న్యూఢిల్లీ: నీట్ యూజీ-2024 ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంపై సుప్రీంకోర్టు మంగళవారం(జులై 23) తుది తీర్పు వెల్లడించింది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా(సీజేఐ) డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పుకాపీని చదివి వినిపిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది.
‘నీట్ పరీక్ష నిర్వహణలో లోపాలున్నాయి. పేపర్‌లీక్ వల్ల 155 మంది విద్యార్థులు మాత్రమే లబ్ధిపొందారు. పరీక్ష రద్దు చేయాల్సిన అవసరం లేదు. నీట్‌కు మళ్లీ పరీక్ష అక్కర్లేదు. నీట్‌పై అభ్యంతరాలను ఆగస్టు 24న వింటాం’అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఎంబీబీఎస్ కోర్సులో ప్రవేశం కోసం మే 5న దేశవ్యాప్తంగా 4750 కేంద్రాల్లో నిర్వహించిన నీట్-యూజీ 2024 పరీక్షకు దాదాపు 24 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీటి ఫలితాలను జూన్ 14న వెల్లడించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) భావించినప్పటికీ.. ముందస్తుగానే జవాబు పత్రాల మూల్యాంకనం ముగియడంతో జూన్ 4నే ఫలితాలు వెల్లడించింది.
అయితే, పరీక్షలో అవకతవకలు, పేపర్ లీకేజీ ఆరోపణలు రావడం దేశవ్యాప్తంగా ఆందోళనలకు కారణమయ్యింది. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన సీబీఐ.. బిహార్‌లో ఇప్పటికే పలువురు అనుమానితులను అరెస్టు చేసింది. నీట్-యూజీ పేపర్ లీకేజీ ఆరోపణలు రావడంతో కొత్తగా పరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది.
పిటిషన్‌ను విచారించిన సుప్రీం ధర్మాసనం స్పందన తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వంతోపాటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)ను ఆదేశించింది. అభ్యర్థుల్లో 1563 మందికి గ్రేస్ మార్కులు కలపడం, నీట్‌ను రద్దు చేయడం, ఓఎంఆర్ షీట్లు అందకపోవడం, న్యాయస్థానం పర్యవేక్షణలో దర్యాప్తు వంటి అంశాలతో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. వీటన్నింటిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలో జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపి తుది తీర్పు మంగళవారం వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment