నీట్‌-పీజీ పరీక్ష వాయిదాకు సుప్రీంకోర్టు నిరాకరణ | Supreme Court Refuses To Postpone NEET PG Exam | Sakshi
Sakshi News home page

నీట్‌-పీజీ పరీక్ష వాయిదాకు సుప్రీంకోర్టు నిరాకరణ

Published Fri, Aug 9 2024 4:58 PM | Last Updated on Fri, Aug 9 2024 5:31 PM

Supreme Court Refuses To Postpone NEET PG Exam

వైద్యవిద్యా పోస్టు గ్రాడ్యుయేషన్‌ కోర్సులో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్‌-పీజీ పరీక్షను వాయిదా వేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ మేరకు నీట్‌-పీజీని వాయిదా వేయాలని కోరుతూ పలువురు విద్యార్ధులు దాఖలు చేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది.  పరీక్షను వాయిదా వేసి విద్యార్థుల జీవితాలను ప్రమాదంలోకి నెట్టలేమని వ్యాఖ్యానించింది.

నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్‌ మెడికల్‌ సైన్సెస్‌ నిర్వహించే ‘నీట్‌-పీజీ పరీక్ష ఆగస్టు 11న (ఆదివారం) జరగనుంది. అయితే దీనిని వాయిదా వేయాలని కోరుతూ విద్యార్ధులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, న్యాయమూర్తులు మనోజ్‌ మిశ్రా, జేబీ పార్దివాలాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. ఈ సందర్బంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.

రెండు రోజుల్లో పరీక్ష నిర్వహించాల్సి ఉండగా... ఈ సమయంలో వాయిదా వేయాలని ఆదేశించలేమని పేర్కొంది. ‘ఇలాంటి పరీక్షలను మనం ఎలా వాయిదా వేయగలం? ఈ మధ్యకాలంలో పరీక్షను వాయిదా వేయమని అడుగుతూ పిటిషన్లు వేస్తున్నారు. ఇది పరిపూర్ణ ప్రపంచమేమి కాదు. మేము విద్యా నిపుణులం కాదు.

రెండు లక్షల మంద విద్యార్థులు హాజరవుతారు. కొంతమంది అభ్యర్థులు వాయిదా వేయాలని కోరినందుకు దీనిని రీ షెడ్యూల్‌ చేయాలని అనుకోవడం లేదు. పరీక్షను వాయిదా వేయడం ద్వారా రెండు లక్షల విద్యార్ధులు, 4 లక్షల మంది తల్లిదండ్రులు ప్రభావితమవుతారు. ఈ పిటిషన్ల కారణంగా మేము విద్యార్ధుల భవిష్యత్తును ప్రమాదంలో నెట్టివేయలేం’ అని కోర్టు అభిప్రాయపడింది.

కాగా నీట్‌ పీజీ పరీక్షలో ఇప్పటివరకు పేపర్‌ లీకేజీ ఆరోపణలు రాలేదు. కానీ  నీట్‌-యూజీ 2024 పరీక్షలో అవకతవకలు జరిగినట్లు దేశ వ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు వ్యక్తమవడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా నీట్‌ పీజీ పరీక్షను సైతం కేంద్రం వాయిదా వేసింది. తొలుత జూన్‌ 23న నిర్వహించాల్స ఉండగా తాజాగా ఆగస్టు 11న జరగనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement