
న్యూఢిల్లీ: విద్యార్థులు ఇబ్బందులు పడకూడదని, నియామకాల్లో అవకతవకల కారణంగా ఈ నెల ప్రారంభంలో నియామకాలు రద్దు చేసిన పశ్చిమ బెంగాల్ ఉపాధ్యాయులు.. తాజా ఎంపిక ప్రక్రియ పూర్తయ్యే వరకు విధుల్లో కొనసాగవచ్చని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
పశ్చిమబెంగాల్ ఉపాధ్యాయ నియామక కుంభకోణంపై ఈ నెల ప్రారంభంలో విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు 2016లో చేపట్టిన 25,753 మంది టీచర్లు, నాన్ టీచింగ్ సిబ్బంది నియామకాలు చెల్లవని తేల్చి చెప్పింది. ఆ నియామకాలను రద్దు చేస్తూ గతంలో కోల్‌కతా హైకోర్టు ఇచ్చిన తీర్పును సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం సమర్థించింది. తాజాగా, టీచర్ల నియామకం రద్దులో స్వల్ప ఊరట కల్పించింది.
ఆ ఉద్యోగులకు వర్తించదు
కొత్త టీచర్ల ఎంపిక ప్రక్రియ పూర్తయ్యే వరకు బోధన కొనసాగించవచ్చని సుప్రీంకోర్టు గురువారం పేర్కొంది. అయితే, ఈ ఉపశమనం 2016 నియామకాలపై దర్యాప్తు సమయంలో ఆరోపణలు లేని అసిస్టెంట్ టీచర్లకే వర్తిస్తుంది. గ్రూప్- సీ, గ్రూప్-డీ, నాన్-టిచింగ్ ఉద్యోగులకు ఇది వర్తించదు. ఎందుకంటే వారిలో ఎక్కువమంది నియామకాల్లో అవినీతి పాల్పడ్డారని సుప్రీం కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.
కొత్త నియామక ప్రక్రియ ఎప్పుడంటే
చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం, పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ (SSC)కు స్పష్టమైన గడువు విధించింది. కొత్త నియామక ప్రక్రియకు సంబంధించిన ప్రకటన మే 31లోపు విడుదల చేయాలి. డిసెంబర్ 31లోపు ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలి. ఈ ప్రక్రియను నిర్లక్ష్యం చేస్తే, కోర్టు తగిన చర్యలు తీసుకుంటుందనీ, జరిమానా విధించే అవకాశం ఉంటుందని హెచ్చరించింది.
ఈ నెల ప్రారంభంలో పశ్చిమ బెంగాల్‌లో 2016 నుంచి పనిచేస్తున్న 25 వేల మంది ఉపాధ్యాయులు, సిబ్బంది నియామకాలను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ మేరకు 2024లో కోల్‌కతా హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. నియామకాల్లో భారీ అక్రమాలు, అవకతవకలకు పాల్పడిన పశ్చిమబెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ (West Bengal Teacher Scam 2016)కు అత్యున్నత న్యాయస్థానం తలంటింది.