మన రాజ్యాంగం బలమైనదేనా? | Sakshi Guest Column On Indian Constitution | Sakshi
Sakshi News home page

మన రాజ్యాంగం బలమైనదేనా?

Published Mon, Feb 3 2025 12:34 AM | Last Updated on Mon, Feb 3 2025 12:34 AM

Sakshi Guest Column On Indian Constitution

కామెంట్‌

మీకు తెలుసా? ప్రపంచ దేశాలన్నింటి రాజ్యాంగాల సగటు ఆయుష్షు 19 ఏళ్లు మాత్రమేనని! భారతదేశం మాత్రం 75 ఏళ్ల పాటు తన రాజ్యాంగాన్ని కాపాడుకుంది. దీనికి సంతోషపడదాం. గర్వంగా ఫీల్‌ అవుదాం. దేశ చరిత్రలోనే కీలకమైన ఈ ఘట్టాన్ని గత వారమే చూశాం. అయితే, సమీక్షకు తగిన సమయం కూడా ఇదే! డెబ్ఫై ఐదేళ్ల సుదీర్ఘ ప్రయాణంలో భారత రాజ్యాంగం ఎదుర్కొన్న సవాళ్లు, ప్రశ్నలేమిటన్నది చూద్దాం.

మన రాజ్యాంగం వలసవాదులదని చాలామంది మేధావులు విమర్శిస్తూంటారు. భారతీయ మూలాలు ఉన్నది కాదని ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యాఖ్యానిస్తూ ఉండేది. అలాంటప్పుడు ఇది ఏ విధంగా మనకు మంచిది?

ప్రజలకు ప్రజాస్వామ్యాన్ని అందించిందనేది ఒక సమాధానం. అలాగే ఏకకాలంలో అర్హులందరికీ ఓటుహక్కు కల్పించిన రాజ్యాంగం కూడా మనదే. కానీ దీనివల్ల అందరూ సమానంగా లాభ పడ్డారా? లేక... ముస్లింలు, ఆదివాసీలు, దళిత మహిళలు లాభ పడలేదా? 

డెబ్భై ఏళ్ల ప్రయాణంలో మన రాజ్యాంగం ఇప్పటివరకూ 106 సార్లు మార్పులకు గురైంది. ఇది మన శక్తికి ప్రతీకా? ఎందుకంటే, అవసరమైనప్పుడు తగు విధంగా మార్పులు, చేర్పులు చేసుకునే వీలుతో రాజ్యాంగం ఉంది. లేదా ఇది బలహీనతా? అగ్రరాజ్యం అమెరికాలో 1789 నుంచి జరిగిన సవరణలు కేవలం 27 మాత్రమే.

శాసనాలు చేసే ప్రజా ప్రతినిధుల వ్యవస్థ కంటే కార్యనిర్వాహక వర్గాన్ని రాజ్యాంగం ఎక్కువ బలోపేతం చేసిందని చెబుతారు. అసెంబ్లీ స్పీకర్ల పనితీరు, రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్‌ ఈ పరి స్థితిని మరింత దిగజార్చాయి. ఫలితంగా ఎంపీలు పార్టీ నాయకత్వా నికి సబార్డినేట్లుగా మారిపోయారు. స్పీకర్లకు హౌస్‌ ఆఫ్‌ కామన్‌ ్స (యూకే) మాదిరిగా వారిపై అధికారం ఏదీ ఉండదు. 

ఈ విమర్శను ఇప్పటివరకూ ఎవరూ సవాలు చేయలేదు కూడా! అయితే దీని వెనుక ఏముందన్నది నిశితంగా పరిశీలించాల్సిన అంశం. ‘‘భారతీయ రాజ్యాంగం అడ్డుగోడలు నిర్మించకుండా... కార్యనిర్వాహక వర్గానికి ఎక్కువ అధికారాలు ఇచ్చింది. అంతేకాకుండా ఈ వర్గం తన అధికారాన్ని పూర్తిస్థాయిలో చలాయిస్తుందని విశ్వసించింది’’ అంటారు గౌతమ్‌ భాటియా. పాలకులందరూ మంచివారనీ, రాజ్యాంగాన్ని తు.చ. తప్పకుండా పాటిస్తారని రాజ్యాంగ నిర్మాతలు భావించారా? ఊహూ, అలా అనుకోలేదని స్పష్టంగా చెప్పవచ్చు. 

ఒక ఉదాహరణ – ఇందిరాగాంధీ విధించిన అత్యవసర పరిస్థితి. ఇది రాజ్యాంగాన్ని సుప్తచేతనావస్థలో పెట్టడం వల్లనో, రాజ్యాంగా నికి అతీతంగా పోవడం వల్లనో అమలు కాలేదు. దాంట్లో భాగమైన వ్యవస్థలతోనే జరిగింది. ఇది మన రాజ్యాంగం బలహీనత లేదా లోపాన్ని ఎత్తిచూపింది. రాజ్యాంగ పరమైన నైతికత లేని విషయాన్ని ఎమర్జెన్సీ పరిస్థితి ఎత్తి చూపిందని చెప్పవచ్చు. 

ఈ నైతికత అనేది రాజ్యాంగ స్ఫూర్తితోనే వ్యవస్థలు పనిచేస్తాయా, లేదా అన్నదాన్ని నిర్ణయిస్తుంది. గవర్నర్లు, ఎన్నికల కమిషనర్లు తరచూ ఈ రాజ్యాంగ నైతికతను తప్పుతుంటారని మనకు తెలుసు. కానీ వాటిపై వ్యాఖ్యా నించడం కంటే ఎక్కువేమీ చేయలేము – ఈ అంశాలపై మనఆందోళన, విమర్శ ఎంత స్థాయిలో ఉన్నప్పటికీ! రాజ్యాంగంలో ఉన్న మరో లోటు ఇదేనా?

రాజ్యాంగం సమాఖ్య నిర్మాణానికి ఏర్పాటు చేసింది. కానీ ఆర్థికాంశాలతో పాటు పరిపాలనకు సంబంధించిన విషయాల్లోనూ రాష్ట్రాలపై పెత్తనం చలాయించే అధికారం కేంద్రానికి కట్టబెట్టింది. సమాఖ్య స్వరూపాన్ని మార్చే అధికారం, శక్తి కూడా కేంద్రానిదే. స్వాతంత్య్రం లభించిన సమయంలో దేశం బలహీనంగా, ముక్కలు ముక్కలుగా విడిపోయింది కాబట్టి... ఆ పరిస్థితుల్లో ఇలాంటి ఏర్పాట్లు చేశారని అనుకున్నా మూడు సిల్వర్‌ జూబ్లీల కాలం గడచిన ఈ తరుణంలోనైనా మార్పులు చేయడం అనవసరమా? 

భారతీయ పౌరులకు రాజ్యాంగం బోలెడన్ని ప్రాథమిక హక్కు లను కల్పించింది. అయితే భావ ప్రకటన, వ్యక్తీకరణపై పూర్తిస్థాయి స్వాతంత్య్రం మాత్రం లేకుండా పోయింది. నిజానికి ఈ ‘ఫ్రీ స్పీచ్‌’ను నైతికత, పరువునష్టం వంటి రెండు సందర్భాల్లో మాత్రమే నియంత్రించాల్సి ఉంటుంది. మహా అయితే... విదేశాలతో మన సంబంధాలు దెబ్బతినే పరిస్థితులకూ పొడిగించవచ్చు. కానీ... మనకున్న నియంత్రణలు చాలా ఎక్కువగా లేవూ?

1973లో రాజ్యాంగంపు మౌలిక స్వరూపాన్ని కాపాడే లక్ష్యంతో సుప్రీంకోర్టు కొన్ని విధి విధానాలను సిద్ధం చేసింది. ఇదో చారిత్రక నిర్ణయం. అయితే దాదాపుగా అదే సమయంలో జబల్‌పూర్‌ అడిష నల్‌ డిస్ట్రిక్ట్‌ మేజిస్ట్రేట్‌ ఎమర్జెన్సీ విషయంలో శాసనకర్తల ఒత్తిడికి లొంగిపోయారు. అయోధ్య విషయంలోనూ ఇదే జరిగిందన్నది చాలామంది అభిప్రాయం. అలాగే జమ్మూ–కశ్మీర్‌కు ఉన్న రాష్ట్ర హోదాను కూడా రాజ్యాంగం కాపాడలేకపోయింది. కాబట్టి... రాజ్యాంగ సంరక్షణ చేయాల్సిన న్యాయస్థానాలు తమ నిర్ణయాల్లో అసందిగ్ధతతో వ్యవహరిస్తున్నాయి. లేదంటే అవసరమైనంత చేయడం లేదు. 

రాజ్యాంగం మనకు ఎన్నికల కమిషన్‌ , కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌(కాగ్‌), ఇన్ఫర్మేషన్‌  కమిషన్‌  వంటి ఎన్నో వ్యవస్థలను కల్పించింది. కానీ... ఇవి పాలకవర్గానికి అతీతంగా స్వతంత్రంగా పని చేసేలా మాత్రం చేయలేకపోయింది. ఆ యా సంస్థల ఉన్నతాధి కారుల నియామకాల విషయంలో ఇది మరింత సత్యమని చాలా మంది చెబుతారు. 

చివరగా... రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన రాజకీయ నేతలు, సంస్థల అధినేతలు ఆ పని ఎంత వరకూ సక్రమంగా నిర్వర్తించారు? అలాగే రాజ్యాంగ సంరక్షణ బాధ్యతను న్యాయమూర్తులు ఎంత సమర్థంగా నిర్వహించారు? సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ మదన్‌ లోకూర్‌ను ఇదే ప్రశ్న అడిగితే... ‘‘భారత్‌కు మంచి రాజ్యాంగం ఉంది. కీలక సందర్భాల్లో రాజకీయ నేతలు, న్యాయమూర్తులు దీని ప్రతిష్ఠను దిగజార్చారు. పాలకవర్గం మాత్రమే కాదు... పార్లమెంటు కూడా ఇందులో భాగస్వామే’’ అన్నారు. ఇందులో అంగీకరించక పోయేందుకు ఏమీ లేదన్నది నా అభిప్రాయం!


కరణ్‌ థాపర్‌ 
వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement