విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగింది: మంత్రి శ్రీధర్‌బాబు
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయిలో ‘నీట్’ పరీక్షలో జరిగిన అవకతవకలపై సీబీఐతో విచారణ జరిపించాలని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. పరీక్షా పత్రాలు లీక్ అయినట్లు ఆరోపణలు రావడం ఒకటైతే, 63 మంది విద్యార్థులకు ఒకే ర్యాంకు రావడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. గురువారం ఆయన శాసనసభలో కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
పరీక్షల నిర్వహణ, ఫలితాల అంశంలో విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని, దీనిపై తక్షణమే కేంద్రం స్పందించాలని కోరారు. దీనికి బా ధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 9వ తేదీ నుంచి నెలరోజులపాటు దరఖాస్తు చేసుకోవడానికి అనుమతినిచ్చి.. ఆ తరువాత మరో వారం రోజులు గడువును నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పొడిగించిందని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు.
పరీక్షల ఫలితాలు జూన్ 14వ తేదీ రావాల్సి ఉండగా.. పదిరోజుల ముందుగానే ప్రకటించడం కూడా అనుమానాలు మరింత పెరగడానికి అవకాశం ఏర్పడిందని అన్నారు. దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నాయని, గ్రేస్ మార్కులు కూడా ఇష్టానుసారం కలిపారని మంత్రి ఆరోపించారు. నీట్ పరీక్షల నిర్వహణలో నేషనల్ డెమొక్రటిక్ అలయెన్స్(ఎన్డీయే)పూర్తిగా విఫలమైందని ఆయన దుయ్యబట్టారు.
బొగ్గు గనుల వేలంపై పునరాలోచన చేయాలి..
బొగ్గు గనులను వేలం వేయకుండా ప్రభుత్వరంగ సంస్థల ఆధ్వర్యంలోనే ప్రారంభించాలని మంత్రి శ్రీధర్‌బాబు డిమాండ్ చేశారు. బొగ్గు గనులను సింగరేణి ద్వారానే ఏర్పాటు చేయాలని, కానీ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి మాత్రం ప్రైవేట్ సంస్థలకు ఇస్తున్నట్లు చెబుతున్నారని మంత్రి విమర్శించారు. అన్ని బొగ్గు నిక్షేప సంస్థలు లాభాల్లో ఉన్నాయని, కిషన్‌రెడ్డి ద్వంద్వ వైఖరితో వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
బొగ్గు గనుల అంశంపై ప్రధాన మంత్రి నరేంద్రమోదీని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కలిసి మాట్లాడతారని అన్నారు. బీఆర్‌ఎస్ నేతలు అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలపై పునరాలోచన చేసుకోవాలని, లేనిపక్షంలో భవిష్యత్తులో ఒక్కసీటు కూడా రాదని మంత్రి శ్రీధర్‌బాబు హెచ్చరించారు. జీవో 46పై త్వరలోనే సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment