రియను నిర్లక్ష్యం చేస్తే, కోర్టు తగిన చర్యలు తీసుకుంటుందనీ, జరిమానా విధించే అవకాశం ఉంటుందని హెచ్చరించింది. ఈ నెల ప్రారంభంలో పశ్చిమ బెంగాల్లో 2016 నుంచి పనిచేస్తున్న 25 వేల మంది ఉపాధ్యాయులు, సిబ్బంది నియామకాలను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ మేరకు 2024లో కోల్‌కతా హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. నియామకాల్లో భారీ అక్రమాలు, అవకతవకలకు పాల్పడిన పశ్చిమబెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ (West Bengal Teacher Scam 2016)కు అత్యున్నత న్యాయస్థానం తలంటింది. -
మీరూ టీచరేగా.. దయచేసి జోక్యం చేసుకోండి
న్యూఢిల్లీ: బెంగాల్ టీచర్ల తొలగింపు వ్యవహారంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఓ లేఖ రాశారు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని.. ఏ తప్పూ చేయని టీచర్లకు న్యాయం జరిగేలా చూడాలని కోరారాయన. 2016 టీచర్ రిక్రూట్మెంట్లో భారీ మోసం జరిగిందంటూ 25 వేల నియామకాలను ఇటు కలకత్తా హైకోర్టు రద్దు చేయగా.. అటు సుప్రీం కోర్టు ఆ తీర్పును సమర్థించింది. అయితే.. నియామకాల సమయంలో జరిగిన నేరాలు ఖండించదగ్గవే అయినప్పటికీ.. ఏ తప్పూ చేయనివాళ్ల ఉద్యోగాలు పోవడం తీవ్ర అన్యాయం కిందకు వస్తుందని రాహుల్ గాంధీ అంటున్నారు. ఏ తప్పు చేయకుండా చట్టపరంగా ఉద్యోగాలు పొందిన వాళ్లు సైతం నష్టపోవడం ఇక్కడ బాధాకరం. దాదాపుగా దశాబ్దంపాటుగా విధులు నిర్వహిస్తున్న ఈ కళంకం లేని టీచర్లను తొలగించడం.. విద్యా వ్యవస్థకు ఆటంకం కలిగించడమే అవుతుంది. అంతేకాదు.. వాళ్ల కుటుంబాలూ ఆర్థికంగా ఇబ్బందుల పాలవుతాయి.గతంలో మీరూ ఓ టీచరే కదా. కాబట్టి.. ఈ మానవతప్పిదం కారణంగా జరుగుతున్న అన్యాయాన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా. ఏ మోసానికి, తప్పునకు పాల్పడకుండా ఉద్యోగాలు సాధించిన వాళ్లను.. తిరిగి కొనసాగించేలా ప్రభుత్వాన్ని కొరతారని మీకు విజ్ఞప్తి చేస్తున్నా అని లేఖలో రాష్ట్రపతి ముర్మును రాహుల్ గాంధీ కోరారు. ఈ లేఖను తన ఎక్స్ ఖాతాలోనూ పోస్ట్ చేశారాయన. I have written to the Honourable President of India, Smt. Droupadi Murmu ji, seeking her kind intervention in the matter of thousands of qualified school teachers in West Bengal who have lost their jobs following the judiciary's cancellation of the teacher recruitment process.I… pic.twitter.com/VEbf6jbY2F— Rahul Gandhi (@RahulGandhi) April 8, 2025 -
నీట్‌ను ఎందుకు రద్దు చేయలేదు?.. సుప్రీం కోర్టుకు దీదీ సూటి ప్రశ్న
‘‘మా గుండె బండరాయేం కాదు. ఈ నిర్ణయాన్ని మేం అంగీకరిస్తున్నామని మీరు భావించొద్దు. ఇలా మాట్లాడుతున్నందుకు నేను జైలుకు వెళ్లాల్సి వస్తుందని నాకు తెలుసు. కానీ అదేం పట్టించుకోను. కొందరు చేసిన తప్పులకు మీ జీవితాలను బలికానివ్వం. నాలో ఊపిరి ఉన్నంత వరకు మిమ్మల్ని రోడ్డున పడనివ్వను’’ అంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భావోద్వేగంగా ప్రసంగించారు.కోల్‌కతా: సుప్రీం కోర్టు తీర్పుతో ఉద్యోగాలు పోగొట్టుకున్న ఉపాధ్యాయులతో సోమవారం నేతాజీ ఇండోర్ స్టేడియంలో మమతా బెనర్జీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నీట్ ప్రవేశ పరీక్ష మీద సర్వోన్నత న్యాయస్థానం గతంలో ఇచ్చిన తీర్పుపై ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘విద్యా వ్యవస్థను ఉల్లంఘించే హక్కు ఎవరికీ లేదు. ఒకవేళ అలా ఉంటే ఎవరికి ఉంటుంది? ఎవరికి ఉండదు? అనే విషయంపై సుప్రీం కోర్టు స్పష్టత ఇవ్వాలి. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో వ్యాపం కేసులో పలువురి ప్రాణం పోయింది. వాళ్లకు ఇప్పటిదాకా న్యాయం జరగలేదు. .. నీట్ ప్రవేశ పరీక్షపైనా ఎన్నో ఆరోపణలు వచ్చాయి. కానీ ఆ పరీక్షను సుప్రీం కోర్టు రద్దు చేయలేదు. అలాంటప్పుడు బెంగాల్‌నే లక్క్ష్యంగా చేసుకోవడం ఎందుకు?. ఇక్కడి మేధస్సును భయపెట్టాలనుకుంటున్నారా? దీనికి సమాధానం కావాలి’’ అని మమత అన్నారు.ఈ విషయాలపై సుప్రీం కోర్టు ఒక స్పష్టత ఇస్తే.. మేం రుణపడి ఉంటాం. ఒకవేళ ఇవ్వకుంటే.. మీకు అండగా ఎలా నిలబడాలో మేం దారి కనిపెడతాం. రెండు నెలలుగా మీరు ఇబ్బంది పడుతున్నారని తెలుసు. అలాగని మిమ్మల్ని 20 ఏళ్లు బాధపెట్టే ఉద్దేశం మాకు లేదు. ఈ రెండు నెలలకు కూడా మీకు పరిహారం చెల్లిస్తాం.మూడు నెలల్లో నియామక ప్రక్రియ తిరిగి చేపట్టాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. కోర్టు ఆదేశాలకు మేం కట్టుబడి ఉన్నాం. కానీ, ఈ వ్యవహారంపై స్పష్టత కోరాం. ఆ స్పష్టత రాగానే తీర్పుపై రివ్యూ పిటిషన్ కూడా వేస్తాం. మీకింకా ఉద్యోగాల నుంచి తొలగించినట్లు లేఖలు రాలేదు. కాబట్టి మీ పని మీరు చేసుకోండి. మీ ఉద్యోగాలకు మాది భరోసా. నా శరీరంలో ఊపిరి ఉన్నంత వరకు రోడ్డున పడే దుస్థితి మీకు రానివ్వను అని అన్నారామె. అంతకు ముందు.. సుప్రీం కోర్టు తీర్పుకు ప్రభుత్వ పరంగా కట్టుబడి ఉంటామన్న ఆమె, వ్యక్తిగతంగా మాత్రం అంగీకరించబోనంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.ఇదే సమయంలో.. విపక్ష బీజేపీ, సీపీఎంలపైనా ఆమె విరుచుకుపడ్డారు. ఇది తమ ప్రభుత్వంపై దాడేనని అంటున్నారామె. నన్ను టార్గెట్ చేసి.. ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో టీచర్ల ఉద్యోగాలను లాక్కోవాలని చూడకండి. గాయపడిన పులి మరింత ప్రమాదకరమైంది. గుర్తుంచుకోండి అని విపక్షాలకు హెచ్చరిక జారీ చేశారు.అంతకు ముందు కోర్టు తీర్పులతో ఉద్యోగాలు కోల్పోయిన టీచర్లు మాట్లాడుతూ.. తాము రివ్యూ పిటిషన్ వేయబోతున్నామని, ఈ విషయంలో బెంగాల్ ప్రభుత్వం.. స్కూల్ సర్వీస్ కమిషన్ తమతో కలిసి రావాలని కోరారు.2016లో జరిగిన 25 వేల టీచర్లు, నాన్ టీచింగ్ స్టాఫ్ నియామకాల్లో అక్రమాలు జరిగినట్లు గతంలో కొందరు కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన కలకత్తా హైకోర్టు ఈ నియామకాలను రద్దు చేసింది. దీన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈక్రమంలో విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. హైకోర్టు తీర్పుపై జోక్యం చేసుకునేందుకు సరైన కారణాలు లేవని పేర్కొంది. కలకత్తా హైకోర్టు తీర్పును సమర్థిస్తూ ఏప్రిల్ 3వ తేదీన మూడు నెలల్లో కొత్తగా టీచర్ల నియామకాలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. ‘‘ఈ నియామకాల ప్రక్రియ మొత్తం మోసపూరితంగా జరిగినట్లు స్పష్టమవుతోంది. తిరిగి సరిదిద్దుకోలేని కళంకం ఇది. ఎలాంటి మోసానికి పాల్పడకుండా ఎంపికైన అభ్యర్థులు కూడా బాధపడాల్సి వస్తోంది. ఈ విషయంలో హైకోర్టు తీర్పు విషయంలో ఎలాంటి జోక్యం చేసుకోబోం’’ :::చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ ఖన్నా నేతృత్వంలోని బెంచ్ తీర్పు అయితే సుప్రీం కోర్టు వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ‘‘కొందరి కారణంగా.. అంతమందిని శిక్షించడం ఏంటి? అని మమతా బెనర్జీ తీర్పుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. -
సుప్రీం కోర్టు తీర్పును అంగీకరించబోను: మమతా బెనర్జీ
న్యూఢిల్లీ, సాక్షి: పశ్చిమ బెంగాల్లో 25 వేల మంది టీచర్ల నియామకాలను రద్దుచేస్తూ సుప్రీం కోర్టు(Supreme Court) ఇచ్చిన తీర్పుపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. న్యాయ వ్యవస్థపై తమ ప్రభుత్వానికి అపారమైన గౌరవం ఉందని.. అయినప్పటికీ ఈ తీర్పును అంగీకరించబోమని అన్నారామె.ఈ దేశ పౌరురాలిగా నాకు ప్రతీ హక్కు ఉంటుంది. అలా.. మానవతా ధృక్పథంతో నా అభిప్రాయం తెలియజేస్తున్నా. న్యాయమూర్తులపై అపారమైన గౌరవం ఉన్నప్పటికీ ఈ తీర్పును నేను అంగీకరించబోను. అయినప్పటికీ ప్రభుత్వపరంగా కోర్టు చెప్పినట్లు నడుచుకుంటాం. స్కూల్ సర్వీస్ కమిషన్‌ను రిక్రూట్మెంట్ ప్రాసెస్ తిరిగి ప్రారంభించాలని కోరినట్లు తెలిపారామె. ఈ క్రమంలోనే ఢిల్లీ నోట్ల కట్టల జడ్జి(Delhi Notes Judge) అంశాన్ని ఆమె ప్రస్తావించారు.ఒక సిట్టింగ్ జడ్జి నివాసంలో నోట్ల కట్టలు దొరికితే కేవలం ట్రాన్స్ఫర్తో సరిపెడతారా?. అదే నియామకాల్లో మోసం జరిగిందని మొత్తం ప్రక్రియనే రద్దు చేస్తారా?. అలాంటప్పుడు వీళ్లను(అభ్యర్థులను) ఎందుకు బదిలీతో సరిపెట్టకూడదు అని మమతా అన్నారు. అలాగే.. నియామకాల రద్దుకు సంబంధించి ఆదేశాలు ఇచ్చిన తొలి జడ్జి ఇప్పుడు బీజేపీ ఎంపీగా(అభిజిత్ గంగోపాధ్యాయను ఉద్దేశించి..) ఉన్నారని, ఈ తీర్పు వెనుక బీజేపీ, సీపీఎంల కుట్ర దాగుంది అని అన్నారామె. బెంగాల్ విద్యా వ్యవస్థ కుప్పకూల్చాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోందని మండిపడ్డారామె. బెంగాల్లో 25 వేల మంది టీచర్లు, నాన్ టీచింగ్ స్టాఫ్ నియమకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు(Calcutta High Court) తీర్పు ఇచ్చింది. ఇవాళ సుప్రీం కోర్టు ఆ తీర్పును సమర్థించింది. ఈ నియామకాల ప్రక్రియ మొత్తం మోసపూరితంగా జరిగినట్లు స్పష్టమవుతోంది. తిరిగి సరిదిద్దుకోలేని కళంకం ఇది. ఎలాంటి మోసానికి పాల్పడకుండా ఎంపికైన అభ్యర్థులు కూడా బాధపడాల్సి వస్తోందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. హైకోర్టు తీర్పు విషయంలో ఎలాంటి జోక్యం చేసుకోబోమని చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ ఖన్నా నేతృత్వంలోని బెంచ్ స్పష్టం చేసింది.అయితే సుప్రీం కోర్టు వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ మమతా బెనర్జీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొందరి కారణంగా.. అంతమందిని శిక్షించడం ఏంటని ప్రశ్నించారామె. ఇది కేవలం 25 వేల మంది అభ్యర్థులకు మాత్రమే సంబంధించిన విషయం కాదని.. వాళ్ల కుటుంబాలకు సంబంధించిన అంశమని అన్నారామె. 2016లో జరిగిన 25 వేల టీచర్ల నియామకాల్లో అక్రమాలు జరిగినట్లు గతంలో పిటిషనర్లు కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన కలకత్తా హైకోర్టు ఈ నియామకాలను రద్దు చేసింది. దీన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈక్రమంలో విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. హైకోర్టు తీర్పుపై జోక్యం చేసుకునేందుకు సరైన కారణాలు లేవని పేర్కొంది. మూడు నెలల్లో కొత్తగా టీచర్ల నియామకాలు చేపట్టాలని ఆదేశించింది. -
36 వేల టీచర్ల నియామకం రద్దు.. హైకోర్టు సంచలన తీర్పు..
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో ఏడేళ్ల క్రితం ఉపాధ్యాయ నియా మక ప్రక్రియలో నిబంధనావళి ఉల్లంఘన ద్వారా ఉద్యోగాలు పొందిన 36వేల మంది ఉపాధ్యాయుల నియామకాన్ని రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. 3 నెలల్లోపు ఆ పోస్టులను భర్తీచేయాలని తృణమూల్ కాంగ్రెస్ సర్కార్‌ను జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. ‘ఇంతటి అవినీతిని పశ్చిమబెంగాల్ లో ఏనాడూ చూడలేదు. ఉద్యోగాలు కోల్పోయిన ప్రైమరీ టీచర్లు 4 నెలలపాటు విధుల్లో కొనసాగవచ్చు. అప్పటిదాకా పారా టీచర్ల స్థాయిలో తక్కువ జీతమే తీసుకోవాలి’ అని జడ్జి జస్టిస్ అభిజిత్ సూచించారు. ‘నాటి రాష్ట్ర ప్రాథమిక విద్యా బోర్డు అధ్యక్షుడు మాణిక్ భట్టాచార్య, బోర్డ్ సభ్యులు ఈ నియామకాల ప్రక్రియను ఒక లోకల్ క్లబ్ మాదిరిగా మార్చే శారు’ అని జడ్జి ఆగ్రహం వ్యక్తంచేశారు. 2016 నాటి బోధన, బోధనేతర సిబ్బంది నియామకాల కుంభకోణాన్ని కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లు విచారణచేపట్టిన విషయం విదితమే. ‘2016లో రిక్రూట్ అయిన 42,500 మందిలో 36వేల మంది ఆప్టిట్యూట్ పరీక్ష అర్హత లేకుండా, శిక్ష ణ లేకుండా ఉద్యోగాలు పొందారు. అందుకే వీరి నియామకం మాత్రమే రద్ద యింది’ అని ఓ న్యాయవాది చెప్పారు. చదవండి: కేరళలో రూ.12 వేల కోట్ల డ్రగ్స్ పట్టివేత.. సముద్రంలో 134 సంచుల్లో.. -
మమతా బెనర్జీకి మరోసారి షాకిచ్చిన సీబీఐ.. ఎమ్మెల్యే అరెస్ట్
కోల్కత్తా: పశ్చిమ బెంగాల్లో మరోసారి రాజకీయం వేడెక్కింది. బెంగాల్లో టీచర్స్ రిక్రూట్మెంట్ స్కామ్‌లో సీబీఐ విచారణలో భాగంగా టీఎంసీ ఎమ్మెల్యే జిబాన్ కృష్ణ సాహాను అరెస్ట్ చేశారు. దీంతో, ఈ కేసులో ఇప్పటి వరకు ముగ్గురు టీఎంసీ నేతలు అరెస్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అరెస్ట్ ఘటన రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా మారింది. వివరాల ప్రకారం.. బెంగాల్లో టీచర్ రిక్రూట్మెంట్కు సంబంధించి కోల్కత్తా హైకోర్టు ఆదేశాలతో సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ క్రమంలో బుర్వాన్‌లోని టీఎంసీ ఎమ్మెల్యే జిబాన్ కృష్ణ సాహా నివాసాలపై సీబీఐ ప్రత్యేక బృందం దాడులు చేసింది. అనంతరం, జిబాన్‌ను సీబీఐ స్పెషల్ టీమ్ దాదాపు 65(ఏప్రిల్ 14 నుంచి దాదాపు మూడు రోజులు) గంటల పాటు విచారించింది. విచారణ తర్వాత.. జిబాన్ కృష్ణను అరెస్ట్ చేస్తున్నట్టు సీబీఐ స్పష్టం చేసింది. అయితే, విచారణ సందర్భంగా జిబాన్.. తమకు సహకరించలేదని అధికారులు తెలిపారు. అంతకుముందు.. కేంద్ర భద్రతా బలగాలతో పాటు సీబీఐ బృందం ముర్షిదాబాద్ జిల్లాలోని ఆయన నివాసానికి చేరుకుంది. అభ్యర్థుల రిక్రూట్మెంట్కు సంబంధించిన అనేక నేరారోపణ పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. ఈ దాడిలో, ప్రభుత్వ పాఠశాలల్లో రెండు సెక్షన్ల రిక్రూట్మెంట్ కోసం రాత పరీక్షల అడ్మిట్ కార్డులతో సహా అనేక నేరారోపణ పత్రాలను సీబీఐ అధికారులు సీజ్ చేశారు. దీనికి సంబంధించిన రికార్డులను కలిగి ఉన్న డైరీని కూడా స్వాధీనం చేసుకున్నట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా, సీబీఐ దాడుల సందర్బంగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తన ఇంట్లో విచారణ సందర్భంగా, జిబాన్ వాష్‌రూమ్‌కు వెళ్లడానికి అనుమతి తీసుకున్నాడు. తరువాత అతను అకస్మాత్తుగా తన నివాసం పక్కనే ఉన్న చెరువు వైపునకు వెళ్లి తన ఫోన్లను అందులోకి విసిరేసాడు. దీంతో, అధికారులు షాకయ్యారు. ఇక, బెంగాల్లో టీచర్స్ రిక్రూట్మెంట్ స్కామ్‌లో ఇప్పటికే సీఎం మమతా బెనర్జీకి షాక్ తగిలింది. టీఎంసీ నేతలు సాహా మాణిక్ భట్టాచార్య, పార్థా చటర్జీ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఆ లిస్టులోకి మరో ఎమ్మెల్యే జిజాన్ కూడా చేరారు. -
కోర్టు ముందు బోరున విలపించిన పార్థ చటర్జీ, అర్పిత ముఖర్జీ
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ టీచర్ల రిక్రూట్మెంట్ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి పార్థ చటర్జీ, ఆయన సన్నిహితురాలు అర్పిత ముఖర్జీ కోర్టు ఎదుట బోరున విలపించారు. ఈడీ అరెస్టు అనంతరం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న వీరిద్దరూ బుధవారం కోర్టు విచారణకు వర్చువల్‌గా హాజరయ్యారు. 'ప్రజల్లో నా ఇమేజ్ గురించి ఆందోళనగా ఉంది. నేను ఎకనామిక్స్ స్టూడెంట్ను. మంత్రి కావడానికి ముందు ప్రతిపక్ష నేతగా ఉన్నా. రాజకీయాలకు నన్ను బలిపశువును చేశారు. ఈడీ అధికారులను నా ఇంటిని సందర్శించమనండి. నా నియోజకవర్గానికి వెళ్లమనండి. నేను ఎల్ఎల్బీ చేశాను. బ్రిటిష్ స్కాలర్షిప్ కూడా పొందాను. నా కూతురు యూకేలో నివసిస్తోంది. అలాంటిది ఇలాంటి స్కామ్‌లో నేను ఎందుకు పాలుపంచుకుంటాను?' అని కోర్టుకు పార్థ చటర్జీ తెలిపారు. బెయిల్ కోసం విజ్ఞప్తి చేసిన ఆయన.. కేసు విచారణకు పూర్తిగా సహకరిస్తున్నానని, ఎలాంటి షరతులతో అయినా బెయిల్ మంజూరు చేయాలాని కోరారు. తాను ప్రశాంతంగా బతకాలనుకుంటున్నానని, దయచేసి తనకు బెయిల్ ఇవ్వాలని ప్రాధేయపడ్డారు. నాకేం తెలియదు.. పార్థ చటర్జీ అనంతరం కోర్టు ముందుకు ఆయన సన్నిహితురాలు అర్పిత ముఖర్జీ వచ్చారు. ఈడీ సోదాల్లో డబ్బు ఎక్కడ దొరికిందో తెలుసా? అని జడ్జి ఆమెను ప్రశ్నించగా.. 'నా ఇంట్లో' అని బదులిచ్చింది. ఆ ఇల్లు నీదేనా? అని అడిగితే అవునని చెప్పింది. అయితే ఆ డబ్బు అక్కడికి ఎలా వచ్చిందో తనకేమీ తెలియదని అర్పిత కోర్టులో వాపోయింది. తనది మధ్యతరగతి కుటంబం అని, 82 ఏళ్ల తన తల్లి అనారోగ్యంతో బాధపడుతోందని పేర్కొంది. తన లాంటి వాళ్ల ఇంటిపై ఈడీ ఎలా దాడి చేస్తుందని ప్రశ్నించింది. దీనికి కోర్టు స్పందిస్తూ.. అవసరమైతే దేశంలో ఎవరి ఇంట్లోనైనా తనిఖీలు చేసే అధికారం ఈడీకీ ఉంటుందని స్పష్టం చేసింది. టీచర్ల రిక్రూట్మెంట్ కుంభకోణానికి సంబంధించి జులైలో అర్పిత ముఖర్జీ నివాసంలో సోదాలు నిర్వహించిన ఈడీకి రూ.50కోట్లు లభ్యమయ్యాయి. కుప్పలుకుప్పలుగా ఉన్న నోట్ల కట్టల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటన అనంతరం టీఎంసీ పార్థ చటర్జీని మంత్రి పదవితో పాటు పార్టీ బాధ్యతల నుంచి తొలగించింది. చదవండి: బయటి వ్యక్తులు తుపాకులు, బాంబులతో దిగారు -
మాజీ సీఎం పిటిషన్ కొట్టేసిన సుప్రీం
న్యూఢిల్లీ: హర్యానా టీచర్స్ రిక్రూట్మెంట్ స్కాంలో ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలా దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. చౌతాలా, మరో తొమ్మిది మంది దాఖలు చేసిన పిటిషన్‌ను.. సోమవారం జస్టిస్ కలిఫుల్లా సారథ్యంలోని ధర్మాసనం కొట్టేసింది. 1999 టీచర్స్ రిక్రూట్మెంట్ స్కాంలో ఓం ప్రకాశ్ చౌతాలా, ఆయన కుమారుడు అజయ్ చౌతాలా, మరో ఎనిమిది మంది నిందితులుగా ఉన్నారు. ఢిల్లీ హైకోర్టు వీరిని దోషులుగా ప్రకటిస్తూ పదేళ్ల చొప్పున జైలు శిక్ష విధించింది. ఈ శిక్షను రద్దు చేయాలంటూ చౌతాలా సుప్రీం కోర్టును ఆశ్రయించగా చుక్కెదురైంది.