దూరదృష్టి గల సంస్కర్త | Sakshi Guest Column On Dr BR Ambedkar On His Jayanthi | Sakshi
Sakshi News home page

దూరదృష్టి గల సంస్కర్త

Published Mon, Apr 14 2025 12:14 AM | Last Updated on Mon, Apr 14 2025 5:57 AM

Sakshi Guest Column On Dr BR Ambedkar On His Jayanthi

నేడు బాబాసాహెబ్‌ డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ జయంతి

సందర్భం

భారతదేశపు గొప్ప దార్శనికులలో ఒకరైన డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ 135వ జయంతి ఈ రోజు. ఆయన వారసత్వాన్ని తక్కువ చేసి చూపించడానికి ఉద్దేశపూర్వకంగా అవాంఛ నీయ ప్రయత్నాలెన్నో జరిగాయి. శతాబ్దం గడచిన తర్వాత కూడా, అంబేడ్కర్‌ అంటే కేవలం ఒక దళిత నాయకుడిగా పరిగణించడం శోచనీయం. ఆయనను దళితులు, అణ గారిన వర్గాల ప్రతినిధిగా మాత్రమే కాకుండా, ఆధునిక భారత దేశపు అగ్రశ్రేణి మేధావుల్లో ఒకరిగా పరిగణించాలన్నది అత్యావశ్యం. 

చదువుకునే రోజుల్లో పిల్లలంతా తాగే సాధారణ కుళాయి నుంచి నీళ్లు తాగడానికి కూడా ఆయనను అనుమతించేవారు కాదు. ఒకసారి మండు వేసవిలో దాహం తట్టుకోలేక దగ్గర్లో ఉన్న కుళాయి నుంచి నీళ్లు తాగడానికి ప్రయత్నిస్తే... కట్టుబాట్లు ఉల్లంఘించారనే  కారణంతో ఆయన మీద దాడికి తెగబడ్డారు. ఆ సంఘటన తరువాత చాలామంది తమ రాత ఇంతే అని సరిపెట్టుకుని ఉండేవారు. మరి కొందరైతే హింసా మార్గాన్ని ఎంచుకుని ఉండేవారు. కానీ, ఆయన అలా చేయలేదు. 

తనలోని బాధను గుండెల్లోనే అదిమిపెట్టుకుని జీవితాన్ని చదవడం నేర్చుకున్నారు. కొలంబియా, లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో డిగ్రీలతో సహా ఎంఏ, ఎంఎస్సీ, పీహెచ్డీ, డీఎస్సీ, డీలిట్, బార్‌–ఎట్‌–లా పూర్తి చేశారు. ఏ పాఠశాలల్లో అయితే తనను చదువుకోవడానికి అనుమతించలేదో... అంతకు మించిన స్థాయిలో విదేశాల్లో విద్యను పూర్తి చేసి తానేమిటో సమాజానికి చూపించారు. అయినా తన మాతృభూమి, కర్మభూమి అయిన భారతదేశానికి తిరిగి వచ్చే విషయంలో స్పష్టమైన వైఖరితో ఉండేవారు.

పేరెన్నికగన్న సంస్థల ఏర్పాటులో అంబేడ్కర్‌ పాత్ర విస్మరించలేనిది. ఆధునిక భారతదేశంలో ఆర్బీఐ, సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ వంటి అనేక సంస్థలు బాబాసాహెబ్‌ దూరదృష్టితో పురుడు పోసు కున్నవే. ఆర్థికశాస్త్రం, ఆర్థిక చరిత్రపై తన ప్రావీణ్యంతో భారత్‌ ఎదుర్కొంటున్న ద్రవ్య సమస్యలను ఆధారాలతో సహా ‘రాయల్‌ కమిషన్‌ ఆన్‌ ఇండియన్‌ కరెన్సీ అండ్‌ ఫైనాన్స్‌’కు విశ్లేషణాత్మకంగా వివరించారు. ఫలితంగా ఒక సెంట్రల్‌ బ్యాంక్‌గా విధులను నిర్వర్తించే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఏర్పాటుకు పునాది పడింది.

గట్టి ప్రజాస్వామ్యవాది
అంబేడ్కర్‌ దృఢమైన ప్రజాస్వామ్యవాది. భారత దేశపు భవి ష్యత్తు, దాని ప్రజాస్వామ్యం, కష్టపడి సంపాదించిన స్వాతంత్య్రం గురించే ఆయన ఎక్కువగా ఆలోచించేవారు. రాజ్యాంగ సభలో ఆయన చివరి ప్రసంగంలో ఈ భయాందోళనలు సుస్పష్టంగా వ్యక్తమ య్యాయి. ఆయన హెచ్చరికలే భారతదేశాన్ని దాదాపు ఎనిమిది దశా బ్దాలుగా ప్రజాస్వామ్య మార్గంలో నడిపిస్తున్నాయి. అయితే నేడు కులం, మతం, జాతి, భాష మొదలైన సామాజిక విభేదాలతో భారతీ యుల మధ్య సోదరభావాన్ని తగ్గించే ప్రయత్నాలను చూస్తున్నాం.

ఆర్య–ద్రావిడ విభజన నుంచి ఎక్కువ ప్రయోజనం పొందగలిగే సమయంలో కూడా ఆర్య దండయాత్ర సిద్ధాంతాన్ని అంబేడ్కర్‌ తప్పు పట్టారు. ‘ఒక తెగ లేదా కుటుంబం జాతిపరంగా ఆర్యులా లేదా ద్రావిడులా అనేది విదేశీ వ్యక్తులొచ్చి విభజన రేఖ గీసేవరకు భారత ప్రజల మదిలో ఇలాంటి ఆలోచనలు తలెత్తలే’దని 1918లో ప్రచురించిన ఒక పత్రికా వ్యాసంలో పేర్కొన్నారు. పైగా యజుర్వేద, అధర్వణ వేదాల్లోని రుషులు శూద్రులకు తగిన ప్రాధాన్యమిచ్చిన అనేక సందర్భాలను ఉదాహరించారు. 

ఆర్యులు, ద్రవిడుల కంటే అంటరానివారు జాతిపరంగా భిన్నమైనవారనే సిద్ధాంతాన్ని కూడా ఆయన తోసిపుచ్చారు.తమ సంకుచిత, మతపరమైన ప్రయోజనాల కోసం భాషా సమస్యలను సాకుగా చూపించేవారు దేశ ఐక్యత విషయంలో అంబే డ్కర్‌ అభిప్రాయాలను తెలుసుకుంటే ఎంతో ప్రయోజనం పొందుతారు.

తాను ప్రావీణ్యం సంపాదించిన తొమ్మిది భాషలలో ఒకటైన సంస్కృతాన్ని అధికారిక భాషగా ఆమోదించడానికి మద్దతుగా 1949 సెప్టెంబరు 10న ఆయన రాజ్యాంగ సభలో ఒక సవరణను ప్రవేశ పెట్టారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలపై తన ఆలోచనలు వెల్లడిస్తూ... ‘హిందీని తమ భాషగా స్వీకరించడం భారతీయులందరి విధి’ అని ప్రకటించారు. హిందీ మాట్లాడే ప్రాంతానికి చెందిన వ్యక్తి కాక పోయినప్పటికీ, దేశ ప్రాధాన్యాలకు ప్రథమ స్థానమిచ్చా రన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.

ఆయన దార్శనికతకు అనుగుణంగా...
’ప్రజాస్వామ్యం విజయవంతంగా సాగడానికి అనుసరించా ల్సిన పద్ధతుల’పై 1952 డిసెంబర్‌ 22న ఒక ప్రసంగమిస్తూ... ప్రజా స్వామ్యం రూపం, ఉద్దేశం కాలక్రమేణా మారుతాయనీ, ప్రజలకు సంక్షేమాన్ని అందించడమే ఆధునిక ప్రజాస్వామ్యపు లక్ష్యమనీ పేర్కొ న్నారు. ఈ దార్శనికతతోనే మా ప్రభుత్వం గత పదేళ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకురావడంలో విజయం సాధించింది. 16 కోట్ల గృహాలకు కుళాయి నీటిని అందించడానికి కృషి చేశాం. పేద కుటుంబాల కోసం 5 కోట్ల ఇళ్లను నిర్మించాం. 

2023లో ‘జన్‌ మన్‌ అభియాన్‌’ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీజీ ప్రారంభించారు. బలహీన గిరిజన వర్గాల (పీవీటీజీ) సామాజిక– ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడం, పీవీటీజీ గృహాలు–ఆవాసా లకు ప్రాథమిక సౌకర్యాలు కల్పించడం దీని లక్ష్యం. ప్రధాన మంత్రి 2047 నాటికి ‘వికసిత్‌ భారత్‌’ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. 

ఇది బాబాసాహెబ్‌ దార్శనికతకు అనుగుణంగా ఉంటుంది. అంతేకాదు, బాబాసాహెబ్‌ వారసత్వం, రచనల గురించి భవిష్యత్‌ తరాలకు మరింతగా తెలియజెప్పడానికి, మా ప్రభుత్వం పంచతీర్థాన్ని అభివృద్ధి  చేసింది. అంబేడ్కర్‌తో ముడిపడిన మహూ (మధ్యప్రదేశ్‌); నాగపూర్‌ (మహారాష్ట్ర) లోని దీక్షా భూమి; లండన్‌ లోని డాక్టర్‌ అంబేడ్కర్‌ మెమోరియల్‌ హోమ్‌; అలీపూర్‌ రోడ్‌ (ఢిల్లీ) లోని మహాపరినిర్వాణ భూమి, మరియు ముంబయి (మహారాష్ట్ర) లోని చైత్య భూమిలే ఆ పంచ తీర్థాలు.

గత నెలలో ప్రధాని దీక్షాభూమిని సందర్శించినప్పుడు, బాబా సాహెబ్‌ ఊహించిన భారతదేశాన్ని సాకారం చేయడానికి మరింత కష్టించి పనిచేయాలన్న ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాటించారు. అంబేడ్కర్‌ ఆదర్శాలకు అనుగుణంగా నడుచుకుంటామంటూ ప్రతిజ్ఞ చేసే అవకాశాన్ని ఆయన జయంతి కల్పిస్తోంది. జాతి, మత, ప్రాంత, కులాలకు అతీతంగా మనమంతా ‘భారతీయులు’గా సాగిపోదాం. ఆయన్ని ఏదో ఒక ప్రాంతానికి పరిమితమైన నాయకుడిగా చేసే ప్రయత్నాలను అడ్డు కోవాలి. 

ఒక సందర్భంలో సైమన్‌ కమిషన్‌ ఆధా రాల గురించి అడిగితే... ప్రాంతీయ దురభిమానమూ, సమూహ భావనలకూ లోనయ్యే ప్రమాదముందని హెచ్చరిస్తూ, ‘మనమె ప్పుడూ భారతీయులమే’ అన్న చైతన్యాన్ని ప్రజల్లో కలిగించడం అత్యవశ్యమని చెప్పారు. బాబాసాహెబ్‌... భారతదేశానికి దేవుడి చ్చిన వరం. ప్రపంచానికి భారతదేశమిచ్చిన బహుమతి. అప్పటి బ్రిటిష్‌ ఇండియా గానీ, నవ స్వతంత్ర భారతం గానీ ఇవ్వని గౌరవ పీఠాన్ని మనం ఆయనకిద్దాం.

రాజ్‌నాథ్‌ సింగ్‌
వ్యాసకర్త భారత రక్షణ మంత్రి 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement