NEET
-
నీట్ యూజీ–2025 పెన్,పేపర్‌తోనే..
సాక్షి, న్యూఢిల్లీ/ హైదరాబాద్: పేపర్ లీకేజీలు, ఇతర వివాదాల నేపథ్యంలో నీట్ యూజీ–2025పై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) కీలక ప్రకటన చేసింది. దేశంలో వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్ –2025 పరీక్షను ఆఫ్‌లైన్ మోడ్‌లో అంటే పెన్, పేపర్ (ఓఎంఆర్ విధానం) పద్ధతిలో నిర్వహించనున్నట్లు గురువారం ప్రకటించింది. పేపర్ లీక్, ఇతర అక్రమాలను నిరోధించేందుకు ఈసారి దేశవ్యాప్తంగా ‘ఒకే రోజు– ఒకే షిఫ్టు’లో ఈ పరీక్షను నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) ఖరా రు చేసిన మార్గదర్శకాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఎంబీబీఎస్‌తోపాటు బీఏఎంఎస్, బీయూఎంఎస్, బీఎస్ఎంఎస్ కోర్సులకు యూనిఫామ్ నీట్ యూజీ పరీక్ష నిర్వహిస్తామని తెలిపింది. నీట్ యూజీ ఫలితాల ఆధారంగా నేషనల్ కమిషన్ ఫర్ హోమియోపతి కింద బీహెచ్ఎంఎస్ కోర్సుల్లో అడ్మి షన్లు నిర్వహిస్తారు. దీంతోపాటు సాయుధ దళాలకు వైద్య సేవలందించే ఆసుపత్రుల్లో బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో చేరాలనుకునే మిలిటరీ నర్సింగ్ సర్వీస్ అభ్యర్థులు కూడా నీట్ అర్హత సాధించాల్సి ఉంటుంది. నాలుగేళ్ల బీఎస్సీ నర్సింగ్ కోర్సుకూ నీట్ యూజీ కోర్సులో అర్హత సాధించాల్సి ఉంటుందని ఎన్టీఏ తెలిపింది. ఆన్లైన్ పరీక్షపై మల్లగుల్లాలు గత సంవత్సరం నీట్–2024లో చోటు చేసుకున్న లీక్ వ్యవహారాల నేపథ్యంలో నీట్ యూజీ– 2025ని జేఈఈ మెయిన్ తరహాలో ఆన్లైన్ విధానంలో నిర్వహించాలనే డిమాండ్లు వచ్చాయి. దీంతో ఎన్టీఏ నిర్వహించే పరీక్షల్లో పారదర్శకతను పెంచే సూచనలు చేసేందుకు ఇస్రో మాజీ చైర్మన్ ఆర్ రాధాకృష్ణన్ నేతృత్వంలో కేంద్రం ఏడుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ విస్తృత సమాలోచనలు జరిపి ‘మల్టీ సెషన్ టెస్టింగ్, మల్టీ స్టేజ్ టెస్టింగ్ ’విధానంలో నీట్‌ను.. ‘మల్టిట్యూడ్ సబ్జెక్ట్ స్టీమ్స్’విధానంలో ‘కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ) పరీక్షలను నిర్వ హించాలంది. ఇందుకోసం రాష్ట్ర, జిల్లా స్థాయి ల్లో సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయాలని తెలిపింది. తాజాగా కేంద్ర విద్య, ఆరోగ్యశాఖలు జరిపిన చర్చల్లో పాత ఓఎంఆర్ పద్ధతికే మొగ్గుచూపుతూ నిర్ణయం తీసుకున్నారు. అయితే అవకతవకలకు ఆస్కారం లేకుండా ఒకే రోజు– ఒకే షిఫ్టు విధానాన్ని అవలంబించాలని నిర్ణయించారు. ‘నీట్ యూజీ–2025ని ఆన్లైన్లో నిర్వహించాలా? పెన్, పేపర్ పద్ధతిలో నిర్వహించాలా? అనే అంశంపై కేంద్ర విద్య, ఆరోగ్యశాఖలు చర్చించాయి. ఆ తర్వాతే ఈ పరీక్షను ఓఎంఆర్ విధానంలో నిర్వహించాలని నిర్ణయించాం. ఎన్ఎంసీ నిర్ణయం ప్రకారం, నీట్–యూజీ–2025ని పెన్, పేపర్ పద్ధతిలోనే నిర్వహిస్తాం. ఒకే రోజు, ఒకే షిఫ్టులో పరీక్ష ఉంటుంది’అని ఎన్టీఏ వర్గాలు చెప్పాయి.దేశంలోనే అతిపెద్ద పరీక్ష దేశంలో అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యే పరీక్షగా నీట్‌కు పేరుంది. 2024లో ఏకంగా 24 లక్షల మందికిపైగా ఈ పరీక్ష రాశారు. దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లోని దాదాపు 1.08 లక్షల ఎంబీబీఎస్ సీట్ల భర్తీ కోసం ఏటా నీట్ పరీక్షను ఎన్టీఏ నిర్వహిస్తుంది. ఇందులో దాదాపు 56 వేల సీట్లు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఉన్నాయి. నీట్లో సాధించే మార్కుల ఆధారంగా విద్యార్థులకు వివిధ కోర్సుల్లోనూ ప్రవేశాలు లభిస్తాయి.ఆధార్ ఆథెంటికేషన్ తప్పనిసరి పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఓటీపీ ఆధారిత ధ్రువీకరణ కోసం మొబైల్ నంబర్‌తోపాటు ఆధార్‌ను లింక్ చేయాలని ఎన్టీఏ గతంలో కోరింది. అభ్య ర్థులు తమ పదోతరగతి సర్టిఫికెట్ ప్రకారం ఆధార్ క్రెడెన్షియల్స్‌ను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సరళమైన దరఖాస్తు ప్రక్రియ కోసం ఆధార్ ఉపయోగిస్తున్నట్లు ఎన్టీఏ పేర్కొంది. ఆధార్‌లోని ఫేస్ అథెంటికేషన్ పద్ధతి వల్ల అభ్యర్థుల గుర్తింపు వేగవంతం, సులభతరమవుతుందని వెల్లడించింది. దీనివల్ల ప్రవేశ పరీక్షలోని అన్ని ప్రక్రియలు సునాయాసంగా పూర్తవుతాయని తెలిపింది. నీట్ యూజీ–2025 రిజిస్ట్రేషన్ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. సిలబస్‌ను ఇప్పటికే అధికారిక వెబ్సైట్లో ఉంచారు. -
దటీజ్ మధురిమ బైద్య..! మైండ్‌బ్లాక్ అయ్యే గెలుపు..
బాల్యమంతా ఆస్పత్రుల చుట్టూనే తిరుగుతూ ఉంది. స్నేహితులను కోల్పోయింది. ఓ పేషెంట్లా దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నా.. వెరవక చదువుని కొనసాగించింది. అంతటి స్థితిలోనూ మంచి మార్కులతోనే పాసయ్యింది. ఓ పక్కన ఆ మహమ్మారి నుంచి కోలుకుంటూనే నీట్కి ప్రిపర్ అవ్వడమేగాక తొలి ప్రయత్నంలోనే విజయం సాధించింది. కేన్సర్ అనంగానే సర్వం కోల్పోయినట్లు కూర్చొనవసరం లేదు. సక్సెస్‌తో చావు దెబ్బతీస్తూ బలంగా బతకాలని చాటి చెప్పింది. ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది. ఆ అమ్మాయే మధురిమ బైద్య. ఆరవ తరగతిలో ఉండగా అంటే.. 12 ఏళ్ల ప్రాయంలో అరుదైన నాన్-హాడ్కిన్స్ లింఫోమా కేన్సర్ బారిన పడింది. అది కూడా స్టేజ్ 4లో ఉండగా వైద్యులు ఈ వ్యాధిని గుర్తించారు. దీంతో ఆమె చికిత్స నిమిత్తం ముంబైలోని టాటా మెమోరియల్ హాస్పిటల్(Tata Memorial Hospital) చుట్టూ తిరుగడంతోనే బాల్యం అంతా గడిచిపోయింది. కనీసం స్నేహితులు కూడా లేరు మధురిమకు. అయినా సరే చదువుని వదల్లేదు. ఆ ఆస్పత్రి ఓపీడీల్లో చదువుకునేది. ఆఖరికి ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యినప్పుడూ పుస్తకాలను వదలేది కాదు. అలా చదువుతోనే మమేకమయ్యేలా తన బ్రెయిన్‌ని సెట్ చేసుకుంది. నిజానికి ఆ దశలో ఉండే కీమోథెరపీలు మోతాదు అంతా ఇంత కాదు. చదివినా బుర్ర ఎక్కదు కూడా. కానీ మధురిమ ఆ బాధని కూడా లెక్కచేయకుండా చదువు మీద ధ్యాసపెట్టి దొరికిన కొద్ది సమయంలోనే చదువుకుంటుండేది. ఆమె కష్టానికి తగ్గట్టు పదోతరగతిలో 96% మార్కులతో పాసై అందర్నీ ఆశ్చర్యపరిచింది. అలాగే ఇంటర్ కూడా 91% మార్కులతో ఉత్తీర్ణురాలైంది. తను ఇంతలా కష్టపడి చదవడటానికి కారణం.. తనలాంటి కేన్సర్ బాధతులందరికీ ఓ ప్రేరణగా ఉండాలనేది ఆమె కోరకట. అందుకోసమే తనను తాను వ్యాధిగ్రస్తురాలిగా లేదా బాధితురాలిగా అస్సలు బావించేదాన్ని కాదని అంటోంది. తన ఆకాంక్షలు నెరవేర్చుకునేందుకు జీవితంపై పోరాడుతున్న యోధురాలిగా అనుకుని ముందుకు సాగానని సగర్వంగా చెబుతోంది మధురిమ. తన కెరీర్ అంతా ఆరోగ్యానికి సంబంధించిన సవాళ్లతోనే పోరాడింది. సంవత్సరాల తరబడి సాగిన కీమోథెరపీ(chemotherapy), రేడియేషన్(Radiation), ఎముక మజ్జ మార్పిడి(Bone marrow transplant) వంటి కఠినతరమైన శస్త చికిత్సలతో కేన్సర్‌ని విజయవంతంగా జయించింది. కానీ వాటి కారణగా శరీరంలోని రోగనిరోధక శక్తి బలహీనమైంది. అందువల్ల తరుచుగా జలుబు, దగ్గు వంటి అంటువ్యాధుల బారినపడుతుండేది. అయినా సరే చదువుని ఆపలేదు. ఎంబీబీఎస్ చేయాలన్న కోరికతో ప్రతిష్టాత్మకమైన నీట్ ఎగ్జామ్(నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్-అండర్ గ్రాడ్యుయేట్ (NEET-UG 2024)కి కూడా ప్రిపేర్ అవ్వడమేగాక తొలి ప్రయత్నంలోనే విజయం సాధించింది. ఇక్కడ మధురిమ కేన్సర్ చివరిదశలో పోరాడుతున్న నైరాశ్యాన్ని దరిచేరనివ్వలేదు. పైగా తన కలను సాకారం చేసుకునే సమయంలో ఎదురవ్వుతున్న కఠినమైన ఆరోగ్య సవాళ్లన్నింటిని తట్టుకుంటూనే మంచి మార్కులతో పాసయ్యింది. అదీగాక అత్యంత కఠినతరమైన నీట్ ఎగ్జామ్‌ని అలవోకగా జయించింది. మధురిమ సక్సస్ జర్నీ చూస్తే..దృఢ సంకల్పం, మొక్కవోని పట్టుదల ముందు..కఠినతరమైన కేన్సర్ కనుమరుగవుతుందని తేలింది. అంతేగాదు ఇక్కడ తన ఆరోగ్య పరిస్థితులన్నింటిని అంగీకరించిందే తప్ప 'నాకే ఎందుకు ఇలా' అనే ఆలోచన రానీయలేదు. అందుకు తగ్గట్టుగా తన సామార్థ్యాన్నిపెంపొందించటంపై దృష్టిపెట్టి అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంది. ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది. మధురిమ గెలుపు మాములుది కాదని ప్రూవ్ చేసింది. (చదవండి: గర్భధారణ సమయంలో ఎటాక్ చేసే వ్యాధి..! హాలీవుడ్ నటి సైతం..) -
ఏపీలోనూ ‘కోటా ఫ్యాక్టరీ’లు
సాక్షి, అమరావతి: ఐఐటీ, నీట్ లాంటి పోటీ పరీక్షల శిక్షణకు రాజస్థాన్‌లోని కోటా నగరం ప్రసిద్ధి చెందింది. అక్కడ ప్రతి ఇల్లూ ఓ శిక్షణ సంస్థే. కోటా ఇన్స్టిట్యూట్స్లో శిక్షణ తీసుకుంటే ర్యాంక్ గ్యారంటీ అనే ప్రచారం బలంగా ఉండడంతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల విద్యార్థులు వస్తుంటారు. అయితే అక్కడి పరిస్థితులు ఎంత దయనీయంగా ఉంటాయో ఇతరులకు తెలియదు. శిక్షణ కోసం కోటా వచ్చిన విద్యార్థులు ఒత్తిడి తట్టుకోలేక గతేడాది 26 మంది ఆత్మహత్యకు పాల్పడగా ఈ ఏడాది ఇప్పటి వరకు 13 మంది ప్రాణాలు వదిలారు. వీరంతా 17–19 ఏళ్ల వయసువారే. ఇక సివిల్స్ శిక్షణకు బ్రాండ్ సిటీ లాంటి ఢిల్లీలో ఇటీవల ఓ పేరొందిన స్టడీ సర్కిల్‌ను వరద ముంచెత్తడంతో ముగ్గురు అభ్యర్థులు మృతి చెందారు. తెలుగు రాష్ట్రాల్లోనూ పరిస్థితి వీటికి భిన్నంగా ఏమీ లేదు. మన వద్ద కూడా అన్ని కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఇంటర్, పోటీ పరీక్షల్లో ర్యాంకుల కోసం విద్యార్థులపై ఇదే తరహా ఒత్తిడి నెలకొంది.పర్యవేక్షణకు ప్రత్యేక వ్యవస్థకోచింగ్ సెంటర్ కంట్రోల్ అండ్ రెగ్యులేషన్ బిల్లు ఆధారంగా ప్రత్యేక చట్టాన్ని రాజస్థాన్ ప్రభుత్వం తేనుంది. శిక్షణ సంస్థలపై పర్యవేక్షణకు 12 మంది అధికారులతో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి నేతత్వంలో పాఠశాల, వైద్య, సాంకేతిక విద్య కార్యదర్శులు, డీజీపీ సభ్యులుగా ఉంటారు. కోచింగ్ సంస్థల ప్రతినిధులు కూడా సభ్యులుగా ఉంటారు. కోచింగ్ సెంటర్లు తమ వివరాలను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే రెండుసార్లు వరకు జరిమానా, ఆ తరువాత సంస్థ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేస్తారు. విద్యార్థి శిక్షణ మధ్యలో మానేస్తే దామాషా ప్రకారం ఫీజు రీఫండ్ చేయాల్సి ఉంటుంది. కోటాలో వరుసగా విద్యార్థుల ఆత్మహత్యలపై అధ్యయనం అనంతరం ఐఐటీ, నీట్ ఇతర పోటీ పరీక్షలకు శిక్షణ పేరుతో 16 ఏళ్లలోపు విద్యార్థులను చేర్చుకోవడం, సాధారణ పాఠశాలల్లో చేరిన వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించడంపై రాజస్థాన్ ప్రభుత్వం నిషేధం విధించింది.బలవన్మరణాలు..విశాఖ పీఎం పాలెంలోని ఓ కార్పొరేట్ స్కూల్లో ఈ ఏడాది జనవరిలో 9వ తరగతి చదివే ఓ విద్యార్థికి టెన్త్ పాఠ్యాంశాలు బోధిస్తూ టెస్టుల పేరుతో తీవ్ర ఒత్తిడికి గురి చేయడంతో భరించలేక ప్రాణాలు తీసుకున్నాడు. గతేడాది ఫిబ్రవరిలో తిరుపతి జిల్లా గూడూరులో ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో తనిఖీల సందర్భంగా రికార్డులు సమర్పించాలని యాజమాన్యం ఒత్తిడి చేయడంతో 21 ఏళ్ల విద్యార్థి హాస్టల్ భవనంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) గణాంకాలు 2021లో ఏపీలో 523 మంది విద్యార్థులు వివిధ కారణాలతో బలవన్మరణాలకు పాల్పడినట్లు వెల్లడిస్తున్నాయి. వాస్తవానికి ఈ సంఖ్య మూడింతలు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 2014 తరువాత 57 శాతానికి పైగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. విద్యార్థులపై మార్కులు, ర్యాంకుల ఒత్తిడి పెరగడంతో అంచనాలను అందుకోలేక సగటున వారానికి ఒక్కరు ప్రాణాలు కోల్పోతున్నట్లు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రాజస్థాన్ తరహాలో ప్రత్యేక చట్టం తెచ్చి కార్పొరేట్ విద్యాసంస్థల వేధింపులను నియంత్రించాలని నిపుణులు సూచిస్తున్నారు. రాజస్థాన్‌లో ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేయడంతో పాటు కోచింగ్ సెంటర్ల నియంత్రణకు ‘‘కంట్రోల్ అండ్ రెగ్యులేషన్ బిల్లు–2024’’ పెద్ద ముందడుగుగా భావిస్తున్నారు. -
బంధించి, 6 నెలలకుపైగా రేప్
కాన్పూర్(యూపీ): విద్యాబుద్దులు నేర్పాల్సిన ఉపాధ్యాయులే కామపిశాచులుగా మారి టీనేజ్ విద్యార్థినితో అమానుషంగా ప్రవర్తించిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. 2022 డిసెంబర్ చివర్లో జరిగిన ఘటన వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. వైద్యవిద్యా కోర్సులో ప్రవేశాల కోసం నీట్ పరీక్ష రాసేందుకు సిద్ధమవుతున్న 17 ఏళ్ల బాలికను ఇద్దరు టీచర్లు బంధించి ఆరునెలలకుపైగా అత్యాచారానికి పాల్పడిన ఘటన ఇప్పుడు యూపీలో చర్చనీయాంశమైంది. కేసు వివరాలను కళ్యాణ్పూర్ అసిస్టెంట్ కమిషనర్ అభిõÙక్ పాండే శనివారం మీడియాకు వెల్లడించారు. ఫతేపూర్ పట్టణానికి చెందిన ఈ టీనేజీ అమ్మాయి నీట్ కోచింగ్ కోసం కాన్పూర్‌కు వచ్చి హాస్టల్లో ఉంటోంది. ఆమె నీట్ కోచింగ్ తీసుకుంటున్న చోటే సాహిల్ సిద్ధిఖీ జీవశాస్త్రం, వికాస్ పూర్వాల్ రసాయనశాస్త్రం బోధించేవారు. 2023 ఏడాది కొత్త ఏడాది వేడుకలు జరుగుతున్నాయి, విద్యార్థులంతా వస్తున్నారని చెప్పి ఈ టీనేజర్‌ను ఆమె ఫ్రెండ్ ఫ్లాట్‌కు టీచర్లు సాహిల్, వికాస్ రప్పించారు. మక్డీఖేరాలోని ప్లాట్‌కు వచ్చిన అమ్మాయికి టీచర్లుతప్ప విద్యార్థులెవరూ కనిపించలేదు. మత్తుమందు కలిపిన శీతలపానీయం తాగడంతో స్పృహకోల్పోయిన టీనేజర్‌ను సాహిల్ తన ఫ్లాట్‌కు తీసుకెళ్లి ఆరునెలలకుపైగా బంధించాడు. పలుమార్లు రేప్‌చేశాడు. తర్వాత వికాస్ సైతం అదే దారుణానికి పాల్పడ్డాడు. ఆరునెలల తర్వాత కాన్పూర్‌కు వచ్చిన తల్లి ఆ టీనేజర్‌ను తీసుకెళ్లింది. అయితే అత్యాచారాన్ని వీడియోలు తీసి బెదిరించడంతో కుటుంబపరువు పోతుందన్న భయంతో టీనేజర్ తనకు జరిగిన దారుణాన్ని బయటకు చెప్పలేదు. అయితే రెండు నెలల క్రితం మరో విద్యారి్థని పట్ల అనుచితంగా ప్రవర్తించడంతో టీచర్ సాహిల్‌ను పోలీసులు అరెస్ట్‌చేశారు. ఇటీవల అతను బెయిల్‌పై బయటికొచ్చాడు. అయితే ఆ మరో విద్యారి్థనిని సాహిల్ లైంగికంగా వేధించిన వీడియో తాజాగా బయటకురావడంతో ధైర్యం తెచ్చుకున్న టీనేజర్ ఎట్టకేలకు పోలీసులకు ఫిర్యాదుచేసింది. పోక్సోసహా పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదుచేసి సాహిల్, వికాస్‌లను అరెస్ట్‌చేశారు. -
డాక్టర్ చదువుకు డబ్బుల్లేక..కూలి పనులకు..
హుస్నాబాద్ రూరల్: వైద్యురాలు కావాలన్నది ఆ అడవి బిడ్డ తపన.. అందుకోసం కూలి పనులు చేస్తూనే కష్టపడి చదివింది. నీట్లో 447 మార్కులు సాధించింది. ప్రైవేటు కాలేజీలో సీటు రావడంతో ఫీజులకు డబ్బుల్లేక.. ఎప్పట్లాగే తల్లిదండ్రులతో పాటు కూలి పనులకు వెళ్తోంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం భల్లునాయక్ తండాకు చెందిన లావుడ్య లక్ష్మి, రమేశ్ దంపతులకు ఇద్దరు కూతుళ్లు. దంపతులు కూలిపని చేస్తూ కూతుళ్లను చదివిస్తున్నారు. పెద్ద కూతురు బీ–ఫార్మసీ చేస్తోంది. చిన్న కూతురు దేవిని కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డి గురుకులంలో చేరి్పంచి చదివించారు.పదో తరగతి, ఇంటర్మిడియెట్‌లో మంచి మార్కులు సాధించిన దేవి.. డాక్టర్ కావాలన్న లక్ష్యంతో ఏడాదిగా తల్లిదండ్రులతో పాటు కూలి పనులకు వెళ్తూనే నీట్‌కు సిద్ధమైంది. నీట్లో 447 (2లక్షల 80 వేల ర్యాంకు) మార్కులు సాధించడంతో తల్లిదండ్రులు సంతోషపడ్డారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీటు వస్తుందని అశించిన లావుడ్య దేవికి.. సిద్దిపేట సురభి మెడికల్ కాలేజీలో సీటు వచి్చంది. ప్రైవేటు మెడికల్ కాలేజీలో చదువుకు ఏటా రూ.3.5 లక్షల వరకు ఖర్చవుతుంది. అంత స్థోమత తల్లిదండ్రులకు లేకపోవడంతో.. చేసేదిలేక దేవి కూలి పనులకు వెళ్తోంది. ఆస్తులు అమ్మి ఫీజు కడదామంటే అడవిలో పెంకుటిల్లు ఒకటే దిక్కు. దానిని కొనేవారు కూడా ఎవరూ లేరు. దాతలు ముందుకొచ్చి ఆర్థిక సహాయం చేస్తే తమ బిడ్డ ఆశయం నెరవేరుతుందని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. -
కూతురంటే ఎంత ప్రేమో.. 70ఏళ్ల వయస్సులో ఎంబీబీఎస్
భువనేశ్వర్ : ఉద్యోగ విరమణకాగానే ‘కృష్ణా రామా’ అనుకుంటూ కాలం గడపాలనుకునేవాళ్లనే ఎక్కువగా చూస్తుంటాం. కానీ ఈయన అలా కాదు. కన్నబిడ్డ దూరమై మిగిల్చిన విషాదం ముందు.. వయసు మీదపడి ఓపిక తగ్గే తరుణంలో ఉరకలేసే ఉత్సాహంతో నీట్ యూజీ 2020 ఫలితాల్లో ర్యాంక్‌ను సాధించారు. ఎంబీబీఎస్ విద్యార్థిగా పాఠాలు నేర్చుకుంటున్నారు. త్వరలో డాక్టర్‌గా విధులు నిర్వహించనున్నారు.ఒడిశాకు చెందిన 64ఏళ్ల జే కిషోర్ ప్రధాన్ ఎస్బీఐ బ్యాంక్‌లో ఉన్నత ఉద్యోగం. ఇద్దరు కవలలు. అందమైన కుటుంబం. ఏచీకూ చింతాలేదు. ఎందుకో ముచ్చటైన ఆ కుటుంబాన్ని చూసి విధికి కన్ను కుట్టింది.మలిదశలో తండ్రికి చేదోడువాదోడుగా ఉండాలనుకున్న కుమార్తెను దూరం చేసింది. ఆ తల్లిదండ్రుల కలలను కల్లలు చేసింది. ఇంటి వెలుగులను ఒకేసారి ఆర్పేసి చీకట్లు మిగిల్చింది.అదుగో అప్పుడే తనలాగే మరో ఆడబిడ్డ తండ్రికి గుండె కోత మిగిల్చకూడదనుకున్నారు. డాక్టర్‌గా సేవలందించాలని దీక్షబూనారు. ఎస్బీఐ అసిస్టెంబ్ బ్యాంక్ మేనేజర్‌గా పదవీ విరమణ చేసినా డాక్టర్‌గా సేవలందించాలనే తన చిరకాల వాంఛను నెరవేర్చుకునే పనిలో పడ్డారు. దృఢ సంకల్పంతో ఓ వైపు విద్యార్థి, మరోవైపు కుటుంబ బాధ్యతలను నిర్వర్తించే పెద్దగా ఇలా రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ తన కలల ప్రయాణాన్ని ప్రారంభించారు.కుటుంబ వ్యవహారాలు, ఒత్తిళ్లు ఉన్నప్పటికీ దేశంలోనే అత్యంత కఠినమైన నీట్ పరీక్షల్లో ఉత్తర్ణీత సాధించాలనే లక్ష్యం ముందు అవి చిన్నవిగా కనిపించాయి. ముందుగా నీట్ యూజీ 2020 పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేందుకు పోటీ పడ్డారు. ఆన్లైన్ క్లాసులకు అటెండ్ అయ్యారు. మొక్కవోని దీక్షతో అనేక సవాళ్లను అధిగమించారు. చివరికి అనుకున్నది సాధించారు.నీట్ పరీక్షా ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించారు. వీర్ సురేంద్ర సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ (VIMSAR)లో ఎంబీబీఎస్ చదివేందుకు అర్హత సాధించారు. ప్రస్తుతం ఆయన ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదువుతున్నారు. వచ్చే ఏడాది డాక్టర్‌గా ప్రజా సేవ చేయనున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాకు డబ్బు మీద ఆశలేదు. దూరమైన నా కుమార్తె కోసం నేను బతికి ఉన్నంత వరకు ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాను’అని వ్యాఖ్యానించారు. ‘దేశ వైద్య విద్యా చరిత్రలో ఇదొక అరుదైన సంఘటన. ఇంత వయస్సులో వైద్య విద్యార్థిగా అర్హత సాధించి ప్రధాన్ ఆదర్శంగా నిలిచారు’ అని విమ్స్‌ఆర్ డైరెక్టర్ లలిత్ మెహెర్ ప్రధాన్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.👉చదవండి : ‘మేం ఏపీకి వెళ్లలేం’ -
64 ఏళ్ల వయసులో ఎంబీబీఎస్ సీటు : రిటైర్డ్ ఉద్యోగి సక్సెస్ స్టోరీ
ఒక్కసారి ఉద్యోగంలో చేరి సంసార బాధ్యతల్లో చిక్కుకున్న తరువాత తమ కిష్టమైంది చదువుకోవడం అనేది కలే, దాదాపు అసాధ్యం అనుకుంటాం కదా. కానీ ఈ మాటలన్నీ ఉత్తమాటలే తేల్చి పారేశాడు ఒక రిటైర్డ్ ఉద్యోగి. వినడానికి ఆశ్చర్యంగా ఉందా? నమ్మలేకపోతున్నారా? అయితే ఒడిశాకు చెందిన జైకిశోర్ ప్రధాన్ గురించి తెలుసుకోవాల్సిందే. ప్రస్తుతం ఈయన సక్సెస్ స్టోరీ నెట్టింట చక్కర్లు కొడుతోంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) రిటైర్డ్ ఉద్యోగి జై కిశోర్ ప్రధాన్ అందరినీ ఆశ్చర్యపరుస్తూ 64 ఏళ్ల వయసులో ఎంబీబీఎస్ కోర్సులో చేరారు. 2020లో నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET UG)లో విజయవంతంగా ఉత్తీర్ణత సాధించారు. ఎస్బీఐలో డిప్యూటీ మేనేజర్‌గా ఉద్యోగ విధులు నిర్వర్తించిన ఆయన రిటైర్మెంట్ తరువాత అందరిలాగా రిలాక్స్ అయిపోలేదు. డాక్టరవ్వాలనే తన చిరకాల వాంఛను తీర్చుకొనేందుకు రంగంలోకి దిగారు. వైద్య విద్య ప్రవేశానికి గరిష్ట వయోపరిమితి నిబంధన లేకపోవడంతో దృఢ సంకల్పంతో నడుం బిగించారు. అందుకోసం పెద్ద వయసులోనూ కూడా కష్టపడి చదివి జాతీయ స్థాయిలో వైద్యవిద్య ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ లో అర్హత సాధించారు.ఎవరీ జై కిశోర్ ప్రధాన్జై కిశోర్ ప్రధాన్ స్వస్థలం ఒడిశాలోని బార్ గఢ్ ప్రాంతం. బాల్యం నుంచే డాక్టర్ అవ్వాలని కలలు కనేవారు. 1974లో మెడికల్ ఎంట్రన్స్ ర్యాంకు రాకపోవడంతో ఆశలు వదిలేసుకున్నారు. బీఎస్సీడిగ్రీ పూర్తి చేసి ఎస్బీఐలో ఉద్యోగం సంపాదించారు. ఈ సమయంలో తండ్రి అనారోగ్యానికి గురయ్యారు. చికిత్స తీసుకుంటున్న సమయంలో తండ్రి అనుభవించిన బాధ, కళ్లారా చూసిన జై కిశోర్ ఎప్పటికైనా డాక్టర్ అవ్వాలని నిర్ణయించుకున్నారట.జై కిశోర్ జీవితంలో మరో విషాదం వైద్య వృత్తిపై ఉన్న ప్రేమతో తన పెద్దకుమార్తెను డాక్టర్న చేయాలని ఎంతగానో ఆశపడ్డారు. అయితే, దురదృష్టవశాత్తూ ఆమె ఎంబీబీఎస్ చదువుతుండగా, అనారోగ్యంతో కన్నుమూయడం విషాదాన్ని నింపింది. అయితే తన రెండో కుమార్తెను కూడా మెడిసిన్ చదివిస్తుండటం విశేషం. సాధించాలన్న పట్టుదల ఉండాలేగానీ అనుకున్న లక్ష్యం చేరేందుకు వయసుతో సంబంధం లేదని జై కిశోర్ చాటి చెప్పారు. -
3.16 లక్షల ర్యాంకుకూ ఎంబీబీఎస్ కన్వీనర్ సీటు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర చరిత్రలో మొదటిసారిగా నీట్లో ఎక్కువ ర్యాంకు వచ్చిన విద్యార్థికి ఎంబీబీఎస్ కన్వీనర్ కోటాలో సీటు లభించింది. ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా మొదటి విడత జాబితాను కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం మంగళవారం వెల్లడించింది. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఉన్న కన్వీనర్ సీట్లలో దాదాపు 4,760 సీట్లను విద్యార్థులకు కేటాయిస్తూ జాబితా విడుదల చేసింది. ఏ కాలేజీలో ఏ ర్యాంకుకు ఎవరికి సీట్లు వచ్చాయో విద్యార్థులకు సమాచారం పంపించింది. గతేడాది అత్యధికంగా నీట్లో 2.38 లక్షల ర్యాంకు వచ్చిన ఒక ఎస్సీ విద్యార్థికి ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలో సీటు లభించగా.. ఈసారి బీసీ ఏ కేటగిరీలోనే 3,16,657 ర్యాంకర్‌కు సీటు లభించడం విశేషం. గత ఏడాది మొదటి విడతలో 1.31 లక్షల ర్యాంకుకు జనరల్ కేటగిరీలో సీటు వచ్చింది. ఈసారి మొదటి విడతలో 1.65 లక్షల ర్యాంకర్‌కు సీటు లభించింది. బీసీ బీ కేటగిరీలో గతేడాది మొదటి విడతలో 1.40 లక్షల ర్యాంకర్‌కు సీటు రాగా, ఈసారి 1.94 లక్షల ర్యాంకర్‌కు సీటు లభించింది. అలాగే గతేడాది బీసీ డీ కేటగిరీలో 1.35 లక్షల ర్యాంకర్‌కు సీటు రాగా, ఈసారి 1.80 లక్షల ర్యాంకర్‌కు వచ్చింది. కన్వీనర్ కోటా సీట్లకు ఇంకా మూడు నుంచి నాలుగు విడతల కౌన్సెలింగ్ జరగనుంది. బీసీ ఈ కేటగిరీలో ప్రస్తుతం 2.03 లక్షల ర్యాంకుకు సీటు లభించింది. ఎస్సీ కేటగిరీలో 2.90 లక్షల ర్యాంకుకు, ఎస్సీ కేటగిరీలో 2.87 లక్షల ర్యాంకుకు సీటు లభించడం గమనార్హం. నిజామాబాద్ మెడికల్ కాలేజీలో దివ్యాంగ రిజర్వేషన్ కింద 13.41 లక్షల ర్యాంకుకు సీటు లభించింది. ఇలావుండగా జాతీయ స్థాయిలో 8 లక్షల నుంచి 9 లక్షల వరకు ర్యాంకులు వచ్చిన వారికి కూడా మన దగ్గర ప్రైవేటు కాలేజీల్లో బీ కేటగిరీలో ఎంబీబీఎస్ సీటు వస్తుందని అంటున్నారు.పెరిగిన సీట్లతో విస్త్రృత అవకాశాలురాష్ట్రంలో వైద్య విద్య అవకాశాలు భారీగా పెరిగాయి. గతేడాది కంటే ఈసారి ప్రభుత్వ కాలేజీలు పెరిగాయి. అలాగే కొన్ని ప్రైవేట్ కాలేజీల్లోనూ సీట్లు పెరిగాయి. దీంతో అధిక ర్యాంకర్లకు కూడా కన్వీనర్ కోటాలో సీట్లు లభిస్తున్నాయి. రాష్ట్రంలో మొత్తం 64 ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. వాటిల్లో మల్లారెడ్డికి చెందిన రెండు, నీలిమ మెడికల్ కాలేజీలు డీమ్డ్ వర్సిటీలయ్యాయి. వీటితో పాటు ఎయిమ్స్ మెడికల్ కాలేజీని మినహాయించి 60 మెడికల్ కాలేజీల్లోని సీట్లకు ఇప్పుడు కన్వీనర్ కోటా కింద సీట్ల కేటాయింపు జరిపారు. 2024–25 వైద్య విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో కొత్తగా 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వచ్చాయి. తద్వారా అదనంగా 400 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. ప్రభుత్వంలోని అన్ని సీట్లను, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని 50 శాతం సీట్లను కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని సీట్లల్లో 15 శాతం అఖిల భారత కోటా కింద భర్తీ చేస్తారు. వాటిల్లో రెండు విడతల కౌన్సెలింగ్ తర్వాత సీట్లు మిగిలితే తిరిగి వాటిని రాష్ట్రానికే ఇస్తారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణాల్లో ఆర్థికంగా బలహీన వర్గాల (ఈడబ్ల్యూఎస్)కు 10 శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. -
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఐఐటీ, నీట్ శిక్షణ
సాక్షి, అమరావతి: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఐఐటీ, నీట్ శిక్షణ ఇచ్చేలా ఇంటర్ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. తొలిదశలో రాష్ట్రంలోని నాలుగు పట్టణాల్లో కేంద్రాలు ఏర్పాటు చేసి, వాటి పరిధిలోని అన్ని కళాశాలల విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. గతంలో ఎంపిక చేసిన కళాశాలల్లో ఐఐటీ శిక్షణను ఆదే కళాశాలకు చెందిన జూనియర్ లెక్చరర్లు ఇచ్చేవారు. ఈసారి నారాయణ కళాశాలలకు చెందిన ఐఐటీ, నీట్ సిలబస్ బోధించే సిబ్బందితో శిక్షణ ఇప్పించేందుకు ఇంటర్ బోర్డు ప్రణాళిక సిద్ధం చేసింది.తొలుత కర్నూలు, నెల్లూరు, గుంటూరు, విశాఖపట్నం నగరాల్లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, ఆయా నగరాలకు ఐదు లేదా పది కి.మీ. పరిధిలోని ప్రభుత్వ కాలేజీల విద్యార్థులకు ఈ అవకాశం కల్పించనున్నారు. ఆసక్తి గల ఇంటర్ ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు నారాయణ సిబ్బంది ప్రత్యేక ప్రవేశ పరీక్ష నిర్వహించి, ప్రతిభ చూపిన వారిని ఉచిత శిక్షణకు ఎంపిక చేయనున్నారు. ఎంపికైన విద్యార్థులు నిర్ణీత సెంటర్లో ఇంటర్ రెగ్యులర్ తరగతులతో పాటు అంతర్భాగంగా ఐఐటీ, నీట్ శిక్షణను కూడా నారాయణ విద్యా సంస్థల సిబ్బందే ఇవ్వనున్నారు.విద్యార్థుల కాలేజీలు వేరైనప్పటికీ ఈ ప్రత్యేక శిక్షణ కేంద్రాల్లో వారి హాజరు ఆన్లైన్లో నమోదు చేస్తారు. దీనివల్ల వారి అటెండెన్స్ ఇబ్బందులు లేకుండా ఉంటుందని ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. కాగా, గత ప్రభుత్వంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులకు ఇదే తరహా శిక్షణను ఇంటర్ బోర్డు చేపట్టింది. ఈ ప్రత్యేక శిక్షణపై ఆసక్తి గల ప్రభుత్వ లెక్చరర్లతో వారు పనిచేస్తున్న కాలేజీల్లోనే శిక్షణ ఏర్పాట్లు చేశారు. అయితే, అనుకున్న మేర ఫలితాలు రాకపోవడంతో ఈ ఏడాది శిక్షణ విధానం మార్చినట్టు తెలుస్తోంది. విద్యార్థులకు ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహణ, ఐఐటీ, నీట్ నమూనా పరీక్షల నిర్వహణ వంటి అన్ని అంశాలను నారాయణ విద్యాసంస్థలే చూసుకోనున్నాయి. -
మా కలలు చిదిమేసిన ప్రభుత్వం
మా కలలను ప్రభుత్వం చిదిమేసింది. మా ఆశలను అడియాశలు చేసింది. గత ఏడాది కటాఫ్ కన్నా ఎక్కువగా మార్కులు వచ్చాయన్న ఆనందాన్ని ఆవిరి చేసింది. రిజర్వేషన్ కోటాలో అయినా సీటు వస్తుందని ఎదురు చూసినా నిరాశనే మిగిల్చింది. మా భవిష్యత్‌ను ప్రశ్నార్థకంగా మార్చింది. కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్‌పరం చేయాలని చంద్రబాబు సర్కారు తీసుకున్న నిర్ణయం మాకు పెనుశాపంగా మారింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు వైద్య విద్యకు పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా కళాశాలలు, ఎంబీబీఎస్ సీట్లు పెంచుకుంటూ వెళుతుంటే... ఒక్క మన రాష్ట్రంలో మాత్రమే మంజూరు చేసిన కళాశాలలు, ఎంబీబీఎస్ సీట్లను సైతం వద్దని ప్రభుత్వమే అడ్డుకుంటున్న దౌర్భాగ్య పరిస్థితులు నెలకొన్నాయి... అని పలువురు నీట్ ర్యాంకర్లు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం దుర్మార్గంగా తీసుకున్న నిర్ణయాలతో ఈ ఒక్క ఏడాదే ఏకంగా 700 ఎంబీబీఎస్ సీట్లను కోల్పోయి తమ పిల్లల భవిష్యత్ తలకిందులైందని పలువురు తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఎన్నికలకు ముందు కొత్త వైద్య కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు రద్దు చేస్తామని చంద్రబాబు, లోకేశ్ హామీ ఇస్తే నమ్మామని... అధికారంలోకి వచ్చాక ఆ జీవోలు రద్దు చేయకపోగా... ప్రభుత్వ కళాశాలల ప్రైవేటీకరణ... అంటూ అసలు రూపం బయటపెట్టారు. నమ్మించిగొంతు కోశారు... అని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. – సాక్షి, అమరావతి/నెట్వర్క్ భవిష్యత్ ప్రశ్నార్థకమైంది గత ఏడాది రెండు మార్కుల తేడాతో కన్వినర్ కోటా ఎంబీబీఎస్ అడ్మిషన్ కోల్పోయాను. మేనేజ్మెంట్ కోటాలో చదవాలంటే కుటుంబ ఆర్థిక పరిస్థితులు సహకరించవు. దీంతో ఏడాదిపాటు లాంగ్‌టర్మ్ కోచింగ్ తీసుకున్నాను. కష్టపడి చదివి నీట్ యూజీ–2024లో 610 స్కోర్ చేశా. ఈ ర్యాంక్‌కు గత ఏడాది గుంటూరు మెడికల్ కాలేజీలో ఓసీకి చివరి సీట్ వచ్చింది. గత ఏడాది ప్రభుత్వ కళాశాలల్లో 750 సీట్లు పెరిగాయి. ఈసారి కూడా మరో 750 సీట్లు పెరుగుతాయన్నారు. వాటికితోడు కొత్త వైద్య కళాశాలల్లో సెల్ఫ్‌ఫైనాన్స్ విధానం రద్దు చేస్తామని టీడీపీ చెప్పింది. ఇలా కూడా మరికొన్ని సీట్లు కలిసి వస్తాయని అనుకున్నా. మంచి స్కోర్ చేశాను. సీట్లు కూడా పెరిగితే తొలి దశ కౌన్సెలింగ్‌లోనే సీట్ వచ్చేస్తుందని కుటుంబం అంతా ఆశపెట్టుకున్నాం. కౌన్సెలింగ్ మొదలయ్యే నాటికి కొత్త కళాశాలలు ప్రారంభం కాలేదు. సెల్ఫ్‌ఫైనాన్స్ విధానం రద్దు చేయలేదు. దీంతో సీట్లు పెరగలేదు. ఏయూ రీజియన్‌లో ఓసీ విభాగంలో 615 స్కోర్‌కు ఆఖరి సీట్ దక్కింది. రెండు, మూడు కౌన్సెలింగ్‌లలో సీట్ వస్తుందన్న నమ్మకం లేదు. ఈ ప్రభుత్వం నిర్ణయంతో నా భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. – యశ్వంత్‌రెడ్డి, నీట్ ర్యాంకర్, విశాఖపట్నం కొత్త కాలేజీలో సీటు వస్తుందని ఆశపడ్డా బీసీ–డీ సామాజికవర్గానికి చెందిన నేను నీట్లో 541 మార్కులు తెచ్చుకున్నాను. కొత్త మెడికల్ కళాశాలలు ఏర్పాటు కావడంతో ఎంబీబీఎస్ సీటు వస్తుందని ఆశపడ్డాను. కొత్త కళాశాలలు అందుబాటులోకి వచ్చి ఉంటే మాలాంటి పేద విద్యార్థులకు అవకాశం లభించేది. పులివెందుల మెడికల్ కళాశాలకు 50 సీట్లు మంజూరు కాగా, రద్దు చేయాలని ప్రభుత్వం కోరడం వల్ల మాలాంటి బీసీ విద్యార్థులకు తీవ్ర నష్టం కలుగుతుంది. ఇక డబ్బులు కట్టి పేద విద్యార్థులు వైద్యవిద్యను అభ్యసించడం కష్టమే. – దేవేశ్, నీట్ విద్యార్థి, రాజంపేట, అన్నమయ్య జిల్లా లాంగ్ టర్మ్ శిక్షణ తీసుకున్నా.. నేను మూడేళ్లగా నీట్ కోసం లాంగ్‌టర్మ్ శిక్షణ తీసుకుంటున్నా. ఈ ఏడాది నీట్లో 500 మార్కులు సాధించాను. ఈ ఏడాది కొత్త కాలేజీలు వస్తాయనే ఆశతో బీసీ–ఈ కోటాలో ఎలాగైనా ఎంబీబీఎస్ సీటు వస్తుందనే ఆశతో ఉన్నా. కానీ కొత్త మెడికల్ కాలేజీలు రాకపోవటం, పులివెందులకు కేటాయించిన సీట్లను ప్రభుత్వం వద్దనడంతో ఈ ఏడాది కూడా సీటు వస్తోందో.. రాదో అని భయంగా ఉంది. మా తల్లిదండ్రులు పేదలు అయినా నన్ను డాక్టర్‌గా చూడాలని లాంగ్‌టర్మ్‌లో చేర్పించారు. ఇప్పుడు సీటు రాకపోతే తీవ్రంగా నష్టపోతాం. – షేక్ తజి్మన్, దువ్వూరు, వైఎస్సార్ జిల్లా రిజర్వేషన్ ఉన్నా మా అబ్బాయికి సీటు రాలేదు గత ఏడాది బీసీ–డీలో 497 స్కోర్ వరకు కన్వినర్ కోటాలో సీటు వచ్చింది. ఈసారి మా అబ్బాయి 541 స్కోర్ చేశాడు. 83 మార్కుల మేర స్కోర్ పెరిగింది. ఈ క్రమంలో తొలి రౌండ్లో కన్వినర్ కోటా సీటు వస్తుందని ఆశపడ్డాం. కానీ, తొలి రౌండ్లో ఎస్వీయూ రీజియన్‌లో బీసీ–డీలో 560 వరకు సీటు వచ్చింది. మా అబ్బాయికి సీటు రాలేదు. గత ఏడాది నంద్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 519 స్కోర్‌కు సీట్ వచ్చింది. ఆ ఏడాది పోటీకి తగ్గట్టుగా ప్రభుత్వ కళాశాలలు పెరిగి సీట్లు పెరగడంతో 519 ర్యాంక్‌కు ప్రభుత్వ కాలేజీలో సీటు వచ్చింది. పులివెందుల కాలేజీకి అనుమతులు వచ్చినా వద్దని లేఖ రాశారు. సీట్లు పెంచకుండా ఈ ప్రభుత్వం అడ్డుపడి మాలాంటి వాళ్లకు ద్రోహం తలపెట్టింది. వేరే దేశానికి వెళ్లి అక్కడ ప్రైవేట్ కంపెనీల్లో పని చేసి వచ్చిన జీతంలో తిని తినక దాచిపెట్టి నా కొడుక్కు లాంగ్‌టర్మ్ కోచింగ్ ఇప్పించా. మంచి స్కోరు, రిజర్వేషన్ ఉన్నా ప్రభుత్వ కోటాలో సీటు రాలేదు. ఇక మాలాంటి వాళ్లు ఎంబీబీఎస్ వంటి ఉన్నత చదువులు ఎలా చదువుతారు. – పెంచలయ్య, నీట్ ర్యాంకర్ తండ్రి, అన్నమయ్య జిల్లా నా కల చెదిరింది వైద్య విద్యను అభ్యసించి సమాజానికి సేవ చేయాలనుకునే నా కల చెదిరింది. కటాఫ్ పెంచి నా భవితను చిదిమేశారు. ఓసీ వర్గానికి చెందిన నేను 540 మార్కులు సాధించినా సీటు రాలేదు. గత ప్రభుత్వంలో వైద్య విద్యకు ఎనలేని ప్రాధాన్యం లభించింది. ప్రస్తుత ప్రభుత్వంలో ప్రాధాన్యత కొరవడటంతో నాలాంటి ఎందరో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. వెంటనే ప్రభుత్వం వైద్య విద్యకు తగిన ప్రాధాన్యత కల్పించాలి. – గరికిన సత్య సంతోష్, గొడారిగుంట,కాకినాడ ఇక మెడిసిన్ కలగానే... విజయవాడలోని ఓ కోచింగ్ సెంటర్లో సంవత్సరం నుంచి నీట్ శిక్షణ తీసుకుంటున్నా. ఇంటర్లో గురుకుల పాఠశాలలో చదువుకున్నా. గత ఏడాది మొదటి సారి నీట్ రాస్తే 388 మార్కులు వచ్చాయి. ఈ సారైనా మెడికల్ సీటు సాధించాలనే లక్ష్యంతో కష్టపడి చదివా. 720 మార్కులకు 524 మార్కులు వచ్చాయి. ప్రభుత్వం నూతనంగా ఐదు మెడికల్ కాలేజీలకు అనుమతులు ఇచ్చి ఉంటే 750 సీట్లు అదనంగా వచ్చేవి. దీంతో నాకు సీటు వచ్చే అవకాశం ఉండేది. అలా జరగకపోవడంతో నా లాంటి ఎంతో మంది పేద విద్యార్థుల డాక్టర్ కల కలగానే మిగిలిపోనుంది. బీసీ–బీ కురుబ అయినా నాకు సీటు రాలేదు. – ముత్తుకూరు సరిత, సంతేకుడ్లూరు గ్రామం, ఆదోని మండలం తీవ్ర నిరాశకు గురయ్యా నాన్న డాక్టర్ బి.సురేష్, రేడియాలజిస్టు. అమ్మ డాక్టర్ ఉమాదేవి గైనకాలజిస్టు. ఇద్దరూ డాక్టర్లు కావడంతో నన్ను కూడా డాక్టర్‌ను చేయాలని వారు ఎంతో ఆశగా చదివించారు. వారి ఆశలను వమ్ము చేయకుండా నేను కూడా ఎంతో కష్టపడి చదువుతున్నాను. మాది బీసీ–బీ కేటగిరీ. నీట్లో 527 మార్కులు తెచ్చుకున్నా సీటు రాలేదు. కటాఫ్ 556 దగ్గర ఆగిపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యాను. మన రాష్ట్రంలో కొత్తగా ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను అందుబాటులోకి తీసుకువచ్చి ఉంటే నాకు సీటు వచ్చి ఉండేదని లెక్చరర్లు చెబుతున్నారు. నాకు సీటు రాకపోవడంతో మా అమ్మానాన్న కూడా ఎంతో బాధపడ్డారు. – బి.ప్రణవ్, కర్నూలు సీట్లు పెరిగితే ఈ పరిస్థితి ఉండేది కాదు మాది వ్యవసాయ కుటుంబం. మాది బీసీ–ఏ కేటగిరీ. నన్ను ఎలాగైనా డాక్టర్‌ను చేయాలని మా అమ్మ వరలక్ష్మి , నాన్న వెంకటేశ్వర్లు చాలా కష్టపడి చదివిస్తున్నారు. నేను కూడా కష్టపడి చదివి మా అమ్మానాన్నల కలలను సాకారం చేయాలని ప్రయతి్నస్తున్నాను. నీట్లో 528 మార్కులు సాధించినా సీటు రాలేదు. కటాఫ్ 561 వద్దే ఆగిపోయింది. రాష్ట్రంలో మెడికల్ సీట్లు పెరిగి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. గత సంవత్సరం ఐదు కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభమయ్యాయి. ఈసారి కూడా మరికొన్ని కాలేజీలు వస్తాయని, మరో 500 నుంచి 700 వరకు సీట్లు పెరుగుతాయని భావించాను. కానీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో మాలాంటి విద్యార్థులకు తీవ్ర నిరాశే మిగిలింది. – బి.జాహ్నవి, కర్నూలు 597 మార్కులు వచ్చినా సీటు రాలేదు ఎంబీబీఎస్‌లో కన్వినర్ కోటా కింద మొదటి కౌన్సిలింగ్లో సీట్లు కేటాయింపు పూర్తయింది. నాకు 597 మార్కులు వచ్చినా సీటు రాలేదు. పులివెందులలో మెడికల్ కళాశాల ఉండి ఉంటే ఈజీగా నాకు సీటు వచ్చి ఉండేది. నాకు సీటు రాకపోవడం చాలా బాధ కలిగిస్తోంది. నీట్ రాసి 597 మార్కులు సాధించినప్పటికీ సీటు రాకపోవడం కలచివేస్తోంది. ప్రభుత్వ తీరు వల్లే నాకు అన్యాయం జరిగింది. – సాయి విఘ్నేశ్వరరెడ్డి, పులివెందుల, వైఎస్సార్ జిల్లా సీట్లు వదులుకోవడం సరికాదు బీసీ–ఈ కేటగిరీకి చెందిన నేను నీట్లో 545 మార్కులు సాధించాను. అయినా సీటు రాలేదు. బీసీ–ఈ కటాఫ్ 553 వద్ద ఆగిపోయింది. గత సంవత్సరం బీసీ–ఈ కేటగిరీ కటాఫ్ 496 మార్కులు. అందువల్ల ఈ ఏడాది నాకు 545 మార్కులు రావడంతో తప్పకుండా సీటు వస్తుందని ఎంతో ఆశపడ్డాను. దీనికి తోడు రాష్ట్రంలో మెడికల్ సీట్లు పెరుగుతాయన్న ఆశ కూడా ఉండేది. కానీ మా ఆశలను ప్రభుత్వం నీరుగార్చింది. సీట్లు పెంచేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆర్థిక ఇబ్బందుల పేరుతో ప్రభుత్వం మెడికల్ కాలేజీల నిర్మాణాలను కొనసాగించలేదు. ఎన్ఎంసీ ఇచ్చిన సీట్లు కూడా వదులుకుంది. ఫలితంగా మాలాంటి వారికి తీవ్ర అన్యాయం జరిగింది. విలువైన మెడికల్ సీట్లు వదులుకోవడం సరికాదు. ఇప్పటికైనా ప్రభుత్వం మెడికల్‌సీట్లు సాధించాలి. – హెచ్ఎం ఫర్హా అన్జుమ్, కర్నూలు 570 వచ్చినా సీటు లేదు... నాకు నీట్ యూజీలో 570 మార్కులు వచ్చాయి. నేను ఓసీ కేటగిరీ. గత ఏడాది మా రీజియన్‌లో ఓసీ కేటగిరీ కటాఫ్ 542 వద్ద ఆగిపోయింది. ఓసీ కేటగిరీలో పోటీ తీవ్రంగా ఉంటుందని తెలుసు. అందుకే మొదటి నుంచి ఎంతో కష్టపడి చదువుతున్నాను. నీట్లో 570 మార్కులు సాధించినా ఫలితం లేకపోయింది. కటాఫ్ 601 వద్దే ఆగిపోయింది. గత సంవత్సరం కటాఫ్ 542 వద్ద ఆగిపోవడంతో ఈ సంవత్సరం నాకు వచ్చిన మార్కులకు తప్పకుండా సీటు వస్తుందని ఎంతో ఆశతో ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణాలను త్వరగా పూర్తిచేసి, ఎన్ఎంసీ ద్వారా సీట్లు సాధించి ఉంటే మాలాంటి వారికి తప్పకుండా సీట్లు వచ్చేవి. ప్రభుత్వ చర్యల వల్ల ఈ ఏడాది మాలాంటి విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగింది. – వి.సాయిసృజన, కర్నూలు ఆంధ్రాలో పుట్టడమే నేరమా? నా కుమార్తెకు బీసీ–ఏ కేటగిరీలో 565 మార్కులు వచ్చినా మెడికల్ సీటు రాలేదు. పేదవాళ్లం అయినప్పటికీ మా కుమార్తెను డాక్టర్‌గా చూడాలని సుమారు రూ.4లక్షలు ఖర్చు చేసి లాంగ్‌టర్మ్ కోచింగ్ ఇప్పించాం. ఎంబీబీఎస్ సీటు వస్తుందని ఆశపడ్డాం. చివరకు కన్నీరే మిగిలింది. గత ఏడాది 501 మార్కులకు ఎంబీబీఎస్ సీటు వచ్చింది. కానీ, ఈ ఏడాది 565 మార్కులు వచ్చినా నా బిడ్డకు సీటు రాలేదు. మాలాంటి వాళ్లని ఎంతోమందిని ఈ ప్రభుత్వం మోసం చేసింది. కొత్త కాలేజీలు వస్తే మాలాంటి వారి జీవితాలు బాగుపడతాయని ఎదురు చూశాం. తీరా ఇప్పుడు సీట్లు తగ్గించారు. ఆంధ్రాలో పుట్టడమే నేరమా.. అన్నట్లు ఉంది. – కె.నవీన్, విద్యార్థిని తండ్రి, టెక్కలిపేద పిల్లలకు శరాఘాతం ప్రభుత్వం కొత్తగా మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయకపోవడంతో సీట్లు తగ్గాయి. నా లాంటి విద్యార్థులకు నష్టం కలిగింది. ఎంబీబీఎస్ పూర్తిచేయాలన్న ఆశతో కష్టపడి చదివాను. సీటు వచ్చే అవకాశం లేదు. మళ్లీ లాంగ్‌టెర్మ్ కోచింగ్‌లో చేరాను. వైద్య విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు ప్రభుత్వ నిర్ణయం శరాఘాతం వంటిది. మెడికల్ కాలేజీలకు ప్రైవేట్‌కు అప్పగించాలనే ప్రభుత్వ నిర్ణయం విద్యార్థులకు శాపం. – కె.మానస, కిండం అగ్రహారం గ్రామం, బొండపల్లి మండలం మా భవిత ప్రశ్నార్థకం నేను బీసీ వర్గానికి చెందిన విద్యార్థిని. కటాఫ్ మార్కులు పెరగడంతో నీట్ సీటు చేజారింది. మాది పేద కుటుంబం. డాక్టర్ కావాలన్నది నా ఆశయం. వైద్య కళాశాలలు పెరగడంతో కచ్చితంగా సీటు వస్తుందని భావించాను. ఎంతో ఉన్నత భవిష్యత్ ఉంటుందని ఊహించాను. అయితే ప్రభుత్వం కొత్త కాలేజీలు తీసుకురాకపోవడంతో మా ఆశలన్నీ అడియాశలయ్యాయి. ప్రభుత్వమే ఇలా చేయడమే సరికాదు. – ఎండీ ఖాసీం, జె.రామారావుపేట, కాకినాడప్రభుత్వం వల్ల ఎంతో నష్టం నాకు నీట్లో 568 మార్కులు వచ్చాయి. గతేడాది ఎస్వీయూ రీజియన్‌లో ఓసీ కేటగిరీకి 542 మార్కులకు కూడా సీటొచ్చింది. ఈ ఏడాది కొత్తగా 5 కాలేజీలు వస్తున్నాయని.. 550కి ఓసీ కేటగిరిలో సీటు వస్తుందని మా కాలేజీ అధ్యాపకులు చెప్పారు. ఎస్వీయూ రీజియన్ పరిధిలో పులివెందుల మెడికల్ కాలేజీకి అనుమతి వచ్చిందన్నారు. కానీ ఆ సీట్లను రద్దు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసినట్లు తెలిసింది. దీంతో నేను ఎంతో నష్టపోతున్నా. ఏం చేయాలో అర్థమవ్వట్లేదు. ధైర్యం చేసి లాంగ్‌టర్మ్‌కు వెళదామన్నా.. వచ్చే ఏడాది సీట్లు పెరుగుతాయన్న నమ్మకం లేదు. – లతిక, నీట్ విద్యార్థి, ఎస్వీయూ రీజియన్ -
'టాప్‌లో కటాఫ్'
సాక్షి, అమరావతి: గతేడాది ఏయూ పరిధిలో ఓసీ విద్యార్థికి ఎంబీబీఎస్‌లో ప్రవేశాలకు నీట్ కటాఫ్ మార్కులు 563.. ఈ ఏడాది ఏకంగా 615..! ఇదే కేటగిరీకి ఎస్వీయూ పరిధిలో గతేడాది కటాఫ్ 550.. ఈ ఏడాది 601..!! ఆదివారం కన్వీనర్ కోటా తొలిదశ కౌన్సెలింగ్‌లో ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపు పరిస్థితి ఇదీ!! అప్పుడు సీటు దొరకటానికి.. ఇప్పుడు గగనంగా మారటానికి కారణం.. కొత్త మెడికల్ కాలేజీలే!గతేడాది 5 కొత్త మెడికల్ కాలేజీలు అందుబాటులోకి రావడంతో సీట్లు పెరిగి మన విద్యార్థులు ఎంతో మంది డాక్టర్లు కాగలిగారు! ఇప్పుడు నాలుగు కొత్త కాలేజీలకు కూటమి సర్కారు నిర్వాకంతో అనుమతులు రాకపోగా పాడేరులో వచ్చింది 50 సీట్లే! ఎంబీబీఎస్ సీట్లు పెరగకపోవడంతో మనకు ఎంత నష్టం జరిగిందో తొలి దశ కౌన్సెలింగ్‌లోనే స్పష్టంగా కనిపించింది!!గతేడాది ప్రభుత్వ ఆధ్వర్యంలో 5 కొత్త వైద్య కళాశాలలు ప్రారంభం కావడంతో అదనంగా 750 సీట్లు సమకూరి మన విద్యార్థుల ఎంబీబీఎస్ కలలు నెరవేరాయి. ఏటా పెరుగుతున్న పోటీకి అనుగుణంగా దూరదృష్టితో వ్యవహరించి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏకంగా 17 ప్రభుత్వ వైద్య కశాశాలలకు శ్రీకారం చుట్టారు. ఈక్రమంలో ఐదు కొత్త కాలేజీలు గతేడాది అందుబాటులోకి రాగా ఈ సంవత్సరం కూడా మరో ఐదు నూతన మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రారంభమైతే తమ కలలు ఫలిస్తాయని విద్యార్థులు, తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు! కూటమి సర్కారు ప్రైవేట్ జపం, కొత్త కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయంతో ఆ ఆశల సౌథాలు కుప్పకూలాయి. ఏడాదంతా లాంగ్ టర్మ్ శిక్షణతో రూ.లక్షలు వెచ్చించి సిద్ధమైన విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది. తొలి దశ కౌన్సెలింగ్‌లోనే సీట్ దొరక్కపోవడంతో ఇక మిగిలిన దశల్లో సీటు లభించే అవకాశాలు తక్కువేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే రెండు మూడు సార్లు లాంగ్ టర్మ్ కోచింగ్ కోసం రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు అప్పు చేసిన మధ్యతరగతి కుటుంబాలు మేనేజ్మెంట్ కోటా సీట్ కొనే పరిస్థితి లేదు. మరోసారి ధైర్యం చేసి లాంగ్ టర్మ్ కోచింగ్‌కి పంపుదామంటే కూటమి సర్కారు ప్రైవేట్ మోజుతో వచ్చే ఏడాదైనా సీట్లు పెరుగుతాయనే నమ్మకం పోయింది. చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాలతో నీట్ యూజీ విద్యార్థుల భవిష్యత్తు తలకిందులైంది. ప్రైవేట్‌కు కట్టబెట్టే ఉద్దేశంతో నాలుగు కొత్త కాలేజీలకు అనుమతులు రాకుండా ప్రభుత్వమే అడ్డుపడింది. కేవలం పాడేరు కళాశాలలో 50 సీట్లకే అనుమతులు లభించాయి. పిల్లల గొంతు కోశారు!ప్రభుత్వ నూతన వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ సీట్లకు సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని రద్దు చేస్తామని.. అది కూడా అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే చేసి చూపిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కూటమి సర్కారు దాన్ని గాలికి వదిలేసి బేరాలకు తెర తీసింది. వైఎస్సార్ సీపీ హయాంలో తీసుకున్న చర్యల ఫలితంగా గిరిజన ప్రాంతంలోని పాడేరు మెడికల్ కాలేజీకి ఈ ఏడాది అరకొరగానైనా 50 ఎంబీబీఎస్ సీట్లు మంజూరు కాగా వాటిలో 21 సీట్లను సెల్ఫ్‌ఫైనాన్స్ కోటా కింద తాజాగా అమ్మకానికి పెట్టింది. ఈమేరకు 2024–25 విద్యా సంవత్సరానికి కొత్త వైద్య కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్స్ కోటా కింద ప్రవేశాలకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని ఆరోగ్య విశ్వవిద్యాలయం సోమవారం నోటిఫికేషన్ జారీ చేయడంపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో పులివెందుల, పాడేరు, మార్కాపురం, మదనపల్లె, ఆదోనిలో ప్రారంభించాల్సిన ఐదు నూతన వైద్య కళాశాలలను కుట్రపూరితంగా అడ్డుకుని ఏకంగా 700 ఎంబీబీఎస్ సీట్లను పోగొట్టి పిల్లల భవిష్యత్తును అంధకారంగా మార్చారని మండిపడుతున్నారు. పులివెందుల వైద్య కళాశాలకు అనుమతులు వచ్చినా.. మేం నిర్వహించలేమంటూ దేశంలో ఎక్కడా లేనివిధంగా ఎన్ఎంసీకి కూటమి ప్రభుత్వమే లేఖ రాయడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. అధికారం చేపట్టిన తొలి వంద రోజుల్లో సెల్ఫ్‌ఫైనాన్స్ విధానానికి సంబంధించిన 107, 108 జీవోలను రద్దు చేస్తామని ఎన్నికలకు ముందు టీడీపీ పలు సందర్భాల్లో హామీ ఇచ్చింది. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్‌కు హామీ గుర్తు లేదా? అని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. తమది ప్రజా ప్రభుత్వం.. పేదల పక్షపాత ప్రభుత్వమంటూ తరచూ చెప్పే సీఎం చంద్రబాబు పేదరిక నిర్మూలనకు పీ 4 ప్రణాళిక పేరుతో ప్రభుత్వ విద్యా సంస్థలను ప్రైవేట్ పరం చేయడాన్ని తీవ్రంగా నిరసిస్తున్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్‌కు అప్పగించి పేదలకు వైద్య విద్యను దూరం చేస్తున్నారని ప్రజా సంఘాలు మండిపతున్నాయి. ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.రెండేళ్లలో కోల్పోతున్న సీట్లు 1,750టీడీపీ అధికారంలో ఉండగా ప్రభుత్వ వైద్య విద్యారంగం బలోపేతానికి చర్యలు తీసుకోలేదు. చంద్రబాబు హయాంలో ఒక్కటి కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు కాకపోవడం దీనికి నిదర్శనం. 2004–09 మధ్య దివంగత వైఎస్సార్ సీఎంగా ఉండగా ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో రిమ్స్‌లను నెలకొల్పారు. రాష్ట్ర విభజన అనంతరం వైఎస్సార్ సీపీ హయాంలో జగన్ ప్రజారోగ్యాన్ని బలోపేతం చేస్తూ 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వీటిలో ఐదు కొత్త వైద్య కళాశాలలు గత ఏడాది ప్రారంభం అయ్యాయి. 750 ఎంబీబీఎస్ సీట్లు ఒక్కసారిగా అదనంగా పెరగడంతో తల్లిదండ్రులు, విద్యార్థుల్లో ఆశలు చిగురించాయి. ఈ విద్యా సంవత్సరంలో కూడా మరో ఐదు కళాశాలలు ప్రారంభించేలా గత ప్రభుత్వం చర్యలు చేపట్టినా కూటమి సర్కారు దాన్ని కొనసాగించలేదు. దీంతో కేవలం 50 సీట్లు సమకూరగా అదనంగా రావాల్సిన 700 సీట్లను రాష్ట్రం నష్టపోయింది. ఇక వచ్చే ఏడాది ప్రారంభం కావాల్సిన మరో ఏడు కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడం వల్ల అదనంగా మరో 1,050 మెడికల్ సీట్లను విద్యార్థులు నష్టపోతున్నారు. వెరసి మొత్తం 1,750 ఎంబీబీఎస్ సీట్లను కోల్పోవడం ద్వారా జరుగుతున్న నష్టం ఊహించలేనిది!!.ఎంబీబీఎస్ యాజమాన్య కోటా ఆప్షన్ల నమోదు ప్రారంభం2024–25 విద్యా సంవత్సరానికి కొత్త వైద్య కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్స్, ప్రైవేట్ వైద్య కళాశాలల్లో యాజమాన్య కోటా ఎంబీబీఎస్ ప్రవేశాల కోసం తొలి దశ కౌన్సెలింగ్‌కు వెబ్ఆప్షన్ల నమోదు ప్రక్రియను ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం సోమవారం నుంచి ప్రారంభించింది. ఈ నెల 19వ తేదీ రాత్రి తొమ్మిది గంటలను ఆప్షన్ల నమోదు చివరి గడువుగా విధించారు. https://drntr.uhsap.in వెబ్సైట్లో విద్యార్థులు ఆప్షన్ నమోదు చేసుకోవాలని రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి తెలిపారు. గతేడాది ప్రారంభించిన విజయనగరం, ఏలూరు, రాజమండ్రి, మచిలీపట్నం, నంద్యాల, ఈ ఏడాది ప్రారంభించనున్న పాడేరు వైద్య కళాశాలలో 240 సెల్ఫ్‌ఫైనాన్స్, 101 ఎన్ఆర్ఐ కోటా (సీ కేటగిరి) సీట్లు ఉన్నట్లు వెల్లడించారు. అదే విధంగా ప్రైవేట్, మైనార్టీ, స్విమ్స్ కళాశాలల్లో బీ కేటగిరి 1078, సీ కేటగిరి 495 సీట్లున్నట్లు పేర్కొన్నారు. ఆప్షన్ల నమోదు సమయంలో సాంకేతిక సమస్యలుంటే 9000780707, 8008250842 నంబర్లలో విద్యార్థులు సంప్రదించాలని తెలిపారు.ప్రైవేటీకరణ దుర్మార్గంపులివెందుల కళాశాలకు సీట్లను నిరాకరించడమేంటి? సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల రద్దు హామీ ఏమైంది? సీఎం చంద్రబాబుకు ఎస్ఎఫ్ఐ లేఖ విద్యార్ధుల వైద్య విద్య ఆశలను కూటమి ప్రభుత్వం చిద్రం చేస్తోందని భారత విద్యార్థి సమాఖ్య (ఎస్ఎఫ్ఐ) మండిపడింది. రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ దుర్మార్గమని పేర్కొంది. ఈమేరకు ప్రభుత్వ తీరును తప్పుబడుతూ సీఎం చంద్రబాబుకు రాసిన లేఖను ఎస్ఎఫ్ఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె.ప్రసన్న కుమార్, ఎ.అశోక్‌లు సోమవారం మీడియాకు విడుదల చేశారు. విద్యను హక్కుగా అందించాల్సిన బాధ్యతను విస్మరించి ప్రైవేట్ వైద్య విద్యకు పట్టం కట్టడం దారుణమన్నారు. కేంద్రంతో సంప్రదించి 5 కొత్త కళాశాలలకు అనుమతులు తేవాల్సిన కూటమి ప్రభుత్వం పులివెందుల కాలేజీకి వచ్చిన 50 సీట్లను కూడా వద్దంటూ నేషనల్ మెడికల్ కౌన్సిల్(ఎన్ఎంసీ)కి లేఖ రాయడం ఏమిటని ప్రశ్నించారు. ఒక్క పాడేరుకు 50 సీట్లు వచ్చాయని, మిగిలిన నాలుగు కొత్త కళాశాలలకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్వోపీ ఇచ్చి ఉంటే అనుమతులు లభించేవన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులు 700 సీట్లు కోల్పోయారన్నారు. ప్రైవేటీకరణ వల్ల పేద, మధ్య తరగతి విద్యార్ధులు వైద్య విద్యకు దూరం కావడం ఖాయమన్నారు. రిజర్వేషన్ల ఊసే ఉండదని, తద్వారా వెనకబడిన తరగతుల విద్యార్ధులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. భవిష్యత్తులో పేదలకు ఉచిత వైద్య సేవలు కూడా అందవని ఆందోళన వ్యక్తం చేశారు. సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని అధికారంలోకి వస్తే వంద రోజుల్లో రద్దు చేస్తామన్న హామీపై ఎందుకు నోరు మెదపడం లేదని సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. వెంటనే వైద్య విద్య ప్రైవేటీకరణను విరమించుకుని ఎన్ఎంసీకి రాసిన లేఖను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ తీరు మార్చుకోకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు.రాయలసీమకు బాబు ద్రోహం మెడికల్ సీట్లు వద్దనడం దారుణం పేద విద్యార్థులకు అన్యాయం చేయొద్దు వైఎస్సార్ సీపీ నేత వెన్నపూస రవీంద్రారెడ్డి టీడీపీ కూటమి ప్రభుత్వం రాయలసీమ ప్రాంతానికి తీరని అన్యాయం చేస్తోందని వైఎస్సార్ సీపీ పంచాయితీ రాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి మండిపడ్డారు. వైద్య, ఆరోగ్య రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తోందని ధ్వజమెత్తారు. ఈమేరకు సోమవారం ఆరు అంశాలతో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్కి లేఖ రాశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ ఒకేసారి 17 మెడికల్ కాలేజీల పనులు మొదలుపెట్టి ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లారని, 5 కాలేజీలు గత విద్యా సంవత్సరంలో ప్రారంభమయ్యాయని గుర్తు చేశారు. సీఎం చంద్రబాబు నిర్వాకం వల్ల ఈ ఏడాది ఐదు కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభం కాకపోగా ఎన్ఎంసీ పులివెందుల మెడికల్ కాలేజీకి ఇచ్చిన 50 సీట్లు కూడా పోయాయని మండిపడ్డారు. ఇది రాయలసీమ ప్రజలకు ద్రోహం చేయడం కాదా? అని ప్రశ్నించారు. మంత్రి సత్యకుమార్ పులివెందుల మెడికల్ కళాశాలను ఎప్పుడైనా సందర్శించారా? అని నిలదీశారు. ప్రశ్నించారు. రాయల సీమ నుంచి గెలిచి వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా ఉంటూ ఇలా చేయటం దుర్మార్గం అనిపించటం లేదా? అని దుయ్యబట్టారు. 2023 డిసెంబర్ 15వ తేదీన పులివెందుల మెడికల్ కళాశాల స్టాఫ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జారీచేసి పోస్టులు భర్తీ చేసి 2023లో మార్చిలో కాలేజీని ప్రారంభించిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. చిన్న చిన్న ఇబ్బందులుంటే రాష్ట్ర ప్రభుత్వాలు అండర్ టేకింగ్ లెటర్ ఇస్తే అడ్మిషన్లు నిర్వహించుకోవటానికి ఎంఎన్సీ అనుమతిస్తుందన్న విషయం తెలియదా? అని ప్రశ్నించారు. కేవలం మాజీ సీఎం జగన్ హయాంలో నిర్మాణం, ప్రారంభం అయిందన్న విషయాన్ని జీర్ణించుకోలేక అడ్మిషన్లకు కూటమి ప్రభుత్వం అడ్డుపడిందని విమర్శించారు. -
తెల్ల ‘కోట్లు’!.. నీట్ ర్యాంకర్ల నిర్వేదం
‘ఏడాదిపాటు లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుని నీట్ యూజీ–2024లో 595 స్కోర్ చేశా. గతేడాదితో పోలిస్తే మెరుగైన స్కోర్ చేసినా కన్వీనర్ కోటాలో సీటు వస్తుందన్న నమ్మకం లేదు. ప్రభుత్వం ఈ ఏడాది మరో 5 కొత్త వైద్య కళాశాలలను ప్రారంభిస్తే మనకు అదనంగా 750 ఎంబీబీఎస్ సీట్లు సమకూరేవి. దీనికి తోడు టీడీపీ తన హామీ మేరకు సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని రద్దు చేస్తే మరో 319 సీట్లు కన్వీనర్ కోటాలో పెరిగేవి. కొత్త వైద్య కళాశాలలకు అనుమతులు ఇచ్చేందుకు ఎన్ఎంసీ అండర్ టేకింగ్ కోరినా ప్రైవేట్‌కు కట్టబెట్టే ఉద్దేశంతోనే ఈ ప్రభుత్వం ఇవ్వలేదు. పులివెందుల మెడికల్ కాలేజీకి ఎంఎన్సీ సీట్లు మంజూరు చేస్తే మేం నిర్వహించలేమంటూ ప్రభుత్వమే లేఖ రాసి నాలాంటి విద్యార్థులకు తీవ్ర నష్టం తలపెట్టింది. ఇప్పటికే లాంగ్‌టర్మ్ కోచింగ్ రూపంలో రెండేళ్లు కాలగర్భంలో కలిసిపోయాయి. ఈసారి కూడా సీటు రాకుంటే నా భవిష్యత్ అంధకారమే. తెలంగాణలో 500 లోపు స్కోర్ చేసిన ఓసీ విద్యార్థులకు ఈసారి సీట్లు వస్తున్నాయి. అక్కడ 8 వైద్య కళాశాలల్లో 400 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా పెరగడమే దీనికి కారణం. ఏపీలో మాత్రం వచ్చిన సీట్లు సైతం వద్దంటూ ప్రభుత్వమే లేఖ రాసింది. ఈడబ్ల్యూఎస్ కోటా అమలుపై చిత్తశుద్ధి లేని జీవో ఇచ్చి చేతులు దులుపుకొంది...!’ విశాఖకు చెందిన నీట్ ర్యాంకర్ సాయి ఆక్రోశం ఇదీ!సాక్షి, అమరావతి: వైద్య విద్యపై ఎంతో ఆశ పెట్టుకుని లాంగ్ టర్మ్ శిక్షణతో ఏడాదంతా సన్నద్ధమై మంచి స్కోర్ సాధించిన పలువురు ఇప్పుడు ప్రభుత్వ ఆధ్వర్యంలో కొత్త వైద్య కాలేజీలు అందుబాటులోకి రాకపోవడంతో ఉసూరుమంటున్నారు. ప్రభుత్వ నూతన వైద్య కళాశాలలను ప్రైవేట్‌కు కట్టబెట్టేందుకు సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలతో ఈ ఏడాది 700, వచ్చే ఏడాది 1,050 చొప్పున మొత్తం 1,750 సీట్లు కోల్పోవడంతో తమ ఆశలు గల్లంతవుతున్నాయని నీట్ ర్యాంకర్లు నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే వైద్య విద్యా వ్యాపారం చేస్తానంటే ఎలా? అని ఆక్రోశిస్తున్నారు. ప్రభుత్వ కళాశాలలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోతే ఇక ‘కోట్లు’న్న వారికే తెల్లకోటు భాగ్యం దక్కుతుందని పేర్కొంటున్నారు.మంచి స్కోరైనా..సీట్ కష్టంనీట్ యూజీలో అర్హత సాధించిన 13,849 మంది ఈసారి రాష్ట్రంలో కన్వీనర్ కోటాలో ఎంబీబీఎస్ ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ప్రస్తుతం నీట్లో 500–550 స్కోర్ చేసినా రిజర్వేషన్ వర్గాల విద్యార్థులకు కన్వీనర్ కోటాలో సీటు కష్టమేనని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక ఓసీ విద్యార్థులైతే దాదాపు 600 స్కోర్ చేసినప్పటికీ అసలు సీటు వస్తుందో? లేదో? అనే ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు తెలంగాణలో 500 లోపు స్కోర్ చేసిన ఓసీ విద్యార్థులకు కూడా కన్వీనర్ కోటాలో సీట్లు దక్కుతున్నాయని, ఏపీలో మాత్రం ప్రతిభ ఉన్నప్పటికీ వైద్య విద్య చదివే అదృష్టం లేదని వాపోతున్నారు. గత పదేళ్లలో తెలంగాణలో కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు గణనీయంగా పెరగడం, ఈ విద్యా సంవత్సరంలో 8 కళాశాలలకు ఏకంగా 400 సీట్లు అదనంగా మంజూరవడం అక్కడి విద్యార్థులకు కలిసి వస్తోంది.సీట్లు పెరిగింది గత ఐదేళ్లలోనే⇒ ఉమ్మడి రాష్ట్రంలో దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో ఒంగోలు, శ్రీకాకుళం, కడప రిమ్స్‌లను నెలకొల్పడంతో పాటు నెల్లూరు ఎసీఎస్ఆర్ కళాశాల ఏర్పాటుకు బీజం వేశారు. ⇒ 2004కు ముందు, 2014–19 మధ్య చంద్రబాబు పాలనలో ప్రభుత్వ ఆధ్వర్యంలో కొత్త వైద్య కళాశాలలు ఏర్పాటు కాలేదు. దీంతో వైద్య విద్యపై తీవ్ర ప్రభావం పడింది. ⇒ గత ప్రభుత్వం అధికారంలో ఉండగా ఏకంగా 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలకు వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. ⇒ వీటిలో ఐదు కొత్త కళాశాలలు గత విద్యా సంవత్సరంలో ప్రారంభమై 750 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా సమకూరడంతో వైద్య విద్యపై ఆశలు చిగురించాయి. ⇒ ఈ క్రమంలో ఈ ఏడాది మరో ఐదు కొత్త వైద్య కళాశాలలను ప్రారంభించాల్సి ఉండగా వాటిని ప్రైవేట్‌పరం చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు.⇒ దీంతో ఈ ఏడాది 750 సీట్లు సమకూరాల్సి ఉండగా కేవలం పాడేరు వైద్య కళాశాలలో కేవలం 50 సీట్లు అది కూడా గత ప్రభుత్వం తీసుకున్న చర్యల ద్వారా అందుబాటులోకి వచ్చాయి. మిగిలిన ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్‌కు కట్టబెట్టేందుకు వాటికి అనుమతులు రాకుండా ప్రభుత్వమే అడ్డుపడింది. ⇒ ఇదే విషయం ఎంఎన్సీ (జాతీయ వైద్య కమిషన్) రాసిన లేఖ ద్వారా ఇప్పటికే బహిర్గతమైన సంగతి తెలిసిందే. ⇒ ఈ ఏడాది మెడికల్ కాలేజీలు పెరిగితే తమ పిల్లలకు కచ్చితంగా సీటు వస్తుందనే అంచనాతో సగటున రూ.3 లక్షలకుపైగా ఖర్చు చేసి నీట్ శిక్షణ ఇప్పించామని, అయితే స్కోర్ 500 దాటినా దక్కని పరిస్థితి నెలకొందని తల్లిదండ్రులు ఆవేదనకు గురవుతున్నారు. ⇒ పులివెందుల మెడికల్ కాలేజీకి ఎంఎన్సీ సీట్లు మంజూరు చేయడం విస్మయం కలిగించిందంటూ ప్రైవేట్ విద్యా వ్యాపారాన్ని ప్రోత్సహించేలా ప్రభుత్వమే వ్యాఖ్యానించడంపై నివ్వెరపోతున్నారు.మా ఆశలను కాలరాశారుగతేడాది నీట్లో 515 స్కోర్ చేశా. ఓసీ కేటగిరీలో 543 స్కోర్‌కు కన్వీనర్ కోటాలో చివరి సీట్ వచ్చింది. దీంతో లాంగ్‌టర్మ్ కోచింగ్ తీసుకున్నా. ఈసారి 555 స్కోర్ సాధించినా పోటీ తీవ్రంగా ఉంది. ఐదు కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభమైతే నాకు సీటు దక్కేది. కనీసం సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని రద్దు చేసినా మాకు న్యాయం జరిగేది. ప్రభుత్వమే మా ఆశలను కాలరాసింది. మేనేజ్మెంట్ కోటాలో చేరాలంటే మా తల్లిదండ్రులకు తలకు మించిన భారం. ఇప్పటికే నాతోపాటు మా సోదరుడి లాంగ్‌టర్మ్ కోచింగ్ కోసం రూ. లక్షల్లో ఖర్చు పెట్టారు. – ఎన్. సుచేతన, రాజంపేట, అన్నమయ్య జిల్లాఅప్పుడు అదృష్టం.. ఇప్పుడు!నాకు ఇద్దరు కుమార్తెలు. 2023లో పెద్దమ్మాయి నీట్లో 530 మార్కులు సాధించి ఏలూరు కాలేజీలో సీట్ దక్కించుకుంది. ఆ విద్యా సంవత్సరంలో 5 కొత్త వైద్య కళాశాలలు ప్రారంభించడం, అదనంగా 750 సీట్లు పెరగడం మాకు కలిసి వచ్చింది. ఇప్పుడు రెండో అమ్మాయి 543 మార్కులు సాధించినా ప్రభుత్వ సీట్ రావటం లేదు. ఈ విద్యా సంవత్సరంలో కూడా ఐదు కొత్త కళాశాలలు ప్రారంభం అయితే అదృష్టం కలసి వస్తుందని ఆశపడ్డాం. ప్రభుత్వమే వసతులు కల్పించలేమని చేతులెత్తేస్తే మాలాంటి వాళ్ల పరిస్థితి ఏమిటి? అదే మా అమ్మాయి పక్క రాష్ట్రంలో ఉంటే మొదటి రౌండ్లోనే ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు వచ్చేది. – సీహెచ్.ఉమామహేశ్వరరావు, పోలాకి మండలం, శ్రీకాకుళంప్రభుత్వమే వ్యాపారం చేస్తానంటే ఎలా?సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో రద్దు చేస్తామని హామీ ఇచ్చిన టీడీపీ దాన్ని నెరవేర్చకపోగా పీపీపీ విధానంలో వైద్య కళాశాలలను నిర్వహిస్తామని చెప్పడం ఎంత వరకు సమంజసం? ప్రభుత్వం ఉచితంగా వైద్య విద్య అందించడానికి కృషి చేయాలి. అంతేగానీ వైద్య విద్యా వ్యాపారం చేస్తానంటే ఎలా? గతేడాది కొత్త వైద్య కళాశాలలు ప్రారంభమై అదనంగా 750 ఎంబీబీఎస్ సీట్లు రావడంతో ఎంతో సంతోషించాం. ఈ ఏడాది మరో ఐదు కొత్త కాలేజీల ద్వారా అదనంగా 750 సీట్లు వస్తాయని భావిస్తే పీపీపీ విధానం పేరుతో విద్యార్థులు, తల్లిదండ్రులను తీవ్ర నిరాశకు గురి చేశారు. – జి.ఈశ్వరయ్య, ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఏపీ రాష్ట్ర కార్యదర్శి -
నీట్ యూజీ-2024 తొలి రౌండ్ కౌన్సెలింగ్ ఫలితాలు విడుదల
నీట్ యూజీ-2024 తొలి రౌండ్ కౌన్సెలింగ్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్ని మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ(ఎంసీసీ) విడుదల చేసింది. కాగా, నీట్ యూజీ కౌన్సెలింగ్ తొలి రౌండ్ ఆగస్ట్ 14 నుంచి రాష్ట్రాల వారీగా ప్రారంభమైంది. ఎంసీసీ సమాచారం మేరకు.. నీట్ యూజీ-2024 కౌన్సెలింగ్ నాలుగుసార్లు జరగనుంది. తాజాగా తొలిరౌండ్ కౌన్సెలింగ్ పూర్తయింది. అందులో ర్యాంక్, ప్రాధాన్యతలు, అందుబాటులో ఉన్న సీట్ల ఆధారంగా అభ్యర్ధులకు ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లను కేటాయించినట్లు ఎంసీసీ వెల్లడించింది. ఈ కౌన్సెలింగ్‌లో మొత్తం 26,109 మంది విద్యార్ధులకు సీట్లను కేటాయించింది.మొత్తం టాప్ 17 ర్యాంకులు సాధించిన విద్యార్ధులు ఎయిమ్స్ ఢిల్లీలో ఎంబీబీఎస్ సీట్లను సంపాదించారు. ఈ సందర్భంగా అర్హులైన విద్యార్ధులు ప్రొవిజినల్ అలాట్మెంట్ లెటర్స్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని ఎంసీసీ వెల్లడించింది.ఎంసీసీ ప్రకారం, రెండవ రౌండ్ కౌన్సెలింగ్ కోసం అవసరమయ్యే వైకల్య ధ్రువీకరణ పత్రాలు(పీడబ్ల్యూడీ) అవసరమయ్యే అభ్యర్థులు సెప్టెంబర్ 9, 2024 సాయంత్రం 5 గంటల లోపు సంబందిత కేంద్రాల నుంచి పొందాలని తెలిపింది. ఇతర వివరాల కోసం ఎంసీసీ కాల్ సెంటర్‌కు కాల్ చేసి తెలుసుకోవాలని, జన్మాష్టమి కారణంగా, ఎంసీసీ కాల్ సెంటర్ (సోమవారం)ఆగస్టు 26, 2024న ఉదయం 9 నుండి సాయంత్రం 6 గంటల వరకు పని చేస్తుందని ఎంసీసీ ప్రతినిధులు వెల్లడించారు.అభ్యర్థులు తమకు కేటాయించిన కాలేజీల్లో రిపోర్ట్ చేయడానికి గడువు ఆగస్ట్ 29 వరకు ఇచ్చింది. ఆ తర్వాత మెడికల్ కాలేజీలు ఈ అభ్యర్థుల అడ్మిషన్ డేటాను వెరిఫై చేస్తాయి. ఇవి ఆగస్టు 30,31 మధ్య ఎంసీసీకి సమర్పిస్తాయి. -
నీట్-పీజీ పరీక్ష వాయిదాకు సుప్రీంకోర్టు నిరాకరణ
వైద్యవిద్యా పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సులో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్-పీజీ పరీక్షను వాయిదా వేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ మేరకు నీట్-పీజీని వాయిదా వేయాలని కోరుతూ పలువురు విద్యార్ధులు దాఖలు చేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. పరీక్షను వాయిదా వేసి విద్యార్థుల జీవితాలను ప్రమాదంలోకి నెట్టలేమని వ్యాఖ్యానించింది.నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ నిర్వహించే ‘నీట్-పీజీ పరీక్ష ఆగస్టు 11న (ఆదివారం) జరగనుంది. అయితే దీనిని వాయిదా వేయాలని కోరుతూ విద్యార్ధులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు మనోజ్ మిశ్రా, జేబీ పార్దివాలాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. ఈ సందర్బంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.రెండు రోజుల్లో పరీక్ష నిర్వహించాల్సి ఉండగా... ఈ సమయంలో వాయిదా వేయాలని ఆదేశించలేమని పేర్కొంది. ‘ఇలాంటి పరీక్షలను మనం ఎలా వాయిదా వేయగలం? ఈ మధ్యకాలంలో పరీక్షను వాయిదా వేయమని అడుగుతూ పిటిషన్లు వేస్తున్నారు. ఇది పరిపూర్ణ ప్రపంచమేమి కాదు. మేము విద్యా నిపుణులం కాదు.రెండు లక్షల మంద విద్యార్థులు హాజరవుతారు. కొంతమంది అభ్యర్థులు వాయిదా వేయాలని కోరినందుకు దీనిని రీ షెడ్యూల్ చేయాలని అనుకోవడం లేదు. పరీక్షను వాయిదా వేయడం ద్వారా రెండు లక్షల విద్యార్ధులు, 4 లక్షల మంది తల్లిదండ్రులు ప్రభావితమవుతారు. ఈ పిటిషన్ల కారణంగా మేము విద్యార్ధుల భవిష్యత్తును ప్రమాదంలో నెట్టివేయలేం’ అని కోర్టు అభిప్రాయపడింది.కాగా నీట్ పీజీ పరీక్షలో ఇప్పటివరకు పేపర్ లీకేజీ ఆరోపణలు రాలేదు. కానీ నీట్-యూజీ 2024 పరీక్షలో అవకతవకలు జరిగినట్లు దేశ వ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు వ్యక్తమవడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా నీట్ పీజీ పరీక్షను సైతం కేంద్రం వాయిదా వేసింది. తొలుత జూన్ 23న నిర్వహించాల్స ఉండగా తాజాగా ఆగస్టు 11న జరగనుంది. -
మార్కులు పెరిగినా.. ర్యాంకులు ఢమాల్!
సాక్షి, హైదరాబాద్: వైద్య విద్య కోర్సులు ఎంబీబీఎస్, బీడీఎస్‌లలో ప్రవేశాలకు ఈసారి విపరీతమైన పోటీ నెలకొంది. గత రెండేళ్లతో పోలిస్తే ఎక్కువ మార్కులు సాధించినవారికి సైతం ఈసారి సీటు దక్కుతుందా లేదా అన్న సందేహాలు నెలకొన్నాయి. ఎక్కువ మార్కులు సాధించినా ర్యాంకులు వేలల్లోకి చేరడంతో ఎక్కడ సీటు దక్కుతుందన్నదీ అర్థంకాని పరిస్థితి నెలకొంది. 2024–25 విద్యా సంవత్సరానికిగాను యూజీ వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రస్తుతం రాష్ట్రస్థాయి కౌన్సెలింగ్ కోసం వెబ్సైట్లో రిజి్రస్టేషన్ ప్రక్రియ కొనసాగుతుండగా.. ఆలిండియా కోటా (ఏఐక్యూ)కు సంబంధించిన కౌన్సెలింగ్ ఈనెల 14వ తేదీ నుంచి మొదలవనుంది. తొలుత ఆలిండియా కోటా సీట్ల కౌన్సెలింగ్ పూర్తిచేసి.. తర్వాత రాష్ట్ర స్థాయి సీట్లను భర్తీ చేస్తారు.లీకేజీ గందరగోళం మధ్య.. ⇒ ఈ ఏడాది యూజీ నీట్ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం విద్యార్థుల ను తీవ్ర గందరగోళంలోకి నెట్టింది. ఫలితాలు వెలువడ్డాక సుప్రీంలో కేసులు, వాదప్రతివాదనల అనంతరం కౌన్సెలింగ్‌కు మార్గం సుగమమైంది. దీనితో కాస్త ఆలస్యంగా రాష్ట్ర స్థాయి ర్యాంకులు వెలువడ్డాయి. వాటిని చూసుకున్న అభ్యర్థు లు సీటు వస్తుందా? రాదా? వస్తే ఎక్కడ రావొచ్చన్న ఆందోళనలో పడ్డారు.మార్కులు ఘనం.. ర్యాంకు పతనం.. ఈ ఏడాది రాష్ట్రస్థాయిలో టాప్ ర్యాంకు సాధించిన విద్యార్థికి వచి్చన మార్కులు 711, ఆలిండియా స్థాయిలో వచి్చన ర్యాంకు 137. అదే 2022 యూజీ నీట్లో రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు సాధించిన అభ్యర్థికి 711 మార్కులేరాగా.. జాతీయ స్థాయిలో 5వ ర్యాంకు వచి్చంది. మంచి మార్కులు వచి్చనా.. ఆలిండియా ర్యాంకు బాగా తగ్గిపోయింది. పోటీ విపరీతంగా పెరగడం, చాలా మంది విద్యార్థులకు మార్కులు పెరగడమే దీనికి కారణం. మెరుగైన మార్కులు సాధించామనుకున్న విద్యార్థులు జాతీయ, రాష్ట్ర స్థాయి ర్యాంకులు మాత్రం తగ్గిపోవడంతో ఆందోళనలో పడ్డారు. దీంతో ఏ కాలేజీలో సీటు వస్తుందో అంచనా వేయలేని పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. ప్రధానంగా ఆలిండియా కోటా సీట్ల విషయంలో సీటు ఎక్కడ వస్తుందనేది అంచనా వేసే పరిస్థితి లేదని నిపుణులు పేర్కొంటున్నారు.రాష్ట్రస్థాయి కౌన్సెలింగ్‌లోనూ అయోమయంప్రస్తుతం రాష్ట్ర స్థాయి ర్యాంకులు విడుదలవడంతో విద్యార్థులు రిజి్రస్టేషన్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఏ కాలేజీలో సీటు వస్తుందనేది అంచనా వేసుకుంటున్నారు. కానీ ఏపీకి 15% కోటా సీట్లు రద్దు, స్థానికతపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, మార్కులు, ర్యాంకుల తీరు మారడం వంటివి విద్యార్థుల్లో అయోమయం సృష్టిస్తున్నాయి. కాలేజీల వారీగా సీట్లు, రిజర్వేషన్ కోటా ప్రకా రం విభజించి పరిశీలిస్తేనే ఏదైనా అంచనాకు వచ్చే అవకాశం ఉంటుందని సీని యర్లు అభిప్రాయపడుతున్నారు. ఆలిండియా కోటాను మినహాయించి రాష్ట్ర స్థాయిలో సీట్ మ్యాట్రిక్స్ విడుదలైతేనే స్పష్టత వస్తుందని అంటున్నారు. -
NEET paper leak case: ‘మాస్టర్‌మైండ్’ అరెస్ట్
నీట్ పేపర్ లీక్ కేసులో సీబీఐ మరో ముందడుగు వేసింది. తాజాగా ఈ కేసులో ఒడిశాకు చెందిన సుశాంత్ కుమార్ మొహంతిని దర్యాప్తు సంస్థ సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ ఉదంతంలో సుశాంత్ ప్రధాన సూత్రధారి అని సమాచారం. ప్రస్తుతం అతనిని సీబీఐ ఐదు రోజుల పాటు రిమాండ్‌కు తరలించింది.ఈ కేసులో ఇప్పటి వరకు 42 మందిని అరెస్టు చేశారు. ఆగస్టు 4న నీట్ పేపర్ లీక్ కేసులో సాల్వర్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. సాల్వర్ సందీప్ రాజస్థాన్‌లోని భిల్వారాలోని మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదువుతున్నాడు. సందీప్‌ను పట్నాలోని ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. అనంతరం 5 రోజుల రిమాండ్‌కు తరలించారు.నీట్ పేపర్ లీక్ కేసులో సీబీఐ ఆగస్టు ఒకటిన చార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈ చార్జిషీటులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ 13 మంది పేర్లను నమోదు చేసింది. ఇందులో నలుగురు అభ్యర్థులు, ఒక జూనియర్ ఇంజనీర్, ఇద్దరు కింగ్పిన్ల పేర్లు ఉన్నాయి. ఈ కేసులో కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రుల పేర్లు కూడా ఉన్నాయని సీబీఐ వెల్లడించింది. -
నీట్ రాష్ట్ర ర్యాంకులు విడుదల
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్, బీడీఎస్ కన్వినర్ కోటా సీట్ల భర్తీకి కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం శనివారం షెడ్యూల్ విడుదల చేసింది. రాష్ట్రం నుంచి నీట్ రాసిన విద్యార్థుల ప్రాథమిక ర్యాంకుల జాబితాను కూడా విడుదల చేసింది. తెలంగాణ టాపర్‌గా అనురాన్ ఘోష్ నిలిచాడు. అతనికి నీట్లో 711 మార్కులు వచ్చాయి. రాష్ట్ర సెకండ్ టాపర్‌గా సుహాస్ నిలిచాడు. తెలంగాణ నుంచి ఈసారి 49,184 మంది నీట్లో అర్హత పొందారు. వారికొచ్చిన మార్కులు, ఆలిండియా ర్యాంకులను జాబితాలో పొందుపర్చారు. ఈ జాబితాలో ఉన్న విద్యార్థులు కన్వీనర్ కోటాలో ప్రవేశాల కోసం ఈ నెల 4న ఉదయం 6 గంటల నుంచి ఈ నెల 13న సాయంత్రం 6 గంటల వరకూ వర్సిటీ వెబ్సైట్లో (https://tsmedadm.tsche.in) దరఖాస్తు చేసుకోవాలని వర్సిటీ సూచించింది. విద్యార్హత, స్థానికత, కమ్యూనిటీ తదితర సర్టిఫికెట్లను అప్లోడ్ చేయాలని సూచించింది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అనంతరం మెరిట్ లిస్ట్ (స్టేట్ ర్యాంక్స్)ను విడుదల చేస్తామని తెలిపింది. ఆ తర్వాత వెబ్ ఆప్షన్లు తీసుకుంటామని, కాలేజీలు, సీట్ల వివరాలను వెబ్ఆప్షన్లకు ముందు వెల్లడిస్తామని పేర్కొంది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఏపీకి, తెలంగాణకు ఉన్న 15 శాతం అన్ రిజర్వ్డ్ కోటాను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు అడ్మిషన్ నిబంధనల్లో మార్పు చేస్తూ ప్రభుత్వం గత నెలలో జీవోను విడుదల చేసింది. ఈ జీవో ప్రకారమే సీట్ల భర్తీ చేపడుతామని నోటిఫికేషన్లో యూనివర్సిటీ పేర్కొంది. ఈ జీవో ప్రకారం రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని 85 శాతం సీట్లను కన్వినర్ కోటాలో భర్తీ చేస్తారు. ఇంకో 15 శాతం సీట్లను ఆలిండియా కోటాలో భర్తీ చేస్తారు. ఇక ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని 50 శాతం సీట్లను కన్వీనర్ కోటాలో, ఇంకో 50 శాతం సీట్లను మేనేజ్మెంట్ కోటాలో భర్తీ చేయనున్నారు. గతంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని 15 శాతం సీట్లను ఓపెన్‌లో పెట్టి, వాటిని తెలంగాణ, ఏపీ విద్యార్థుల్లో ఎవరికి మెరిట్ ఉంటే వారికి కేటాయించేవారు. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు కావడంతో ఈ కోటాను (అన్ రిజర్వ్డ్) ప్రభుత్వం రద్దు చేసింది. వరుసగా నాలుగేళ్లు చదవాల్సిందే... స్థానికతను గుర్తించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో 6వ తరగతి నుంచి ఇంటర్ సెకండియర్ వరకు అంటే ఏడేళ్లలో నాలుగేళ్లు తెలంగాణలో చదివితే స్థానికత ఉన్నట్లుగా గుర్తించేవారు. ఈసారి ఆ నిబంధనలో మార్పు చేశారు. 9వ తరగతి నుంచి ఇంటర్ సెకండియర్ వరకు వరుసగా 4 ఏళ్లు తెలంగాణలో చదివిన వాళ్లనే తెలంగాణ స్థానికులుగా గుర్తిస్తామని పేర్కొన్నారు. 9వ తరగతి కంటే ముందు ఎక్కడ చదివారనే దాంతో సంబంధం లేదని స్పష్టం చేశారు. దీనివల్ల స్థానికతకు కచి్చతత్వం ఉంటుందని అంటున్నారు. ఎంబీబీఎస్ సీట్లు 8,690 రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో మొత్తం 8,690 సీట్లు ఉండగా వాటిల్లో 31 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 3,990 సీట్లున్నాయి. అలాగే 29 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 4,700 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. మరో నాలుగు ప్రభుత్వ మెడికల్ కాలేజీల అనుమతి కోసం ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. కౌన్సెలింగ్ పూర్తయ్యేలోగా అవి వస్తే మరో 200 ఎంబీబీఎస్ సీట్లు ప్రభుత్వ కాలేజీల్లో అందుబాటులోకి రానున్నాయి. -
14 నుంచి నీట్ యూజీ కౌన్సెలింగ్
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర యూజీ వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ ప్రక్రియ ఈ నెల 14 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు ఇప్పటికే ఆల్ ఇండియా కోటా (ఏఐక్యూ) కౌన్సెలింగ్ తాత్కాలిక షెడ్యూల్‌ను మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) విడుదల చేసింది. మరోవైపు రాష్ట్ర స్థాయి కౌన్సెలింగ్ నిర్వహణకు డాక్టర్వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో నీట్ యూజీ–2024లో అర్హత సాధించిన విద్యార్థులు కౌన్సెలింగ్‌కు అవసరమైన ధ్రువపత్రాలతో సన్నద్ధంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. తొలుత అఖిల భారత కోటా.. నీట్ యూజీ కౌన్సెలింగ్‌లో భాగంగా తొలుత అఖిల భారత కోటా (ఏఐక్యూ) కింద ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని 15 శాతం, కేంద్ర విశ్వవిద్యాలయాలు, ఎయిమ్స్, జిప్మెర్ వంటి జాతీయ సంస్థల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీ ఉంటుంది. కేంద్ర ఆరోగ్య శాఖ పరిధిలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్‌కు చెందిన ఎంసీసీ ఏఐక్యూ కౌన్సెలింగ్ నిర్వహిస్తుంది. ఇందులో పాల్గొనడానికి ఆసక్తి ఉన్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్ర విద్యార్థులయినా ఏఐక్యూలో సీట్లు పొందొచ్చు. రాష్ట్ర కోటా కౌన్సెలింగ్ ఇలా.. తొలి విడత అఖిల భారత కోటా కౌన్సెలింగ్ ముగిశాక రాష్ట్ర స్థాయి కౌన్సెలింగ్‌ను డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం నిర్వహిస్తుంది. రాష్ట్రంలో 16 ప్రభుత్వ, 16 ప్రైవేట్, రెండు మైనారిటీ వైద్య కళాశాలలతోపాటు శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల ఉంది. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 15 శాతం ఏఐక్యూలో, మిగిలిన 85 శాతం సీట్లను రాష్ట్ర స్థాయిలో భర్తీ చేస్తారు. రాష్ట్రంలో అన్ని రకాల కళాశాలల్లో 6,209 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ, పద్మావతి వైద్య కళాశాలల్లోని 460 ఎంబీబీఎస్ సీట్లను ఏఐక్యూలో భర్తీ చేస్తారు. కన్వినర్, బీ, సీ కేటగిరీలకు వేర్వేరుగా కౌన్సెలింగ్ చేపడతారు. రాష్ట్ర కోటాకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు నీట్ ఆల్ ఇండియా ర్యాంకు ఆధారంగా మెరిట్ జాబితా విడుదల చేస్తారు. ఆ మెరిట్ జాబితా ఆధారంగా విద్యార్థులకు సీట్ల కేటాయింపు చేపడతారు. అంతా ఆన్లైన్లోనే ఇక ఏఐక్యూ, రాష్ట్ర స్థాయి కౌన్సెలింగ్ అంతా కూడా ఆన్లైన్ విధానంలోనే నిర్వహిస్తారు. కౌన్సెలింగ్‌కు దరఖాస్తు చేసుకోవడం, రాష్ట్ర స్థాయి ర్యాంక్‌ల కేటాయింపు, కావాల్సిన కళాశాలల ఆప్షన్ల నమోదు, సీట్లు కేటాయింపు ఇలా కౌన్సెలింగ్ ప్రక్రియ అంతా ఆన్లైన్లోనే ఉంటుంది. కౌన్సెలింగ్‌కు సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు విశ్వవిద్యాలయం అధికారిక వెబ్సైట్ http:// drysruhs.edu.in/ index.html లో ప్రకటిస్తుంది. నీట్ యూజీ కౌన్సెలింగ్‌కు కావాల్సిన ధ్రువపత్రాలు» నీట్ యూజీ– 2024 ర్యాంక్ కార్డ్ » పుట్టిన తేదీ ధ్రువీకరణ (పదో తరగతి మార్కుల మెమో) » 6 నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు » ఇంటర్మీడియెట్ స్టడీ, ఉత్తీర్ణత సర్టిఫికెట్లు » ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ (ఇంటర్/10+2) » కుల ధ్రువీకరణ » ఆధార్ కార్డు » దివ్యాంగ ధ్రువీకరణ పత్రం » విద్యార్థి తాజా పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు అర్హులు 43,788 మంది నీట్ అర్హత సాధించిన రాష్ట్ర విద్యార్థుల జాబితా విడుదల డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్(డీజీహెచ్ఎస్) నుంచి అందిన నీట్ యూజీ–2024 అర్హత సాధించిన విద్యార్థుల వివరాలను డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం శుక్రవారం విడుదల చేసింది. 43,788 మంది విద్యార్థులు అర్హత సాధించినట్టు పేర్కొంది. 715 స్కోర్ సాధించి జాతీయ స్థాయిలో 44వ ర్యాంక్‌తో కె.సందీప్ చౌదరి తొలి స్థానంలో నిలవగా.. అదే స్కోర్‌తో గట్టు భానుతేజ సాయి(50), పి.పవన్‌కుమార్ రెడ్డి (81), వి.ముఖేష్ చౌదరి(150) తర్వాతి స్థానాల్లో నిలిచారు. మొత్తంగా రాష్ట్రం నుంచి 61 మంది 700, ఆపైన స్కోర్ సాధించారు. 2,349 మంది 600, ఆపైన స్కోర్ చేశారు. ఈ జాబితాను మెరిట్ లిస్ట్‌గా పరిగణించవద్దని తల్లిదండ్రులు, విద్యార్థులకు విశ్వవిద్యాలయం స్పష్టం చేసింది. -
లోపాల్ని సరిదిద్దుకోవాల్సిందే.. ఎన్టీఏకు సుప్రీం అక్షింతలు
న్యూఢిల్లీ: నీట్ యూజీ పరీక్ష విధానానికి సంబంధించిన లోపాలను (సరిదిద్దాలని) నివారించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)ను సుప్రీంకోర్టు శుక్రవారం హెచ్చరించింది. మున్ముందు ఇలాంటి లీకేజీలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అటు కేంద్రంతోపాటు ఎన్టీఏను మందలించింది. ఈ మేరకు నీట్ యూజీ పేపర్‌లీక్‌పై దాఖలైన వివిధ పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు.. శుక్రవారం తుది తీర్పు వెలువరించింది.పేపర్‌లీకేజీలో వ్యవస్థీకృత ఉల్లంఘన జరగలేదని, కేవలం పాట్నా, హజారీబాగ్‌కే పరిమితమని సుప్రీం వ్యాఖ్యానించింది. అందుకే నీట్ పరీక్షను రద్దు చేసి, మళ్లీ నిర్వహించేందుకు నిరాకరిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ ధర్మాసంన సమగ్ర తీర్పు వెల్లడించింది.నీట్ వంటి జాతీయ పరీక్షలో ఇలాంటి 'ఫ్లిప్ ఫ్లాప్స్'ను నివారించాలని, ఇవి విద్యార్థుల ప్రయోజనాలను దెబ్బతిస్తాయని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. నీట్ యూజీ పేపర్ లీక్‌పై ఆరోపణలు, ఇతర అవకతవకలపై వివాదం చెలరేగినప్పటికీ పరీక్షను రద్దు చేయకపోవడానికి గల కారణాలను వెలువరిస్తూ, అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసిందిపరీక్షా విధానంలో లోపాలను నిపుణుల కమిటీ సరిచేయాలని పేర్కొంది. ఎన్టీఏ స్ట్రక్చరల్ ప్రాసెస్‌లోని లోపాలన్నింటినీ తమ తీర్పులో ఎత్తిచూపినట్లు అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. విద్యార్థుల శ్రేయస్సు కోసం లోపాలను భరించలేమని స్పష్టం పేర్కొంది. తాజాగా తలెత్తిన సమస్యలు పునరావృతం కాకుండా ఈ ఏడాదే కేంద్రం పరిష్కరించాలని సుప్రీంకోర్టు సూచించింది.ఈసందర్భంగా ఎన్టీఏ పనితీరు, పరీక్షల్లో సంస్కరణల కోసం కేంద్రం నియమించిన ఇస్రో మాజీ చీఫ్ కె.రాధాకృష్ణన్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల కమిటీకి సుప్రీంకోర్టు పలు ఆదేశాలు జారీ చేసింది.కేంద్రం నియమించిన కమిటీ తన నివేదికను సెప్టెంబర్ 30 లోపు కోర్టుకు సమర్పించాలి. ఈ కమిటీ మొత్తం పరీక్ష ప్రక్రియను విశ్లేషించి, పరీక్ష విధానంలో లోపాలను సరిచేసి, ఎన్టీఏ మరింత సమర్థవంతంగా చేయడానికి అవసరమయ్యే మార్పులను సూచించాలి. పరీక్షా వ్యవస్థను బలోపేతం చేసేందుకు అంతర్జాతీయ సాంకేతిక సంస్థల సాయం తీసుకోవాలని సూచించింది. ఈ నివేదిక అందిన తర్వాత అందులోని అంశాలను అమలుచేసే విషయంపై కేంద్రం, విద్యాశాఖ రెండు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలి.అర్హత పరీక్షల నిర్వహణకు ప్రామాణిక ఆపరేటింగ్ విధానం లేదా ప్రోటోకాల్‌ను రూపొందించడం,పరీక్షా కేంద్రాల కేటాయింపు, మార్పు ప్రక్రియను సమీక్షించాలి.అభ్యర్థుల గుర్తింపును ధృవీకరించడానికి కఠినమైన విధానాలను సిఫార్సు చేయాలి.అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు సాధ్యాసాధ్యాలను అంచనా వేయాలి.ట్యాంపరింగ్ ప్రూఫ్ ప్రశ్నపత్రాల కోసం యంత్రాంగాలను సమీక్షించాలి. సూచనలు ఇవ్వాలి.పరీక్షా కేంద్రాల్లో క్రమం తప్పకుండా ఆడిట్లు, తనిఖీలు నిర్వహించాలి. -
నీట్ యూజీ-2024పై సుప్రీం సమగ్ర తీర్పు
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ప్రకంపనలు రేపిన నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారంపై సుప్రీంకోర్టు శుక్రవారం తుది తీర్పు వెలువరించింది. సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం.. నీట్ పేపర్ లీకేజీలో వ్యవస్థీకృత ఉల్లంఘనలు జరగలేదని స్పష్టం చేసింది. పేపర్ లీకేజీ హజారీబాగ్, పాట్నాలకు మాత్రమే పరిమితమైందని స్పష్టం చేసింది.అయితే పరీక్ష వ్యవస్థలో ఉన్న లోపాలను నివారించాలని నేషనల్ టెస్టింగ్ ఏజ్సెన్సీతోపాటు కేంద్రానికి సుప్రీం సూచించింది. పేపర్ లీకేజ్ ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.. కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని, కమిటీ నివేదిక అమలుపై రెండు వారాల్లో సుప్రీంకోర్టుకు కేంద్ర విద్యాశాఖ రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.పేపర్ లీకేజీ ఆరోపణలు, పరీక్షలో ఇతర అవకతవకలపై తీవ్ర వివాదం ఉన్నప్పటికీ, నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్)-యుజి మెడికల్ ప్రవేశ పరీక్షను రద్దు చేయకపోవడానికి గల కారణాలను సుప్రీంకోర్టు శుక్రవారం తన తీర్పులో వివరించింది. సుప్రీం చేసిన సూచనలు..1. ఎవల్యూషన్ కమిటీ ఏర్పాటు చేయాలి2. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ రూపొందించాలి 3. పరీక్షా కేంద్రాల కేటాయింపు ప్రక్రియను సమీక్షించాలి 4. గుర్తింపు, తనిఖీ ప్రక్రియలను మరింత మెరుగుపరచాలి 5. అన్ని పరీక్ష కేంద్రాలలో సీసీటీవీ లను ఏర్పాటు చేయాలి 6. పేపర్ టాంపరింగ్ జరగకుండా భద్రతను పెంచాలి 7. ఫిర్యాదుల పరిష్కారానికి మెరుగైన వ్యవస్థను ఏర్పాటు చేయాలి 8. సైబర్ సెక్యూరిటీ రంగంలో సాంకేతికతను అభివృద్ధి చేసుకునేందుకు అంతర్జాతీయ సహకారం తీసుకోవాలి నీట్ లీక్ అంశం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. మే 5న జరిగిన ఈ పరీక్షను రద్దుచేసి.. మళ్లీ నిర్వహించాలని సుప్రీంకోర్టును పలువురు ఆశ్రయించగా.. అందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. ప్రశ్నాపత్రం లీక్ అయిన మాట వాస్తవమే కానీ.. దీని ప్రభావం స్వల్పమేనని అభిప్రాయపడింది. నీట్ రీ ఎగ్జామ్ అవసరం లేదని పేర్కొంది. ఈ పిటిషన్లపై నేడు సర్వోన్నతన్యాయస్థానం సమగ్ర తీర్పు వెలువరించింది.మరోవైపు నీట్ పేపర్ లీకేజ్‌పై విచారణ చేస్తో న్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) తొలి ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఇందులో నలుగురు అభ్యర్ధులు, ఓ జూనియర్ ఇంజనీర్, ఇద్దరు కుట్రదారులు సహా 13 మందిని నిందితులుగా చేర్చింది. -
నీట్ పేపర్ లీక్ కేసులో సీబీఐ ఛార్జ్ షీట్
ఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. 13మంది నిందితులపై సీబీఐ ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. నితీష్ కుమార్, అమిత్ ఆనంద్, సికిందర్ యాద్వెందు, అశుతోష్ కుమార్-1, రోషన్ కుమార్, మనీష్ ప్రకాష్, అశుతోష్ కుమార్-2, అఖిలేష్ కుమార్, అవదేశ్ కుమార్, అనురాగ్ యాదవ్, అభిషేక్ కుమార్, శివానందన్ కుమార్, ఆయుష్ రాజ్ వంటి నిందితుల పేర్లను చార్జిషీట్లో జత చేసింది. నీట్ పేపర్ లీకేజీ కేసులో దర్యాప్తు చేసిన సీబీఐ ఇప్పటి వరకు 40 మందిని అరెస్టు చేసింది. ఇందులో 15 మందిని బీహార్ పోలీసులు అరెస్టు చేశారు. ఇక నీట్ పేపర్ లీకేజీకి సంబంధించి సీబీఐ అధికారులు 58 ప్రాంతాల్లో దర్యాప్తు సోదాలు నిర్వహించారు. CBI FILES FIRST CHARGESHEET IN THE NEET PAPER LEAK CASE pic.twitter.com/JIg8YG1CSi— Central Bureau of Investigation (India) (@CBIHeadquarters) August 1, 2024 -
ఆగస్ట్ 14 నుంచి .. నీట్ యూజీ 2024 కౌన్సెలింగ్
ఢిల్లీ: నీట్ యూజీ కౌన్సిలింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. కేంద్ర ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలోని మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ ఆగస్ట్ 14 నుంచి నీట్ యూజీ కౌన్సిలింగ్ నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇందులో భాగంగా ఆగస్ట్ మొదటి వారంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కౌన్సిలింగ్‌పై అప్డేట్స్ను ఎంసీసీ వెబ్సైట్లో చూడాలని సూచించింది. ఈ మేరకు నీట్ అభ్యర్థులకు కేంద్ర ఆరోగ్య శాఖ డైరెక్టర్ ఒక నోటీసు విడుదల చేసింది. -
పోటీ పరీక్షలు.. ప్రమాణాలు పాతాళంలో
దేశంలో ఇంజనీరింగ్, మెడికల్, లా తదితర కోర్సుల్లో సీట్ల భర్తీ కోసం కటాఫ్ మార్కులు తగ్గించుకుంటూపోతున్నారు. నాణ్యత ప్రమాణాలతో రాజీ పడుతున్నారు. జీరో మార్కులు వచ్చిన వారు కూడా ఇంజనీరింగ్, మెడికల్, లా కోర్సుల్లో అడ్మిషన్ పొందే పరిస్థితి ఉంది. సీట్ల భర్తీ కోసం కటాఫ్‌లు తగ్గించుకుంటూ పోవడం వల్ల ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రమాణాలు పడిపోతాయి. ఇది దీర్ఘకాలంలో ప్రతికూల పరిణామాలకు దారితీస్తుంది. కాబట్టి ప్రొఫెషనల్ విద్య కోర్సుల్లో ప్రవేశాలకు కనీస ప్రమాణాలు పాటించాలని చెబుతున్నారు.. కెరీర్స్360 ఫౌండర్ చైర్మన్ మహేశ్వర్ పెరి. ప్రస్తుతం ప్రొఫెషనల్ కోర్సుల్లో పడిపోతున్న ప్రమాణాలపై ఆయన అందిస్తున్న విశ్లేషణాత్మక కథనం.. దేశ అత్యున్నత న్యాయస్థానం.. సుప్రీంకోర్టు ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ (ఏఐబీఈ) కటాఫ్‌ను తగ్గించేందుకు నిరాకరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఏఐబీఈ కటాఫ్‌ను తగ్గించడం వల్ల న్యాయ విద్యలో ప్రమాణాలు పడిపోతాయని పేర్కొంది. ‘‘పరీక్ష నిర్వాహకులు.. ఏఐబీఈ జనరల్ కేటగిరీ కటాఫ్ 45 మార్కులు, ఎస్సీ/ఎస్టీలకు కటాఫ్ 40 మార్కులుగా నిర్ణయించారు.ఆ మాత్రం కూడా స్కోర్ చేయకుంటే లాయరుగా ఎలా రాణించగలరు. మీరు దాన్ని ఇంకా 40, 35కు తగ్గించాలని కోరుతున్నారు.. దయచేసి చదవండి’’ అంటూ ఈ సందర్భంగా సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. ప్రధాన న్యాయమూర్తి మనందరి తరఫున మాట్లాడుతున్నారు. దేశవ్యాప్తంగా ప్రవేశ పరీక్షల్లో పడిపోతున్న ప్రమాణాలు, అర్హత మార్కులు, తగ్గుతున్న ఉత్తీర్ణత ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. నేషనల్ లా యూనివర్సిటీలు2022 సర్క్యులర్‌లో నేషనల్ లా యూనివర్సిటీల కన్సారి్టయం ప్రతి కే టగిరీలో అందుబాటులో ఉన్న సీట్లకు ఐదు రెట్ల మంది విద్యార్థులను కౌన్సెలింగ్‌కు పిలవాలని నిర్ణయించింది. దీని అర్థమేమిటంటే.. వారు కనీస ప్రమాణాలను కూడా వదిలేసి ప్రతి సీటుకు ఐదుగురిని పిలవాలని నిర్దేశించారు. ప్రవేశానికి కనీస మార్కులు నిర్దేశించకపోవడం వల్ల కనీసం నాణ్యత లేని విద్యార్థి కూడా అడ్మిషన్ పొందే అవకాశం ఉంటుంది. 2023లో 40 వేల కంటే ఎక్కువ ర్యాంకు వచి్చన విద్యార్థులు సైతం ఎన్ఆర్ఐ కోటాలో నేషనల్ లా యూనివర్సిటీల్లో ప్రవేశం పొందే వీలు కలిగింది. 150కు 15–17 మార్కుల(10 శాతం మార్కులు)మధ్య వచి్చన విద్యార్థులు కూడా జాతీయ లా వర్సిటీల్లో ఎన్ఆర్ఐ కోటా ద్వారా అడ్మిషన్ పొంది.. ఈ దేశంలో లాయర్‌గా మారే అవకాశం ఏర్పడింది. నీట్ పీజీ 2023 2023లో నీట్ పీజీకి హాజరైన మొత్తం విద్యార్థుల సంఖ్య.. 2,00,517. ఆ ఏడాది అందుబాటులో ఉన్న మొత్తం సీట్లు 47,526. మొత్తం 800 మార్కులకు పరీక్ష జరిగింది. 2023లో తొలుత కటాఫ్ 291 మార్కులు(36 శాతం). ఆ తర్వాత కౌన్సెలింగ్ కొనసాగుతున్న కొద్దీ కటాఫ్‌ను తగ్గించుకుంటూ వచ్చి.. చివరకు జీరోగా నిర్ణయించారు. అంటే.. పరీక్షకు హాజరైతే చాలు.. మెడికల్ పీజీలో ప్రవేశం పొందొచ్చన్నమాట! ఇది ఒకరకంగా ప్రవేశ పరీక్షను చంపివేయడంలాంటిదే!! ప్రస్తుతం పలు మెడికల్ కాలేజీల్లో పీజీ చదువుతున్న విద్యార్థుల్లో జీరో మార్కులు వచి్చన వారుకూడా ఉండొచ్చు. నీట్ యూజీ ⇒ 2020లో మొత్తం 13,66,945 మంది విద్యార్థులు నీట్ యూజీ పరీక్షకు హాజరైతే.. కటాఫ్ 147( మొత్తం 720 మార్కులకు(20.4 శాతం)గా నిర్ణయించారు. ఆ సంవత్సరం మొత్తం మెడికల్ సీట్ల సంఖ్య 93,470. కానీ డెంటల్ సీట్లు భర్తీ కాకపోవడంతో డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆ ఏడాది కటాఫ్‌ను 113కు తగ్గించింది. దీంతో 15.7 శాతం మార్కులు వచి్చన వారికి కూడా సీటు లభించింది. ⇒ అదే విధంగా 2021లో మొత్తం 15,44,273 మంది విద్యార్థులు నీట్ యూజీ పరీక్ష రాశారు. మొత్తం మెడికల్ సీట్లు 99,695 ఉన్నాయి. ఆ ఏడాది కటాఫ్ 138(19.2 శాతం). కాని ఆయుష్ సీట్లు భర్తీ కాకపోవడంతో ఆయుష్ అడ్మిషన్స్ సెంట్రల్ కౌన్సిలింగ్ కమిటీ కటాఫ్‌ను 122కు తగ్గించింది. అంటే 17% మార్కులు సాధించిన విద్యార్థులు కూడా సీటు పొందొచ్చు. ఇలా సీట్లు భర్తీ చేయడం కోసం కటాఫ్ తగ్గిస్తూ నాణ్యత విషయంలో రాజీపడుతున్నారు. నీట్ ఎండీఎస్ 2023ఈ పరీక్షను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫర్ మెడికల్ సైన్సెస్.. ఎండీఎస్ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహిస్తుంది. ఈ పరీక్షకు కేటాయించిన మొత్తం మార్కులు 960. మొత్తం సీట్లు 6,937. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల సంఖ్య 23,847. దీనికి కూడా సీట్ల భర్తీ కోసం 2021 నుంచి కటాఫ్ తగ్గించుకుంటూ వస్తున్నారు. నీట్ సూపర్ స్పెషాలిటీదేశంలో నీట్ సూపర్ స్పెషాలిటీలో మొత్తం సీట్ల సంఖ్య 4,243. ఈ పరీక్షకు 2023లో వచ్చిన దరఖాస్తులు 19,944. 2023లో మొదటి రౌండ్లో కటాఫ్ 50 పర్సంటైల్‌గా నిర్ణయించారు. సీట్లు భర్తీకాలేదు. దీంతో రెండో రౌండ్లో కటాఫ్‌ను 20 పర్సంటైల్‌కు తగ్గించారు. అయినా సీట్లు నిండలేదు. ఇక చివరగా స్పెషల్ రౌండ్లో అర్హతను జీరో పర్సంటైల్‌గా నిర్ణయించారు.మెడికల్, లాకే పరిమితం కాలేదు..వాస్తవానికి ఈ అర్హత మార్కులు తగ్గింపు అనేది లా, మెడికల్‌కే పరిమితం కాలేదు. 2018 జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు సంబంధించి కేంద్ర విద్యాశాఖ ఐఐటీల్లో ప్రతి విభాగం, ప్రతి కేటగిరీకి సంబంధించి సీట్ల సంఖ్యకు రెట్టింపు సంఖ్యలో విద్యార్థులు అందుబాటులో ఉండేలా కటాఫ్‌ను తగ్గించాలని ఆదేశించింది. అంటే.. ఐఐటీల్లో అందుబాటులో ఉన్న మొత్తం 10వేల సీట్లకు 20 వేలమంది విద్యార్థులను జోసా కౌన్సెలింగ్ పిలుస్తారు. దీనికోసం అడ్మిషన్ బోర్డు అర్హత మార్కులను 35 శాతం నుంచి 25 శాతానికి తగ్గించింది. ఏకంగా 10 శాతం తగ్గించారు. దీంతో తొలుత మెరిట్ లిస్ట్‌లో 18,138 మంది మాత్రమే ఉండగా.. కొత్తగా 13,842 మంది విద్యార్థులను అర్హులుగా ప్రకటించారు. ఇలా మొత్తంగా పదివేల సీట్ల కోసం 31,980 మంది విద్యార్థులు జోసా కౌన్సెలింగ్‌లో పాల్గొన్నారు. -
భవిష్యత్తు మార్చేసిన ఒక్క ప్రశ్న
-
పునః సమీక్ష జరగాలి!
కొద్దివారాలుగా కొనసాగుతున్న వివాదం కీలక ఘట్టానికి చేరుకుంది. దేశవ్యాప్తంగా వైద్యవిద్యా కళాశాలల్లో ప్రవేశం కోసం ఏటా జరిపే జాతీయస్థాయి పరీక్ష ‘నీట్’లో అక్రమాలు జరిగాయన్న అంశంపై విచారణ చేస్తున్న దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నపత్రాల లీకైనమాట నిజమంటూనే, వ్యవస్థీకృతంగా భారీస్థాయిలో లీకులు జరగనందున పునఃపరీక్ష జరపాల్సిన అవసరం లేదని తేల్చే సింది. ‘నీట్’ వివాదంతో నెలన్నరగా నిద్ర లేని రాత్రులు గడుపుతున్న విద్యార్థులకూ, వారి తల్లితండ్రులకూ ఇది ఒకింత ఊరట, మరింత స్పష్టత. అభ్యర్థుల మానసిక ఒత్తిడిని దృష్టిలో ఉంచుకొని, దాదాపు 23 లక్షల మందికి పైగా హాజరైన పరీక్షను మళ్ళీ నిర్వహించాలని అనుకోకపోవడం మంచిదే. అయితే పేపర్ లీకులు, ఒకదాని బదులు మరొక ప్రశ్నపత్రం ఇవ్వడం, ఒకరి బదులు మరొకరు పరీక్షలు రాయడం, నిర్ణీత కేంద్రాల నుంచి మునుపెన్నడూ లేనంత మంది టాపర్లుగా అవతరించడం – ఇలా ‘నీట్’ నిర్వహణలో ఈసారి వివిధ స్థాయుల్లో జరిగిన అవకతవకలు అనేకం. వీటన్నిటితో వ్యవస్థపై ఏర్పడ్డ అపనమ్మకాన్ని తొలగించడం ఎలా అన్నది ఇప్పుడు అతి పెద్ద ప్రశ్న. మొదట అసలు లోపాలు లేవని వాదించి, ఆనక తప్పుల్ని అంగీకరించినా కీలక చర్యలు చేపట్ట డానికి కార్యనిర్వాహక వ్యవస్థ వెనకాడడం చూశాం. చివరకు న్యాయవ్యవస్థ జోక్యంతో ప్రక్షాళన అవసరమనే అంశం చర్చకు వచ్చింది. సుప్రీమ్‌కోర్ట్ ఆదేశాలతో ‘జాతీయ పరీక్షా సంస్థ’ (ఎన్టీఏ) ‘నీట్’ పరీక్షా ఫలితాలను సవరించి, గురువారం ప్రకటించాల్సి వచ్చింది. భౌతికశాస్త్రంలో ఒక ప్రశ్నకు రెండు జవాబులూ సరైనవేనంటూ విద్యార్థులకు ఈ ఏటి పరీక్షలో గ్రేస్ మార్కులు కలిపిన ఘనత ‘నీట్’ది. అత్యధిక సంఖ్యలో టాపర్లు రావడానికీ అదే కారణమైంది. సదరు వివాదాస్పద ప్రశ్నకు సరైన జవాబు ఒకటేనంటూ సుప్రీమ్ జోక్యం తర్వాత ఐఐటీ – ఢిల్లీ నిపుణుల సంఘం ఖరారు చేసింది. దాంతో అయిదేసి మార్కులు కోతపడి, దాదాపు 4.2 లక్షల మంది విద్యార్థుల మార్కులు మారాయి. జూన్ 4న తొలుత ఫలితాలు ప్రకటించినప్పుడు టాప్ స్కోరర్ల సంఖ్య 61 కాగా, ఇప్పుడీ వివాదాలు, విచారణలు, మార్పుల తర్వాత అది 17కు తగ్గింది. మార్కులు, దరి మిలా ర్యాంకుల్లో మార్పులతో తాజా జాబితాను ఎన్టీఏ విడుదల చేయాల్సి వచ్చింది. పునఃపరీక్షఉండదని కోర్ట్ తేల్చేయడంతో, సవరించిన ర్యాంకుల్ని బట్టి ఇప్పుడిక ప్రవేశాలు జరVýæనున్నాయి. ఎంబీబీఎస్ చదువు కోసం పెట్టిన ఈ దేశవ్యాప్త ‘నీట్ – యూజీ’ పరీక్షలు లోపభూయిష్ఠమనీ, మరీ ముఖ్యంగా స్థానిక విద్యార్థుల అవకాశాలకు హానికరమనీ రాష్ట్రాలు గగ్గోలు పెడుతున్నాయి. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమైన ‘నీట్’ వద్దంటూ తమిళనాడు కొన్నేళ్ళుగా పోరాడుతుంటే, పశ్చిమ బెంగాల్ సైతం బుధవారం గొంతు కలిపింది. తాజాగా కర్ణాటక అసెంబ్లీ సైతం ‘నీట్’ వద్దని గురువారం బిల్లును ఆమోదించింది. సొంతంగా రాష్ట్రస్థాయి మెడికల్ ఎంట్రన్ టెస్ట్ పెడతామంటూ తీర్మానించింది. అది చట్టపరంగా సాధ్యమేనా, కేంద్రం, సుప్రీమ్ కోర్ట్ ఏమంటాయన్నది పక్కన పెడితే, ‘నీట్’ పట్ల పెరుగుతున్న అపనమ్మకం, రాష్ట్రాల్లో అసంతృప్తికి ఇది నిదర్శనం. అసలు ఒకప్పుడు ఎక్కడికక్కడ రాష్ట్రస్థాయి ప్రవేశపరీక్షలే ఉండేవి. దేశంలో వైద్యవిద్య చదవదలచిన పిల్లలు ప్రతి రాష్ట్రంలో పరీక్షలు రాసే ఈ శ్రమ, ఖర్చును తప్పించడం కోసం జాతీయస్థాయిలో అందరికీ ఒకే పరీక్ష ‘నీట్’ను ప్రవేశపెట్టారు. మంచి ఆలోచనగా మొదలైనా, ఆచరణలో అది అవకతవకలకు ఆస్కారమిస్తూ, విద్యార్థుల్ని మరింత ఒత్తిడికి గురి చేసేదిగా మారడమే విషాదం. మళ్ళీ పరీక్ష జరపనక్కర లేదని సుప్రీమ్ ప్రకటించింది కానీ, అసలు తప్పులేమీ జరగలేదని మాత్రం అనలేదని గుర్తించాలి. ఇప్పటికైతే పాట్నా, హజారీబాగ్ – ఈ రెండుచోట్లా పేపర్ లీకైనట్టు కోర్టు నిర్ధరించింది. అలాగే, మరిన్ని వివరాలు తవ్వి తీసేందుకు సీబీఐ దర్యాప్తు కొనసాగుతుందనీ స్పష్టం చేసింది. విద్యార్థుల కౌన్సిలింగ్ వగైరా కొనసాగించవచ్చని అనుమతిస్తూనే, భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు ఎదురవకుండా, పరీక్షల నిర్వహణ మరింత మెరుగ్గా ఎలా నిర్వహించాలన్న దానిపై మార్గదర్శకాలు రానున్నట్టు పేర్కొంది. అభ్యర్థుల బంగారు భవిష్యత్తు ఆధారపడిన పరీక్ష లపై ఎన్టీఏలో నిర్లక్ష్యం ఎంతగా పేరుకుందో ఇటీవలి ‘నీట్’, యూజీసీ– నెట్ వివాదాలే నిదర్శనం. పరీక్షా కేంద్రాల ఎంపిక మొదలు కీలకమైన పనిని బిడ్డింగ్‌లో అవుట్ సోర్సింగ్‌కు అప్పగించడం దాకా లోపాలు అనేకం. అసలు ముందుగా ఎన్టీఏను ప్రక్షాళన చేయాలంటున్నది అందుకే. ‘నీట్’ సంగతే తీసుకున్నా పెన్ను– పేపర్ల విధానం నుంచి కంప్యూటర్ ఆధారిత ఆఫ్‌లైన్ పరీక్షకు మారాలని నిపుణుల మాట. ‘జేఈఈ’లో లాగా రెండంచెల పరీక్షా విధానం ఉండాలనే సూచనా వినిపిస్తోంది. సంపూర్ణ అధ్యయనం, సమగ్ర చర్చతో తగిన చర్యలు చేపట్టడం ఇక భవిష్యత్ కార్యాచరణ కావాలి. అసలు ఇవాళ దేశంలో అనేకచోట్ల చదువుల్లో పరీక్షా పత్రాల మొదలు పోటీపరీక్షల ప్రశ్నపత్నాల వరకు అన్నీ విపణిలో యథేచ్ఛగా లభిస్తున్న దుఃస్థితి. ఈ లీకుల జాడ్యాన్ని అరికట్టకపోతే ప్రతిభకు పట్టం అనే మాటకు అర్థం లేకుండా పోతుంది. రకరకాల పేపర్ లీకులతో తరచూ వార్తల్లో నిలుస్తున్న బిహార్ సైతం ఎట్టకేలకు లీకు వీరులను కఠినంగా శిక్షించేందుకు ప్రభుత్వ పరీక్షల (అక్రమాల నిరోధక) బిల్లును అసెంబ్లీలో బుధవారం ఆమోదించింది. అన్నిచోట్లా ఇలాంటి కఠిన చట్టాలు అవస రమే. అయితే, అమలులో చిత్తశుద్ధి, అంతకన్నా ముందు ఆ చట్టాల దాకా పరిస్థితిని రానివ్వ కుండా లీకులకు అడ్డుకట్ట వేయడం ముఖ్యం. ‘నీట్’ పునర్నిర్వహణకు కోర్టు ఆదేశించకున్నా, తప్పులు జరిగాయని తేటతెల్లమైంది గనక మన పరీక్షా వ్యవస్థలు, విధానాలపై పునఃసమీక్ష, ప్రక్షాళనకు దిగాలి. అదీ పారదర్శకంగా జరగాలి. ‘నీట్’ లీకువీరులకు కఠిన శిక్షతో అందుకు శ్రీకారం చుట్టాలి.