ఉచితమా? అనుచితమా? | Sakshi Guest Column On Free schemes in India | Sakshi
Sakshi News home page

ఉచితమా? అనుచితమా?

Published Thu, Feb 20 2025 12:26 AM | Last Updated on Thu, Feb 20 2025 12:26 AM

Sakshi Guest Column On Free schemes in India

విశ్లేషణ

ఉచిత పథకాల గురించి సుప్రీం కోర్టు ఈనెల 12న వ్యాఖ్యానించటంతో ఈ విషయం మరొకమారు చర్చలోకి వచ్చింది. ఈ ధోరణులకు మూలం ఎక్కడున్న దనేది ఒక ప్రశ్న అయితే, అందుకు అసలు పరిష్కారం ఉందా అన్నది రెండవ ప్రశ్న. ఇండియా మధ్యయుగాల కాలం నుంచి ఫ్యూడల్‌ వ్యవస్థలలో, తర్వాత దానితో పాటు కొన్ని వందల సంవత్సరాలపాటు వలస పాలనలో మగ్గిపోయి అన్ని విధాలుగా వెనుకబడింది. అట్లాగని దేశంలో సహజ వనరులకు, కష్టించి పనిచేసే మానవ సంపదకు కొరత లేదు. 

ఏవో కొన్నిచోట్ల తప్ప, గ్రామీణ ఆర్థికతపై, అవసరాలపై ఆధారపడి సాగే సకల వృత్తుల వారున్నారు. అయినప్పటికీ,  1947లో దేశానికి స్వాతంత్య్రం సాధించుకునే నాటికి, అత్యధిక శాతం ప్రజలు దయనీయంగా వెనుకబడి ఉన్నారు. తమ స్థితిగతుల పట్ల, అందుకు కారణాలపట్ల, ప్రజలలో చైతన్యానికి ఎంత మాత్రం కొరత లేదు. వాస్తవానికి అటువంటి చైతన్యాలు గలవారు అనేక రూపాలలో సాగించిన ఉద్యమాలూ, తిరుగుబాట్లూ, 1857 నాటి ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామానికీ, 1885 నుంచి కాంగ్రెస్‌ నాయకత్వాన స్వాతంత్య్రోద్యమానికీ భూమికగా పనిచేశాయి.

ప్రణాళికలు సరిగ్గా అమలైవుంటే...
ఈ నేపథ్యాన్నంతా ఇంతగా చెప్పుకోవటానికి కారణాలున్నాయి. వనరులు, ప్రజల చైతన్యాలు గల దేశంలో గత 75 సంవత్సరాల స్వాతంత్య్ర కాలంలో తగిన విధానాలు, వాటి అమలు ఉండిన పక్షంలో ఈరోజు అసలు ఉచితాల అవసరమే ఏర్పడేది కాదు. ఎన్నిక లకు ముందు ఎందుకీ ఉచితాలని, అందువల్ల ప్రజలు పనిచేసేందుకు ఇష్టపడటం లేదని, ఆ విధంగా పరాన్నజీవుల తరగతి ఒకటి సృష్టి అవుతున్నదని సాక్షాత్తూ దేశ సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యా నించవలసిన పరిస్థితి వచ్చేది కాదు. 

ఇక్కడ కొన్ని విషయాలు చెప్పుకోవాలి. దేశం పేదరికం నుంచి బయటపడి అభివృద్ధి సాధించేందుకు చేయవలసిందేమిటన్న అవగా హన స్వాతంత్య్రోద్యమ నాయకులకు 1947 కన్న ముందే స్పష్టంగా ఉంది. వ్యవసాయిక, పారిశ్రామిక, వాణిజ్య రంగాలన్నింటికి సంబంధించి వారంతా బాగా చదివి అనేక దేశాలను, అక్కడి ఆలోచనా విధానాలను, అభివృద్ధి విధానాల తీరుతెన్నులను గమనించినవారు. వాటిని భారతదేశ పరిస్థితులకు ఏ విధంగా అన్వయించాలో అర్థం చేసుకున్నవారు. 

ఇటువంటి నేపథ్యాల వల్లనే వారి మేధస్సుల నుంచి, సుదీర్ఘ చర్చల నుండి, అప్పటికే చిరకాలంగా ప్రజాస్వామికంగా ఉండిన దేశాలకు మించి, ప్రపంచంలోనే ఎక్కడా లేనంత గొప్ప రాజ్యాంగం రూపుదిద్దుకున్నది. దేశ స్వాతంత్య్రోద్యమం వలెనే రాజ్యాంగం కూడా ఆసియా, ఆఫ్రికాలలోని ఇతర వలస వ్యతిరేక ఉద్యమాలకు ఆదర్శప్రాయమైంది. ఆ రాజ్యాంగానికి అనుగుణంగా తర్వాత కాలంలో చట్టాలు, ప్రణాళికలు, సంక్షేమ పథకాలు రూపు తీసుకున్నాయి. అవి సక్రమంగా అమలై ఉండినట్లయితే ఈ చర్చలకు ఆస్కారమే ఏర్పడేది కాదు.

స్వాతంత్య్రం వచ్చిన నాటి పేద స్థితిగతులను బట్టి సంక్షేమం తప్పనిసరి. దేశం, దానితోపాటు వారూ అభివృద్ధి చెందటం రాత్రికి రాత్రి జరిగేది కాదు. సంక్షేమ దృక్పథం పారిశ్రామిక విప్లవం నుంచి యూరప్‌లో, ఇంకా చెప్పాలంటే మన దేశంలోనూ మొదటి నుంచి ధార్మిక భావనలలో భాగంగా ఉన్నదే. అయితే, ఆధునిక ప్రజా స్వామిక, ఆర్థిక వ్యవస్థలు ఏర్పడిన తర్వాత, సకల జనుల అభివృద్ధి క్రమంలో, ఆ పని సవ్యంగా జరిగినట్లయితే, సంక్షేమ చర్యల అవసరం క్రమంగా తగ్గిపోవాలి. 

పేదలు తమ కాళ్లపై తాము నిలబడ గలగాలి. అదే ప్రభుత్వం లక్ష్యమై, దాని విధానాలు, ఆచరణలు అందుకు దోహదం చేయాలి. ఆ పని జరగనపుడు అంతా అస్తవ్యస్త మవుతుంది. ఈ పరిస్థితుల నుంచి పుట్టుకు వచ్చేదే పాప్యులిజం.సంక్షేమం కాస్తా పాప్యులిజంగా లేదా జంక్‌ వెల్ఫేర్‌గా మారటం. 

అభివృద్ధి మార్గం
స్వాతంత్య్ర సమయానికి దేశ పరిస్థితులు ఏమిటో స్పష్టంగా తెలిసిన నాయకులు అందుకు పరిష్కార మార్గాలను కూడా అన్వేషించినట్లు పైన చెప్పుకున్నాము. వారి అవగాహనలు, అన్వేషణలు అంతకుముందే ఉండినట్లు 1947కు ముందు కాంగ్రెస్‌ మహాసభల ఆర్థిక సంబంధ తీర్మానాలను, 1935 నాటి గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా యాక్ట్‌ ప్రకారం ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వాల చర్యలను పరిశీలించినట్లయితే అర్థమవుతుంది. 

అటువంటపుడు 1947 తర్వాత, 1951–52 నాటి మొదటి ఎన్నికల వెనుక జరిగిందేమిటి? పరిస్థితులను మార్చేందుకు నెహ్రూ ప్రభుత్వం కొన్ని ముఖ్యమైన చట్టాలు చేసింది. వాటిలో భూసంస్కరణలు, గ్రామ పంచాయితీ వ్యవస్థ, సహకార సంఘాల ఏర్పాటు, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు మొదలైనవి ఉన్నాయి. ఇవి అమలైనట్లయితే గ్రామీణ భారతంలో పేదలకు భూములు లభించటం, పంచాయితీలలో, సహకార సంఘాల ద్వారా లభించే వాటిలో వారికి అవకాశాలు, రిజర్వేషన్ల ద్వారా విద్యా – ఉద్యోగాలు, అంతిమంగా ఫ్యూడల్‌ శక్తుల పట్టు క్రమంగా సడలి పేద ప్రజల అభ్యున్నతి వంటివి జరుగుతాయి. 

పలు దేశాలలో భూసంస్కరణలు ఇటువంటి ఫలితాలను ఇవ్వటమే గాక, వ్యవసాయ రంగంలో సంపదల సృష్టి జరిగి అది పారిశ్రామికాభివృద్ధికి పెట్టుబడిగా ఉపయోగ పడింది. భారతదేశంలో అటు వంటి క్రమం మొదలై సాగి ఉంటే, సంక్షేమం ఉచితాలుగా, ఉచితాలు ఊబిగా మారి ఉండేవి కావు. నిజానికి చాలా కాలం వరకు సంక్షేమం కూడా సరిగా అమలు కాలేదు. కనుక ఇదంతా కేవలం స్వయంకృతం.

ప్రహసన ప్రాయంగా...
అదట్లుంచితే, తొలి దశలో రూపొందిన ఈ గొప్ప ప్రణాళికలు ఎందువల్ల విఫలమైనట్లు? సూటిగా చెప్పాలంటే, కాంగ్రెస్‌లో స్వాతంత్య్రోద్యోమ కాలం నుంచే బలంగా ఉండిన ఫ్యూడల్‌ వర్గాలు, తర్వాత ఆ పార్టీలో చేరిన మాజీ రాజసంస్థానాలవారు, గొప్పగా కాకున్నా ఒక మేరకు ఉండిన పారిశ్రామిక వర్గాలు కలిసి, అధికార యంత్రాంగాన్ని తమకు విధేయులుగా మార్చుకుని, తమ ప్రయో జనాల కోసం అన్నింటినీ కుంటుపరిచారు. నెహ్రూ నిస్సహాయునిగా మిగిలారు. 

అందుకే ఏ ఒక్కటీ సవ్యంగా అమలుకాక, స్వాతంత్య్ర ఫలితాల కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తుండిన పేదలు, మధ్య తరగతి వర్గాలను తీవ్రంగా నిరాశపరచింది. దాని పర్యవసానంగానే 1957 ఎన్నికలలో కాంగ్రెస్‌ కొన్ని ముఖ్యమైన రాష్ట్రాలలో ఓడటం, 1960ల మధ్యకు వచ్చేసరికి వివిధ తరగతుల ఆందోళనలు, 1967లో కాంగ్రెస్‌ను 9 రాష్ట్రాలలో ఓడించి సంయుక్త విధాయక్‌ దళ్‌ ప్రభు త్వాల ఏర్పాటు, 1969 నుంచి నక్సలైట్‌ ఉద్యమం వంటివి వరుసగా జరుగుతూ వచ్చాయి. భూసంస్కరణలు, పంచాయితీరాజ్‌ వ్యవస్థ, సహకార సంఘాలు, రిజర్వేషన్ల అమలు ప్రహసనంగా మిగిలాయి. 

ఇందుకు ప్రజలను నిందించటంగానీ, వారు ఉచితాల కారణంగా పనులకు వెళ్లటం లేదనటంగాని పూర్తిగా నిర్హేతుకమైనది. మారుతున్న పరిస్థితులలో వారికి నిత్య జీవిత వ్యయం, ఇతర అవస రాల ఖర్చు చాలా పెరుగుతున్నాయి. కేవలం ఉచితాలు ఎంత మాత్రం సరిపోవు. 

ఉచితాల ఊబికి ఏకైక పరిష్కారం ప్రభుత్వాలు, పార్టీలు తామే చేసిన రాజ్యాంగాన్ని, చట్టాలను నిజాయితీగా అమలు పరచటం. పేదలు పెట్టుబడిదారీ వ్యవస్థ కోసం సరిగా పని చేయా లన్నా, తిరుగుబాట్లు చేయవద్దనుకున్నా వారికి సంక్షేమ పథకాలు అవసరమని సిద్ధాంతీకరించి సవ్యంగా అమలు చేసిన బ్రిటిష్‌ వ్యవస్థను, జర్మన్‌ నియంత బిస్మార్క్‌ను మనం ఒకసారి చదువుకుంటే ఉపయోగపడుతుంది.

టంకశాల అశోక్‌ 
వ్యాసకర్త సీనియర్‌ సంపాదకుడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement