నీట్‌ను ఎందుకు రద్దు చేయలేదు?.. సుప్రీం కోర్టుకు దీదీ సూటి ప్రశ్న | Mamata Banerjee Again Ask On Top Court Order Sacking Teachers Order | Sakshi
Sakshi News home page

నీట్‌ను ఎందుకు రద్దు చేయలేదు?.. సుప్రీం కోర్టుకు దీదీ సూటి ప్రశ్న

Published Mon, Apr 7 2025 4:29 PM | Last Updated on Mon, Apr 7 2025 4:58 PM

Mamata Banerjee Again Ask On Top Court Order Sacking Teachers Order

‘‘మా గుండె బండరాయేం కాదు. ఈ నిర్ణయాన్ని మేం అంగీకరిస్తున్నామని మీరు భావించొద్దు. ఇలా మాట్లాడుతున్నందుకు నేను జైలుకు వెళ్లాల్సి వస్తుందని నాకు తెలుసు. కానీ అదేం పట్టించుకోను. కొందరు చేసిన తప్పులకు మీ జీవితాలను బలికానివ్వం. నాలో ఊపిరి ఉన్నంత వరకు మిమ్మల్ని రోడ్డున పడనివ్వను’’ అంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి‌ మమతా బెనర్జీ భావోద్వేగంగా ప్రసంగించారు.

కోల్‌కతా: సుప్రీం కోర్టు తీర్పుతో ఉద్యోగాలు పోగొట్టుకున్న ఉపాధ్యాయులతో సోమవారం నేతాజీ ఇండోర్‌ స్టేడియంలో మమతా బెనర్జీ సమావేశమయ్యారు.  ఈ సందర్భంగా నీట్‌ ప్రవేశ పరీక్ష మీద సర్వోన్నత న్యాయస్థానం గతంలో ఇచ్చిన తీర్పుపై ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘విద్యా వ్యవస్థను ఉల్లంఘించే హక్కు ఎవరికీ లేదు. ఒకవేళ అలా ఉంటే ఎవరికి ఉంటుంది? ఎవరికి ఉండదు? అనే విషయంపై సుప్రీం కోర్టు స్పష్టత ఇవ్వాలి. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో వ్యాపం కేసులో పలువురి ప్రాణం పోయింది. వాళ్లకు ఇప్పటిదాకా న్యాయం జరగలేదు. 

.. నీట్‌ ప్రవేశ పరీక్షపైనా ఎన్నో ఆరోపణలు వచ్చాయి. కానీ ఆ పరీక్షను సుప్రీం కోర్టు రద్దు చేయలేదు. అలాంటప్పుడు బెంగాల్‌నే లక్క్ష్యంగా చేసుకోవడం ఎందుకు?. ఇక్కడి మేధస్సును భయపెట్టాలనుకుంటున్నారా? దీనికి సమాధానం కావాలి’’ అని మమత అన్నారు.

ఈ విషయాలపై సుప్రీం కోర్టు ఒక స్పష్టత ఇస్తే.. మేం రుణపడి ఉంటాం. ఒకవేళ ఇవ్వకుంటే.. మీకు అండగా ఎలా నిలబడాలో మేం దారి కనిపెడతాం. రెండు నెలలుగా మీరు ఇబ్బంది పడుతున్నారని తెలుసు. అలాగని మిమ్మల్ని 20 ఏళ్లు బాధపెట్టే ఉద్దేశం మాకు లేదు. ఈ రెండు నెలలకు కూడా మీకు పరిహారం చెల్లిస్తాం.

మూడు నెలల్లో నియామక  ప్రక్రియ తిరిగి చేపట్టాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. కోర్టు ఆదేశాలకు మేం కట్టుబడి ఉన్నాం. కానీ, ఈ వ్యవహారంపై స్పష్టత కోరాం. ఆ స్పష్టత రాగానే తీర్పుపై రివ్యూ పిటిషన్‌ కూడా వేస్తాం. మీకింకా ఉద్యోగాల నుంచి తొలగించినట్లు లేఖలు రాలేదు. కాబట్టి మీ పని మీరు చేసుకోండి. మీ ఉద్యోగాలకు మాది భరోసా.  నా శరీరంలో ఊపిరి ఉన్నంత వరకు రోడ్డున పడే దుస్థితి మీకు రానివ్వను అని అన్నారామె. అంతకు ముందు.. సుప్రీం కోర్టు తీర్పుకు ప్రభుత్వ పరంగా కట్టుబడి ఉంటామన్న ఆమె, వ్యక్తిగతంగా మాత్రం అంగీకరించబోనంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

ఇదే సమయంలో.. విపక్ష బీజేపీ, సీపీఎంలపైనా ఆమె విరుచుకుపడ్డారు. ఇది తమ ప్రభుత్వంపై దాడేనని అంటున్నారామె. నన్ను టార్గెట్‌ చేసి..  ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో టీచర్ల ఉద్యోగాలను లాక్కోవాలని చూడకండి. గాయపడిన పులి మరింత ప్రమాదకరమైంది. గుర్తుంచుకోండి అని విపక్షాలకు హెచ్చరిక జారీ చేశారు.

అంతకు ముందు కోర్టు తీర్పులతో ఉద్యోగాలు కోల్పోయిన టీచర్లు మాట్లాడుతూ.. తాము రివ్యూ పిటిషన్‌ వేయబోతున్నామని, ఈ విషయంలో బెంగాల్‌ ప్రభుత్వం.. స్కూల్‌ సర్వీస్‌ కమిషన్‌ తమతో కలిసి రావాలని కోరారు.

2016లో జరిగిన 25 వేల టీచర్లు, నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌  నియామకాల్లో అక్రమాలు జరిగినట్లు గతంలో కొందరు కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన కలకత్తా హైకోర్టు ఈ నియామకాలను రద్దు చేసింది. దీన్ని సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈక్రమంలో విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. హైకోర్టు తీర్పుపై జోక్యం చేసుకునేందుకు సరైన కారణాలు లేవని పేర్కొంది. కలకత్తా హైకోర్టు తీర్పును సమర్థిస్తూ ఏప్రిల్‌ 3వ తేదీన మూడు నెలల్లో కొత్తగా టీచర్ల నియామకాలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. 

‘‘ఈ నియామకాల ప్రక్రియ మొత్తం  మోసపూరితంగా జరిగినట్లు స్పష్టమవుతోంది. తిరిగి సరిదిద్దుకోలేని కళంకం ఇది. ఎలాంటి మోసానికి పాల్పడకుండా ఎంపికైన అభ్యర్థులు కూడా బాధపడాల్సి వస్తోంది. ఈ విషయంలో హైకోర్టు తీర్పు విషయంలో ఎలాంటి జోక్యం చేసుకోబోం’’ 
:::చీఫ్‌ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ సంజయ్‌ ఖన్నా నేతృత్వంలోని బెంచ్‌ తీర్పు 

అయితే సుప్రీం కోర్టు వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ‘‘కొందరి కారణంగా.. అంతమందిని శిక్షించడం ఏంటి? అని మమతా బెనర్జీ తీర్పుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement